సర్ పై చర్చకు విపక్షాల పట్టు.. సభలో గందరగోళం.. వాయిదా

పార్లమెంట్  ఉభయ సభలూ సోమవారం (డిసెంబర్ 1) ప్రారంభమయ్యాయి.  లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభం కాగానే  ఇటీవల మరణించిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి.  ఈ సమావేశాలలో  14 కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంటే,    ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు సంసిద్ధమయ్యాయి.  ఈ నేపథ్యంలో ఈ సారి పార్లమెంటు శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉంది.  లోక్ సభలో   ఓటర్ల జాబితా సవరణ సర్ పై  చర్చించాలంటూ  కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఇక పోతే..  ఉపరాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైన రాధాకృష్ణన్   రాజ్యసభ సమావేశాలకు తొలి సారిగా అధ్యక్షత వహిస్తున్నారు.    ఈ రోజు ఆరంభమైన పార్లమెంటు సమావేశాలు 15 రోజుల పాటు కొనసాగుతాయి.  

ఇలా ఉండగా పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ విపక్షలపై విమర్శలు గుప్పించారు.  సభలో నినాదాలు చేసి, సభా కార్యక్రమాలను అడ్డుకుని విలువైన సభా సమయాన్ని వృధా చేయవద్దంటూ విపక్షాలకు సూచించారు. నినాదాలు చేయడానికి బయట చాలా వేదికలు ఉన్నాయన్న ఆయన, పార్లమెంటును  విధాన రూపకల్పనకు పరిమితం చేయాలన్నారు. నినాదాలతో సభను అడ్డుకుని విపక్షాలు డ్రామా అడుతున్నాయని విమర్శించారు.  పార్లమెంటు  సమావేశాలు కేవలం సంప్రదాయం కాదనీ, దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపే ప్రయత్నాలకు నవ శక్తిని ఇచ్చే మార్గమని అన్నారు.   కాగా  వయనాడ్ ఎంపీ ప్రియాంక వాద్రా మోడీ వ్యాఖ్యలకు లోక్ సభలో గట్టి రిటార్డ్ ఇచ్చారు. పార్లమెంటు ప్రజా సమస్యలను చర్చించే వేదిక అని పేర్కొన్న ఆమె..  సభలో  చర్చకు అవకాశం ఇవ్వకుండా  అధికార పక్షమే నాటకాలు ఆడుతోందని విమర్శించారు. 

ఇలా ఉండగా లోక్ సభ ఇలా ప్రారంభమై అలా కొద్ది సేపటికే వాయిదా పడింది. మొదటి రోజే సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సర్ పై చర్చకు కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు నిరసనకు దిగాయి.  సభ్యుల నినాదాలతో సభలో ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu