కాళేశ్వరంతో కాంట్రాక్టర్లే బాగుపడ్డారు.. కవిత నోట కాంగ్రెస్ మాట

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై తన విమర్శల స్వరం పెంచింది. ఇప్పటి వరకూ కేవలం హరీష్ రావు, సంతోష్ లన టార్గెట్ చేసుకుంటూ తన విమర్శల వాణి వినిపించిన కవిత.. ఇప్పుడు తండ్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరంపైనా తన విమర్శలను సంధించారు. నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు. ఇప్పటి వరకూ కాళేశ్వరం నిరుపయోగం అనీ, అవినీతి సొమ్మలు వెనకేయడానికి మాత్రమే బీఆర్ఎస్ ఆ ప్రాజెక్టు చేపట్టి అంచనాలు పెంచుకుంటూ పోయి సొమ్ములు దండుకుందన్న విమర్శలు కాంగ్రెస్ నుంచే వచ్చాయి. ఇప్పుడు కవిత కూడా అదే వాణి, అదే బాణితో తన విమర్శలకు పదును పెట్టారు.  

తాజాగా శుక్రవారం కామారెడ్డిలో మాట్లాడిన కవిత కాళేశ్వరంతో కామారెడ్డి, నిజామాబాద్, బాన్సువాడలకు చుక్కనీరు వచ్చిన దాఖలాలు లేవన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాంట్రాక్టర్లు బాగుపడటానికే తప్ప రైతులకు, రాష్ట్ర వ్యవసాయానికీ దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని కుండబద్దలు కొట్టేశారు.  

 కాళేశ్వరం ప్రాజెక్టు కంటే జ‌మానాలో క‌ట్టించిన నిజాం సాగ‌రే ఎంతో నయమన్నారు. అయితే ఇప్పుడు అది మట్టి కూరుకుకోయి ఉందనీ, దానిని పూడిక తీయించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.  గ‌తంలో నిజాంసాగ‌ర్ ప‌ర్యాట‌కంగానూ ఎంతోబాగుండేద‌ని ఆ దిశగా కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. తానిప్పుడు కాళేశ్వ‌రంపై చేసిన ఈ వ్యాఖ్యలపై ఇక బీఆర్ఎస్ నేతలు  నోరేసుకుని ప‌డిపోతార‌న్న కవిత.. చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాలోని ఓ పంచ్ డైలాగ్ తో చురక వేశారు. 

ఇప్పుడు తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలకూ, ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన కవిత కాంగ్రెస్ రంగుల చీరకట్టడానికీ ముడి పెడుతూ పరిశీలకులు విశ్లేషణలకు పని చేప్పారు. ఆమె కాంగ్రెస్ కు చేరువ అవుతున్నారనడానికి కవిత తాజా వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు.  కాళేశ్వరంపై కాంగ్రెస్  విమర్శలనే బాజాప్తుగా తాజాగా కవిత కూడా చేశారు.  

ఇక ఇప్పుడు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై విమర్శలు చేయాల్సిన అవసరం లేని పరిస్థితిని కవిత తన వ్యాఖ్యలతో కల్పిస్తున్నారంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇక కవిత విమర్శలకు సమాధానం చెప్పాలంటూ కేటీఆర్, హరీష్, కేసీఆర్ లను నిలదీస్తే పరిపోతుందంటున్నారు.  పరిస్థితి చూస్తుంటే.. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ గూటికి చేరడానికి అట్టే సమయంపట్టేలా లేదని కూడా చెబుతున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu