కారు పార్టీకి కౌంట్ డౌన్  మొదలైనట్టేనా? గ్రేటర్ ఎన్నికతో గులాబీ బాస్ కు చెక్ పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో బడా నేతలను రంగంలోకి దింపుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలదళం..  మరో మూడేళ్లలో జరగనున్న అసెంబ్లీ సమరానికి..జీహెచ్ఎంసీ ఎన్నికను సెమీఫైనల్ గా భావిస్తోంది. గ్రేటర్ లో పాగాతో తమ లక్ష్యానికి చేరుకునేలా కార్యాచరణ రెడీ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ ప్రచారానికి పార్టీ అగ్రనేతలను  రంగంలోకి దింపుతోంది.    జీహెచ్ఎంసీ ఎన్నికను బీజేపీ హైకమాండ్ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తుందంటే వాళ్లు ఎంత సీరియస్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎ‍న్డీయేను విజయతీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్‌ ను గ్రేటర్ ఎన్నికల ఇంచార్జ్ గా నియమించింది. కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసి రాష్ట్ర నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు భూపేంద్ర యాదవ్‌. లోకల్ బాడీ ఎన్నికకు జాతీయ స్థాయిలో ట్రబుల్ షూటర్ గా పేరున్న భూపేంద్రను ఇంచార్జ్ గా పంపించిన హైకమాండ్.. అంతటితో ఆగడం లేదు. కేంద్రమంత్రులను హైదరాబాద్ ప్రచారానికి పంపిస్తోంది. రెండు రోజుల క్రితమే గ్రేటర్ లో ప్రచారం చేసి వెళ్లారు ప్రకాశ్ జవదేకర్. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై ఆయన చార్జీషీట్ విడుదల చేశారు. కేసీఆర్ పాలనపై, టీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు ప్రకాశ్ జవదేకర్.    బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య కూడా రెండు రోజులుగా నగరంలో పర్యటిస్తున్నారు. ఛేంజ్‌ హైదరాబాద్‌’ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో మీటింగ్ పెట్టి కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు తేజస్వి సూర్య. గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇస్తే భాగ్యనగరం రూపురేఖలు మారుస్తామని, పాతబస్తీలో అరాచక శక్తులను తరిమికొడతామని  తేజస్వి సూర్య అన్నారు. తాను భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్తే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారని, తనను రెచ్చగొడితే భాగ్యలక్ష్మి దేవాలయాన్ని అడ్డాగా చేసుకుంటానని సవాల్‌ విసిరారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలన్నారు సూర్య. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుధవారం గ్రేటర్ లో ప్రచారం చేయబోతున్నారు. స్మృతికి తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉండటంతో ఆమెకు ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు.    కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ పాటు మరికొంతమంది నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. గ్రేటర్ లో పాగా వేస్తే దక్షిణాదిలో పార్టీకి ఫుల్ జోష్ వస్తుందని బీజేపీ ప్లాన్ చేసిందని చెబుతున్నారు. గౌతమ్ గంభీర్, సైనా నెహ్వాల్, కుష్భు లు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్నారు తెలుస్తోంది. అవసరమైతే మరికొందరు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలను హైదరాబాద్ పంపించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తుందట.  బీజేపీ వ్యూహాలతో అధికార టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే స్థానిక ఎన్నికలను పెద్దగా పట్టించుకోని సీఎం కేసీఆరే స్వయంగా జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారని, గ్రేటర్ ప్రజలకు వరాలు కురిపించారని చెబుతున్నారు. వరాలు ఇవ్వడమే కాదు బీజేపీ గెలిస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయంటూ ఓటర్లను భయాందోళన కల్గించే ప్రయత్నం చేశారు కేసీఆర్. బీజేపీ దూకుడుతో గులాబీ నేతల్లో గుబులు పెరిగిపోతుందని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.    దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బీజేపీకి జోష్ వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి గ్రేటర్‌ పోటీలో బీజేపీ రేసులోకి వచ్చింది. ఇప్పుడు గ్రేటర్‌ లోనూ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తోంది బీజేపీ రాష్ట్ర నేతలందరినీ మోహరించి భాగ్యనగర్‌ బస్తీల్లో జోరు పెంచుతోంది.  బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్‌రావుతో సహా రాష్ట్ర స్థాయి నేతలంతా హైదరాబాద్‌లోనే ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
మాట తప్పే వ్యక్తిని ఏమంటారు? అంటే రాజకీయ నాయకుడు అని చెప్పుకొనే రోజుల్లో బతుకుతున్నాం. ఏదో నూటికో కోటికో ఒకరిద్దరు తప్ప దాదాపు రాజకీయ నాయకులంతా అదే కోవకి చెందిన వాళ్లనేది బహిరంగ రహస్యం. చిన్నదో పెద్దదో ఏదొక విషయంలో, ఏదొక సందర్భంలో మాట మార్చడమో, మాట తప్పడమో చేస్తూనే ఉంటారు. దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అతీతులు కాదు. తాజాగా ఆయన మాస్క్ గురించి ఉపన్యాసం ఇచ్చిన 24 గంటల్లోనే శానిటైజర్ లో కాలేశారు.   యాంకర్ సుమ తాజాగా మంత్రి కేటీఆర్ ని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో హైదరాబాద్ అభివృద్ధి అంశంతో పాటు పలు విషయాలను పంచుకున్నారు. అదంతా బాగానే ఉంది కానీ, ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో కేటీఆర్ చెప్పిన దానికి, ఇంటర్వ్యూ ముగిసిన కొద్ది గంటలకు ఆయన చేసిన దానికి అసలు పొంతనే లేదు. కేటీఆర్ మాస్క్ లేకుండా ఇంటర్వ్యూలో పాల్గొనడంతో.. మిమ్మల్ని మాస్క్ లేకుండా చూసి ఎన్ని రోజులైంది అని సుమ ప్రశ్నించింది. దీంతో పొంగిపోయిన కేటీఆర్ మాస్క్ గురించి చిన్నపాటి ఉపన్యాసమే ఇచ్చారు. మనిషికి ముక్కు ఎంత ముఖ్యమో ప్రస్తుతం పరిస్థితుల్లో మాస్క్ కూడా అంతే ముఖ్యం అన్నట్టుగా చెప్పారు. ఆరేడు నెలల నుంచి తాను ఎక్కడికెళ్లినా మాస్క్ ధరించే వెళ్తున్నానని.. లాక్ డౌన్ సమయంలో కంటైన్మెంట్ జోన్లలో తిరిగాను, కరోనా పేషెంట్స్ ని కలిసాను.. అయినా తనకి కరోనా సోకలేదని, ఎప్పుడూ మాస్క్ ధరిస్తూ ఉండటమే దానికి కారణమని చెప్పుకొచ్చారు. అంతేకాదు, కొందరుంటారు పేరుకి మాస్క్ పెట్టుకుంటారు, మాట్లాడేటప్పుడు మాస్క్ తీసేసి మాట్లాడతారు అంటూ సెటైర్స్ కూడా వేశారు.   అబ్బబ్బా మాస్క్ గురించి మంత్రి కేటీఆర్ ఎంత గొప్పగా సెలవిచ్చారో కదా. ఆగండి ఆగండి కంగారుపడి పొగిడేసి మనం కూడా ఆయనలాగా శానిటైజర్ లో కాలేస్తే ఎలా?. మాస్క్ గురించి ఉపన్యాసం ఇచ్చిన 24  గంటల్లోనే కేటీఆర్ మాస్క్ గొప్పతనాన్ని మరిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన.. నిన్న ప్రచారంలో మాస్క్ ని ముక్కుకి పెట్టుకోవడమే మరిచారు. మాస్క్ లేకుండా పబ్లిక్ లోకి రానని చెప్పిన ఆయన, కొందరు మాట్లాడేటప్పుడు మాస్క్ తీసేస్తున్నారని సెటైర్స్ వేసిన ఆయన.. చెప్పిన 24 గంటల్లోనే తప్పులో కాలేశారు. ఏదో ఫార్మాలిటీకి మెడలో మాస్క్ తగిలించుకొని ప్రచారంలో పాల్గొన్నారు. ఇలా అయితే ఎలా మంత్రి గారు. అసలే మిమ్మల్ని ప్రజలు మాస్క్ కి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారు. మీరు మాస్క్ మరిచి మా మనోభావాలు హర్ట్ చేయకండి. దయచేసి వాక్సిన్ వచ్చేవరకు మాస్క్ తోనే కనిపించండి.
భారత్ చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో గత జూన్ లో పలు చైనా యాప్‌లను నిషేధిస్తూ చర్యలు తీసుకున్నకేంద్ర ప్రభుత్వం.. తాజాగా చైనాకు మరో ఝలక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన 43 యాప్‌లను బ్యాన్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మనదేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ, భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొంటూ ఈ 43 మొబైల్ అప్లికేషన్లను నిషేధిస్తూ సమాచార, సాంకేతిక శాఖ ఈరోజు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుబంధ ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా బ్యాన్ చేసిన ఈ యాప్స్‌లో చైనా వ్యాపార దిగ్గజ సంస్థ అలీ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. దానితో పాటు అలీబాబా వర్క్ బెంచ్, హీరోస్ ఎవాల్వ్‌డ్, డింగ్ టాక్ వంటి ఇతర అప్లికేషన్లున్నాయి.    ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది జూన్ 29న ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69 ఏ కింద 59 మొబైల్ యాప్స్‌ను.. అలాగే సెప్టెంబర్ 2న మరో 118 యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిలో ఎక్కువగా చైనీస్ యాప్‌లే. కాగా టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, వీ చాట్, లూడో వంటి యాప్‌లు భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లేలా చేస్తున్నాయంటూ గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీతో అవగాహనకు వచ్చిన జనసేన చివరి నిమిషంలో బరి నుండి తప్పుకుంది. బీజేపీ అగ్రనేతల రాయబారం తర్వాత ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు పవన్ కల్యాణ్ అంగీకరించారు. అయితే త్వరలో ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండడంతో.. ఆ సీట్‌‌ను జనసేన కోరుకుంటోంది. బీజేపీ కోసం జిహెచ్ఎంసి ఎన్నికల నుండి తప్పుకున్నామని, దీనికి ప్రతిగా తిరుపతి సీటును తమకు ఇవ్వాలని కోరడానికి జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ చేరుకున్నారు. అయితే నిన్న సోమవారం నుంచి ఇప్పటివరకు వారికి బీజేపీ అగ్రనేతల అపాయింట్ మెంట్ ఇంకా దొరకలేదు. దీంతో బీజేపీ అగ్రనేతలను కలవడం కోసం పవన్, మనోహర్ ఎదురు చూస్తున్నారు.   ఇది ఇలా ఉండగా తిరుపతి లోకసభ సీటును జనసేనకు ఇవ్వబోమని, తామే అక్కడ నుండి పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం చేసారు. తమ పార్టీ గతంలో కూడా తిరుపతి లోక్ సభ స్థానం నుండి గెలిచిందని ఆయన గుర్తు చేశారు. మరోపక్క తిరుపతిలో పోటీ చేస్తామని ముందే ప్రకటించిన ఎపి బీజేపీ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ కూడా జనసేనకు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో పోటీ చేసి.. పవన్ కల్యాణ్ మద్దతుతో వైసీపీని ఓడించొచ్చని.. దీంతో ఏపీలో తమ పరపతి పెరుగుతుందని.. పైగా సీఎం జగన్ కూడా తమ కంట్రోల్ లో ఉంటాడని బిజెపి స్కెచ్ వేసింది. ఇంతకూ బీజేపీకి గ్రేటర్ ఎన్నికలలో చేసిన సాయానికి బదులుగా మిత్రపక్షం జనసేనకు తిరుపతి సీటు ఇస్తారా.. లేక అక్కడ కూడా బీజేపీ నే పోటీ చేస్తుందా వేచి చూడాలి.
బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను కూడా అమ్మేస్తారని విమర్శించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇప్పటికే మోడీ సర్కార్ భారతదేశాన్ని అమ్మేస్తోందని ఆరోపించారు. అన్నింటినీ ప్రైవేట్‌పరం చేయడమే బీజేపీ పాలసీ అన్నారు కేటీఆర్. రైల్వే రంగాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని హామీలంటూ బీజేపీ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చాడు. బీజేపీ నేతలు గోబెల్స్‌ కజిన్స్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం మంత్రులు సైతం అస్యతాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను తీర్చినందుకా టీఆర్‌ఎస్‌ ప్రభత్వుంపై చార్జ్‌షీట్‌ విడుదల చేశారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతుబంధు అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడలేని విదంగా 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయే అన్నారు. తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రమని కేంద్రమంత్రులు చెప్పారని గుర్తుచేశారు.    బీజేపీకి 50 ప్రశ్నలు సంధించారు కేటీఆర్. లోయర్‌ సీలేరును తీసుకెళ్లి ఏపీలో కలిపింది బీజేపీ కాదా?అని ప్రశ్నించారు. పేకాట క్లబ్‌లు మూసివేయించినందుకా మాపై ఛార్జిషీట్‌? లక్షల మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టారు.. వారు భాజపాపై ఛార్జిషీట్‌ వేయాలి. కరోనా సమయంలో చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు ఛార్జిషీట్‌ వేయాలి అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నందుకు బీజేపీపై రైతులు ఛార్జిషీట్‌ వేయాలన్నారు. పెట్టు బడుల ఉపసంహరణ దేశ భవిష్యత్‌ కోసమా.. గుజరాత్‌ పెద్దల కోసమా? అని ప్రశ్నించారు.  ఐటీఐఆర్‌ రద్దు చేసింది ఎవరు? ఆరేళ్ల లో హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పగలరా? అని బీజేపీ నేతలను నిలదీశారు. ఇంటింటికి మంచి నీళ్లు, వేలాది గురుకులాలు పెట్టి పేద విద్యార్థులను చదివిస్తున్నందుకే  టీఆర్‌ఎస్‌పై చార్జ్‌షీట్‌ విడుదల చేశారా? అని బిజేపీ నేతలను ప్రశ్నించారు కేటీఆర్.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం దూకుడుగా పోరాడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతలే బ్రేకులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నగరం నుంచే లోక్ సభకు ప్రాతినిధ్య వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తీరుతో కమలం పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం హోరాహారీగా జరుగుతున్న సమయంలో కేడర్ లో జోష్ నింపాల్సిన కిషన్ రెడ్డి.. పార్టీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడుతున్నారన్న చర్చ బీజేపీలోనే జరుగుతోంది. ముఖ్యంగా వరద సాయం, కేంద్ర నిధులపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా, నగర ఎంపీగా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని పరుగులు పెట్టాంచాల్సిన కిషన్ రెడ్డే.. పార్టీ భారంగా మారారనే చర్చ బీజేపీ నుంచే వినిపిస్తోంది.    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరద సాయం అంశం కీలకంగా మారింది. ప్రభుత్వం చేసిన 10 వేల రూపాయల ఆర్థిక సాయం కొందరికి మాత్రమే అందింది. దీంతో సాయం అందని వారంతా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీని గెలిపిస్తే వరద బాధితులకు సాయంగా 25 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు బండి సంజయ్. ఇది జనంలోకి బాగా వెళ్లింది. ఇది గ్రహించిన  అధికార పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. వరద సాయం చేసేది జీహెచ్ఎంసీ కాదని, రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని.. టీఆర్ఎస్సే ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి... సాయం చేయడం తమతోనే సాధ్యమని ఎన్నికల ర్యాలీలలో చెబుతూ వస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చి వరద బాధితులకు సాయం చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటిస్తే బీజేపీకి ఎంతో బూస్ట్ వచ్చేది. అయితే అలాంటి ప్రకటన చేయని కిషన్ రెడ్డి.. సంజయ్ హామీనే తప్పనే అర్దం వచ్చేలా మాట్లాడారు. స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు ఇవ్వదని, అలా ఇవ్వడానికి చట్టాలు ఒప్పుకోవని చెప్పారు కిషన్ రెడ్డి.    కిషన్ రెడ్డి ప్రకటనతో కమలం నేతలు అవాక్కయ్యారట. సంజయ్ ఇచ్చిన వరద సాయం హామీ వల్ల వచ్చిన మైలేజీ అంతా కిషన్ రెడ్డి ప్రకటనతో పోయిందని గ్రేటర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. వరద సాయం, కేంద్ర నిధులపై  కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకుంది టీఆర్ఎస్. కిషన్ రెడ్డి కామెంట్లను నిమిషాల్లో వైరల్ చేసింది. కేంద్రం నిధులు ఇవ్వదని కేంద్రమంత్రి చెబుతుంటే.. ఇంటికి 25 వేల రూపాయలు సాయం చేస్తామంటూ ప్రజలను బండి సంజయ్ మోసం చేస్తున్నారంటూ.. ఇద్దరు మాట్లాడిన వీడియోలను జనంలోకి వదిలారు కారు పార్టీ నేతలు. ఆ వీడియోలు చూసిన జనాలకు కూడా.. బీజేపీ ఎక్కడి నుంచి తెచ్చి వరద సాయం చేస్తుందనే అనుమానాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారాల్లోనూ మంత్రి కేటీఆర్ పంచ్ డైలాగులతో విరుచుకుపడుతుంటే కిషన్ రెడ్డి మాత్రం సొల్లు ప్రసంగాలు చేస్తున్నారని.. ఇలా అయితే టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కష్టమనే అభిప్రాయం కమలం కేడర్ లో వస్తోంది అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలోనూ కిషన్ రెడ్డి నామమాత్రంగా వ్యవహరించారని బీజేపీ నేతలు చెబుతున్నారు.     అంతేకాదు కిషన్ రెడ్డి ఎంఐఎం నేతలతో సన్నిహితంగా ఉంటారనే ప్రచారం ఉంది.  ఎంఐఎం సహకారం వల్లే అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా  ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారని కూడా చెబుతారు. ఇప్పుడు ఇది కూడా గ్రేటర్ ప్రచారంలో బీజేపీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. గతంలో అసద్ తో కిషన్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోలు, వారిద్దరు వేదికలపై నవ్వుతూ మాట్లాడుతూ కూర్చున్న వీడియోలను కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న కమలం నేతలకు ఇది మైనస్ గా మారిందని బీజేపీ నేతలే చెబుతున్నారు. గ్రేటర్ టికెట్ల  విషయంలోనూ కిషన్ రెడ్డి వ్యవహారం వల్లే కొన్ని చోట్ల కార్యకర్తలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. గ్రేటర్ ఎన్నికల్లో  బీజేపీ కోసం జనసేన తప్పుకుందని చెప్పారు. తిరుపతిలో సీటు కావాలని అన్నాడు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని భావించాలా?.. గ్రేటర్ లో వదులుకున్నాం కాబట్టి తిరుపతిలో సీటు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారా?" అని పవన్ ను టార్గెట్ చేస్తూ రోజా ప్రశ్నించారు. బీజేపీకి కొన్ని ఓట్లు పడాలి, టీఆర్ఎస్ ఓడాలి అంటూ ఎన్నికల నుంచి పవన్ వైదొలిగారు.. ఇప్పుడు తిరుపతికొచ్చి పోటీచేస్తున్నారని రోజా అన్నారు. గతంలో తన సొంత నియోజకవర్గంలో, తన సొంతవాళ్ల మధ్యే గెలవలేని వ్యక్తి ఇప్పుడు తిరుపతి వచ్చి ఏం చేస్తాడని ఆమె ప్రశ్నించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతిలో గెలిచేది వైసీపీనే అని స్పష్టం చేశారు.    జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు రోజా. జనసేన పార్టీయా లేక కేటీఆర్ అన్నట్టు మోడీ భజనసేన పార్టీయా అనేది అర్థం కావడంలేదని రోజా ఎద్దేవా చేశారు. పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికలకు పోకుండా టీడీపీ, బీజేపీలకు  ప్రచారం చేసి వాళ్లకు ఓట్లు వేయాలని ప్రజలకు చెప్పారని ఆమె విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు ఇవ్వకపోయినా పవన్ ఏమీ మాట్లాడలేదని రోజా విమర్శించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతలు హాట్ కామెంట్స్ తో గ్రేటర్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎంఐఎం టార్గెట్ గా బీజేపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఎంఐఎంకు ఓటు వేస్తే టీఆర్‌ఎస్ లబ్ధి పొందుతుందన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో 30 నుంచి 40 వేల మంది రోహింగ్యాలు ఉన్నారన్న బీజేపీ ఆరోపణలు చేస్తోందని చెప్పిన అసద్.. రోహింగ్యాల పేర్లు ఓటర్ల జాబితాలో ఉంటే మరి దేశానికి హోం మంత్రిగా ఉన్న అమిత్‌షా ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. అమిత్ షా నిద్రపోతున్నారా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అంత మంది రోహింగ్యాలు ఓటర్ల జాబితాలోకి ఎలా వచ్చారని అమిత్ షా ఎందుకు విచారణ జరపించట్లేదని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆ రోహింగ్యాలు ఎవరో బీజేపీ వెల్లడించాలని అన్నారు. విద్వేషం సృష్టించడమే బీజేపీ నేత ఉద్దేశమని అసద్ ఆరోపించారు.
మూడు గ్రూపులు.. ఆరు అలకలు.. పన్నెండు గొడవలు. ఇదీ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో దక్కిన విజయం బీజేపీకి బూస్ట్ ఇచ్చింది. దుబ్బాక  జోష్ తో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కమలం వికసిస్తుందని, బల్దియాపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు. తీరా ఎన్నికలు వచ్చాకా మాత్రం ఆ పార్టీలో నిరుత్సాహం కనిపిస్తోందని చెబుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటే.. వర్గ పోరుతో కమలనాధులు వెనకబడ్డారనే చర్చ జరుగుతోంది. నగర పరిధిలోని నేతలు రెండు వర్గాలుగా విడిపోవడంతో కేడర్ లోనూ గందగోళం నెలకొందని చెబుతున్నారు.                  నగరంలో బీజేపీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన తీరుతో గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీకి ఇబ్బందులు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజాసింగ్ తీరు బీజేపీలో మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. హిందూ అనుకూల, ఎంఐఎం వ్యతిరేక ప్రకటనలు చేస్తూ కేడర్ లో జోష్ నింపుతుంటారు రాజాసింగ్. అయితే పార్టీ వ్యవహారాల్లో మాత్రం ఆయన ఎప్పుడూ కాంట్రవర్సీనే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్గీయుడిగా ముద్రపడిన రాజాసింగ్.. కావాలనే బండి సంజయ్ కి సహకరించడం లేదనే చర్చ జరుగుతోంది. బీజేపీలో తీవ్ర కలకలం రేపిన రాజాసింగ్ ఆడియో వెనక కిషన్ రెడ్డి పాత్ర ఉందని తెలుస్తోంది.  గ్రేటర్ ఎన్నికల్లో తానే చక్రం తిప్పాలని కిషన్ రెడ్డి భావించారట. అయితే బండి సంజయ్ సిటీపై ఫోకస్ చేస్తూ సభలు, సమావేశాలు పెట్టారు. సంజయ్ దూకుడుతో ఆయనకు నగరంలో బలమైన వర్గం తయారైందట. గ్రేటర్ టికెట్ల ఎంపికలోనూ కిషన్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించాలని చూసినా.. సంజయ్ టీమ్ వ్యతిరేకించిందని తెలుస్తోంది. సిటీలో సంజయ్ టీమ్ పెరగడాన్ని కిషన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని చెబుతున్నారు. అందుకే సంజయ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే రాజాసింగ్ తో కిషన్ రెడ్డి డ్రామా ఆడిస్తున్నారని బీజేపీ కార్యకర్తల్లోనే చర్చలు జరుగుతున్నాయి.   కిషన్ రెడ్డి మనిషిగా ముద్రపడిన రాజాసింగ్.. ఆయన చెప్పినట్లే చేస్తారని చెబుతుంటారు. కిషన్ రెడ్డి పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు రాజాసింగ్ పార్టీ కార్యాలయంలో యాక్టివ్ గా ఉండేవారట. ఎప్పుడు అక్కడే ఉండేవారంటున్నారు. లక్ష్మణ్ కు పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయం రావడం మానేశారట. పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదంటున్నారు. కిషన్ రెడ్డి బాటలోనే రాజాసింగ్ కూడా లక్మణ్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నన్ని రోజులు.. పార్టీ కార్యాలయం వైపు వెళ్లలేదని చెబుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా రాజా సింగ్ తీరు మారలేదంటున్నారు. కిషన్ రెడ్డితో సంజయ్ కు విభేదాలు ఉన్నందునే.. సంజయ్ కి వ్యతిరేకంగా రాజా సింగ్ రాజకీయం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.   గోషామహాల్ నియోజకవర్గం పరిధిలో జరిగిన టికెట్ల గొడవ, పార్టీ కార్యాలయం దగ్గర ధర్నాలు, బీఫామ్ తీసుకునేందుకు వచ్చిన దళిత అభ్యర్థిపై దాడి చేసి బట్టలు చించేయడం వంటి ఘటనలు పార్టీ పరువు తీశాయనే చర్చ బీజేపీలో జరుగుతోంది. బండి సంజయ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ వైరల్ కావడం కమలంలో కల్లోలం రేపింది. అయితే రాజాసింగ్ పేరుతో ఫేక్ ట్వీట్ వైరల్ అవుతోందని కమలనాధులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగానే.. రాజా సింగ్ ఆడియో బయటికి వచ్చింది. బండి సంజయ్ తీరుపై రాజా సింగ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. గ్రేటర్ నామినేషన్ల సమయంలోనే జరిగిన ఈ రెండు ఘటనలు  పార్టీకి నష్టం కల్గించాయనే అభిప్రాయం తెలంగాణ బీజేపీ నేతల నుంచి వస్తోంది. సిటీలో ఉన్న ఒక్క ఎమ్మెల్యేనే కలిసి రాకపోతే.. జీహెచ్ఎంసీని ఎలా ముందుకు తీసుకెళతారనే చర్చ కొన్ని వర్గాల ఓటర్లలో వచ్చిందని చెబుతున్నారు. ఇది పార్టీకి చాలా మైనస్ అయిందని, కేడర్ లోనూ జోష్ తగ్గిందని చెబుతున్నారు.    తెలంగాణ బీజేపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెబుతున్నారు. లక్ష్మణ్ పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఆయనకు సపోర్ట్ చేయలేదని టాక్ ఉంది. ఇప్పుడు మాత్రం ఇద్దరూ కలిసి తీరుగుతున్నారు. తెలంగాణ బీజేపీకి ఇప్పటివరకు నగరం నేతే అధ్యక్ష బాథ్యతలు చేపట్టారు. మొదటిసారి సిటీయేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టారు. దీంతో గుర్రుగా ఉన్న నగర నేతలంతా ఏకమై.. సంజయ్ ని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. అందుకే సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టగానే... గతంలో ఉప్పు నిప్పులా ఉన్న  కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కలిసిపోయారని చెబుతున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో పొత్తుపై మాట్లాడేందుకు కూడా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు సంజయ్ హైదరాబాద్ లోనే ఉన్నా ఆయనను తీసుకువెళ్లలేదు. దీంతో బండికి చెక్ పెట్టేందుకే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కలిసిపోయారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. మొత్తంగా పార్టీ నేతల వర్గపోరుతో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళన కమలం  కేడర్ లో వ్యక్తమవుతోంది. దుబ్బాక ఇచ్చిన బూస్ట్త్ తో గ్రేటర్ లో మరింత స్పీడుగా వెళ్లాల్సిన పార్టీ.. ముఖ్య నేతల తీరుతో మూల్సం చెల్లించుకోవాల్సిన పరిస్థితికి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారట.  
జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు మాణికం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి‌, భట్టి విక్రమార్క మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో అధికార పార్టీ టీఆర్ఎస్ ని మించి ఉచిత హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. వరద బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల సాయం అందజేస్తామని వెల్లడించింది. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2.5 లక్షలు, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 లక్షలు ఇస్తామని తెలిపింది. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించింది.   ఎంఎంటీఎస్‌, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని వెల్లడించింది. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని తెలిపింది. 80 గజాలలోపు స్థలంలో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు అని ప్రకటించింది. క్షురకులు, రజకులు, వడ్రంగులకు చెందిన దుకాణాలకు ఆస్తిపన్నుతో పాటు విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తామని తెలిపింది. ధరణి పోర్టల్ రద్దుకు కృషి చేస్తామని తెలిపింది. ప్రతి కుటుంబానికి 30 వేల లీటర్ల ఉచిత మంచినీరు అందజేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వెనక్కి తగ్గడం లేదు. వచ్చేఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్నారు. ఇప్పటికే సీఎస్‌ నీలం సాహ్నికి రెండుసార్లు లేఖ రాశారు. తాజాగా ఆయన మళ్లీ మరోలేఖ రాశారు. ఇందులో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహాయ, సహకారాలు అందించాలని కోరినట్లు తెలుస్తోంది.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఈనెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కూడా ఆ లేఖతో పాటు నిమ్మగడ్డ పంపించినట్లు సమాచారం. ఎన్నికల సంఘం జారీ చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పునూ, ప్రభుత్వం నుంచి అవసరమైన సహచారం కోసం ఎన్నికల సంఘం మూడోరోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్న హైకోర్టు సూచననూ ప్రస్తావించారని సమాచారం. హైకోర్టు తీర్పు కాపీని లేఖకు నిమ్మగడ్డ జతచేసి పంపినట్లు చెబుతున్నారు. రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని లేఖలో నిమ్మగడ్డ సీఎస్ కు గుర్తుచేశారని తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ, కమిషన్ విధి నిర్వహణలో ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తీర్పులో న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఇదే విషయాన్ని తన లేఖలో ఎన్నికల కమిషనర్ ప్రస్థావించారు.    స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధమని ఎన్నికల సంఘం అంటోంది. కరోనా తీవ్రత కారణంగా ఇప్పుడే ఎన్నికలు వద్దంటోంది ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. అయితే ఆమె నుంచి సరైన ప్రతిస్పందన రాలేదు. దీంతో సీఎస్ కు నిమ్మగడ్డ రమేశ్ ముచ్చటగా మూడోసారి లేఖ రాశారు. ఎన్నికల ఏర్పాట్లకు సహకరించేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని ఆ లేఖలో సీఎస్ ను నిమ్మగడ్డ కోరారు.    ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, పంచాయతీరాజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సీఎస్ సహకరించకపోవడంతో మీటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. సోమవారం ఏర్పాటు చేసిన మీటింగ్‌కు అధికారులు ఎవ్వరు రాలేదు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు, ఆదేశాలు లేవని అధికారులు చెబుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్‌ నిర్వహించాలని నిమ్మగడ్డ రమేశ్‌ పట్టుదలతో ఉన్నారు. దీంతో  సీఎస్‌ నీలం సాహ్నికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మరో లేఖ రాశారు. ఎస్ఈసీ రాసిన మూడో లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గ్రేటర్ పోరులో మల్కాజిగిరి నియోజకవర్గం కీలకంగా మారింది. మల్కాజ్ గిరి నియోజకవర్గానికి మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు పైర్ బ్రాండ్ నేతలు ఇంచార్జులుగా ఉన్నారు. వారందరూ పేరు విచిత్రంగా ఆర్ అక్షరంతోనే ప్రారంభం అవుతోంది. దీంతో మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో ట్రిబుల్ ఆర్.. ఆర్ఆర్ఆర్ ఫైట్ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.  మల్కాజ్ గిరి ఇంచార్జ్ గా మంత్రి ఈటెల రాజేందర్ ను నియమించింది అధికార పార్టీ. ఆయన ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. కార్యకర్తల సమావేశాలు ముగించుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు రాజేందర్. బీజేపీ ఇంచార్జుగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్.. తెలంగాణలో కాక రేపిన దుబ్బాక ఉప ఎన్నిక విజేత రఘునందన్ రావు ఉన్నారు. రఘునందన్ కూడా తన మార్క్ ప్రచారం స్టార్ చేశారు. తన సొంత నియోజకవర్గం కావడంతో మల్కాజ్ గిరిని సవాల్ గా తీసుకున్నారు తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి. ఆయన కూడా కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మల్కాజ్ గిరిలో ముగ్గురు ఫైర్ బ్రాండ్ లీడర్లు మకాం వేయడంతో రాజకీయం హీటెక్కిస్తోంది. మల్కాజ్ గిరి లోకల్ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు కూడా ఫ్రైర్ బ్రాండే. గ్రేటర్ ఎన్నికల్లో ఆయన మరింత దూకుడుగా  వెళుతున్నారు. దీంతో మల్కాజ్ గిరిలో ముగ్గురు ఫైర్ బ్రాండ్ల మధ్య ప్రతిష్టాత్మక  సమరం సాగుతోందనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.       మల్కాజ్ గిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో తొమ్మిది డివిజన్లు ఉన్నాయి. 2016 గ్రేటర్ ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది డివిజన్లు గెలిచి క్లీన్ స్వీప్ కొట్టింది అధికార టీఆర్ఎస్. మరోసారి అది రిపీట్ చేయాలనే టార్గెట్ తో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు ఎత్తులు వేస్తున్నారు. నియోజకవర్గంలో కొందరు సిట్టింగులను మార్చింది గులాబీ పార్టీ. మంత్రి పదవిపై చాలా రోజులుగా ఆశలు పెట్టుకున్నారు మైనంపల్లి. ఈసారి అవకాశం వస్తుందని భావించినా.. ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే మల్కాజ్ గిరి  పరిధిలోని అన్ని డివిజన్లలో గెలిచి కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని మైనంపల్లి భావిస్తున్నారట. నియజకవర్గం పరిధిలో  గత అరేండ్లలో జరిగిన అభివృద్ది, ఇటీవల చేసిన వరద సాయం తమకు కలిసి వస్తుందని కారు పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అయితే వరద సాయం కొంత మందికే అందడంతో మిగిలివారంతా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. వరదల సమయంలో ప్రభుత్వం, స్థానిక కార్పొరేటర్లు, బల్దియా అధికారులు తమను పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.  దీంతో గులాబీ నేతల్లో కొంత ఆందోళన కనిపిస్తుందని చెబుతున్నారు. అందుకే బీజేపీ వల్లే వరద సాయం ఆగిపోయిందనే ప్రచారం ఎక్కువ చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.   తెలంగాణ పీసీసీ రేసులో ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి.. గ్రేటర్ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. తన లోక్ సభ పరిధిలోకి వచ్చే మల్కాజ్ గిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎక్కువ డివిజన్లు గెలిచి పీసీసీకి లైన్‌ క్లియర్ చేసేకునేందుకు తన వ్యూహాలతో దూసుకెళ్తున్నాడు. మల్కాజిగిరి పరిధిలో తక్కువ సీట్లు సాధిస్తే పీసీసీ చీఫ్ పదవికి ఎఫెక్ట్‌ పడుతుందని భావిస్తున్న రేవంత్.. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో గెలుపును సెమీ ఫైనల్‌గా భావించి తన శక్తిని మొత్తం ప్రచారంలో దారపోస్తున్నారు.  ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లించేలా గ్రౌండ్‌ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్కువ డివిజన్లు గెలిస్తే.. పీసీసీ చీఫ్ విషయంలో వ్యతిరేకుల నోళ్లు మూయించొచ్చని భావిస్తున్నట్లుగా పార్టీలోని రేవంత్ రెడ్డి అనుచరుల్లో చర్చ నడుస్తోంది. వరద సాయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన పోరాటానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రేవంత్ పోరాటం వల్లే మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించిందని కాంగ్రెస్ చెబుతోంది. ఇదే విషయాన్ని జనాల్లోకి తీసుకెళుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు హస్తం లీడర్లు.    దుబ్బాక వేవ్ గ్రేటర్‌లోనూ కొనసాగించి టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని నిరూపించేందుకు రఘునందన్‌ రావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దుబ్బాక విజయం వన్‌ టైమ్‌ వండరే అని టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కామెంట్ చేయడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న రఘునందన్ రావు.. మల్కాజ్ గిరిలో  ఎక్కువ డివిజన్లు సాధించి మరోసారి హైకమాండ్‌ దృష్టిలో తనపేరు మారు మోగేలా చేసుకోవాలని ‌ప్లాన్ చేస్తున్నాడు. రఘునందన్ ను ఇంచార్జ్ గా నియమించడంతో మల్కాజ్ గిరి బీజేపీ కేడర్ లోనూ జోష్ పెరిగిందని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, వరద సాయంలో జరిగిన అవినీతే ప్రధాన ప్రచారస్త్ర్రంగా చేసుకుంటున్నారు రఘునందన్ రావు.     మొత్తంగా తన నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు, టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం ఎదురుచూస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి రేవంత్‌రెడ్డి.. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో ఊపుమీదున్న ఎమ్మెల్యే రఘునందన్ రావులు ఎవరికివారు తమ సత్తా నిరూపించుకునేందుకు ట్రై చేస్తున్నారు. ముగ్గురు ముఖ్య నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గ్రేటర్ పోరు మల్కాజ్ గిరి నియోజకవర్గంలో కాక పుట్టిస్తోంది. ముగ్గురు మాటకారులే కావడం, ఫైర్‌ బ్రాండ్‌గా పేరుండటంతో గ్రేటర్ సమరంలో మల్కాజిగిరిలో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని, అదే సమయంలో నిర్మాణ పనులు ఆగిపోవడంతో జరిగిన నష్టం గురించి కూడా వివరాలు ఇవ్వాలని చాలా రోజుల కిందట హైకోర్టు ఆదేశించిన సంగతి తెల్సిందే. అయితే రాష్ట్ర అధికారులు మాత్రం హైకోర్టుకు వివరాలు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. అంతేకాకుండా అధికారులు ఇవ్వడం లేదని అకౌంటెంట్ జనరల్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతో ఈ అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం పై సీరియస్ అయింది. వచ్చే సోమవారం లోపు అమరావతి నిర్మాణానికి సంబంధించి తాము అడిగిన వివరాలు అందించాలని, అయితే వివరాల సమర్పణలో కనుక విఫలమైతే అకౌంటెంట్‌ జనరల్‌ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. ఒకవేళ ఆయన వివరాలు సమర్పించలేకపోతే విజిలెన్స్‌, ఆదాయపు పన్నుల శాఖ నుంచి తెప్పించుకుంటామని తేల్చి చెప్పింది. ఈ కేసు పై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.   ఈ కేసు విచారణ సందర్భంగా రాజధాని రైతుల తరుఫున లాయర్ మురళీధరరావు వాదిస్తూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం చేసి, వారి హక్కులను హరించేలా చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వాదించారు. రైతుల భూములు తీసుకున్నందుకు ప్రతిగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయన గుర్తు చేశారు. ఆ మేరకు రైతులతో కుదిరిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం కుదరదని అయన స్పష్టం చేశారు. ‘‘రాజధానిని నిర్మిస్తామని భూములు తీసుకుని.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడం కుదరదు. రాజధాని వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ రాజధాని రైతులు, సాధారణ ప్రజలు ఇచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం ముఖ్యమంత్రి ఆకాంక్షమేరకే జీఎన్‌రావు కమిటీని ఏర్పాటు చేసినట్లుంది. ఆ కమిటీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులను సంప్రదించలేదు. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) కూడా అదే తరహాలో నివేదిక ఇచ్చింది. జీఎన్‌రావు కమిటీ, బీసీజీ రూపొందించిన నివేదికలు, ఆ నివేదికలను అధ్యయనం చేసి మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ రూపొందించిన నివేదిక ఒకే తరహాలో ఉన్నాయి’’ అని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తమకు సూచనలు చేయాలని బీసీజీని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదని అయన కోర్టుకు వివరించారు. అయితే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాయం వివరణ తీసుకుంటామని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.   ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు రాజధానికి చేసిన ఖర్చుపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడమే కానీ.. ఇంత వరకూ అధికారిక లెక్కలు బయట పెట్టలేదు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతికి పైసా ఖర్చు పెట్టలేదని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ తో సహా పలువురు మంత్రులు, వైసిపి నాయకులు చెబుతూ వస్తున్నారు.ఇదే సమయంలో టీడీపీ నేతలు మాత్రం దాదాపు పదివేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకున్న పలు సంస్థలు పనులు మధ్యలో నిలిపివేసాయి. ఒప్పందం ప్రకారం అలా పనులు నిలిపివేస్తే ప్రభుత్వం వాటికీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ వివరాలన్నీ చాలా రహస్యంగా ఉన్నాయి. ఈ మొత్తం వివరాలు బయటకు వస్తే అపుడు అమరావతి కోసం అసలు ఎంత ఖర్చు చేసారు అనే వివరాలు బయటకు వస్తాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందా? గులాబీ బాస్ ఎంట్రీకి అర్ధమేంటీ? కొత్త హామీలను జనాలు నమ్ముతారా?. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో పార్టీలన్ని స్పీడ్ పెంచాయి. బీజేపీ దూకుడుతో అధికార పార్టీలో ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ పరాజయంతోనే తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కారుకు బ్రేకు పడితే.. ఆ పార్టీకి ముందు ముందు గండమేనన్న చర్చ జరుగుతోంది. దీంతో గ్రేటర్ ఎన్నికలపై స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారని చెబుతున్నారు. గతంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికలను కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రచారం కూడా చేయలేదు. అయితే గ్రేటర్ ఎన్నికలను మాత్రం ఆయన మినిట్ మినిట్ మానిటర్ చేస్తున్నారని తెలుస్తోంది. డివిజన్ల వారీగా పార్టీ పరిస్ఖితులను తెలుసుకుంటూ.. వివిధ సంస్థల ద్వారా సర్వే చేయిస్తూ.. వాటి వివరాల ఆధారంగా  పార్టీ  ఇంచార్జులకు కేసీఆర్ సలహాలు, సూచనలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.    తెలంగాణ భవన్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆరే రిలీజ్ చేశారు. గ్రేటర్ లో రోజుకు రోజుకు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండటంతో సీఎం స్వయంగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. గ్రేటర్ జనాలకు ఆయన వరాలు కురిపించారు. అయితే కేసీఆర్ గ్రేటర్ హామీలపై గ్రేటర్ జనాల్లో చర్చ జరుగుతోంది. ఓటమి భయంతోనే కేసీఆర్ కొత్త హామీలు ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు. వరద సాయం పేరుతో గులాబీ నేతలకు దోచి పెట్టి.. ఎన్నికలయ్యాకా అందరికి ఇస్తామని చెప్పడమేంటనీ ముఖ్యమంత్రిని విపక్షాలు నిలదీస్తున్నాయి. సర్కార్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే వరద బాధితులకే నేరుగా డబ్బులు ఇచ్చేవారని చెబుతున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని సర్వేల్లో తేలడంతో కేసీఆర్ కొత్త ఎత్తులు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ కేసీఆర్ ప్రచారం చేయలేదు. గత గ్రేటర్ ఎన్నికల్లోనూ అంతా కేటీఆరే చూసుకున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక తమకు సవాల్ గా మారినా ప్రచారానికి వెళ్లలేదు కేసీఆర్. కాని గ్రేటర్ ఎన్నికలపై మాత్రం ఫోకస్ చేశారు. పార్టీ మేనిఫెస్టోను కూడా కేసీఆరే రిలీజ్ చేశారు. దీన్ని బట్టి గులాబీ నేతలకు ఓటమి భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది. అందుకే వరాలు ప్రకటించారని చెబుతున్నారు.    కరోనా సమయంలో క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లాక్ డౌన్ తో వాహనాలు రోడ్డు ఎక్కకపోవడంతో తినడానికి తిండలేక కొందరు డ్రైవర్లు అవస్థలు పడ్డారు. కరోనా సమయంలో వారిని అసలు పట్టించుకోలేదు కేసీఆర్ సర్కార్. పక్కన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆటో,  క్యాబ్ డ్రైవర్లకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇక్కడ కూడా అలానే తమను ఆదుకోవాలని క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు వేడుకున్నా టీఆర్ఎస్ సర్కార్ కనీసం స్పందించలేదు. లారీ డ్రైవర్లు కూడా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు. లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అంతా అప్పుల పాలయ్యారు. మూడు నెలల క్రితమే రోడ్డు ట్యాక్సీ రద్దు చేయాలని లారీ యజమానులు ప్రభుత్వానికి విన్నవించారు. అయితే అప్పుడు స్పందించని సర్కార్.. గ్రేటర్ ఎన్నికల వేళ వారికి ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో  ఎలాగైనా గట్టెక్కేందుకే కేసీఆర్ సర్కార్ తాజా వరాలు ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ లో దాదాపు ఐదు లక్షల మంది ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారని అంచనా. వారంతా తమకు మద్దతిచ్చేలా రోడ్డు ట్యాక్స్ ను రద్దు చేశారని చెబుతున్నారు.    కేసీఆర్ ఇప్పుడు ఎన్ని వరాలు ప్రకటించినా గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని ఎంత మెత్తుకున్నా పట్టించుకోకుండా.. ఎన్నికల వేళ చేయడాన్ని జనాలు కూడా అర్ధం చేసుకుంటారని చెబుతున్నారు. ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త డ్రామాలు చేస్తున్నారని గ్రేటర్  ప్రజలు భావిస్తున్నారని, పోలింగ్ రోజున వారు తమ సత్తా చూపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.గులాబీ నేతలు మాత్రం తాము ఇచ్చిన హమీలపై ప్రజల్లో మంచి స్పందన వస్తుందని, గ్రేటర్ ఎన్నికల్లో తమకు ప్లస్ కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరీ కేసీఆర్ హామీలు అధికార పార్టీని గట్టెక్కిస్తాయా లేక ప్రతిపక్షాలు చెబుతున్నట్లు ఓట్ల హామీగానే సిటీ జనాలు చూస్తారా చూడాలి మరీ..
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో.. తెలంగాణ లోని కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. కరోనా తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న అన్ని పడకలకూ ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించాలని ఈ భేటీలో నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 22 వేల పడకలు ఉండగా, ప్రస్తుతం 11 వేల పడకలకు మాత్రమే ఆక్సిజన్ సౌకర్యం ఉంది. అంతేకాకుండా వందకు పైగా పడకలు ఉన్న ఆసుపత్రులకు లిక్విడ్ ఆక్సిజన్ ను, మిగిలిన ఆసుపత్రులకు సాధారణ ఆక్సిజన్ ను సరఫరా చేయాలని ప్రభుత్వం పేర్కొంది.   అన్ని ఆసుపత్రుల్లో కలిపి అదనంగా మరో 5 వేల పడకలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా తొలి దశలో ఎదుర్కొన్న సంక్షోభ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, మరోసారి ఆ పరిస్థితి ఏర్పడకుండా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి గాంధీ ఆసుపత్రి వరకూ కరోనా చికిత్సలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలనూ సిద్ధంగా ఉంచాలని, అదే విధంగా వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
అమలాపురం మాజీ ఎంపీ హ‌ర్ష కుమార్ తిరిగి సొంతగూటికి చేరారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ కి దూరమైన ఆయ‌న.. ఇవాళ ఉమెన్‌చాందీ, శైలజానాథ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ మోసం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీపై పోరాడటంలో వైసీపీ, టీడీపీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఏపీ ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని, ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని హర్షకుమార్ చెప్పారు.   కాగా, 2004-2014 వ‌ర‌కు వ‌రుస‌గా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ త‌రుపున ఎంపీగా గెలుపొందిన ఆయ‌న‌, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడ‌తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. వారం రోజుల్లోనే పోలింగ్ ఉండటంతో పార్టీలన్ని సర్వశక్తులు ఒడ్డిపోరాడుతున్నాయి. ప్రచారంలో అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నాయి పార్టీలు. గ్రేటర్ ఎన్నికల్లో సోషల్ మీడియా  కీ రోల్ పోషిస్తోంది. అన్ని పార్టీలు ఆన్  లైన్ ప్రచారం కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే సోషల్ మీడియా ప్రచారం గ్రేటర్ సమరంలో హద్దులు దాటినట్లు కనిపిస్తోంది. అన్ లైన్ లో ఫేక్ ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. తమ పార్టీకి కలిసొచ్చేలా, ప్రత్యర్థి పార్టీలకు డ్యామేజీ కలిగేలా ఫేక్ ఆడియో కాల్స్, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల సర్వేలంటూ ఫేక్ సర్వేలను క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.    గ్రేటర్ ఎన్నికలపై సర్వే అంటూ ఫేక్ సర్వేలు బయటికి వస్తున్నాయి. ఒకే సర్వే సంస్థ పేరుతోనూ డిఫరెంట్ ఫలితాలు ఉండే సర్వేలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాణక్య సంస్థ పేరుతోనే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు అనుకూలంగా సర్వేలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి 90-96, ఎంఐఎం 3035,  టీఆర్ఎస్ 24-29, కాంగ్రెస్ కు 4-6 సీట్లు వస్తాయని ఉన్న సర్వేలను బీజేపీ కేడర్ వైరల్ చేస్తోంది. టీఆర్ఎస్ కు 96- 106, ఎంఐఎంకు 40-45, కాంగ్రెస్, బీజేపీలకు 1-2 డివిజన్లు వస్తాయని సూచించే సర్వే మ్యాపులను గులాబీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు 80కి పైగా సీట్లు రాబోతున్నాయంటూ అదే చాణక్య పేరుతో హస్తం అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏది నిజమో, ఏది అసత్యమో తెలియక గ్రేటర్ ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.    ఫేక్ ఆడియో కాల్స్, వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా టీఆర్ఎస్ అనుకూలురు ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. బండి సంజయ్ ను గ్రేటర్ ఎన్నికల బాధ్యత నుంచి తప్పించారంటూ ఓ న్యూస్ ఛానెల్ బ్రేకింగ్ పేరుతో  సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో సంజయే మీడియా ముందుకు వచ్చి అది ఫేక్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. తమ పేరుతో అసత్య ప్రచారం జరుగుతుందని సదరు ఛానెల్ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లుగా.. రాజా సింగ్  ట్వీట్ ను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు. దానిపైనా రాజాసింగ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మాజీ మంత్రి డీకే అరుణ తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నారని, ఉత్తమ్ తో ఆమె సమావేశమయ్యారని కొన్ని వర్గాలు ప్రచారం చేశాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ కాంగ్రెస్ లో చేరారని కూడా కొందరు పోస్టులు పెట్టి వైరల్ చేశారు.    గ్రేటర్‌ ఎన్నికల వేళ సోషల్‌ మీడియాలో విద్వేషం హద్దులు దాటుతోంది. తమ ప్రత్యర్థులపై దిగజారుడు వ్యాఖ్యలు, విషపురాతలు రాస్తూ ప్రచారం చేస్తున్నారు. నేతల అలవాట్లు, ఆకారాలపై విద్వేషపు పోస్టులు పెడుతున్నారు. గుండోడు, బండోడు, బక్కోడు, బికారీ.. ఇలా  ప్రత్యర్థులపై అభ్యంతరకర, రాయలేని వ్యాఖ్యలతో చెలరేగుతున్నారు, రెచ్చగొడుతున్నారు. నాయకుల అలవాట్లు, ఆహార్యంపై సెటైర్లు, కుళ్లుజోకులు వేస్తున్నారు. వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. ప్రత్యర్థులను చులకన చేసే ప్రయత్నంలో దిగజారుడు పోస్టులు పెడుతున్నారు.  ఆకారం, అలవాట్ల ఆధారంగా కుళ్లుజోకులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీపై యువత మనసులో విద్వేషపు బీజాలు నాటుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఇలాంటి పోస్టులకు కొదవలేదు. వ్యక్తులను కించపరుస్తూ వీడియోలు, సినిమాల్లోని హాస్యపు బిట్లు, మీమ్స్, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్కులతో పోస్టులు రూపొందిస్తూ కొత్త ఓటర్లకు గాలం వేస్తున్నారు.    కొత్త ఓటర్లే లక్ష్యంగా ప్రైవేటు ఆర్మీల హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ నిత్యావసర వస్తువుగా మారింది. ఆన్‌లైన్‌ క్లాసుల పుణ్యమాని ఇప్పుడు ప్రతీ విద్యార్థికి స్మార్ట్‌ఫోన్‌ ఉంది. ముఖ్యంగా 18 ఏళ్లు దాటి డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థుల ఓట్లే లక్ష్యంగా ఈ వ్యంగ్యపు, వెకిలి పోస్టులు రూపొందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే యువతలో నూటికి 90 శాతం వినోదానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే, వారి దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలపై కుళ్లుజోకులతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగొచ్చని, దాడులకు పురిగొలిపే ప్రమాదముందని పోలీసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే వీటి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.    గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే.. పార్టీల సానుభూతిపరులు అప్పటికపుడు ప్రత్యేకంగా కంటెంట్‌ రైటర్లు, డీటీపీ ఆపరేటర్లు, వీడియో ఎడిటర్లను నియమించుకున్నారు. కేవలం 20 రోజులకే వీరికి రూ.30 వేల నుంచి 40 వేల వరకు చెల్లిస్తూ ఇలాంటి పోస్టులను ప్రోత్సహిస్తున్నారు. పార్టీలకు అనుకూలంగా వారి అధికారిక సోషల్ వింగ్ లు చేసే పోస్టులు పద్ధతిగానే ఉంటున్నాయి.కొందరు అభిమానుల ముసుగులో ప్రైవేటు ఆర్మీలు నడిపిస్తున్నారు. వారంతా తమ పోస్టింగులతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా  పోస్టులపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చేసిన, చేయబోయే పనులను చెప్పుకొని ఓట్లు అడగటం, ప్రత్యర్థులను విమర్శలతో ప్రశ్నించడం మంచి రాజకీయమని, కాని ఇలా విద్వేషాలకు దిగడం ప్రమాదమంటున్నారు పోలీసులు.
ఈ ఏడాది ప్రారంభంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుండి వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రయత్నాలలో కొన్ని సంస్థలు విజయం సాధించి ఉత్పత్తి వైపు కూడా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా సంస్థలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ లు వాటి సగటు సామర్థ్యం 95 శాతమని తెలిపాయి. అయితే ఫైజర్ టీకా విషయానికి వస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలలో పంపిణీ పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ నిల్వ, రవాణాకు -70 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమవడమే ముఖ్య సమస్యగా నిపుణులు చెపుతున్నారు.   ఈ పరిస్థితుల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ సామార్థ్యానికి సంబంధించి అస్ట్రాజెనికా సీఈఓ పాస్కల్ సోరియట్ ఈరోజు సోమవారం కీలక ప్రకటన చేసారు. కరోనాకు వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని అయన చెప్పారు. బ్రిటన్, బ్రెజిల్ దేశాల నుండి చివరి దశ ట్రయల్స్ సమాచారం మేరకు ఈ టీకా సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టుగా తేలింది. ఈ వ్యాక్సిన్ సగటు సామర్థ్యం 70 శాతమని ప్రకటించింది.   అయితే క్లీనికల్ ట్రయల్స్‌లో భాగంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ విషయంలో అధికారులు రెండు రకాల డోసులు వలంటీర్లకు ఇచ్చారు. మొదటి విధానంలో వలంటీర్లకు మొదట సగం డోసు ఇచ్చి, ఆ తరువాత పూర్తి డోసు ఇవ్వగా.. వ్యాక్సిన్ 90 శాతం సామర్థ్యంతో పనిచేసినట్టు వెల్లడైంది. ఇక కరోనా వ్యాక్సిన్ డోసులకు సంబంధించిన రెండో విధానంలో ఈ వ్యాక్సిన్ ను కేవలం సగం డోసు వినియోగించగా దాని సామర్థ్యం 90 శాతంగా వెల్లడవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అని ఆస్ట్రాజెనెకా సీఈవో తెలిపారు. ఈ విధానం అన్నిటికంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తోందని, వ్యాక్సిన్ విషయంలో ఇదే పద్దతి అవలంబించాలని వివిధ దేశాల ఔషధ నియంత్రణ సంస్థలకు సూచిస్తామని అయన పేర్కొన్నారు.   అంతేకాకుండా ఎమ్‌ఆర్‌ఎన్ఏ ఆధారంగా రూపొందించిన మోడర్నా, ఫైజర్ టీకాలతో పోలిస్తే ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ సగటు సామర్థ్యం కొంత తక్కువగా ఉన్నప్పటికీ వ్యాక్సిన్ పంపిణీ సౌలభ్యం పరిగణలోకి తీసుకుంటే ఆక్స్‌ఫర్డ్ టీకాయే భారత్ తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనువైనదని నిపుణులు అభిప్రాయడుతున్నారు. మిగిలిన వ్యాక్సిన్ల తో పోలిస్తే.. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ను సాధారణ రిఫ్రెజిరేటర్లలో కూడా నిలువ చేయగలగడం దీని ప్రధమానమైన అడ్వాంటేజ్ అని నిపుణులు అంటున్నారు. కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేని భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆక్సఫర్డ్ టీకాయే తగినదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు రెండు డోసులు కలిపి కేవలం రూ.1000లోపే లభ్యమయ్యే అవకాశం ఉంటడమనేది ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి మరో సానుకూల అంశమని వారు అంటున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ క్లీనికల్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివిధ దేశాల వ్యాక్సిన్ నియంత్రణ సంస్థలకు అందించి, త్వరగా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటామని ఆస్ట్రాజెనెకా ఈ సందర్భంగా పేర్కొంది.
ఏపీలో అధికార వైసీపీకి ఆ పార్టీ నాయకుల తీరు తలనొప్పిగా మారింది. ఇటీవల వైసీపీ నేతలు బహిరంగంగానే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న విశాఖలో డీఆర్సీ సమావేశంలో మాటల యుద్ధం జరిగింది. సమావేశంలో ఇతర ప్రజాప్రతినిధుల ముందే ఎంపీ విజయసాయిరెడ్డిపై చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విరుచుకుపడ్డారు. మరోవైపు.. ఇదే సమావేశంలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత సీఎం ఆఫీస్ వద్ద డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి 'బుద్ధి, జ్ఞానం ఉందా నీకు.. డిప్యూటీ సీఎం వా నువ్వు' అని దుర్బాషలాడిన ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు నువ్వెంతంటే నువ్వెంత అని వాగ్వాదానికి దిగారు.    తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. టిడ్కో ఇళ్లు విషయంలో కాకినాడలో అవినీతి జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కేకలు వేశారు. ఒకే పార్టీ లో ఉంటూ నాకు చెప్పాలి కదా అని బోసుపై దుర్భాషలాడారు. మేడ లైన్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు వల్లే కాకినాడ నగరం మునిగిపోయిందని కూడా బోస్ ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే ద్వారంపూడి మరింత రెచ్చిపోయారు. ఈ విషయాలు తనకు చెప్పాలి కదా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే ద్వారంపూడికి మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు నచ్చజెప్పారు. దీంతో రాసభాస మధ్య సమావేశం అర్థాంతరంగా ముగిసిపోయింది.  

‘కారు’కు ‘కమ్మ’ని కబురు!

గ్రేటర్‌లో కమ్మ ఓటర్లు టీఆర్‌ఎస్ వైపే?   ‘అమరావతి’పై ‘కమలం’ కప్పగంతులే కారణమట   గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం, మరోసారి టీఆర్‌ఎస్ ‘కారు’ వైపే  చూస్తోందా? నగరంలోని కమ్మ వర్గ పెద్దలు, వివిధ పార్టీల్లో ఉన్న ఆ సామాజిక వర్గ నేతలు చెబుతున్న విశ్లేషణ ప్రకారం.. పలు నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కమ్మ సామాజికవర్గం, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కూడా కమ్మ వర్గానికి నాలుగు సీట్లు ఇచ్చినా.. ఆ కులం ఓటర్లు మాత్రం కారు ఎక్కేందుకే ఆసక్తి ప్రదర్శిస్తుండటం విశేషం.   కమ్మ వర్గం స్వాభావికంగా టీడీపీకి, సంప్రదాయ ఓటు బ్యాంకుగా దశాబ్దాల నుంచి కొనసాగుతోందన్నది బహిరంగమే. దాని పలితంగానే ఉమ్మడి రాష్ట్రంలో, నగరంలోని శేరిలింగంపల్లి, సనత్‌నగర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించగలిగింది. అక్కడ సెటిలర్ల సంఖ్య ఎక్కువయినప్పటికీ, వారిలో కమ్మ వారి హవానే ఎక్కువ కావడం దానికి మరో ప్రధాన కారణం.   రాష్ట్ర  విభజన తర్వాత కూడా... నగరంలో టీడీపీ చెప్పుకోదగ్గ ఫలితాలే సాధించింది. అయితే, చంద్రబాబునాయుడు తెలంగాణపై దృష్టిసారించకపోవడంతో,  ఉన్న ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. పోనీ ఆ తర్వాత కూడా బాబు మేల్కొనకపోవడంతో, ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీని వీడారు. ఇప్పుడు మొత్తం 150 డివిజన్లలో 90 డివిజన్లకే పోటీ చేస్తుందంటే, ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ, ఎన్టీఆర్ హయాం నుంచి పనిచేస్తున్న నేతలు మాత్రమే టీడీపీలో కొనసాగుతుండగా, వారిలో కమ్మవారే ఎక్కువ. ఇతర పార్టీల్లో అవకాశం లేక, ఉన్నా అక్కడి వాతావరణంలో సర్దుకోలేక, విధిలేక టీడీపీలోనే కొనసాగుతున్న పరిస్థితి. నిజానికి ఈ ఎన్నికల్లో అంతమంది అభ్యర్ధులను వెతికి నామినేషన్లు వేయించడం.. టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ నగర అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా నాయకత్వ ప్రతిభ, పొలిట్‌బ్యూరో సభ్యుడయిన అరవిందకుమార్‌గౌడ్ పర్యవేక్షణ ఫలితమని చెప్పకతప్పదు.   అయితే, టీడీపీకి సంప్రదాయ మద్దతుదారుగా ఉన్న కమ్మవారికి.. ఈ ఎన్నికల్లో కేవలం 6 సీట్లు మాత్రమే ఇచ్చారంటే, టీడీపీని కమ్మ వారు ఎంత వేగంగా వీడిపోతున్నారో స్పష్టమవుతోంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో విజయాన్ని నిర్దేశించే స్థాయిలో ఉన్నప్పటికీ, కమ్మ వర్గ నేతలు.. టీడీపీ వైపు కాకుండా టీఆర్‌ఎస్-బీజేపీ వైపు చూడటం ఆశ్చర్యం. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 4, బీజేపీ 4, కాంగెస్ 2, టీడీపీ 6 సీట్లు కమ్మ వర్గానికి ఇవ్వడం విశేషం. అంటే కమ్మ వర్గం మాసికంగా టీడీపీని అభిమానిస్తున్నప్పటికీ, రాజకీయంగా ఇతర పార్టీల వైపు చూస్తుందని స్పష్టమవుతోంది. సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానికంగా తమ నియోజకవర్గాల్లో కమ్మ వారితో తొలి నుంచీ కలసి ఉండటం ప్రస్తావనార్హం.   సహజంగా కమ్మవర్గం మిగిలిన కులాలకంటే ఒక తరం ముందు ఆలోచిస్తుంది. ఎవరితోనూ గొడవ పడకుండా, తమ వ్యాపారాలేవో తాము చేసుకునే తత్వం దాని సొంతం. ఏ ప్రభుత్వంలో ఉన్నా కావలసినవి ఇచ్చి, పనులు చేయించుకోవడం వారి ప్రత్యేకత. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చుట్టూ చేరిన కమ్మ వ్యాపారులు, వైఎస్ సీఎం అయిన వెంటనే ఆయన చుట్టూ చేరిపోయారు. ఆ తర్వాత వచ్చిన సీఎంల చుట్టూ కూడా వారే కనిపించేవారు. జగన్ కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టిన వారిలో కూడా కమ్మ వ్యాపారులే ఎక్కువ. అంటే వ్యాపారం వారి రక్తంలో ఒక భాగమన్నది తెలిసిందే.   ఎక్కడ.. ఏది లాభం అనుకుంటే,  అటే అడుగులేసే తెలివైన కులంగా పేరుంది. లాభనష్టాల బేరీజు.. ఇతరులను వాడుకోవడంలో,  కమ్మ వర్గ నైపుణ్యం ముందు ఎవరూ సరిరారన్నది బహిరంగ రహస్యం. ప్రతిదీ వ్యాపారకోణంలో ఆలోచించే కమ్మ వర్గానికి, ఇతర సామాజికవర్గం నుంచి సహకారం-మద్దతు లభించడం కష్టం. ఇతరులతో కలిసి నడిచే అలవాటు తొలి నుంచీ ఆ వర్గానికి లేదు. ఈ వ్యాపారతత్వం కృష్ణా జిల్లాలో.. బ్రాహ్మణ-వైశ్యులతో సహా, కుల-మతాలకు అతీతంగా అలవాటుకావటం మరో విశేషం. కృష్ణా జిల్లాకు చెందిన ప్రతి కులం-మతంలో, వ్యాపారధోరణి స్పష్టంగా కనిపిస్తుంటుంది. అది వేరే విషయం.   సహజంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం, డబ్బు సంపాదన మెళకువల్లో నిష్ణాతులైన కమ్మ వర్గం.. ఆ ధ్యాసలో పడి, ఇతర సామాజికవర్గాల సహకారం తమకు అవసరం లేదని భావిస్తుంటుంది. కమ్మ సామాజికవర్గం దేనినయినా వదులుకునేందుకు సిద్ధంగా ఉంటుంది కానీ,  డబ్బును పోగొట్టుకునేందుకు మాత్రం  సిద్ధంగా ఉండదన్న సామెత వినిపిస్తుంటుంది. అందుకే.. రెడ్డి, వెలమ వర్గాలతో పోలిస్తే, కమ్మ వర్గానికి ఉండే ఇతర వర్గాల దన్ను బహు తక్కువ. ఇన్ని లక్షణాలున్న కమ్మవర్గం.. ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా, కష్టపడి వ్యాపారాల్లోనే సంపాదించడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తుందన్నది కూడా అంతే నిజం.   ఇప్పుడు హైదరాబాద్‌లో దశాబ్దాల నుంచి స్థిరపడిన కమ్మ వర్గం, ఇదే ధోరణిలో టీఆర్‌ఎస్‌కు మద్దతుదారుగా మారటం గమనార్హం. గత గ్రేటర్ ఎన్నికల్లోనూ ఈ వర్గం టీఆర్‌ఎస్‌కే జై కొట్టింది. చంద్రబాబు ఇక్కడి నుంచి వెళ్లినందున, తమ రక్షణ కోసమే వారు ఆ నిర్ణయం తీసుకున్నట్లు కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే తీరు కొనసాగించింది. చంద్రబాబు హైదరాబాద్‌లో పార్టీని వదిలేయడంతో, కమ్మ వర్గం తమకు టీఆర్‌ఎస్ ఒక్కటే  సురక్షితమైన పార్టీగా ఎంచుకున్నారు. దాని ఫలితమే సెటిలర్లు ఉండే నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలుపు. ఇప్పుడు ఆ వర్గం నేతలు బీజేపీలో చేరినా, కమ్మ ఓటర్లు మాత్రం కారు ఎక్కేందుకే ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.   ఇక ఇతర పార్టీల్లో స్థానిక అంశాల కారణంగా చోటు లభించక కొందరు.. ఆయా పార్టీల్లో ఇమడలేని మరికొందరు కమ్మ వర్గ నేతలు మాత్రమే, ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో కమ్మ వర్గ ప్రాధాన్యతను గుర్తించిన టీఆర్‌ఎస్, ఆ వర్గ నేతలకు సీట్లిచ్చింది. కూకట్‌పల్లి అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కొమ్మినేని వికాస్ ఇంటికి స్వయంగా కేటీఆర్ వెళ్లి, కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లి, వికాస్ సహకారం కోరారు. ఆ తర్వాత శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్‌తోపాటు, ఖమ్మం జిల్లాలో కూడా కమ్మ వర్గ నేతలకే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సీట్లిచ్చింది. పువ్వాడకు క్యాబినెట్‌లో చోటు కూడా ఇచ్చింది.  తాజా గ్రేటర్ ఎన్నికల్లో కూడా కమ్మ వర్గం చూపు, టీఆర్‌ఎస్ వైపే కనిపిస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో.. కమ్మ వర్గ ఎమ్మెల్యేలు భేటీ అయి, నగరంలోని కమ్మ ప్రముఖులతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారట.   ఇదిలాఉండగా... నగరంలో కమ్మ వర్గంతోపాటు, సెటిలర్ల అభిప్రాయాలపై తాము వివిధ నియోజకవర్గాల్లోని, ఆయా వర్గాల వారితో ముచ్చటించడం జరిగింది.  ఆ ప్రకారంగా... నిజానికి సెటిలర్లలో ఎక్కువ శాతం ఈసారి బీజేపీకి ఓటు వేయాలన్న ధోరణిలో ఉన్నట్లు కనిపించింది. కానీ ఏపీలో,  అమరావతి అంశానికి బీజేపీ మద్దతు ఇవ్వని కారణంగా.. ఆ పార్టీకి బదులు, గతంలో మాదిరిగానే ఈసారి కూడా టీఆర్‌ఎస్ మద్దతునివ్వాలని నిర్ణయించుకున్నట్లు, వారి మాటల్లో స్పష్పమయింది. ఈ విషయంలో వారి వాదన-వైఖరి విచిత్రంగా అనిపించింది. అమరావతికి అడ్డంకులు సృష్టిస్తున్న ఏపీ సీఎం జగన్... తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సఖ్యతగానే ఉన్నారు. అయితే, జగన్‌తో దోస్తానా చేస్తున్న కేసీఆర్‌పై కరుణ.. కేసీఆర్ మద్దతునిస్తున్న జగన్‌పై కోపం ప్రదర్శించడమే విచిత్రం. -మార్తి సుబ్రహ్మణ్యం

సంజయ్ నై.. కిషన్ సై! బీజేపీలో ఏం జరుగుతోంది? 

తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయిందా? జనసేనతో పొత్తు కొందరికి ఇష్టం లేదా? పవన్ తో చర్చలకు ఆయన ఎందుకు వెళ్లలేదు? గ్రేటర్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుండగా బీజేపీలో పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల కార్యాచరణ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జనసేన పొత్తు విషయంలో పార్టీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయడంపై బండి సంజయ్ ఓ అభిప్రాయంతో ఉండగా కిషన్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరించారనే చర్చ బీజేపీలో జరుగుతోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య సఖ్యత లేదని. నగర సీనియర్ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారని చెబుతున్నారు. జనసేనతో పొత్తు విషయంలో బండి సంజయ్ కు ఇష్టం లేకున్నా కిషన్ రెడ్డి చొరవ తీసుకుని పవన్ కల్యాణ్ తో మాట్లాడరనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే శుక్రవారం రోజంతా హైదరాబాద్ లోనే  ఉన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ మాజీ నేత సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారు. మరికొందరు నేతలతోనూ సంజయ్ మంత్రాంగం జరిపారని చెబుతున్నారు. హైదరాబాద్ లోనే ఉన్నా పవన్ కల్యాణ్ తో చర్చలకు సంజయ్ వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. జనసేనతో పొత్తు ఇష్టం లేదు కాబట్టే.. పవన్ దగ్గరకు బండి వెళ్లలేదని చెబుతున్నారు. అంధ్రా పార్టీగా ముద్రపడిన జనసేనతో పొత్తు పెట్టుకుంటే గ్రేటర్ లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కూడా కొందరు బీజేపీ నేతలు ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. అందుకే బండి సంజయ్ జనసేన విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదని చెబుతున్నారు.  జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, జనసేన పొత్తుపై మొదటి నుంచి తీవ్ర గందరగోళం నడిచింది. సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్ ..అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు  చేస్తున్నామని చెప్పారు. గ్రేటర్ లో పోటీ చేయడానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపిన జనసేన.. పార్టీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసింది. సొంతంగానే పోటీ చేస్తామని బయటికి చెబుతూనే... బీజేపీతో పొత్తుకు జనసేన నేతలు ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే జనసేనతో పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపలేదు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వారికి కొన్ని డివిజన్లు ఇవ్వాల్సి వస్తుందని. దాంతో పార్టీలో అసంతృప్తి వస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భావించారట. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఎవరితోనూ పొత్తు లేదని ఆయన ప్రకటించారు. అంతేకాదు జనసేనతో పొత్తు ఏపీ వరకే పరిమితమని కూడా స్పష్టం చేశారు. సంజయ్ ప్రకటన తర్వాత కూడా గురువారం జనసేన నుంచి మరో ప్రకటన వచ్చింది. గ్రేటర్ ఎన్నికలపై  పవన్ తో మాట్లాడేందుకు బండి సంజయ్ వస్తున్నారని ప్రకటించింది. జనసేన లేఖపై మరోసారి స్పందించిన బండి సంజయ్.. జనసేనతో పొత్తు సమస్యే లేదని తేల్చి చెప్పారు.  బండి సంజయ్ పొత్తు లేదని రెండోసారి స్పష్టం చేయడంతో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని భావించారు. అయితే శుక్రవారం మళ్లీ పొలిటికల్ సీన్ మారిపోయింది. జనసేన పొత్తు మేటర్ లోకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంటరయ్యారు. పార్టీ మరో ముఖ్య నేత లక్ష్మణ్ తో కలిసి వెళ్లి ఆయన పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారు. జనసేన పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చేలా పవన్ ను ఒప్పించారు. కిషన్ రెడ్డి తో సమావేశం తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని అధికారికంగా ప్రకటించారు జనసేన చీఫ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిల తీరుతో బీజేపీలో కన్ఫ్యూజన్ నెలకొన్నదని చెబుతున్నారు. టికెట్ల ఎంపికలోనూ సంజయ్, కిషన్ రెడ్డి వర్గాల మధ్య గొడవలు జరిగాయంటున్నారు. బంజారాహిల్స్, కూకట్ పల్లి ప్రాంత నేతలు కొందరు కిషన్ రెడ్డిపై బహరంగంగానే తీవ్ర ఆరోపణలు చేశారు.  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు మీద ఉన్నట్లు కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో జీహెచ్ఎంసీలోనూ పాగా వేస్తామనే ధీమా కమలనాధుల్లో పెరిగిందని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో బీజేపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. నగర కాంగ్రెస్ లోని కొందరు ముఖ్య నేతలు, టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా కమలం గూటికి చేరారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నుంచి  పోటీ  చేసేందుకు నేతలు పోటీ పడ్డారు. ఒక్కో డివిజన్ నుంచి 10 నుంచి 10 మంది టికెట్ కోసం పోటీ పడ్డారని బీజేపీ నేతలు చెబుతున్నారు. గ్రేటర్ లో దాఖలైన నామినేషన్లలోనూ అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీ పేరుతో వేసినవే ఎక్కువగా ఉన్నాయి. ఇంత వరకు  బాగానే రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతల తీరే గందరగోళంగా మారిందని తెలుస్తోంది. ముఖ్య నేతల తీరుతో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలగవచ్చనే ఆందోళన కమలం కేడర్ లో కనిపిస్తోంది.

ఆయన నోట మళ్లీ ఢిల్లీ మాట! లైట్ తీసుకుంటున్న పార్టీలు

​దేశంలో గుణాత్మక మార్పు రావాలి.. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందే.. ఆ పార్టీల వల్లే దేశం ఆగమైంది.. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తా.. ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేసీఆర్ గత రెండేండ్లుగా చెబుతున్న మాటలు. ఎన్నికల సమయాల్లోనూ, తనకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినపుడే, బీజేపీ, కాంగ్రెస్ లపై ఈ తరహా కామెంట్లు చేస్తూ వచ్చారు కేసీఆర్. ఇంకా చేస్తూనే ఉన్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. బీజేపీని టార్గెట్ చేస్తూ జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరాటానికి టీఆర్ఎస్ సన్నద్ధమవుతోందని తెలిపారు. చాలా మంది ప్రాంతీయ నేతలతో మాట్లాడానని చెప్పారు కేసీఆర్.    జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చేసిన తాజా ప్రకటనపై జనాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండేండ్ల నుంచి చెబుతున్న మాటలే మళ్లీ చెప్పారనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే జాతీయ పార్టీలపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్ వల్లే దేశం అభివృద్దికి నోచుకోలేదని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు దేశానికి అరిష్టమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాదు త్వరలోనే ఢిల్లీ వెళ్తునున్నానని కూడా చెప్పారు గులాబీ బాస్. భువనేశ్వర్ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడారు. చెన్నె వెళ్లి స్టాలిన్ తో సమావేశమయ్యారు. కోల్ కతా వెళ్లి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీతోనూ మంత్రాగం చేశారు. లక్నో వెళ్లి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతిని కలిశారు. దీంతో ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారనే అభిప్రాయం వచ్చింది.    తర్వాత ఏమైందో ఏమోకాని తుస్సుమనిపించారు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ మాట కూడా మర్చిపోయారు. అప్పటి నుంచి ఇంతవరకు ఆయన ఢిల్లీ వెళ్లింది లేదు.. ఫెడరల్ ఫ్రంట్ వచ్చింది లేదు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రావడంతో ఢిల్లీకి వెళ్లినా చేసేది ఏమి లేదని భావించిన కేసీఆర్ సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోతే.. ప్రాంతీయ పార్టీలతో కలిసి హడావుడి చేయాలని చూశారని, మోడీ ప్రభంజనం వీచడంతో కేసీఆర్ ఆశలు ఆవిరయ్యాయనే ప్రచారం జరిగింది. కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ ఏర్పాట్లకు సంబందించి మరో ప్రచారం కూడా జరిగింది. ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన టీడీపీ అధినేత,అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రచారం చేశారు. బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ , కోల్ కతాల్లో మమతా బెనర్జీలు నిరసనకు దిగితే అక్కడికి వెళ్లి వారికి మద్దతు తెలిపారు. చంద్రబాబు దూకుడుతో లోక్ సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో ఆయనే చక్రం తిప్పబోతున్నారనే ప్రచారం జరిగింది. చంద్రబాబుకు జాతీయ స్థాయిలో వస్తున్న క్రేజీని జీర్ణించుకోలేకే.. ఆయనకు పోటీగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తెరపైకి తెచ్చారని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.    గత ఆగస్టులో మరోసారి జాతీయ రాజకీయాల ప్రస్తావన తెచ్చారు కేసీఆర్. మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్ లోనే విపక్ష పార్టీలతో సమావేశం పెట్టబోతున్నానని, అన్ని ప్రాంతీయ పార్టీ నేతలను ఆహ్వానిస్తానని చెప్పారు. అప్పుడు కూడా కేసీఆర్ ఢిల్లీకి  వెళ్తారేమోనని జనాలు భావించారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి ఢిల్లీకి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారనే చర్చ కూడా జోరుగా జరిగింది. కాని అప్పుడు కూడా కేసీఆర్ మాటలు గాలి మాటలుగానే మిగిలిపోయాయి. హైదరాబాద్ లో సమావేశం జరగలేదు.. ఏ పార్టీ నేత వచ్చి కేసీఆర్ ను కలవలేదు. టీఆర్ఎస్ అధినేత కూడా ఏ లీడర్ తోనూ మాట్లాడలేదు. కనీసం ఫోన్ లో కూడా కేసీఆర్ ఏ ప్రాంతీయ పార్టీ నేతతోనూ మాట్లాడినట్లు కనిపించ లేదు. జీఎస్టీ బకాయిలను కేంద్రం విడుదల చేయడం లేదంటూ లేఖలు రాసి సెప్టెంబర్ లో మరోసారి హడావుడి చేశారు కేసీఆర్. కేంద్రం తీరుకు నిరసనగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ఆర్థికమంత్రులతో సమావేశం పెడతామని కూడా ప్రకటించారు. కాని అది కూడా జరగలేదు.    తాజాగా పార్టీ నేతలతో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల సన్నద్దత సమావేశంలో జాతీయ రాజకీయాలపై మాట్లాడారు కేటీఆర్. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత ఆరున్నరేళ్లలో దేశానికి చేసిందేమీ లేదని, తప్పుడు ప్రచారాలతో, తప్పుడు విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందని కేసీఆర్‌ విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందేనని, బడేభాయ్‌ వెంట చోటే భాయ్‌ అన్నట్లు దేశాన్ని సరైన దిశ చూపెట్టడంలో విఫలం అయ్యాయన్నారు. ఆ రెండు మూస పార్టీల నుంచి దేశానికి విముక్తి కావాలని, అందుకు  హైదరాబాద్‌ నుంచే యుద్ధం ప్రకటిస్తామన్నారు. దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపై నిలిపేందుకు  ప్రయత్నాలు చేస్తున్నామని  చెప్పారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, డీఎంకే నేత స్టాలిన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్‌ యాదవ్‌, శరద్‌పవార్‌, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, కుమారస్వామి, సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడానని తెలిపారు. డిసెంబరు రెండోవారంలో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి దేశవ్యాప్త ఉద్యమం గురించి చర్చిస్తామన్నారు కేసీఆర్.    కేసీఆర్ తాజా ప్రకటనకు ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ బీజేపీ తమకు గట్టి పోటీ ఇస్తుండటంతో కారణమనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగడంతో.. ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో గెలిచేందుకు ఇలా ఎత్తులు వేస్తున్నారని, గ్రేటర్ ఎన్నికలు ముగియగానే జాతీయ రాజకీయాలపై మళ్లీ కేసీఆర్ మాట్లాడరని చెబుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఎప్పుడో ఆ పని చేసేవారంటున్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై ఉద్యమం చేస్తానంటున్న కేసీఆర్.. ఆ బిల్లులు పార్లమెంట్ ముందుకు వచ్చిన సమయంలో ఆ పని ఎందుకు చేయలేదనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన మెజార్టీ బిల్లులకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్.. ఇప్పుడు కేంద్రం ఏం చేయడం లేదని విమర్సిండంలో అర్ధం లేదంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చేస్తున్న ప్రటనకను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.

కేసీఆర్‌-కేటీఆర్ పాచిక పారింది.. టాలీవుడ్ నుంచి భారీ ప్ర‌చారం ల‌భించింది!

  ఎట్ట‌కేల‌కు తెలంగాణ ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను తిరిగి ఓపెన్ చేసుకోడానికి అనుమతి ఇచ్చింది. సినిమా థియేటర్లు మినహా అన్ని రంగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. ఇతర పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ పార్కులతో పాటు రెస్టారెంట్లు, బార్లకు ఎటువంటి పరిమితులు లేకుండా పూర్తి ఆక్యుపెన్సీతో న‌డుస్తున్నాయి. సినిమాల విషయానికి వస్తే విషయాలు భిన్నంగా ఉంటున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో పెట్టుబడులను తిరిగి పొందే అవ‌కాశం లేనందున‌ నిర్మాతలు ఆ రూల్‌కు పూర్తి వ్యతిరేకత‌తో ఉన్నారు. కొంతమంది నిర్మాతలు పెట్టుబడులను తిరిగి పొందడానికి అదనపు షోలు, టికెట్ల ధ‌ర‌ల పెంపుతో పాటు క‌నీసం 75 శాతం ఆక్యుపెన్సీ ప్లాన్‌ను సూచిస్తున్నారు. 2021 జనవరి 1 నుండి కేంద్రం 100 శాతం ఆక్యుపెన్సీని మంజూరు చేస్తుందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్రస్తుతానికైతే, ప్ర‌భుత్వ‌ పరిమితులతో తమ సినిమాలను విడుదల చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు సిద్ధంగా లేరు, థియేట‌ర్లు తెరుచుకుంటాయ‌న్న‌ సంతోషంతోనూ లేరు. అదనపు షోలు వేస్తే అందుకు అనుగుణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. అందువ‌ల్ల ప్రొడ్యూస‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లకు ఒన‌గూడే ప్ర‌యోజ‌నం త‌క్కువే. దేశం మొత్తం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఈ త‌రుణంలో రూ. 50 టికెట్‌ను రూ. 100 చేస్తే కొన‌డానికి ఎవ‌రు సిద్ధంగా ఉంటార‌నేది పెద్ద ప్ర‌శ్న‌. టికెట్ ధరలు పెరిగితే చాలా మధ్యతరగతి కుటుంబాలు థియేటర్ల ముఖం చూడ‌వు. 50 శాతం ఆక్యుపెన్సీ ప‌రిమితి ఉన్నంత కాలం భారీ బ‌డ్జెట్ సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతాయ‌నే న‌మ్మ‌కం లేదు. వ‌చ్చే సంక్రాంతిపై టాలీవుడ్ ఆశలు పెట్టుకుంది. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అవ‌కాశం ఉంటేనే వరుస చిత్రాలు విడుదలవ‌డానికి ఆస్కారం క‌లుగుతుంది. హైద‌రాబాద్ గ్రేట‌ర్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్‌రావు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. ఈ వ‌రాల‌కు టాలీవుడ్ ప్ర‌ముఖ సెల‌బ్రిటీలు ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు చెబుతార‌నీ, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసిస్తూ ఆకాశానికెత్తేస్తార‌నీ ఆయ‌న‌కూ, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌కూ బాగా తెలుసు. అస‌లు సినిమా ఇండ‌స్ట్రీపై ఈ వ‌రాల‌ను ప్ర‌క‌టించ‌డానికి వెనుక కేటీఆర్ ఉన్నార‌ని వినిపిస్తోంది. వారి ఊహ‌ల‌కు త‌గ్గ‌ట్లే చిరంజీవి, మ‌హేశ్‌బాబు మొద‌లుకొని అనేక‌మంది సెల‌బ్రిటీలు, సినిమా సంఘాలు తెలంగాణ ప్ర‌భుత్వానికీ, కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ముంగిట వారికి ఇంత‌కంటే కావాల్సింది ఏముంటుంది!

మారుతి డైరెక్ష‌న్‌లో మాస్ మ‌హారాజా

  గతేడాది 'ప్రతిరోజు పండ‌గే' చిత్రంతో భారీ విజయాన్ని అందించినప్పటికీ, దర్శకుడు మారుతి తన తదుపరి చిత్రానికి ఏ స్టార్‌ను ఒప్పించలేకపోయాడు. దాదాపు ఒక సంవత్సరం పాటు, అనేక మంది స్టార్స్ చుట్టూ చ‌క్క‌ర్లు కొట్టిన‌ తరువాత, వరుసగా నాలుగు ఫ్లాప్‌లను చ‌విచూసి, మ‌ళ్లీ త‌నేమిటో చూపించాల‌ని ఎదురుచూస్తున్న‌ రవితేజతో కలిసి పనిచేయాలని అత‌ను నిర్ణయించుకున్నాడు. ఈ మూవీని యు.వి. క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మించ‌నుంది. ర‌వితేజ ఇటీవ‌లే 'క్రాక్' మూవీని పూర్తిచేసి, ప్ర‌స్తుతం ర‌మేశ్‌వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న మూవీని చేస్తున్నాడు. న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి అంగీక‌రించాడు. ఆ సినిమాతో పాటు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఏక కాలంలో న‌టించ‌డానికి ఆయ‌న ప్లాన్ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేసిన 'రాజా ది గ్రేట్' మూవీ ర‌వితేజ చివ‌రి హిట్ ఫిల్మ్‌. దాని త‌ర్వాత వ‌రుస‌గా ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని, డిస్కో రాజా చిత్రాల‌తో ఫ్లాపులు చ‌విచూశాడు. గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్‌లో చేసిన 'క్రాక్' సినిమాతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌స్తాన‌ని ఆయ‌న న‌మ్ముతున్నాడు.

'దిశ ఎన్‌కౌంట‌ర్' విష‌యంలోనూ చిక్కుల్లో ఆర్జీవీ!

  నిన్న‌గాక మొన్న 'మ‌ర్డ‌ర్' మూవీ విష‌యంలో న్యాయ‌ప‌ర‌మైన‌ ఆటంకాలు ఎదుర్కొని బ‌య‌ట‌ప‌డిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన రాబోయే మ‌రో చిత్రం 'దిశ‌ ఎన్‌కౌంట‌ర్' విష‌యంలోనూ చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డారు. ఇది గత సంవత్సరం జరిగిన విషాద దిశ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌ ఆధారంగా రూపొందింది. దిశ కేసులో నలుగురు నిందితుల కుటుంబీకులు దాఖ‌లు చేసిన కేసులో తెలంగాణ హైకోర్టు రామ్ గోపాల్ వర్మకు షో కాజ్ నోటీసు జారీ చేసింది. దిశపై దాడి చేసి, ఆమెను కిరాతకంగా హ‌త్య చేశార‌ని ఆరోపణలు ఎదుర్కొంటున్న న‌లుగురు నిందితుల కుటుంబ సభ్యులు రామ్ గోపాల్ వర్మ త‌మ‌ను 'దిశ ఎన్‌కౌంట‌ర్' మూవీలో చెడుగా చూపిస్తున్నార‌ని ఆ కేసులో పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ చిత్రం త‌న క్ల‌యింట్ల‌ను తీవ్ర మాన‌సిక ఆందోళ‌న‌ల‌కు గురిచేస్తోంద‌ని నిందితుల కుటుంబ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది అన్నారు. 'దిశ ఎన్‌కౌంటర్' మూవీని థియేటర్లలో విడుదల చేయడానికి అనుమతించరాదని న్యాయవాది వాదించారు. ఆర్జీవీ ఇప్పుడు షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందించాల్సి ఉంది.

'ఫైట‌ర్' తండ్రిగా 'పోలిస్ క‌మిష‌న‌ర్‌'?

  విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైరెక్ట‌ర్‌ పూరి జగన్నాథ్‌తో కలిసి ఒక ఉత్తేజకరమైన చిత్రం పనిలో బిజీగా ఉన్నాడు. 'ఫైటర్' పేరుతో రూపొందుతోన్న‌ ఈ చిత్రానికి సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో విజయ్ బాక్సర్ పాత్రను పోషిస్తున్నాడు. అత‌ని జోడీగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్యా పాండే న‌టిస్తోంది. విజయ్ తండ్రి పాత్రలో నటించడానికి సీనియర్ మలయాళ నటుడు సురేష్ గోపిని పూరి సంప్ర‌దించిన‌ట్లు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రంలో తండ్రీకొడుకుల అనుబంధం ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది. సురేష్ గోపి అయితే ఆ క్యారెక్ట‌ర్‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని పూరి భావిస్తున్నాడు. 'పోలీస్ క‌మిష‌న‌ర్' లాంటి డ‌బ్బింగ్ సినిమా ద్వారా ఆయ‌న తెలుగు ప్రేక్షకులకు సుప‌రిచితుడే. మ‌ల‌యాళంలో స్టార్ యాక్ట‌ర్ అయిన ఆయ‌న శంక‌ర్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన 'ఐ' మూవీలో విల‌న్‌గానూ న‌టించి త‌న‌లోని విల‌క్ష‌ణ‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. కొంత‌కాలం విరామంతో ఆయ‌న మిగ‌తా భాష‌ల చిత్రాల్లో న‌టిస్తూ వ‌స్తున్నారు. ఒకేసారి వేర్వేరు సినిమాల్లో భాగం కావాలని ఆయ‌న ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ, సురేష్ గోపి వ‌స్తే క‌చ్చితంగా ఈ ప్రాజెక్టుకు చాలా విలువ వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. త్వ‌ర‌లో దీనికి సంబంధించి అధికారిక స‌మాచారం రానుంది.

గౌత‌మ్ అలా చేయ‌క‌పోతే కాజ‌ల్ పెళ్లాడేది కాద‌ట‌!

  టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న సుదీర్ఘ కాల బాయ్‌ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లును అక్టోబ‌ర్ 30న పెళ్లాడింది. వివాహం తరువాత, ఆమె తన భర్తతో కలిసి హనీమూన్ వెళ్ళింది . ఆ ఇద్ద‌రూ మాల్దీవుల్లో హనీమూన్‌ను ఆస్వాదించారు. గౌతమ్‌తో వివాహానికి అంగీకరించడానికి ఒక కారణం ఉందని కాజల్ తెలిపింది. అంద‌రు అమ్మాయిల మాదిరిగానే, తన కాబోయే భర్త మోకాళ్లపై నిల్చొని ఎర్ర గులాబీని ఇవ్వడం ద్వారా తన ప్రేమను వ్యక్తం చేయాలని ఆమె కోరుకుంది. ఆమె కోరుకున్న విధంగానే గౌతమ్ కిచ్లు ఆమెకు ప్ర‌పోజ్ చేశాడు. ఈ కారణంగా, గౌతమ్‌తో మ్యారేజ్‌కి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా చేయకపోతే అతన్ని వివాహం చేసుకోవడం కష్టమేన‌ని ఆమె సరదాగా వ్యాఖ్యానించింది. ప్రతి అమ్మాయి తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి నుండి గులాబీని పొందాలని కోరుకుంటుందని కాజల్ చెప్పింది. పెళ్లిని ఖాయం చేసుకునే ముందు గౌతమ్ తన తల్లిదండ్రులతో మాట్లాడాడని కాజల్ తెలిపింది. అయితే అతను మోకాళ్లపై ఉండి గులాబీతో ప్రపోజ్ చేయాల‌ని ఆమె రూల్ పెట్టింది. వ‌ర్క్ విష‌యానికి వ‌స్తే, కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న‌ 'ఆచార్య' చిత్రంలో కాజల్ అగర్వాల్ కనిపించనుంది. డిసెంబర్ 5 నుండి ఆమె సెట్స్‌లో ఉంటున్న‌ట్లు సమాచారం. సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం కరోనావైరస్ కార‌ణంగా విధించిన లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. లాక్‌డౌన్ ముగిసి, ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చాక షూటింగ్‌ను పున‌రుద్ధ‌రించారు. విష్ణు మంచు నటిస్తోన్న 'మోస‌గాళ్లు' చిత్రంలో ఆమె అత‌ని సోద‌రిగా క‌నిపించ‌నుండ‌టం విశేషం. అలాగే కమల్ హాసన్ సినిమా 'ఇండియన్ 2'లో ఆమె ఆయ‌న జోడీగా న‌టిస్తోంది. ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

ప్రపంచంలో అత్యంత భయానక రహస్య సరస్సులు

ప్రపంచం అనేక అద్భుతాల సమాహారం. అందమైన జలపాతాలు, అలరించే అడవులు, చిత్రకారుణి కుంచెను మించిన అపూర్వమైన దృశ్యాలు ఎన్నో ఎన్నెన్నో.. అయితే కొన్ని అద్భుతాల వెనుక భయంకరమైన వాస్తవాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రపంచంలోని అందమైన సరస్సులే కాదు అత్యంత భయానక సరస్సులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాణాలను హరిస్తాయి. ముందుగా వీటి గురించి తెలుసుకోవడం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుంది. మరి ఆ భయానక రహాస్య సరస్సుల విశేషాలు ఏంటో చూద్దామా... 1. బ్లూ లేక్, రష్యా రష్యాలోని వింతైన సరస్సు ఇది. ఈ సరస్సులోకి నీరు వర్షం ద్వారా ఈ సరస్సులోని నీరు  ప్రవాహాల నుంచి,  నదుల నుంచి ఇందులోకి చేరదు. భూగర్భ నీటి బుగ్గల ద్వారా సరస్సులోకి నీళ్లు చేరుతాయి. అయితే నీటిలో హైడ్రోజన్ సల్ఫైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా నీటి రంగు నీలం రంగులో కనిపిస్తుంది.  సరస్సు 258 మీటర్ల లోతులో ఉంది. ఇది 75 మీటర్ల ఎత్తున ఉన్న సీటెల్ స్పెస్ కూడా ఈజీగా ఇందులో మునిగిపోతుంది. ఈ సరస్సు నీరు రాళ్ళను సైతం కోస్తూ వెళ్లడంతో సరస్సు రోజురోజుకు లోతుగా మారుతోంది. ఈ నీలం సరస్సు ప్రపంచంలోని అతిపెద్ద గుహలను తనలో నిక్షిప్తం చేసుకుందని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2. లేక్ నాట్రాన్, టాంజానియా తూర్పు ఆఫ్రికాలో లోతైన సరస్సు ఇది.  టాంజానియా కథలలో ఈ సరస్సు ప్రస్తావన ఉంటుంది.  ప్రజల జీవితాలను ఇది ప్రభావితం చేస్తుంది. అయితే ఈ సరస్సు ఒడ్డున ఫ్లెమింగోలు, చిన్న పక్షులు, గబ్బిలాలు ప్రాణములేని స్థితిలో కనిపిస్తాయి. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, ప్రాణాలు కోల్పోయిన అన్ని జీవుల శరీరాలు భద్రపరచబడి కనిపిస్తాయి. నీటిలోని సోడియం కంటెంట్ కారణంగా సరస్సు పసుపు రంగును కనిపిస్తుంది. అయితే ఇందులో ఉండే అనంతమైన సూక్ష్మజీవుల కారణంగా ఈ జలాలు నారింజ రంగులో ఉంటాయి. కానీ నెమ్మదిగా నారింజ రంగు మరింత ముదురుగా మారి, నీటి రంగు ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారుతోంది. ఈ సరస్సులో నాట్రాన్ పుష్కలంగా ఉంది, సహజంగా సంభవించే సోడియం సమ్మేళనం సోడియం కార్బోనేట్, బైకార్బోనేట్, క్లోరైడ్ మరియు సల్ఫేట్ల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ వాతావరణం రంగురంగుల ల్యాండ్ స్కేప్ మాదిరిగా కనిపిస్తోంది. 3. మిచిగాన్ లేక్, యుఎస్ఎ అమెరికాలో ఉన్న ఐదు గొప్ప సరస్సుల్లో మిచిగాన్ లేక్ ఒకటి. ఈ సరస్సు వందలాది మంది ప్రాణాలను తీసిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సరస్సులో ఎలాంటి రాక్షసులు లేరు. అంతేకాదు మరణించినవారు నీటికి దూరంగా ఉన్నప్పుడే మరణించారు. అయితే ఇక్కడి అలలను ప్రమాదకరంగా పరిగణిస్తారు. ఒడ్డుకు వచ్చే అలలు, నీటి ప్రవాహాలు ఊహించని విధంగా ప్రాణాలను హరిస్తాయి. అంతేకాదు గజ ఈతగాళ్లు కూడా  మిచిగాన్ ఒడ్డున ప్రవాహాలను ఎదుర్కోలేరని, ఇవి చాలా ప్రమాదకరమైనవి అంటారు. సమ్మర్ సీజన్ లో ఇక్కడికి ఈతకు వచ్చి అనేక మంది ప్రాణాలు కోల్పోతారు.  ఆ నిర్దిష్ట సమయంలో నీటి ప్రవాహం, అలల తాకిడి ఎక్కువ కావడంతో ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. శరదృతువు ఈ సరస్సు వాతావరణం పడవలు, మత్స్యకారులకు ప్రమాదకరం.  నీటి ఉపరితలంపై హఠాత్తుగా పెరుగుతున్న ప్రవాహాలు ప్రాణాంతక తరంగాలకు కారణమవుతాయి. 4. న్యోస్ కామెరూన్ సరస్సు ఈ సరస్సు అనేక పొరుగు గ్రామాలకు అనేక శతాబ్దాలుగా నిశ్శబ్దంగా నీటిని అందించింది. కానీ దాని ఉపరితలం కింద, ఒక రహస్యం ఉంది. ప్రకృతి ప్రాణాంతక శక్తిని అకస్మాత్తుగా విడుదల చేసిన తరువాత సరస్సు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందింది. ఈ సంఘటన ఆగస్టు 21, 1986 న జరిగింది. సరస్సు నుండి అధిక శక్తితో కూడిన వాయువు మేఘం పెరిగింది. సమీపంలో నివసించే ప్రతిదీ ప్రజలు, పశువులు, పక్షులు మొదలైనవి ఏమీ ఈ విపత్తు నుంచి బయటపడలేదు! సరస్సు చుట్టూ నివసించే చిన్న కీటకాలు కూడా కుళ్ళిపోయాయి. ఈ సంఘటన సుమారు 1746 మంది మానవుల ప్రాణాలను తీసింది.  ప్రపంచం నలుమూలల శాస్త్రవేత్తలు ఈ ప్రదేశాన్ని సందర్శించారు, సరస్సులో అగ్నిపర్వత బిలం ఉన్నట్లు వారు కనుగొన్నారు. 5.కరాచాయ్ సరస్సు, రష్యా రష్యా లోని యురల్స్ లో ఉన్న ఈ సరస్సు ప్రపంచంలో అత్యంత కలుషితమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సరస్సు ఒడ్డున కేవలం రెండు గంటలు గడపడం వల్ల మీరు రెండు గంటలు ఎక్స్‌రే మెషీన్‌లో కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాదు అది కూడా సీసంతో కప్పబడిన కవరింగ్ లేకుండా ఉంటుంది. రేడియేషన్ పాయిజనింగ్ ద్వారా చాలా నెమ్మదిగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సరస్సు 1950 లలో జరిగిన యుద్ధం కారణంగా నాశనమైంది. ఆ తర్వాత ఈ సరస్సును ద్రవ రేడియోధార్మిక వ్యర్థాల నిల్వ కోసం ఉపయోగించారు.  

తెల్ల కాగితం- నల్ల చుక్క

‘‘ఇవాళ మీకో పరీక్ష పెట్టబోతున్నాను’’ క్లాసులోకి అడుగుపెడుతూనే చెప్పారు ప్రొఫెసర్‌. అకస్మాత్తుగా ఈ పరీక్ష ఏమిటా అని విద్యార్థులంతా తలపట్టుకుని కూర్చున్నారు. కానీ ప్రొఫెసర్‌ మాటని ఎవరు కాదనగలరు. ఎలాగొలా పరీక్షని పూర్తిచేసేందుకు అంతా సిద్ధపడ్డారు. అందరికీ తలా ఒక ప్రశ్నాపత్రాన్నీ ఇచ్చారు ప్రొఫెసర్‌. ‘‘ఈ ప్రశ్నాపత్రం వెనుకనే మీ జవాబులు రాసి ఇవ్వండి. మీకు ఒక్క అరగంటే సమయం ఉంది,’’ అంటూ పరీక్షని మొదలుపెట్టేశారు.   విద్యార్థులంతా ప్రశ్నాపత్రాలని తెరిచి చూస్తే ఏముంది. కాగితం మధ్యలో ఒక చిన్న చుక్క కనిపించింది అంతే! ప్రొఫెసర్‌గారు తమ తెలివితేటల్ని పరీక్షించేందుకే హఠాత్తుగా ఈ పరీక్షని పెట్టారన్న విషయం విద్యార్థులకి అర్థమైపోయింది. కాబట్టి అంతా ఆ చుక్కని చూసి తమకి తోచిన జవాబుని ఏదో ప్రశ్నాపత్రం వెనకాల రాయడం మొదలుపెట్టారు.   అరగంట గడిచిపోయింది, ఒకో విద్యార్థీ వచ్చి తను పూర్తిచేసి ప్రశ్నాపత్రాన్ని ప్రొఫెసర్‌గారి బల్లమీద ఉంచి వెళ్లారు. ప్రొఫెసరుగారు ఆ ప్రశ్నాపత్రాలన్నింటినీ తీసుకుని వాటిలోంచి ఒక్కో విద్యార్థీ రాసిన జవాబుని చదవడం మొదలుపెట్టారు. ప్రశ్నాపత్రంలో ఉన్న చుక్కని చూసి విద్యార్థులు రకరకాల జవాబులు రాశారు. కొంతమంది ఆ చుక్క ఆకారాన్నీ, రంగునీ వర్ణించారు. మరికొందరు కాగితంలో దాని స్థానం గురించి కొలతలు వేశారు. ఇంకొందరు మరో అడుగు ముందుకు వేసి ‘జీవితం ఓ చుక్కలాంటిది...’ అంటూ కవితలల్లారు. కొందరైతే అసలు ఏ జవాబూ లేకుండా కాగితాన్ని అలాగే వదిలివేశారు.   ప్రశ్నాపత్రాలన్నింటినీ చదివిన తరువాత ప్రొఫెసరుగారు తన అభిప్రాయాన్ని చెప్పడం మొదలుపెట్టారు- ‘‘మీకు ఓ నల్ల చుక్క ఉన్న పత్రాన్ని ఇచ్చి మీకు తోచింది రాయమని అడగ్గానే, అంతా కాగితం మధ్యలో ఉన్న నల్లని చుక్క గురించే రాశారు. ఎవ్వరూ కూడా మనం చెప్పుకునే సబ్జెక్టు గురించి కానీ, మీ లక్ష్యాల గురించి కానీ, జీవితం మీద మీకు ఉన్న అభిప్రాయాల గురించి కానీ... ఆఖరికి మీ గురించి కానీ ఒక్క ముక్క కూడా రాయలేదు. మన జీవితం కూడా మీకిచ్చిన తెల్లకాగితం లాంటిదే! దాని మీద అనారోగ్యం, పేదరికం, అసంతృప్తి, కుటుంబ కలహాలు లాంటి చిన్న చిన్న మరకలు కనిపిస్తూ ఉంటాయి. మనమంతా విలువైన జీవితాన్ని మర్చిపోయి ఎంతసేపూ ఆ మరకల మీదే మన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాము. వాటి గురించే మన మనసునీ కాలాన్నీ వెచ్చిస్తూ ఉంటాము. అంతేకానీ, చేతిలో ఉన్న తెల్లటి కాగితం మీద ఎంత అందమైన జవాబుని రాయవచ్చో, ఎంత అద్భుతమైన చిత్రాలని గీయవచ్చో మర్చిపోతూ ఉంటాము. నేను మీకు ఈ పరీక్ష పెట్టింది మీకు మార్కులు ఇవ్వడానికి కాదు, మీకు జీవితం విలువ నేర్పడానికి,’’ అంటూ ముగించారు ప్రొఫెసరుగారు. ఆయన మాటలు విన్న తరువాత విద్యార్థులకి తమ జీవితాల్లో అత్యంత ఉపయోగపడే పాఠం అదే అనిపించింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara

మనకోసం మరో మూడు గ్రహాలు

భూమి ఓ అసాధారణమైన గ్రహం. అదృష్టమో, ప్రకృతి వరమో కానీ ఇక్కడ జీవం మనుగడ సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. అనువైన ఉష్ణోగ్రతలు, సూర్యుడి నుంచి తగినంత దూరం, అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర, నీటి సౌలభ్యం, రాతి నేల, గురుత్వాకర్షణ శక్తి, భూమి మీదకు ఉల్కలు దూసుకురాకుండా కాపాడే గురుగ్రహం.... ఇలా చెప్పుకొంటూపోతే అద్భుతం అనదగ్గ సానుకూలతలు ఎన్నో భూమికి సొంతం. అందుకనే భూమిలాగా జీవానికి సహకరించే ప్రాంతం ఈ విశ్వంలో ఉండే అవకాశం లేదని నమ్ముతుంటారు శాస్త్రవేత్తలు. ఎక్కడో శనిగ్రహం చుట్టూ తిరిగే టైటాన్ వంటి అతికొద్ది ఉపగ్రహాల మీద మాత్రమే జీవం మనుగడ సాగించే సావకాశం ఉందని భావిస్తుంటారు. మరి ఇప్పుడో... భూమికి కేవలం 39 కాంతిసంవత్సరాల దూరంలో సౌరకుటుంబాన్ని పోలిన ఓ వ్యవస్థ ఉన్నట్లు నాసా ప్రకటించింది. ఏడాదిలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో అది ఓ కాంతి సంవత్సరం అన్న విషయం తెలిసిందే! వినడానికి ఈ దూరం కాస్త ఎక్కువే అనిపించినా, ఈ అనంత విశ్వంలో ఇది ఇంచుమించు పక్కింటితో సమానం. కుంభరాశిలో భాగంగా ఉన్న ఈ వ్యవస్థలోని నక్షత్రానికి ట్రాపిస్ట్‌ 1 అని పేరు పెట్టారు. ఈ ట్రాపిస్ట్‌ 1 నక్షత్రం చుట్టూ ఏడు గ్రహాలు తిరుగుతున్నట్లు గమనించారు. ఈ గ్రహాలన్నీ కూడా సదరు నక్షత్రానికి చాలా చేరువలో ఉన్నాయట. ఒక గ్రహం మీద నిలబడి చూస్తే మిగతా ఆరు గ్రహాలన్నీ కూడా కనిపించేంత దగ్గరదగ్గరగా ఇవి ఉన్నాయి. సూర్యుడితో పోలిస్తే ఈ ట్రాపిస్ట్‌ నక్షత్రం దాదాపు పదోవంతు మాత్రమే ఉంటుంది. పైగా దీని నుంచి వచ్చే కాంతి మన సూర్యకాంతికంటే 200 రెట్లు తక్కువట. అయితే నక్షత్రానికి బాగా దగ్గరగా ఉండటం వల్ల దీని చుట్టూ తిరిగే గ్రహాల మీద ఉష్ణోగ్రతలు 0- 100 మధ్యలోనే ఉంటాయని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా 4,5,6 గ్రహాలు జీవానికి మరింత అనువుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ట్రాపిస్ట్‌ 1 గురించి అందిన సమాచారమంతా వాటి మీద మనిషి మనుగడకి సంబంధించి కొత్త ఆశలను కల్పించేట్లుగానే ఉంది. అయితే అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఆ గ్రహాల మీద నీటి లభ్యత ఎంత, వాటి మీద లభించే ఖనిజాల ఏమిటి... లాంటి పరిశోధనల ఇంకా జరగాల్సి ఉంది. అప్పుడు మాత్రమే వాటి మీద మనుషులు జీవించే అవకాశం ఉందో లేదో నిర్ధారించగలం. అసలు ఇప్పటికే వాటి మీద కొన్ని జీవులు బతికేస్తున్నాయేమో అన్న అనుమానాలు కూడా మొదలైపోయాయి. ఏది ఏమైనా ఇన్నాళ్లకి భూమిని పోలిన గ్రహాలు కొన్ని శాస్త్రవేత్తలకు కొత్త ఆశలను కల్పిస్తున్నాయి.   - నిర్జర.

వ్యాయామం మీద అతి పెద్ద పరిశోధన

ఆరోగ్యానికి నడక ఎంత అవసరమో కొత్తగా చెప్పేదేమీ లేదు. జాగింగ్‌ చేయడం, సైకిల్‌ తొక్కడం, ఈత కొట్టడం... ఇవన్నీ కూడా మంచి ఫలితాలని ఇచ్చే వ్యాయామాలే అయినప్పటికీ... సులువుగా సహజంగా చేసే నడకే మన ఆరోగ్యాలను కాపాడుతూ వస్తోంది. కానీ ఈ నడక ఎంతసేపు ఉండాలి, ఎలా ఉండాలి అన్నదాని మీద ఇప్పటివరకూ ఎవరూ సరైన జవాబు చెప్పలేకపోతున్నారు. రోజుకి 10,000 అడుగులు నడిస్తే మంచిదన్న మాట ఉన్నప్పటికీ... అదేమీ అంత శాస్త్రీయం కాదని కొట్టి పారేస్తున్నారు నిపుణులు. ఈ 10,000 అడుగులు అన్నమాట జపాన్‌లోకి ఒక వాణిజ్య సంస్థ మొదలుపెట్టిన ప్రచారం అని గుర్తుచేస్తున్నారు. మరికొందరేమో వారానికి ఓ రెండు రోజుల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుందిలే... మిగతా రోజుల్లో ఆఫీసుకి పోవాలి కదా! అంటున్నారు. మరి నడకకు సంబంధించి లోగుట్టును రట్టు చేసేదెలా!     అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌కు చెందిన ‘అలెన్‌ యూంగ్‌’ అనే కార్డియాలజిస్టుకి ఇదే అనుమానం వచ్చింది. వేలమంది జనాల రోజువారీ కదలికలను క్షుణ్నంగా పరిశీలిస్తే కనుక.... వారి జీవిత విధానం, అందులో భాగంగా వారు ఎంతసేపు నడుస్తున్నారు, ఎలాంటి వ్యాయామం చేస్తున్నారు తెలిసిపోతుంది. వ్యాయామం చేయడం వల్ల వాళ్ల ఆరోగ్యం ఏమన్నా మెరుగుపడిందా! అన్న విషయమూ బయటపడుతుంది. కానీ ఇందుకోసం వేలమంది జీవితాలను దగ్గరగా పరిశీలించడం ఎలా సాధ్యం?     తన పరిశోధనను ఎలా ముందుకు తీసుకుపోవాలా అని బుర్ర బద్దలుకొట్టుకుంటున్న అలెన్‌కు హఠాత్తుగా ఓ ఉపాయం తోచింది. అప్పటికే యాపిల్‌ సంస్థ విడుదల చేసిన ఒక యాప్‌ గుర్తుకువచ్చింది. మన శరీర కదలికలు ఎలా ఉన్నాయి? మనం ఎంత దూరం నడుస్తున్నాం? అని పసిగట్టగలిగే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమంటూ ఒక పిలుపుని ఇచ్చారు. అలెన్‌. అలెన్ పిలుపునిచ్చిన తొలివారంలోనే దాదాపు 53,000 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రస్తుతానికి లక్షమంది ఈ యాప్‌ ద్వారా అలెన్‌కు తమ కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అలెన్‌కు అందిస్తున్నారు. అందుకే వ్యాయామానికి సంబంధించి అతి పెద్ద పరిశోధనగా ఇది పేరుగాంచింది.     అలెన్‌ మొదలుపెట్టిన ఈ పరిశోధన ద్వారా పూర్తిస్థాయి ఫలితాలు అందేందుకు కొంత కాలం పట్టక తప్పదు. లక్షమందికి సంబంధించిన గణాంకాలను విశ్లేషించాలంటే అంత తేలికైన విషయం కాదు కదా! కానీ ఈపాటికే ఈ గణాంకాలు కాస్త భయపెట్టేవిగా ఉంటున్నాయట. మనలో చాలామంది అసలు కదలనే కదలడం లేదంటూ ఈ యాప్ ద్వారా తేలుతోందట. ‘అందులో ఆశ్చర్యం ఏముంది? మన సమయాన్ని పూర్తిగా కూర్చునే గడిపేస్తున్నాం. అటూఇటూ వెళ్లడం మాట అటుంచి, కనీసం లేచి నిలబడేందుకు కూడా ప్రయత్నించడం లేదు’ అంటున్నారు అలెన్. మరి ఈ పరిశోధన ముగిసేసరికి ఇలాంటి భయంకరమైన వాస్తవాలు ఎన్ని బయటపడతాయో! మరైతే ఎంతసేపు నడవాలి? ఎలా నడవాలి? అన్న విషయమై అలెన్‌ తన పరిశోధనని పూర్తి చేసేదాకా మనం ఆగాలా! అమెరికాలోనే సుదీర్ఘ కాలం నడక గురించి అధ్యయనం చేస్తున్న ‘ట్యూడర్‌ లాక్‌’ అనే నిపుణుడి ప్రకారం మనషి రోజుకి కనీసం 8,000 అడుగులన్నా నడిస్తే మంచిది. సాధారణంగా మనిషి ఓ 5,000 అడుగుల వరకు తనకు తెలియకుండానే నడుస్తుంటాడనీ, దానికి మరో 3,000 అడుగులు జోడించేందుకు, ఓ అరగంటపాటు ప్రత్యేకంగా నడకసాగించమని చెబుతున్నారు ట్యూడర్‌. మరి అలెన్‌ పరిశోధన, ట్యూడర్‌ మాటను ఎంతవరకు రుజువు చేస్తుందో చూడాలి. - నిర్జర.

గొంతు నొప్పికి చక్కటి పరిష్కారం..!

చలికాలం వచ్చిందే చాలు అనేక అనారోగ్యసమస్యలు ముసురుకుంటాయి. కరోనా మహ్మమారి వ్యాప్తి కారణంగా ఏ మాత్రం జబులు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపించినా భయంతో హస్పిటల్స్ కు పరిగెత్తుతున్నారు. అయితే అన్ని సమస్యలను కరోనా దృష్టిలో చూడటం మంచిది కాదు. ముఖ్యం గొంతు నొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. జీర్ణక్రియ అస్తవ్యస్తం కావడంతో కొందరిలో గొంతు ఒరుసుకుపోతుంది. గొంతు వద్ద ఏదో నొక్కుతున్న భావన కలగడం, తెమడ జిగటగా ఉండి బయటికి రావడం కష్టం కావడం, కొండనాలుకలో వాపు కనిపిస్తాయి. ఈ స్థితిలో సల్ఫర్‌, సేఫియా, ఆర్సెనిక్‌ ఆల్బ్‌ం  వంటి మందులు బాగా పనిచేస్తాయి. బ్రయోనియా, పల్సటిల్లా,  మందులు కూడా ఉపయోగించవచ్చు. కొందరిలో జీర్ణాశయ సమస్యల వల్ల గొంతు, గవద బిళ్లలు ఎర్రబారడం, గొంతు ఒరిపిడికి గురికావడంతో పాటు  గొంతు పొడిబారినా దప్పిక అనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో సాయంత్రం వేళ ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. చలివేయడంతో పాటు గొంతులో జిగటగా అంటుకుపోతున్న భావన కలుగుతుంది. ఇలాంటి వారికి పల్సటిల్లా మందు బాగా పనిచేస్తుంది. గొంతు నొప్పి రాగానే భయపడకుండా గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని గార్లింగ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.

ఆరోగ్యం దుమ్ముకొట్టుకుపోతోంది

మారుతున్న నాగరికత పుణ్యమా అని ఇప్పుడు గ్రామాలు కూడా పట్టణాలకు తీసిపోకుండా ఉన్నాయి. వీధుల్లో కార్లూ, నేల మీద టైల్స్, ఇంట్లో డియోడరెంట్లు ఇప్పుడు సర్వసాధారణం. ఇక ప్లాస్టిక్‌ వాడకం గురించైతే చెప్పనే అక్కర్లేదు. వీటి వాడకం వల్ల పెద్దగా నష్టం లేదనీ, ఒకవేళ ఉన్నా వాటికి కాస్త దూరంగా ఉంటే సరిపోతుందనీ అనుకుంటున్నాము. కానీ కొత్తగా జరుగుతున్న కొన్ని పరిశోధనలు మనం వాడే వస్తువుల నుంచి వెలువడే కాలుష్య రసాయనాలు, మన ఇంట్లో ఉండే దుమ్ములో సైతం పేరుకుపోతున్నాయని రుజువుచేస్తున్నాయి.   పరిశోధన గత పదహారు సంవత్సరాలుగా మన ఇళ్లలో ఉండే దుమ్ము గురించి అమెరికాలో పలు పరిశోధనలు జరిగాయి. జార్జ్‌ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ పరిశోధనల ఫలితాలన్నింటినీ క్రోడీకరించి చూశారు. ఇంట్లో రోజూ కనిపించే దుమ్ములో దాదాపు 45 రకాల హానికారక పదార్థాలు ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. వీటిలో ఒక పది రకాలైతే దాదాపు అమెరికా అంతటా కనిపించాయట.      వేటి నుంచి? ఇంతకీ ఈ హానికారక రసాయనాలు వేటినుంచి వచ్చి దుమ్ములో చేరుతున్నాయనే విషయం ఆసక్తికరమైనది. ప్లాస్టిక్‌ వస్తువులు మృదువుగా ఉండేందుకు వాడే phthalates అనే పదార్థాలూ, షాంపూల వంటి ఉత్పత్తులు నిలువ ఉండేందుకు వాడే phenol అనే రసాయనాలు, నాన్‌స్టిక్ వంటి వస్తువులను తయారుచేసేందుకు వాడే ఫ్లోరినేటెడ్‌ కెమికల్స్‌... ఇలా మన చుట్టూ ఉన్న నానారకాల వస్తు సముదాయం నుంచి హానికారకాలు వెలువడి, ఇంట్లోని దుమ్ములో పేరుకుంటున్నాయని తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే... మన ఇంట్లో రసాయనాలతో తయారైన ప్రతి పదార్థమూ ఎంతో కొంత విషాన్ని, ఇంటి వాతావరణంలోకి వెదజల్లుతూనే ఉంది. ఇక బయట నుంచి వచ్చే దుమ్ము గురించి చెప్పనే అక్కర్లేదు. పరిశ్రమల దగ్గర్నుంచీ వాహనాల వరకూ ప్రతి ఒక్క యంత్రమూ ఎంతో కొంత కాలుష్యాన్ని మన ఇంట్లోకి చేరవేస్తోంది.   తీవ్రమైన హాని ఇలా దుమ్ములో కనిపించే రసాయనాలు ముఖ్యంగా సంతానోత్పత్తి మీద దుష్ప్రభావం చూపుతాయట. ఇక జీర్ణవ్యవస్థను దెబ్బతీయడం దగ్గర్నుంచీ కేన్సర్‌ను కలిగించడం వరకూ ఇవి నానారకాల రోగాలకూ మనల్ని చేరువ చేసే అవకాశం లేకపోలేదు. నేల మీద పారాడే పసిపిల్లలు, ఏది పడితే అది నోట్లో పెట్టుకునే చిన్న పిల్లలు వీటి బారిన పడే ప్రమాదం అత్యధికం.     దుమ్ము దులుపుకోవడమే! మనం రోజువారీ విచ్చలవిడిగా వాడేస్తున్న వస్తువులు, అవి వెలువరించే హానికారక పదార్థాల గురించి ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు జరగవలసి ఉంది. ఈలోపల మనం చేయగలిగిందల్లా, ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయడమే. ఇంట్లో దుమ్ము మరీ ఎక్కువగా పేరుకుంటూ ఉంటే, పాత పద్ధతులను వదిలిపెట్టి శక్తిమంతమైన వాక్యూమ్ క్లీనర్లను ఉపయోగించమని సూచిస్తున్నారు. నేలని ఎప్పటికప్పుడు తడిగుడ్డతో శుభ్రం చేస్తూ ఉండాలనీ, చేతులను తరచూ కడుక్కుంటూ ఉండాలని సలహా ఇస్తున్నారు. దుమ్మే కదా అని అశ్రద్ధ చేస్తే మన ఆరోగ్యం కూడా దుమ్ముకొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   - నిర్జర.
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.