డిప్రెషన్ బాధితులకు గుడ్ న్యూస్.. 7రోజులు ఇలా చేస్తే షాకింగ్ ఫలితాలు పక్కా..!
posted on Dec 4, 2025 3:46PM
.webp)
డిప్రెషన్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ డిప్రెషన్ ఊబిలో చిక్కుకుంటున్నారు. దీన్నుండి బయటపడటానికి మానసికంగా యుద్దం చేస్తుంటారు. చుట్టూ ఉన్న అందరూ సపోర్ట్ చేస్తే తప్ప దీన్నుండి సులువుగా బయట పడలేరు. డిప్రెషన్ కారణంగా నమోదు అవుతున్న మరణాలు కూడా చాలానే ఉంటున్నాయి. అయితే డిప్రెషన్ లో నలిగిపోతూ ఇక తమ జీవితం అంతే నిరాశలో ఉండేవారికి గుడ్ న్యూస్.. డిప్రెషన్ ను తరిమి కొట్టే అద్బుతమైన మార్గం ఉంది. కేవలం 7రోజులు చాలు.. జీవితంలో అద్బుతం జరుగుతుంది. ఈ విషయం స్వయానా పరిశోధకులు, వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకూ 7 రోజులు చేయాల్సిన పనులేంటి? ఇది డిప్రెషన్ తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే..
ఫోన్ బంద్.. డిప్రెషన్ ఎండ్..
డిప్రెషన్ సమస్యను ఎండ్ చేయడానికి ఫోన్ బంద్ చేయడం అతిగొప్ప మార్గమని వైద్యులు, పరిశోధకులు అంటున్నారు. ఒక పరిశోధన ప్రకారం కేవలం వారం రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల డిప్రెషన్ లక్షణాలు 24శాతం తగ్గాయని చెబుతున్నారు. అంతేకాదు.. ఆందోళన సమస్య 16.1 శాతం, నిద్రలేమి, నిద్రకు సంబంధించిన సమస్యలు దాదాపు 14.5 శాతం తగ్గాయట. కాబట్టి సోషల్ మీడియాకు వారం రోజులు దూరం ఉంటే ఇన్ని సమస్యలు మంత్రించినట్టు తగ్గుతాయని అంటున్నారు. సోషల్ మీడియా అంటే స్మార్ట్ ఫోన్, అందులో నెట్ కనెక్షన్.. ఇవి రెండూ దూరంగా ఉంటే చాలని అంటున్నారు.
సోషల్ మీడియా డిటాక్స్ ప్లాన్..
7రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం అనే ప్లాన్ ను దశల వారిగా ఈ కింది విధంగా ఫాలో కావచ్చు.
1రోజు..
సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉండాలో.. ఆత్మ పరిశీలన చేసుకుని.. ఆ తరువాత విషయాన్ని ఒక కాగితం మీద కొన్ని లక్ష్యాలు రాసుకోవాలి. దీనివల్ల ఎవరికి వారికే తాము సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉండాలి, దాని వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అనే విషయం అర్థం అవుతుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి తమకు తాము రెఢీ అవుతారు.
2వ రోజు..
సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి మంచి మార్గం నోటిఫికేషన్లను ఆప్ చేయడం. నోటిఫికేషన్ల వల్ల ఫోన్ ను పదే పదే తీయవలసి వస్తుంది. నోటిఫికేషన్లను ఆఫ్ చేయాలి. హోమ్ స్క్రీన్ మీద సోషల్ మీడియా యాప్ లను తీసేయాలి. వాటిని ఫోల్డర్ లలో ఉంచి యాప్ లను తెరిచే అవసరం తగ్గించాలి.
3వ రోజు..
రోజూ ఫోన్ చూస్తూ గడిపే సమయాన్ని కాస్తా మంచి అలవాట్ల కోసం వెచ్చించాలి. కొంతసేపు పుస్తకం చదవడం, వ్యాయామం, మంచి అభిరుచి, ఎప్పటినుండో నేర్చుకోవాలని అనుకున్న పనిని నేర్చుకోవడం, ఆర్ట్స్ క్రాఫ్ట్స్, తోటపని ఇట్లా ఏదైనా సరే.. సోషల్ మీడియాకు దూరంగా మనసును లాక్కెళ్లాలి.
4వ రోజు..
సోషల్ మీడియా నుండి బయటకు వచ్చి చుట్టూ ఉన్న పరిసరాలు, జరుగుతున్న పరిస్థితులతో మాత్రమే కనెక్ట్ అవుతూ ఉండాలి. చేసే ప్రతి పనిని మనసుతో ఆస్వాదిస్తూ చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మెదడు మానిటైజ్ అవుతుంది. మెదడు మీద సోషల్ మీడియా ఒత్తిడి మెల్లిగా తగ్గడం మొదలవుతుంది.
5వరోజు..
మానసికంగా మెరుగ్గా ఉండటానికి ద్యానం, శ్వాస వ్యాయామాలు బాగా సహాయపడతాయి. అందుకే రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయాలి. అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల ఎలా అనిపిస్తోంది, మనసు ఎలా ఫీలవుతోంది, ఏ పని తేలికగా అనిపించింది, ఏ పని కష్టంగా అనిపించింది మొదలైనవన్నీ ఒక జర్నలింగ్ రాసుకోవాలి. ఇది జరుగుతున్న మార్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
6వ రోజు..
సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటే ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపడం చాలా మంచిది. అది కూడా నేరుగా వ్యక్తులతో కలిసి సమయాన్ని గడపాలి. ఇది బంధాలను బలపరచడమే కాకుండా, డిప్రెషన్ వంటి భూతాన్ని పారద్రోలడానికి బంధాలు ఎంతగా సహకరిస్తాయో కూడా అర్థం చేసుకునేలా చేస్తుంది.
7వ రోజు..
వారంలో జరిగిన ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న మార్పును రివైండ్ చేసుకోవాలి. ఏ చిన్న రిలీఫ్ కనిపించినా చాలా గొప్ప ఫలితం సాధించినట్టే.. ఎందుకంటే ఒక్కసారి గెలుపు రుచి చూస్తే దానికోసం అలాగే కంటిన్యూ చేయాలని అనిపిస్తుంది. మెల్లిగా సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉండాలో అంత దూరం ఉంటూ కేవలం అవసరం కోసం మాత్రమే లిమిట్ గా సోషల్ మీడియా ఉపయోగించడం నేర్చుకుంటే డిప్రెషన్ భూతాన్ని తరిమి కొట్టేయవచ్చు.
*రూపశ్రీ.