TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అతను
మొన్న ఏప్రిల్ లో డిగ్రీ అయిపోయింది.
నా వయసు ఇప్పుడు పందొమ్మిది సంవత్సరాలు,దసరా వస్తే ఇరవై పడతాయి.
నాకు ఇంకా చదువుకోవాలని ఉంది.
అమ్మకు కూడా చదివించాలని ఉంది.
ఇరుగు పొరుగు వాళ్ళు మాత్రం లక్ష్మీ మంచి సంబంధం వస్తే పెళ్ళి చేసేయ్,బాధ్యత తీరుతుందని అమ్మతో అంటున్నారు.
అదిగో సరిగ్గా ఆ సమయంలోనే బాబాయి ఒక సంబంధం తెచ్చాడు.
పిన్ని కూడా మంచి వాడని చెప్పింది.
ఈ రోజు కాలేజీ గ్రౌండ్స్‌లో అన్నయ్య సైకిల్ తీసుకుని చాలా సేపు తొక్కాను.
సైకిల్ స్టాండ్ వేసి చక్కగా ఎగురుకుంటూ ఇంట్లోకి వచ్చాను.
ఎవరో కొత్త వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నాడు.
హా ఎవరో kkg అమ్మకొసమో,అన్నకోసమో పని మీద వచ్చాడు అనుకుని,అతని ముందే అమ్మను గట్టిగా పిల్చుకుంటూ వంటగది గుండా ఇంటి వెనకాలకు వెళ్ళాను.
ఆశ్చర్యం వేసింది,అక్కడ,అన్నా,వదిన,
అమ్మమ్మ అందరూ ఉన్నారు.
అమ్మ ఎప్పటి నుంచి సిద్ధంగా పట్టుకుని ఉందో పట్టులంగా,ఓణి,తువ్వాలు నా చేతికిచ్చి నవ్వుతూ స్నానం చేసి రమ్మంది.
బుద్ధిగా చేసి రాగానే వదిన తల దువ్వి రెండు జడలు వేసింది.
అమ్మమ్మ పూలు పెట్టి అలంకరించింది.
ఏంటిదమ్మా?అంటే ఎవరూ ఏం చెప్పలేదు.
కొద్ది సేపటి తరువాత నీకు పెళ్ళి చూపులు అన్నారు,గంభీరంగా.
నేను ఏదో అనబోతే చెప్పినట్లు విను అని అన్న అన్నాడు.
వదినతో బాటు నన్ను తీసుకెళ్ళి అతని ముందర క్రింద చాపలో కూర్చోబెట్టారు.
"అతను"అన్నాడు,కుర్చీలో కూర్చొమ్మని.
హమ్మయ్య,సైకిల్ తొక్కి తొక్కి కాళ్ళు నొప్పెడుతున్నాయి అని మనసులో అనుకుంటూ చటుక్కున కుర్చీలో కూర్చున్నాను.
అమ్మ ఒక్క చూపు చూసింది,తీక్షణంగా నన్ను.
నేను మనసులోనే నవ్వుకున్నాను I am the boss రుద్రమదేవి.
kkg మొదలు పెట్టాడు మీ పేరు రవళి కదా అన్నాడు.
"తొక్కేం కాదు"అనుకోలేదు మనసులో,ఎందుకంటే ఆ పదం ఇరవై ఏండ్ల క్రితం వాడుకలేదు మరి.
ఏదో ఒకటి అనుకోవాలి కదా?
నేననుకున్నాను మనసులో,"
ఈ రుద్రమదేవిని రవళి అంటావ్ బే."
కాదండీ, రుద్రమదేవి అన్నాను మెల్లగా.
నా మాటలు నాకే వింతగా తోచాయి.
అంత లోస్వరంతో,నేనింతవరకు మాట్లాడలేదు ఎవరితో మరి.
లెక్చరర్ ముందు విద్యార్థిలా బుద్ధిగా సర్దుకుని కూర్చున్నాను.
అతను అన్నాడు నా పేరు వెంకటేశ్వర్లు.
నేను బి.ఎ.చదివాను.
మీరేం చదివారు అన్నాడు?
మనసులో చిన్న చూపు వీడు ఆర్ట్స్ వాడు.
నేను అతిశయంతో చెప్పాను,
బి.యస్సి అని.
ఇంకా చదువుతారా అన్నాడు.
చెంగున లేడి పిల్లలా లేచి, నా పుస్తకాల కోసం ప్రత్యేకంగా ఉన్న అర నుండి సర్టిఫికేట్లు తీసి నేను స్కూలు ఫస్ట్,కాలేజి ఫస్ట్ అని ఆగకుండా చెబుతున్నాను.
అతను పెళ్ళి చూపుల కోసం వచ్చాడన్న సంగతి నేను మరచిపోయి చాలా సేపయింది.
నేను పుస్తకాలు తీస్తుంటే అతను నా ప్రక్కన నిల్చున్నాడు.
అతను అన్నాడు మెల్లగా,మీరు నాకు నచ్చారు.నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా అని?
మా అమ్మను అడిగి చెబుతాను అన్నాను కొద్దిగా బుంగమూతి పెట్టి.
అతను,మీ అమ్మ సరే అంది అన్నాడు.
మా ఫ్రెండ్స్ ను అడిగి చెబుతానన్నాను.
అతను ఒకరకపు వెటకార స్వరంతో"ఫ్రెండ్స్ ను అడిగి చెబుతావా అన్నాడు".
హా అవును అన్నాను.
నా నుండి భయం సిగ్గు పరారయ్యాయి.
నాకు పుట్టుకతోనే ఎదుటి వారి కళ్ళలోకి చూస్తూ మాట్లాడటం అలవాటు,అయినా నేను లీడర్ని,రుద్రమను.
అతన్ని కళ్ళతోనే స్కాన్ చేశాను.
ఎత్తు 5'11",
రంగు...చామన ఛాయ,
శరీరం బాగానే ఉంది.
తలకట్టు నిండుగా చక్కగా ఉంది.
ముక్కు చక్కగా ఉంది.
చిన్న,సన్న,పెదవులు.
కళ్ళున్నాయి చూశారూ, అవి కమలాలు,శక్తివంతమైన కందర్పుని కళ్ళు.
నేను ఆ క్షణం పాటు, కళ్ళలోకి,కళ్ళు పెట్టి చూసే లక్షణం కోల్పోయాను.
కానీ నా మనస్సులోకి సర్రున చదువు గుర్తుకు వచ్చింది.
ముభావంగా మారిపోయాను.
అతను వెళ్ళపోయాడు.
రౌండ్ టేబుల్ సమావేశం మొదలైంది.
ఎవరికి తోచిన విధంగా వారు,పెళ్ళి,చెయ్యాలి,వద్దు అంటున్నారు.
అబ్బాయి బాగున్నాడు,పైగా ప్రభుత్వ ఉద్యోగి మెజారిటీ అభిప్రాయం.
నేను ఆ రోజు పడుకుని అన్నం ఎలా తినాలి అని,విష్ణుమూర్తి లా ఫోజు పెట్టి మా అన్న,చిన్నమ్మ పిల్లలకు నేర్పిస్తున్నాను,కంచం ముందర పెట్టుకుని.
అతను వచ్చాడు.
వీడు మళ్ళీ వచ్చాడ్రా దేవుడా అనుకుని దిగ్గున లేచి నిలబడ్డాను.
అమ్మ అబ్బాయికి మంచినీళ్ళు ఇవ్వంది.
తెచ్చిచ్చాను,వీడి కళ్ళ వైపు చూడొద్దురా బాబూ అనుకున్నాను.
చిన్నగా నవ్వాడు.
చూసి తలతిప్పుకున్నాను మెల్లగా.
పెళ్ళంటే అర్థం తెలియదు నాకు అప్పటికి.
అమ్మ,అన్న చెప్పినట్లు వినడం,కాలేజికి పోయి చదువుకోవడం.
కావలసినవన్నీ అమ్మా,అన్నలు ఇచ్చేవారు.
సంతోషం తప్ప,ఇంకేమీ తెలియని జీవితం.
నిజం చెప్పాలంటే నాకు అప్పటికి ఆడ,మగ ఆకర్షణ,సిగ్గు,బిడయం ఇవేవీ తెలియవు.
మా కాలేజీలో అమ్మాయిలతో ఎలామాట్లాడేదాన్నో,అబ్బాయిలతోనూ అలాగే మాట్లాడేదాన్ని.
మా క్లాసు వాళ్ళతో పోలిస్తే రెండేళ్ళు చిన్నదాన్ని.
అమీబాకి సార్లతో పాఠాలు చెప్పించుకోవడం,ఫస్ట్ రావడం తప్పితే దానికి ప్రేమ తెలియదురా అనే వాళ్ళు మగ పోరగాళ్ళు.
పైగా నాగలక్ష్మిని,శ్రీలతను,ఇంకా ఇతర అమ్మాయిలను పిలవవా రుద్రమ అనేవాళ్ళు.
దామోదర్ గాడు,భూమి పుట్టినప్పుడు పుట్టిండు.
మా బాబాయి క్లాస్మేట్,ఫెయిల్ అవుతూ,అవుతూ నా క్లాస్ మేట్ అయిండు గాడిద.
నన్ను ఎన్నిసార్లు కొట్టాడో తలమీద బుచ్చిపాప అంటూ.
అదిగో అలాంటి దాన్ని నాకు వీడిని అదే పెళ్ళి చూపుల కమలేక్షణుడిని చూస్తే ఏదో వీడు నా దగ్గరివాడు అనిపించింది.
నెల తిరిగే సరికల్లా పెళ్ళయింది.
అతనికి ఏదో ట్రైనింగట,పెళ్ళైన రెండో రోజే వెళ్ళపోయాడు.
మా అమ్మ,వాళ్ళమ్మ,మా వదిన,వాళ్ళక్క మమ్మల్ని చూసి ముసిముసిగా నవ్వుకున్నారు.
అతను టాటా చెబుతూ ఎంతో బాధగా వెళుతున్నాడు.మళ్ళీ,మళ్ళీ వెనక్కి వచ్చి నా చేయి పట్టుకుని నొక్కుతూ వెళ్ళొస్తా అంటూ వెళుతున్నాడు.
మా అమ్మ ఆర్డర్ అతను నన్ను పట్టుకుంటే ఏమన వద్దని,ఏం చేయాలి దేవుడా.
నా మనసులో నొక్కిన కాడికి సాలు గానీ వెళ్ళరా బాబు,జీటీవీలో మై డార్లింగ్ అన్న షారుఖ్ ఖాన్ పాటలు చూడాలని తొందర.
అతను అలా వెళ్ళాడో లేదో నేను ""జాదూ తేరీ నజర్ ఖుష్బూ తేరా బదన్ ""అని పాడుతూ లోపలికి వస్తుంటే మా అత్త అనే ఓ కొత్త వ్యక్తి నావైపు సీరియస్ గా చూసింది.
వెంటనే మా అమ్మ నా తలపై మొట్టికాయ వేసింది.నాకర్థమైంది ఏదో తప్పు చేశానని.
అత్త,ఆడపడచు ఉన్న రెండు రోజులు రుద్రమ మూగదైంది పాపం.
ఏమే రుద్రమ మీ ఆయన ట్రైనింగుకు పోయిండట కదా అంటూ కిసుక్కుమనటం అలవాటైంది మా బజార్లో ఆడముఖాలకి.
ఒకసారి పక్కింటి రమ పిన్నిఅలాగే అంటే అన్నాను.నిన్నే పిలుస్తుండు పోరాదు ట్రైనింగ్కు తోడుగా అన్నాను.
చూశావా లక్ష్మక్కా నీ బిడ్డ ఎంత మాటందో అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది.
మా అమ్మ తనతో చిన్న పిల్ల తెలియదులే చెల్లె అన్నది.
నేను ఉక్రోశం ఆపుకోలేక ఎందుకమ్మా నన్ను ఇట్లా అంటుండ్రు అంటే?
మధ్యలో మా వదిన కల్పించుకుని మా తమ్ముడొచ్చాక తెలుస్తుందిలే అంది కిసుక్కున నవ్వుతూ.
వెధవ సంత అందరికీ పిచ్చెక్కింది అనుకున్నాను.
ఈ రెన్నెళ్ళ కాలంలో నేను మూడు వ్యాసరచనపోటీళ్ళో బహుమతులు గెలిచాను.
అతను ఉత్తరాలు వ్రాశాడు మాఇంటికి.
నేను రోజూ గుర్తుకు వస్తున్నానట.
అతను నేను కలిసి పెరిగినట్లు,కలిసి చదివినట్లు నేను గుర్తుకురావడమేంటి నాన్సెన్స్ ఓవర్ యాక్షన్ కాకపోతే, వాడికి నేనెందుకు రిప్లై వ్రాయాలంటూ ఉత్తరాలను టేబుల్ సొరుగులోకి వేశాను.
రెన్నెళ్ళపోయింది అతను వేంకటేశ్వర్లు ట్రైనింగ్ నుండి సరాసరి మా ఇంటికి వచ్చాడు కొంపలు మునిగిపోయినట్లు.
ఆరోజు మాఅమ్మ అయ్యగారిని పిలిపించింది.
అయ్యగారు ఈ రోజురాత్రి తొమ్మిది గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది అని అమ్మ ఇచ్చిన దక్షిణ తీసుకుని వెళ్ళొస్తానే రుద్రమా అంటూ బోసినోరుతో నవ్వుతూ వెళ్ళాడు.
ఆ రోజు మా అత్తమ్మ,ఆడపడచు వచ్చారు మధ్యాహ్నానికి.
అమ్మ,అత్తమ్మ,అందరూ కలిసి నన్ను వింతగా అలంకరించారు,నా పుస్తకాల గదినీ అలాగే అలంకరించారు.
వెంకీ ముందేబోయి గదిలో తొంగున్నాడు.
వాడు నా గదిలో,పైగా ఈ రుద్రమ మంచం మీద కూర్చున్నాడు పాత సినిమాల్లో చూశాను నాగేశ్వరరావు, రామారావు అలాగే కూర్చునే వారు.
నేను వెళ్ళనంటుంటే బలవంతంగా లోపలికి పంపి తలుపేశారు.
అమ్మ ఆర్డర్ ఆ వెంకీగాడి కాళ్ళకు దండం పెట్టమని.
పెడ్తేపోలా పెళ్ళిలో అయ్యగారు ఎన్ని సార్లు మొక్కించాడనీ,వెంటనే వెంకీకి దండం పెట్టాను.
అతను భుజాలు పట్టుకుని లేపి మంచం మీద కూర్చో పెట్టాడు.
అతను నాకు ఫ్రెండైనాడు,భయం పోయింది కదా,అతనికి నాకు ఒకటవ తరగతి నుండి డిగ్రి వరకున్న అందరు స్నేహితుల గురించి చెప్పాను.
చివరకు పక్కింటి శీనుగాని గురించి చెబుదామని...ని....దు...ర..లోకి జారి పోయాను.
అతను నాకు మంచినీళ్ళు తాపించి పడుకోబెట్టాడు,తలపై చెయ్యేసి నిమురుతూ...
నా కలలో నాన్నతో విహరిస్తున్నాను.
తెల్లవారింది.
అమ్మ,అత్తమ్మ,ఆడపడచు,
వదిన అందరూ ఏమీ మారలేదు అంటూ గుసగుసలు పెట్టుకున్నారు.
అత్తమ్మ పెద్ద గొంతుతో అరుస్తుంటే వెంకీ అబ్బ నీకెందుకమ్మా,నేను చూసుకుంటా కదా అంటున్నాడు.
ఇంట్లోవాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు,నేను,వెంకీతప్ప.
ఈరోజు మా అత్తగారింటికి వెళ్ళి,అక్కడనుండి వెంకీ పనిచేసే ఊరికి వెళ్ళాలట.
The great Rudrama అమ్మా,అన్నలను వదలి వెళ్ళడమా?
కుదరదుగాక కుదరదు.
నేను మొండికేశాను.
వదిన అన్నది ప్రేమగా "నేను మా వాళ్ళను వదిలేసి రాలేదూ".
అమ్మ బతిమిలాడింది,కేవలం మూడు రోజులే నాలుగవ రోజు సాయంత్రం ఇక్కడే ఉంటావు అంది.
మా అత్తమ్మ మొదలుపెట్టింది రాగాలు ఆ సూర్యపేట పిల్లను చేసుకుంటే ఈ బతిమిలాడటాలు ఉండేవా అంటూ.
అతను వాళ్ళమ్మతో"అమ్మా నువ్వు కాసేపు ఉంటావా""అన్నాడు విసుగ్గా.
అన్నయ్య,అమ్మ చెరోపక్క ప్రేమగా చేతులుపట్టుకుని బస్సు ఎక్కించారు.
అత్తమ్మ ఏమీ అనలేదు బాదానే చూసుకుంది.
ఇంటిప్రక్కలవాళ్ళు వచ్చి సుజాత అదృష్టం బంగారు బొమ్మ కోడలిగా దొరికింది అని మాట్లాడి వెళ్ళారు.
అత్తమ్మ మురిసిపోయింది.
మొగుడిగారి గురించి చెప్పక్కరలేదు.మధ్యమధ్యలో నా దగ్గరకు వచ్చి ఏమైనా కావాలా అని అడిగిపోతున్నాడు.
రాత్రయింది,నేను తెలివిగా అత్తమ్మ పక్కన పడుకున్నాను.
నన్ను నిద్రపోయాక నడిపించుకు తీసుకువెళ్ళి ఆ గదిలో పడుకోబెట్టారు.
నేను అలా నడిచేటప్పుడు కళ్ళు తెరవను ఎందుకంటే మళ్ళీ త్వరగా నిద్రపట్టదు.
ఆ రాత్రీ ఎప్పటిలాగే నాకు స్వర్గంలా,తనకు నరకంలా గడచిపోయింది.
వెంకీ పనిచేసే ఊరికి వెళ్ళేసరికి మధ్యాహ్నం ఒంటిగంటయింది.
సినిమా టాకీస్ ప్రక్కనే ఉంది ఇల్లు.
ఒక్కటే పెద్ద గది,మూడు గదులంత స్థలంలో ఉంది.
డిప్యూటీ కలెక్టరు గారు ఆతిథ్యం ఇచ్చే గదట.
సోఫాలు,కుర్చీలు,డైనింగ్ టేబుల్,రెండు సింగిల్ కాట్ మంచాలు బాగున్నాయి.
అన్నీ జిట్రేగు కర్రతో చేసినవి చాలా బాగున్నాయి.
పరుపులు,టీవీ ఇంకా ప్యాక్ విప్పలేదు.
తను డ్యూటీలో రిపోర్ట్ చేసి వచ్చేటప్పుడు,కేబుల్ అతన్ని కూడా తీసుకువచ్చాడు.
టీవీ రిమోట్ చేతికి ఇచ్చి నాతో ఆన్ చేయించాడు.
అత్తమ్మ అన్నది ఈ పరుపులు కొని ఆరు నెలలు అయింది.
పోయినసారి నేనొచ్చినప్పుడు సీల్ తీయరా అంటే,తరువాత తీస్తాలే అని తప్పించుకున్నాడు.
తను ఈ రోజు పరుపులకున్న కవర్లు తీసి కొత్త బెడ్షీట్లు,తలగడకు కవర్లు ఇద్దరం కలిసి తొడిగాము.
రాత్రి ముగ్గురం కలిసి భోజనాలు చేశాము.
అత్తమ్మ నాకు ఇష్టమైన ఆహారపదార్థాలు ఏమిటని అడిగింది.
నేను చెప్పాను పులిహోర,దద్యోదనం,అప్పడాలు,పప్పుచారు,ఏదో ఒక వేపుడు,మొక్కజొన్న అన్నాను.
అయితే మా వాడికి తిప్పలు తప్పవన్నమాట,వాడికేమో చికెన్,మటన్,చేపలు,రొ్య్యలు ఇష్టం అన్నది.
అతను నావైపు ఆర్తిగా చూశాడు.
నిద్రాదేవి అందరినీ ఆవహించింది.
తెల్లవారాక టిఫిన్ చేసి అత్తమ్మ ఊరికి వెళ్ళిపోయింది.
అతను నాతో సాంబారు,ఆలుగడ్డ వేపుడు చేయమన్నాడు.
టీ తప్ప ఏమీ చేయడం రాని నేను తెల్ల ముఖం వేశాను.
అన్నం మాడిపోయింది.
మంచం క్రిందకు నెట్టాను.
సాంబారు పుల్లగా ఉంది,ఆలుగడ్డ ఉడకలేదు.
అతను మధ్యాహ్నం వచ్చి మా పై అధికారి ఊరికెళ్ళాడు,ఆఫీస్ లో పెద్దగా ఉండదు అన్నాడు.
ఇంట్లోకి రాగానే తన చక్కటి ముక్కుతో అన్నం మాడిన వాసన కనిపెట్టి నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
నేను నిశ్శబ్దంగా మంచం కింది నుండి అన్నం గిన్న బయటకు తీశాను.అతను అన్నీ రిపేరు చేశాక కలిసి భోజనం చేసి నడుం వాల్చాం మంచంలో.
మా ఇద్ధరి మధ్యలో దిండు పెట్టాను.
టేపు రికార్డర్ కం రేడియో ఆన్ చేశాడు.
రేడియోలో పాట వస్తుంది.
""నేలతో నీడ అన్నదీ నను తాకరాదనీ"" .
అతను గొల్లున నవ్వాడు.
నాకు కోపం వచ్చింది.
తప్పయింది మేడం అన్నాడు. సాయంత్రం ఇంట్లోకి కావలసిన వస్తువులతో బాటు,మల్లెపూలు తెచ్చాడు.
స్నానం చేసి తయారై గుడికి వెళ్ళి వస్తుంటే గుడిదగ్గర ఒక పెద్దవయసావిడ ఎదురైంది.
తను వెంకీ స్నేహితునికి బామ్మట.తను నమస్కరిస్తే ఆమెకు నేనూ దండం పెట్టాను.
మీకు రామచంద్రుని వంటి కొడుకు పుడతాడని మామిడిపండు చేతిలో పెట్టింది.
ఇంటికి వచ్చాము.అతను మెల్లగా నా చేయి పట్టుకుని నీ చేతులు బాగున్నాయి.
అరచేయి విశాలంగా ఉంటే అదృష్టమట,గోళ్ళు పొడవుగా ఉంటే మంచి కళాభిరుచి ఉంటుందట అన్నాడు.
అవును మాతాతయ్య ఎప్పుడో చెప్పారన్నాను.
అతనికి చాలా విజ్ఞానం ఉంది.ఏ విషయం గురించి అయినా అనర్గళంగా మాట్లాడగలడు.
చాలా సేపటి తరువాత నాతో అన్నాడు.మనమిద్దరం భార్యాభర్తలం.నీతో మాట్లాడిన పది నిముషాల నుండే నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను.
నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను జీవిత పర్యంతం బాగా చూసుకుంటా అన్నాడు.
నాకు మీమీద గౌరవం ఉంది, కానీ మిమ్మల్ని మా కుటుంబ సభ్యునిగా భావించడానికి ఇంకొద్దిగ సమయం కావాలన్నాను.
అతను సరే అలాగే కానీ అన్నాడు.
రోజులు గడుస్తున్నాయి.
అతని మంచి తనం ముందు నేను చాలా చిన్నగా తోచాను, నాకు నేనే.
[1/29, 17:34] Guruji: పడుకుని అనుకున్నాను,రేపు ఉదయం నా సంసిద్ధతను తెలియచేయాలి అని.
అతను తల స్నానం చేసి బయటకు వచ్చాడు.
నేను స్నానాల గదిలోకి వెళ్ళి,గడియ పెట్టకుండానే(అతని వలన ఎటువంటి హాని జరగదని భయం లేదు మరి) బట్టలు విప్పి పైకి చూశాను,గుండె ఆగినంత పనైంది.ఇంతింత మిడిగుడ్లేసుకుని....
చూస్తుంది గోడమీద బల్లి.
ఒకరకమైన భయంతో కూడిన జుగుప్సతో కెవ్వున అమ్మా అని అరిచాను.
అతను లుంగీ సర్దుకుంటున్న వాడల్లా పరుగెత్తుకు వచ్చాడు.గట్టిగా అతన్ని వాటేసుకున్నాను.
తొలిసారి పురుష స్పర్శ తనువెల్లా తాకగానే వెయ్యిఓల్టుల విద్యుత్ తాకిన భావన నాకుకలిగింది.అటువంటి భావనే తనలోనూ కలిగిందని నాకు అర్థమైంది.అతను వెనకకు జరగబోతుంటే అతను నేర్పిన మూగవారి భాషలో అతని అరచేతిని సున్నితంగా తాకాను.
ఏం జరిగిందట?
తొలి ఉదయం...
ఆపై ప్రతి ఉదయం,
ప్రతి పగలు,ప్రతి రేయి.
యవ్వనంలో ఉన్నప్పుడు ప్రేమను
భర్త,భార్యలు వ్యక్తం చేయడానికి అత్యుత్తమ సాధనం అదేనేమో.
అతను నాకు భర్తగా లభించడం, నా పూర్వజన్మ సుకృతం అనిపించింది ఈ క్షణం వరకూను.
నాకున్న గొప్ప స్నేహితుడు,గురువు,తండ్రి,
అన్న ఇంకా సర్వం తానే.అతని ఒడిలో తలపెట్టుకుని అతని కంటే ఒక్క క్షణం ముందు అనంతలోకాలకు వెళ్ళాలనేది నా అభిలాష అన్నాను (నా కొడుకు అత్యంత ప్రేమగా,తనకూతురుకు పెట్టుకున్న పేరు) రుద్రమతో.
ప్రేమే కదా జీవన మాధుర్యం, ప్రేమే కదా శాశ్వతం,
ప్రేమే కదా సత్యం, శివం,సుందరం.
-ఇందిర.వెల్ది