Facebook Twitter
డిసెంబరు పూలు (ఉగాది కథల పోటీలో కన్సలేషన్ బహుమతి పొందిన కథ)

డిసెంబరు పూలు (ఉగాది కథల పోటీలో కన్సలేషన్ బహుమతి పొందిన కథ)

 

 

సూర్యకిరణాల్లో వెచ్చదనం తగ్గిపోసాగింది... గాలిలో చిరుచలీ మొదలైంది. సాయంత్రం అయిదు గంటలు అవుతూ ఉండగానే పడమటి కొండల వైపు ప్రయాణం మొదలుపెట్టాడు ప్రభాకరుడు. రైల్లో హైదరాబాదు వెళుతున్నాను. రిజర్వేషన్ సెకండ్ క్లాస్ కే దొరికింది... నేను ఉద్యోగ రీత్యా భువనేశ్వర్ లో, మా వారు ఒక్కరూ హైదరాబాదులో... అబ్బాయి ఉద్యోగం చేస్తూ బెంగుళూరులో... సాయంత్రపు చలికి చిరుగుబులు మొదలైంది గుండెల్లో... అప్రయత్నంగానే ఆ గగుర్పాటులో ఒకప్పుడు  నరసాపురంలోని  మా అద్దింట్లో  పూచిన డిసెంబరు పూలు కనుల ముందు మెదిలాయి.

“అమ్మా, ఆకలే... ఇంకా ఎంత సేపూ?” అమ్మని చుట్టుకుని, ఆమె చీర  కుచ్చిళ్ళలో తల దాచుకున్నాడు ఎనిమిదేళ్ళ తమ్ముడు రాజు. “నాన్నగారు వెళ్ళారు కదా, భోజనం తెచ్చేస్తారులే... ఇంకాసేపేరా...” ఊరడించింది అమ్మ వాడిని.
ఆ పెద్ద పెంకుటింటిలో వరసగా నాలుగు వాటాలు. పెద్ద పెద్ద కామన్ వరండాలు... మొదటి రెండు వాటాలు ఇంటివారివే. మా వాటా పక్కన చిన్న వాటా మరొకటి ఉంది. ప్రస్తుతం ఖాళీగానే ఉందది. మా వాటా అంటే కేవలం రెండు గదులే. ఒక పెద్ద గది... అదే రీడింగ్ రూమ్, అదే బెడ్ రూమ్ కూడా... దాన్ని ఆనుకొని అడ్డంగా పొడవాటి వంట గది. అందులోనే ఓ ప్రక్కన పూజ, స్టోర్ రూమ్, మరోకప్రక్కన అలికిన మట్టిపొయ్యి. మా వాటా అంతా ఇంగ్లీష్ ‘టీ’ అక్షరంలా ఉంటుంది అన్నమాట! కాకినాడ నుంచి నాన్నకి ట్రాన్స్ఫర్ అయి నిన్న ఉదయం పాసింజరు రైలు ఎక్కి ఈరోజు ఉదయానికి ఈ ఊరు చేరాము. 


“ఏమ్మా, మీ సామాను ఎప్పుడు వస్తుందీ?” కళ్ళు చికిలిస్తూ అడిగింది ఇల్లుగల మామ్మగారు. అసలే ఆవిడవి  చాలా చిన్న కళ్ళు... చికిలిస్తే కళ్ళు మూసిందో, తెరిచిందో కూడా తెలీకుండా చింతాకుల్లా కనబడుతున్నాయి.
“యస్సారెమ్టీ లారీకి వేసారండి... రేపటికొస్తుంది...” వినయంగా చెప్పింది అమ్మ.
ఈలోగా నాన్న రావటంతో అందరం లోపలికి వెళ్ళిపోయాము. ఉడికీ ఉడకని అన్నం, వేగీ వేగని కూర, కాగీ కాగని సాంబారు... విస్తరాకుల్లో ఆ హోటల్ అన్నం తినాలంటేనే వెగటుగా తోచింది. “నాన్నా దోసకాయ ముక్క తొక్కతో సహా వేసేసారు... ఏం బాలే...” ముఖం చిట్లించా విసుగ్గా.


“చూసావా మరి? అమ్మ కూరలకి ఇక పేర్లు పెట్టకుండా, పేచీలు పెట్టకుండా తినాలి ఏం?” అనునయంగా అన్నారు నాన్న. తమ్ముడు మాత్రం అన్నం తినేసి నిద్రపోయాడు. నాలో పెద్ద సందేహం... అమ్మ దగ్గరికి వెళ్ళి చెవిలో ఊదాను... 
“తమ్ముడు ఆకలికి అంతలా ఏడిస్తే ఆ మామ్మగారు వాడికైనా కాస్త అన్నం పెట్టి ఉండొచ్చు కదే?”
“నాన్నకి ఇష్టం ఉండదని నేను అడగలేదు... మనం అడగలేదని ఆవిడ పెట్టలేదు... అన్నం పెడతామని అంటే మనం ఏమన్నా  అనుకుంటామేమో అని అనుకుని ఉంటారు...” అని చెప్పింది... కానీ నాకంతగా అర్థం కాలేదు...

ఆ విశాలమైన ప్రాంగణంలో మాకు ఆడుకోడానికి బోలెడంత స్థలం దొరికింది. బయట ఏడు పెంకులాటలూ, ఇంట్లో వరండా మీద చింత పిక్కలూ, అష్టా చెమ్మాలూ, కేరం బోర్డూ ... ముందస్తుగా ‘ఆట అయ్యాక, అన్నీ సర్దేస్తాను’ అని చెప్పి నన్ను ఆటకు పిలిచేవాడు తమ్ముడు... ఆట అయిపోగానే ఎక్కడివి అక్కడ వదిలేసి పరుగు తీసే వాడు. వాడిని తిట్టుకుంటూ, విసుక్కుంటూ అన్నీ డబ్బాలకు ఎత్తుకునే దాన్ని.


వేసవి కాలం నా పరీక్షాఫలితాలు వచ్చేవరకూ హాయిగా గడిచిపోయింది. టెన్త్ క్లాసు రిజల్ట్స్ వచ్చేసాయి. సెకండ్ క్లాసు వచ్చింది నాకు. ఇంటర్ లో సైన్సు గ్రూప్ లో చేరాలని అనుకున్నాను. కానీ సీయీసీ లో చేర్చారు. బీకాం చదివితే త్వరగా ఉద్యోగాలు వస్తాయని... నాన్న మాట కాదనేది లేదుగా... అందుకే టైపింగ్ క్లాసు లోనూ జాయిన్ అయ్యాను. 
ఏదీ మొదట ఉత్సాహంగా ఉండదు. టైపింగ్ క్లాసూ అంతే... ఏ యస్ డీ యఫ్ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే, అన్ని వరసలూ పూర్తి చేసేసి ఎప్పుడు వాక్యాలు టైప్ చేసేస్తానా అని అనిపించేది... కృషితో నాస్తి దుర్భిక్షం... త్వరలోనే ఆరోజూ వచ్చేసింది... మూడు నెలలు తిరిగేసరికి అలవోకగా ఇంగ్లీష్ పేరాలు టైప్ చేయటం వచ్చేసింది. 


మొట్టమొదటి రోజున కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ క్లాస్ లో వందమంది మగ పిల్లల మధ్య ఓ పది మంది అమ్మాయిలం... బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాము. చాలా మంది టెన్త్ ఈ ఊరిలో చదివిన వాళ్ళే కాబట్టి ఒకరితో ఒకరికి పరిచయాలు ఉన్నాయి... సిలబస్సూ, కొనుక్కోవలసిన పుస్తకాల లిస్టులతో మొదటి రోజు గడిచింది. ఆరోజే ‘లిడియా’ అనే అమ్మాయి నాకు పరిచయం అయింది. తను మా ఇంటివారికి మనవరాలి వరస అని తరువాత తెలిసింది. తోవ లోనే వాళ్ళిల్లు కావటం తో... ఇద్దరం కలిసి కాలేజీకి రావచ్చు, అని అనుకున్నాం ఇద్దరం... 


మర్నాడు క్లాసులో ఇంకో అమ్మాయి పరిచయం అయింది. నవ్వితే సొట్ట పడే బుగ్గలు, ఉంగరాల జుట్టూ... మిగిలిన క్లాస్ మేట్స్ అందరికీ తెలుసు అనుకుంటా... ‘కృష్ణమణి’ మా ఎకనామిక్స్ హెడ్ గారి అమ్మాయి అట... కొత్తవారితో అంతగా కలవలేను నేను... అలాంటిది అతి త్వరగా ఆమె నాకు దగ్గరయింది... నాలో దాగి ఉన్న బెరుకునూ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నూ పోగొట్టింది తనే...

వర్షాకాలం గడచిపోయి హేమంతం మొదలైంది. చదువుతో, టైపింగ్ క్లాసులతో సమయం గడచిపోయేది. ఈ లోగా ఓ సారి ఇంటివారికి కోడలు వరసయ్యే రాజేశ్వరి గారు మా ఇంటికి వచ్చి, నాకు పూలు మాల కట్టటం ఎలాగో నేర్పారు. మొదట్లో సరిగ్గా వచ్చేది కాదు... కనకాంబరాల గొంతులు తెగిపోయేవి. దారం ఎలా పట్టుకోవాలో, పూలు అటూ ఇటూ చేసి ఆ దారం మీద ఎలా అమర్చుకోవాలో, దారాన్ని ఆ పూల చుట్టూ ఎలా మెలిక తిప్పి, వేళ్ళతో ఎలా  ముడి వేయాలో చాలా చక్కగా, ఓపికగా నేర్పించారు... అలా మాల కట్టటం నేర్చుకున్నాను.


ప్రతీరోజూ సాయంత్రం కాలేజీ వదిలాక టైపింగ్ క్లాసుకు వెళ్లి, అదయ్యాక, లిడియా ఇంటివరకూ వచ్చి, అక్కడినుంచి దగ్గరి దారిలో ఇంటికి వచ్చేదాన్ని. ఇంటికి రాగానే కాళ్ళూ చేతులూ కడిగేసుకుని, అన్నం వేడిగా తినేసి, తమ్ముడిని చదివించి, నేను కాసేపు చదివేసుకుని, గోదావరి గట్టునున్న కొండాలమ్మ గుడిలోంచి వినిపించే పాటలు వింటూ నిద్రలోకి జారుకునేదాన్ని. ఒక్కో సారి శారదా టాకీస్ నుంచి రెండో ఆటకి ముందు వేసే పాటలూ వినిపించేవి - ‘నమో వేంకటేశా...’ ‘ఏడూ కొండల సామీ...’ అంటూ ఘంటసాల వారి మధురమైన గాత్రంతో...


నవంబర్ గడిచి, డిసెంబర్  వచ్చింది... ఇంటి వారి పెరట్లోకి ఏదో పని మీద వెళితే అక్కడ పొదలు పొదలుగా ఉన్న మొక్కల నిండా అరవిచ్చిన మొగ్గలు... గులాబీ రంగులో... ఎంత బాగున్నాయో... “మామ్మ గారూ, ఇవేం పూలు?” అని అడిగితే చెప్పారు... “డిసెంబర్ పూలమ్మా... ఎప్పుడూ చూడలేదా?”


స్కూల్లో ఉండగా ఎవరో అమ్మాయిలు  పెట్టుకుంటే చూసానేమో కానీ ఇంత విపులంగా, వివరంగా చూడలేదు మరి... తెల్లవారేసరికి, గులాబీ రంగు నక్షత్రాల్లా ఎంతో అందంగా డిసెంబరాలు! ఓహ్... ఆకు పచ్చని వనానికి అద్దిన గులాబీ రంగు! వారి అనుమతితో పూలు కోసుకుని, మొట్టమొదటి సారిగా స్వంతంగా డిసెంబర్ పూల మాల కట్టాను... మొత్తం పూలకి మూరెడు పూలు అయ్యాయి... నా లావుపాటి రెండు జడలలో కుడివైపు జడకి అమ్మ పిన్నుతో పెట్టింది... ఆ గులాబీ రంగు పూవులకి మాచ్ అయ్యే లంగా, ఓణీ జాగ్రత్తగా వెదికి వేసుకుని కాలేజీకి వెళ్ళిపోయాను...


మా క్లాసులోని అమ్మాయిలంతా డిసెంబర్ పూల అందానికి పడిపోయారు... అందరి నోటా ఒకటే మాట... ‘అబ్బా, ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయో...’ 
‘అవునా, ఇవి మా ఇల్లుగల మామ్మగారి దొడ్లోవి... నేనే మాల కట్టాను తెలుసా?’ కించిత్ గర్వంగా చెప్పాను.
“మా అమ్మమ్మగారి ఊర్లో కూడా ఉన్నాయి కానీ ఈ రంగువి కావు... తెల్లవీ, వయొలెట్ వీ...” వేణి చెప్పింది అపురూపంగా గులాబీ రంగు డిసెంబర్ పూవుల్ని తాకి మరీ చూస్తూ...    
అప్పటినుంచీ ప్రతీరోజూ ఆ మొక్కలకి నీళ్ళు పోసే దాన్ని.  డిసెంబర్ నెలా, జనవరి, ఫిబ్రవరి నెలలూ ఉదయం లేవగానే వాళ్ళ పెరటి తోట మీద దాడి చేసి, పూలు కోసి, దండలు కట్టి నా జళ్ళో పెట్టుకోవడమే  కాకుండా నా ఫ్రెండ్స్ అందరి జడలకీ పంచేదాన్ని... డిసెంబర్ పూల పుణ్యమా అని నాకు మాలకట్టటం అద్భుతంగా వచ్చేసింది...

“అక్కా, డిసెంబర్ పూలు తగ్గిపోయాయి...” దిగులుగా చెప్పింది ఆరేళ్ళ చిన్నారి, ఇంటివారి మనవరాలు, నా పూలదండల భాగస్తురాలూ...  చిన్నారి అమ్మా,  నాన్నగారు ఢిల్లీ లో ఉద్యోగం చేస్తున్నారు... ఈ మధ్యనే పాపను ఇక్కడికి తెచ్చుకున్నారు మామ్మగారు వాళ్ళు.
“అవునురా... ఫిబ్రవరి అయిపోవచ్చింది కదా మరి?  శీతాకాలం అయిపోయి ఇక వేసవి కాలం వచ్చేస్తుంది... పెద్ద పరీక్షలు అవగానే మీకు సెలవులు ఇచ్చేస్తారు కూడానూ...” ఆ పాప తెచ్చిన గుప్పెడు పూవులనూ దారంతో మాలకడుతూ చెప్పాను... 


“అంటే, మళ్ళీ డిసెంబర్ పూలు ఎప్పుడొస్తాయి?” 
“మళ్ళీ డిసెంబర్ లోనే... ఈలోగా వేసవిలో మల్లెపూలు, వర్షాకాలంలో చామంతి పూలూ వస్తాయి కదా?”
“ఉహు, ఇవే బాగుంటాయి నాకు... మంచి రంగులో అందంగా ఉంటాయి... కదక్కా?”
“అవును...” వెంటనే ఒప్పేసుకున్నాను, కట్టిన బుజ్జి దండను ఆ బుజ్జిదాని బుల్లి జడలో అలంకరిస్తూ...
“కేరం బోర్డు ఆడుకుందాం అక్కా, కాలేజీ నుంచి తొందరగా వచ్చేయ్...” చెప్పాడు తమ్ముడు...
“అలాగే, ఆటయ్యాక అన్నీ నువ్వు సర్దితేనే...” షరతు పెట్టి స్నానానికి వెళ్ళిపోయాను...

ఇంకో నాలుగు హేమంత శిశిరాలు శరవేగంతో గడిచిపోయాయి... నేను గ్రాడ్యుయేషన్  రెండో సంవత్సరంలోకి వచ్చేసాను... చదువుకుంటూనే వైజాగ్ లో ఉద్యోగం చేస్తున్న అక్క ప్రోత్సాహంతో, పోటీ పరీక్షలకి తయారవుతూ, కొన్ని వ్రాసాను...  తమ్ముడు ఎనిమిదో తరగతికీ, చిన్నారి ఆరో తరగతికీ వచ్చారు. ఈ నాలుగు శీతాకాలాలూ డిసెంబర్ పూల వసంతాలు మా ముగ్గురినీ ఎంతో ఆనందపరిచాయి... పూల మాలల పంపకం వలన కాలేజీలో నా స్నేహితురాళ్ళతో అనుబంధం కూడా ఎక్కువ అయింది...


ఉన్నట్టుండి, జనవరి నెలలో నాకు విశాఖపట్నం నుంచి ఒక బీమా కార్యాలయంలో టైపిస్టు ఉద్యోగానికి ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది... నా టైపింగ్ స్పీడు, ఆక్యురసీ వాళ్లకి బాగా నచ్చేసి, అప్పాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టేసారు... నా ఉద్వేగానికి అంతు లేదు... 


చదువు పూర్తికాక ముందే సంపాదనాపరురాలిని అవుతున్నాను... గాలిలో తేలిపోతున్న భావన కలిగింది... ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తే, అదే రోజు నాన్నగారికి గుంటూరుకు  బదిలీ అయిన ఆర్డర్ వచ్చింది. అయితే సెలవులకి ఈ ఇంటికి వచ్చి మళ్ళీ ఆనందించే అవకాశం ఇక లేదన్న మాట... నా స్నేహితులందరినీ... లిడియా, కృష్ణవేణి, శ్యామల, మణీ అబ్బా, అందరూ ఎంత దగ్గరైపోయారో... అందరినీ వదిలి వెళ్ళాల్సిందే...


ఈ ఆవరణలోని కొబ్బరి చెట్లూ, తాటి చెట్లూ, గిలకబావీ, మామ్మగారు ఎండబెట్టే కొబ్బరి ముక్కల కమ్మని రుచీ, ఆవిడ చేసి పెట్టే తాటి రొట్టీ, మా వంటగదిని ఆనుకుని ఉన్న సీతాఫలం చెట్టుకు కాచిన తియ్యని పళ్ళూ, తాతగారు మట్టికుండలో వేసి తంపటి పెట్టే తేగల రుచీ, కొద్దిగా మొలక వచ్చిన తాటి టెంకలని కత్తితో పగలగొట్టి తినే కమ్మని బుర్రగుంజూ – వీటన్నిటికీ దూరం కావలసిందేనన్న మాట... ఇంకా మామ్మగారి పాటలూ, తాతగారి కబుర్లూ, చిన్నారి కబుర్లూ... అన్నిటినీ మిస్సవాల్సిందే... మనసుకు చాలా వెలితిగా అనిపించింది... అయ్యో... అసలైనవీ, అపురూపమైనవీ... నా డిసెంబర్ పూలు... బాధతో నా కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి...    


నన్ను విశాఖపట్నంలో హాస్టల్లో చేర్చటానికి నిర్ణయం జరిగింది... అక్కయ్య ఊరిలోనే ఉంటుంది కాబట్టి భయం లేదు. నాన్నగారు నన్ను జాయిన్ చేయటానికి నాతో బయలుదేరారు... ఆ పైవారం ఆయన మా ఫ్యామిలీ ని గుంటూరు షిఫ్ట్ చేసేస్తానని చెప్పారు...బయలుదేరే ముందు చిన్నారి నన్ను గట్టిగా పట్టుకుని, నా పొట్టలో తలదాచుకుంది. దాని కళ్ళలో బాధ... “అక్కా, నువ్వు వెళ్ళిపోతే డిసెంబర్ పూలు ఎవరు మాల కడతారు?” అంది దీనంగా... 
“నీకు నేర్పించాను కదరా... నువ్వే కడతావు... నేను క్రిస్మస్ కి వస్తానుగా, అప్పుడు నువ్వు నాకు మాలకట్టి ఇద్దువు గాని...” ఊరడించాను...


“నాకు నీ అంత బాగా రాదుగా? మధ్యలో చాలా పూలు తెగిపోతాయి... దారం ఉండిపోతుంది మధ్యలో... మరి నాకు పాటలు ఎవరు నేర్పిస్తారు? ఎక్కాలు ఎవరు అప్పజెప్పించుకుంటారు? కథలు ఎవరు చెబుతారు? నువ్వు లేకపోతే నాకు తోచదు అక్కా...” 


నా కన్నీటి తడి దాని మెత్తని బుగ్గలకు అంటుకుంటుంటే, వాటిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. తమ్ముడి నుదుట ముద్దు పెట్టుకుని, అమ్మకి, తాతగారికి, మామ్మగారికి పాదాలంటి నమస్కరించి నాన్నగారితో బయలుదేరాను... గేటు దాటే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి తనివితీరా మా ఇంటినీ, ఆ ప్రాంగణాన్నీ చూసుకున్నాను... ఆ తరువాత అవి  సరిగ్గా కనిపించలేదు... కారణం - మా  రిక్షా ఆ ఆవరణ దాటటంతో పాటుగా కనులు మసకబారటం కూడా...

“మీకు నైట్ మీల్స్ కావాలా మేడమ్?” పాంట్రీ కార్ వెండార్ మాటలకి ఆలోచనల్లోంచి ఈ లోకంలోకి వచ్చాను.  “వద్దు...” చెప్పి ఎదురుగా చూసాను. కన్నార్పకుండా నా వైపే చూస్తున్న ఒకావిడ “మీరు... వినయ గారే కదా...” అని అడిగింది ఆత్రంగా.
“అవును... మీరు...” ఆశ్చర్యంగా ఆమెను పరికించి చూసిన నేను ఆమెను గుర్తుపట్టి, “చిన్నారీ, నువ్వేనా?” అన్నాను ఆరాటంగా...
“అవును అక్కా... ఎలా ఉన్నారు,ఎక్కడ ఉన్నారు?” ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమె ముఖంలో దాచినా దాగని ఆనందం... నా పక్కకి వచ్చి కూర్చుంది చిన్నారి. ఆమెకి నా వివరాలు అన్నీ చెప్పాను... కానీ, నా మనసులో ఎంతో వేదనగా ఉంది తనని చూస్తూ ఉంటే... కళ్ళలోకి గోదారి పొంగుకు వస్తోంది... 


“ఇప్పటివరకూ మన చిన్నతనాన్ని, నిన్నూ తలచుకుంటున్నాను... అదేమిటో, చిత్రంగా వెంటనే నువ్వు కలిసావు... చిన్నారీ, ఏమైందిరా? ఏమిటిది?” తలమీద కప్పుకున్న ముసుగులోంచి కనిపిస్తున్న ఆ ముఖాన్ని చూస్తూ  అడగలేక అడిగాను. ఒక చెంప అంతా కాలిపోయి ఉంది... కుడివైపు జుట్టు కూడా లేదు కొంతమేర... 


“చిన్నపుడు  డిసెంబర్ పూలు మాల కడుతూ వాటి గురించి నువ్వు ‘శిశిరంలో వసంతం’ అనే దానివి గుర్తుందా అక్కా? ఇది ‘వసంతంలో శిశిరం...’ కాకపోతే శాశ్వత శిశిరం...” ఆమె గొంతు దుఃఖంతో వణికింది.  “ఒక శాడిస్ట్ భర్త రూపంలో నన్ను కాటేసాడు... నా ఆస్తిపాస్తులూ, కట్న కానుకలూ కాజేసి, ఆపైన నన్ను వదిలించుకోవటానికి నా మీద మచ్చ వేసి, యాసిడ్ పోసాడు... దానికి తగిన శిక్ష కూడా అనుభవిస్తున్నాడనుకో, కటకటాల వెనుక...”


“ప్చ్... చిన్నారీ...” ఆమెను దగ్గరగా లాక్కుని గుండెల్లో పొదువుకున్నాను. ప్రస్తుతం ఆమె సీలేరు దగ్గర ట్రైబల్ ఏరియాలో టీచర్ గా చేస్తోంది... పిల్లలు లేరు... తాతగారూ, మామ్మ గారూ కాలం చేసారట. చిన్నారి అమ్మా, నాన్నా తన దగ్గరే ఉన్నారట... తన జీవితాన్ని గిరిజన బాలబాలికల అభివృద్ధి, మానసిక వికాసాల కోసమే  వినియోగించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది చిన్నారి.


“చిన్నారీ, అప్పుడు మనింట్లో డిసెంబర్ పూల తరువాత నేనైతే ఎప్పుడూ ఆ రంగు డిసెంబర్ పూలు చూడలేదు... కానీ చిరుచలి మొదలైన వెంటనే ఆ గులాబీ రంగు పువ్వులూ, నువ్వూ నా మనసులో మెదులుతారు ఇప్పటికీ... ఆ రంగు బుగ్గలతోనే ఉండే మా చిన్నారి కళ్ళలో నిండిపోతుంది నాకు...” ఆర్ద్రంగా చెప్పాను.


“అవునక్కా, నేనైతే  ప్రతీ ఏటా చూస్తూనే ఉన్నాను ఆ పూలు... వాటికి పరిమళం లేదని అంటారు కానీ, వాటి నిండా నీ జ్ఞాపకాల పరిమళమే వినయక్కా...” ప్రేమగా చెప్పింది చిన్నారి.


“చిన్నారీ, ఇక మనం ఎప్పటికీ కలిసే ఉండాలి... విడిపోవద్దు...” ఆమె చెంపలు తడుముతూ, ఉద్వేగంగా చెప్పాను, కాస్మెటిక్ సర్జన్ గా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న నా కొడుకు మనసులో మెదులుతూ ఉండగా...

 

-నండూరి సుందరీ నాగమణి