15 నెలలు.. 5000 కిలోమీటర్లు.. జగన్ పాదయాత్ర 2.0.. నిజమేనా?

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవం అనదగ్గ పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. ఆ తరువాత ఈ 16 నెలల కాలంలోనూ ఇసుమంతైనా కోలుకోలేకపోయింది. పార్టీ క్యాడర్ జారిపోయింది. నేతలు పార్టీ కార్యక్రమాలకు మొహం చాటేస్తున్నారు. గతంలో అంటే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అయిన దానికీ కానిదానికీ నోరెట్టుకు పడిపోయి ఫైర్ బ్రాండ్ నేతల్లా గుర్తింపు పొంది జగన్ మన్ననలు పొందిన నేతలు ఇప్పుడు కలికానిక్కూడా కనిపించడం లేదు. ఇప్పుడు ఇప్పుడు మాజీ మంత్రులుఅంబటి రాంబాబు, పేర్ని నాని వంటి ఇద్దరు అతి కొద్ది మంది  మాత్రమే పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు.

అప్పుడప్పుడు సజ్జల మీడియా ముందుకు వచ్చి అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసి మళ్లీ  మౌనం వహిస్తున్నారు. అధికారంలో ఉండగా అడ్డగోలుగా వ్యవహరించి అవినీతికి పాల్పడిన పలువురు నేతలు కేసుల భయంతో బిక్కుబిక్కుమంటుండగా, ఇంకొందరు అవినీతి కేసులలో అరెస్టై రిమాండ్ ఖైదీలుగా కటకటాల వెనుక కాలక్షేపం చేస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీ పుంజుకోవాలంటే.. 2019 ఎన్నికలలో తన పార్టీ విజయానికి ప్రధాన కారణంగా ఉన్న పాదయాత్రనే మళ్లీ చేపట్టక తప్పదన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. అప్పట్లో జగన్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర కారణంగానే ఆయన నాయకత్వంలో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి రాగలిగింది. జగన్ ముఖ్యమంత్రి కాగలిగారనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రధాన కారణం అప్పట్లో పాదయాత్రతో ఆయన జనం మధ్యలో ఉండటమే. అయితే అధికారం చేజిక్కిన తరువాత జగన్ జనం ముఖం చూడటమే అరుదైపోయింది. అధవా ఎప్పుడైనా బయటకు వచ్చినా రోడ్డు కిరువైపులా పరదాలు కట్టించుకుని జనం తనకు కనబడకుండా, జనానికి తాను కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

దీంతో ఆయన జనానికి దూరం అయ్యారు. దీనికి తోడు ఐదేళ్ల పాలనా కాలంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించడమే కాకుండా.. అంతకు ముందు ఐదేళ్లూ చంద్రబాబు పాలనలో  జరిగిన అభివృద్ధి ఆనవాలును కూడా చెరిపేయాలని ప్రయత్నించడంతో వైసీపీ ఘోర పరాజయాన్ని అందుకుంది. అందుకే 2029 ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడానికి తాను జనంలోకి వెళ్లడమొక్కటే మార్గమని జగన్ భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ సారి గతం కంటే ఎక్కువ దూరం నడిచి ఎక్కువ మంది జనాలకు చేరువ కావాలని జగన్ భావిస్తున్నారు. 

ఇదే విషయాన్ని జగన్ కు సన్నిహితుడూ, ఒక విధంగా చెప్పాలంటే పార్టీ అధికార ప్రతినిథిగా చెలామణి అవుతున్న  వెంకటరెడ్డి మీడియాకు చెప్పారు. ఈ సారి జగన్ పాదయాత్ర 15 నెలల పాటు సాగుతుందనీ, అలాగే గత రికార్డును బద్దలు కొడుతూ ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 5వేల కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేస్తారనీ వెల్లడించారు.  అయితే ఇక్కడే పరిశీలకులు గతంలో పాదయాత్ర సందర్భంగా జగన్ నేలవిడిచి సాము చేసిన చందంగా హామీలు గుప్పించారనీ, అయితే అధికారపగ్గాలు చేపట్టిన తరువాత తన అహంకారపూరిత వ్యవహార శైలితో అన్ని వర్గాల ప్రజలనూ దూరం చేసుకున్నారని అంటున్నారు. ఇప్పుడు మరోసారి పాదయాత్ర అంటూ ఆయన జనం ముందుకు వచ్చినంత మాత్రాన జగన్ ను జనం నమ్మే పరిస్థితి ఉండదంటున్నారు. చూడాలి మరి జగన్ ఒక వేళ నిజంగా పాదయాత్రతో జనం ముందుకు వస్తే వారెలా రిసీవ్ చేసుకుంటారో?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu