Publish Date:Mar 20, 2019
Publish Date:Mar 11, 2019
Publish Date:Mar 6, 2019
Publish Date:Mar 2, 2019
Publish Date:Feb 28, 2019

EDITORIAL SPECIAL
  ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అధినేత వైస్ జగన్ బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి సంచలనం రేపుతోంది. ఆయన మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది. మొదట ఆయన తెల్లవారు జామున బాత్ రూమ్ కి వెళ్లి గుండె పోటుతో అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారని వార్తలొచ్చాయి. కాసేపటికి ఆయన మృతదేహం రక్తం మడుగులో పడి ఉందని.. ఆయన తలకి, చేతులకి గాయాలు ఉన్నాయని.. ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ పోలీసులు కూడా వివేకాది హత్యే అని ప్రాధమికంగా నిర్దారించారు. వివేకానంద రెడ్డిది సహజ మరణం కాదని, ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా నిర్థారణ అయిందని పోలీసులు వెల్లడించారు. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నట్లు, పదునైన ఆయుధంతో వివేకా తల, శరీరంపై దాడి చేసినట్లు వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికను బట్టి చూస్తే వివేకా హత్యకు గురయ్యారని అర్ధమవుతోంది. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన రక్తపు మడుగులో పడి ఉంటే.. ఆయనది సహజం మరణమని, ఆయన గుండెపోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేశారు?. అసలు తొలుత అలా ఎవరు ప్రచారం చేశారు? అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది?. వివేకా సౌమ్యుడని, వివాదాలకు దూరంగా ఉంటారని పేరుంది. మరి అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికుంది?. ఆయన హత్య వెనుక రాజకీయ కోణాలు, రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతకి స్వయానా బాబాయ్ అయిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. ఆయన మృతి రాజకీయ కోణం సంతరించుకుంది. ఇప్పటికే వివేకా మృతిపై కొందరు వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిమీద ఒకరు అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు వివేకా మృతిపై విచారణకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ నివేదిక వస్తే కానీ వివేకా మృతి వెనుక రాజకీయ కుట్ర ఉందో, మరేదైనా కక్ష ఉందో తెలీదు.
  2019-20 సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఎన్ని నిధులు వస్తాయో స్పష్టంగా తెలియదన్నారు. అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలోనూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతామని వెల్లడించారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆరవ బడ్జెట్‌ అని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలు సహకారం అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు గుజరాత్‌, కేరళ అభివృద్ధి గురించే దేశవ్యాప్తంగా చర్చ జరిగేదని, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరుగుతోందని అన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. రైతుల్లో నిరాశను తొలగించామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ రైతులకు కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. 2018 డిసెంబరు 11వ తేదీలోగా తీసుకున్న రైతు రుణాలు రూ.లక్ష వరకూ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయాభివృద్ధి కోసం రూ.20,107కోట్లు కేటాయించారు. రైతు బంధు సాయం కింద ఎకరానికి రూ.10వేలు అందిస్తుండగా, ఇందుకోసం రూ.12వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతు బీమా కోసం రూ.650కోట్లు కేటాయించిన కేసీఆర్‌ ప్రభుత్వం.. నీటిపారుదల శాఖకు రూ.22,500కోట్లు కేటాయించింది. తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు: వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు రైతు బంధుకు రూ.12 వేల కోట్లు రైతు బీమా రూ.650 కోట్లు నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు ఎస్సీల అభివృద్ధికి రూ.16,581 కోట్లు ఎస్టీల అభివృద్ధికి రూ.9,827 కోట్లు మైనార్టీల సంక్షేమానికి రూ.2004 కోట్లు ఈఎన్‌టీ, దంత పరీక్షలకు రూ.5,536 కోట్లు ఆసరా పెన్షన్లకు రూ.12,067 కోట్లు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ.1450 కోట్లు రూపాయికి కిలో బియ్యం పథకానికి రూ.2,744 కోట్లు దివ్యాంగుల పెన్షన్లకు రూ.12వేల కోట్లు ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు
  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేతల జంపింగులే హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే నేతలు వరుసపెట్టి టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. నేతల జంపింగులపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన వారే పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరి పనితీరు ఏంటో చంద్రబాబుకు తెలుసునని చెప్పుకొచ్చారు. పార్టీలో, చంద్రబాబుతో విభేదాలు ఉంటే ఎప్పుడో వెళ్లి ఉండేవారని, ఎన్నికలకు రెండు నెలల ముందు కాదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 150 సీట్లలో గెలిచి చంద్రబాబు సీఎం అవుతారని లోకేష్ ధీమా వ్యక్తం చేసారు. నాలుగేళ్ల 10 నెలలు ప్రయాణం చేసి, ఇప్పుడు బాబు మీద విమర్శలు చేయడంలో పరమార్ధాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నిన్న మొన్నటిదాకా జగన్ ను తిట్టి, ఇప్పుడు ఆయన దగ్గరకే వెళ్లడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నేతలు పార్టీలు మారినా ఏమీ కాదని.. సంక్షేమం, అభివృద్ధే టీడీపీకి అండగా నిలుస్తాయని లోకేష్ స్పష్టం చేసారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు 30 రోజుల ముందు పొత్తులపై చంద్రబాబు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఏపీ ఎన్నికల బరిలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ మరియు కాంగ్రెస్ దిగనున్నాయి. టీడీపీ, వైసీపీల పొత్తు అసలు ఆప్షనే లేదు. ఇక టీడీపీ, బీజేపీలు గత ఎన్నికల్లో కలిసి పనిచేసినా.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాబట్టి బీజేపీతో పొత్తు ఉండే అవకాశం లేదు. జనసేన విషయానికొస్తే.. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉండి టీడీపీకి మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, కేవలం వామపక్షాలతో కలిసి నడుస్తామని స్పష్టం చేసారు. ఇప్పటికైతే జనసేనతో పొత్తు కూడా కష్టమే. మరి ఎన్నికల ముందు ఏదైనా అద్భుతం జరిగితే చెప్పలేం. ఇక మిగిలింది కాంగ్రెస్. మిగతా పార్టీలతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి.. అదేవిధంగా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే తెలంగాణలో వచ్చిన చేదు ఫలితాల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ లు ఏపీలో ఎంతవరకు కలిసి పనిచేస్తాయో కూడా ఆలోచించాలి. కొందరు టీడీపీ నేతలు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాం కానీ రాష్ట్రంలో మాత్రం విడిగా పోటీ చేస్తేనే టీడీపీకి లాభమని అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు లోకేష్ ఏమో టీడీపీ, ఇతర పార్టీలతో పొత్తు అంటున్నారు. దీంతో అసలు టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అంటూ చర్చలు మొదలయ్యాయి. చూద్దాం మరి ఎన్నికల ముందు టీడీపీ పొత్తుల విషయంలో ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తుందో.
ALSO ON TELUGUONE N E W S
  మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సారీ... ఇకపై సాయిధరమ్ తేజ్ అనకూడదు ఏమో? సాయితేజ్ అని అనాలేమో! ఎందుకంటే... మెగా మేనల్లుడు పేరు మార్చుకున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన 'చిత్రలహరి' టైటిల్ కార్డ్స్ లో అతడి పేరు సాయితేజ్ అని పడుతుంది. ఆల్రెడీ విడుదల చేసిన తొలి పాట 'పరుగు పరుగు'లో అలాగే ఉంది. బహుశా... సెంటిమెంట్ కావొచ్చు. 'చిత్రలహరి', పేరు మార్పు విషయాలు పక్కన పెడితే... మారుతి దర్శకత్వంలో ధలమ్-లకుల్ జోడీ మరోసారి సందడి చేయనుందని టాక్. ఇంతకీ ధలమ్ ఎవరు? లకుల్ ఎవరు? అనుకుంటున్నారా? ధలమ్ అంటే సాయిధరమ్ తేజ్. అతణ్ణి రకుల్ అలాగే పిలుస్తుంది. లకుల్ అంటే రకుల్ ప్రీత్ సింగ్. ఆమెను సాయిధరమ్ తేజ్ అలాగే పిలుస్తాడు. వీరిద్దరిదీ 'ల' భాష. ఆల్రెడీ 'విన్నర్'లో జంటగా నటించారు. మరోసారి ఈ జంటను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మారుతి అనుకుంటున్నారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. సాయిధరమ్ తేజ్ కు 'సుప్రీమ్', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' వంటి హిట్స్ ఆయన ఇచ్చారు.
రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు ఓ టెన్షన్ తీరింది. ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా విడుదల అయితే ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, అందువల్ల సినిమాను విడుదల కాకుండా ఆపాలని దాఖలు చేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దాంతో వర్మకు, 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు ఓ టెన్షన్ తీరింది. సినిమా విడుదలకు రూట్ క్లియర్ అయ్యింది. అయితే... మరో టెన్షన్ ఉంది. సినిమా సెన్సార్ ఇంకా పూర్తి కాలేదు. అందుకని, ఈ నెల 22న విడుదల చేయాలనుకున్న సినిమాను కాస్తా 29కి వాయిదా వేశారు వర్మ. బుధవారం సెన్సార్ సభ్యులు సినిమాను చూడనున్నారు. చూసి ఏయే సన్నివేశాలకు కత్తెర వేస్తారు? ఏయే సన్నివేశాలను సినిమాలో ఉంచుతారు? అనేది చూడాలి. సెన్సార్ విషయంలో లొల్లి లొల్లి జరిగిన సంగతి తెలిసిందే. సినిమా చూడకముందే ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి, ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసం సెన్సార్ సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వర్మ మండిపడ్డారు. తరవాత రాజీ కుదిరిందనుకోండి. అయితే.. వర్మ తీసింది ఉన్నది ఉన్నట్టుగా యధాతథంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా? ఒకవేళ సెన్సార్ కత్తెరలు వేస్తే... వర్మ ఎలా స్పందిస్తారు? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెన్సార్ అడ్డు తగిలితే కోర్టుకు వెళ్ళడానికి వర్మ సిద్ధమవుతున్నారట.
మ‌ల్టీ స్టార‌ర్ మూవీస్ లో న‌టించేందుకు వెంక‌టేష్ ఆస‌క్తి చూపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల వెంకీ, వ‌రుణ్ తేజ్ క‌ల‌యిక‌లో మ‌ల్టీస్టార‌ర్ గా వ‌చ్చిన `ఎఫ్ 2` చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇక ఈ ఇన్ స్పిరేష‌న్ తో మ‌రిన్ని సినిమాలు చేయ‌డానికి వెంకీ ఉత్సాహం చూపిస్తున్నాడు. ప్ర‌జంట్ నాగచైత‌న్య , వెంక‌టేష్ క‌లిసి `వెంకీ మామ‌` లో న‌టిస్తున్నారు. అయితే వెంక‌టేష్ మ‌రో క్రేజీ మ‌ల్టీస్టార్ సినిమాలో న‌టించేందుకు ఓకే చెప్పిడ‌ని స‌మాచారం అందుతోంది.  అవును మాస్ మ‌హారాజ్ ర‌వితేజ తో క‌లిసి వెంక‌టేష్ ఒక మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు ఓకే చెప్పాడ‌ట‌. వెంకీ కామెడీ టైమింగ్, మాస్ రాజా ఎన‌ర్జిటిక్ ప‌ర్ఫార్మెన్స్ క‌లిస్తే....అంతే గా అంతేగా అనాల్సిందే ప్రేక్ష‌కులు అంటున్నారు సినీ పండితులు. అయితే ఈ చిత్రాన్ని వీరుపోట్ల ద‌ర్శ‌క‌త్వంలో అనిలీ సుంక‌ర నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే క‌థా చ‌ర్చ‌లు ప్రారంభం అయిన‌ట్లు ఇద్ద‌రు హీరోలు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తే మాత్రం ఇద్ద‌రి చేసే హంగామా చూడ‌టానికి వెండి తెర స‌రిపోద‌ని చెప్పాల్సిందే.
                ఒక మధ్య తరగతి కుటుంబంలో ...ఎక్క‌డో  ఒక మారుమూ పల్లెటూరు లో పుట్టి  తెలుగు ప్రేక్ష‌కుల‌తో  43 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్నికొన‌సాగిస్తోన్న హీరో  క‌లెక్ష‌న్ కింగ్  మోహ‌న్‌బాబు.  ఆయ‌న జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి.   జ‌యాప‌జ‌యాలున్నాయి.  అనుభ‌విస్తోన్న అష్టైశ్వ‌ర్యాల వెనుక  అష్ట క‌ష్టాలూ ఉన్నాయి.   ‘‘నా రూటే సెపరేటు’’ అంటూ ఆయ‌న ఓ సినిమాలో చెప్పిన డైలాగ్.... ఆయ‌న వ్య‌క్తిత్వానికీ, మ‌న‌స్త‌త్వానికీ  వ‌ర్తిస్తుంది అన‌డంలో సందేహం లేదు.  తనదైన వ్యక్తిత్వాన్ని నిుపుకోవటానికి, తనదైన ఉనికిని చాటుకోవటానికి ప్రయత్నం చేసే వాళ్ల రూటు ఎప్పుడూ సెపరేటుగానే ఉంటుంది. ఆ ప్రయత్నం చేశా డు  కాబట్టే  త‌న  జీవితంలోని ప్రతి అడుగులో  ఒక విభిన్న‌త, విజ‌యం, అప‌జ‌యం   కనిపిస్తుంది.     ధైర్యము- పట్టుదల‌ రెండూ క‌లగ‌లిసిన హీరో అంటే మోహ‌న్ బాబు.    గెలుపు  నుండే కాదు.. ఓటమి నుండి కూడా పాజిటివ్‌ ఎనర్జీ ని జనరేట్‌ చేసుకోవచ్చు అనటానికి  ఆయ‌న జీవితమే ఒక ఎగ్జాంపుల్,  ప్లాట్‌ ఫారం నుండి పార్లమెంటు దాకా, డ్రిళ్ళు మాస్టర్‌ నుండి విద్యాయ వ్యవస్థాపకుడు దాకా, 560 చిత్రాల నటుడిగా, 75 చిత్రా నిర్మాతగా ఆయ‌న సినీ ప్ర‌స్థానం సాగుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న త‌మిళంలో కూడా ఇటీవ‌ల సినిమాలు చేయ‌డానికి సైన్ చేసాడు. ముక్కు సూటిగా మాట్లాడే ఆయ‌న తత్వం , వ‌ర్క్ ప‌ట్ల ఆయ‌న‌కున్న డెడికేష‌న్ వ‌ల్లే  ఆయ‌న అన్ని స‌క్సెస్ లు అందుకోగ‌లిగారు. ఆయ‌న చేసిన సినిమాలు, అందుకున్న విజ‌యాల‌తో టాలీవుడ్ లో క‌లెక్ష‌న్స్ కింగ్ గా మారాడు. ఆయ‌న డైలాగ్ డిక్ష‌న్ తో డైలాగ్ కింగ్ కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆయ‌న ఒక్కో సినిమాలో ఒక్కో మేన‌రిజం చూపిస్తూ త‌న‌కు తానే సాటి అనిపించున్నాడు. ఇలాగే మ‌రిన్ని పుట్టిన రోజులు జ‌ర‌పుకోవాల‌ని మోహ‌న్ బాబుకి  బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలుపుతోంది తెలుగువ‌న్ డాట్ కామ్.
  ఎవరు? 'బిగ్ బాస్' సీజన్ 3కి హోస్ట్ ఎవరు? ఫస్ట్ సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. అతణ్ణి తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా బుల్లితెర వీక్షకులను ఆకట్టుకున్నాడు. రెండో కుమారుడు భార్గవ్ రామ్ జన్మించిన సమయంలో కుటంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని 'బిగ్ బాస్' రెండో సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ చేయలేదు. అతడి స్థానంలో నాని వచ్చాడు. నేచురల్ స్టార్ ఇమేజ్ కలిగిన నాని, అంతే నేచురల్ గా షోను రక్తి కట్టించాడు. అయితే... కౌశల్ ఆర్మీ కారణంగా నాని చెడ్డపేరు మూటకట్టుకోవలసి వచ్చింది. అదంతా గతం! ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 3కి ఎవరు హోస్ట్ చేస్తారు? అనేది క్వశ్చన్. ముందు ఎన్టీఆర్ పేరు వినిపించింది. 'స్టార్ మా' యాజమాన్యం ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళింది. రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఆఫర్ చేసిందట. యంగ్ టైగర్ మరోసారి హోస్ట్ చేయడం దాదాపు ఖాయమే అనుకున్నారంతా. అయితే... రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' చిత్రీకరణ జరుగుతున్న కారణంగా 'బిగ్ బాస్'లో హోస్ట్ చేయలేనని ఎన్టీఆర్ చెప్పేశాడట. దాంతో ఇప్పుడు నాగార్జున పేరు వినిపిస్తోంది. మన్మధుణ్ణి ఒప్పించే పనిలో 'స్టార్ మా' యాజమాన్యం నిమగ్నమైంది. ఒకప్పుడు 'మా' యజమానుల్లో ఒకరైన నాగార్జునకు, ప్రస్తుత యాజమాన్యంతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఆల్రెడీ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో ఫస్ట్ సీజన్ కి హోస్ట్ చేశారు. 'బిగ్ బాస్ 3'కి హోస్ట్ చేసే అవకాశాలను కొట్టి పారేయలేం.
  ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్.. వరుసపెట్టి పలువురు నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ చేరికలు చూసి వైసీపీ శ్రేణులు ఆనందపడుతున్నారు. అయితే వారి చేరిక వల్ల వైసీపీకి కొత్తగా ఒరిగేది ఏముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే దాదాపు వారంతా గతంలో వైసీపీని వీడి, జగన్ మీద తీవ్ర విమర్శలు చేసిన వారే. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి, తర్వాత పార్టీని వీడి.. జగన్‌ మీద విమర్శలు గుప్పించిన వారు వరుసగా ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. వీరిలో కొందరు ఎన్నికలకు ముందుగానే పార్టీ ఫిరాయించిన వారున్నారు. కొందరు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఫిరాయించిన వారున్నారు. గతంలో వైసీపీని వీడి తనమీద విమర్శలు చేసిన వారిని జగన్ ఏరికోరి మరి పార్టీలో చేర్పించుకుంటున్నారు. రీసెంట్ గా వైసీపీలో చేరిన దేవినేని చంద్రశేఖర్, రఘురామకృష్ణంరాజు, దాడి వీరభద్రరావు లాంటి వారు ఆ కోవలోకే వస్తారు. మంత్రి దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్.. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. జగన్ టికెట్ ఇస్తారేమో అని ఆయన ఆశపడ్డారు. కానీ ఇవ్వలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో.. అనంతరం మళ్లీ ఆయన సోదరుడు ఉమాకి దగ్గరయ్యారు. ఆ సమయంలో.. ఆయన జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్ పంచకు చేరారు. జగన్‌ కూడా హ్యాపీగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక రఘురామకృష్ణంరాజు అయితే గతంలో జగన్ ని నపుంసకుడు అంటూ హద్దు దాటి విమర్శలు చేశారు. తనని వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని కూడా జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించేశారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా అంతే. ఆయన వైసీపీకి రాజీనామా చేసినప్పుడు.. జగన్‌ వ్యక్తిత్వం పై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. జగన్ పై విమర్శల దాడి చేసిన ఆయన చాలా కాలం పాటు ఏ పార్టీలోనూ చేరలేదు. ఈ మధ్య టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలొచ్చాయి. కానీ టికెట్ విషయంలో టీడీపీ సానుకూలంగా స్పందించక పోవడంతో వెనకడుగు వేశారు. ఇక ఎన్నికల సమయం వచ్చే సరికి.. మళ్లీ వైసీపీ వైపే చూశారు. ఇలా తనను విమర్శించిన వారిని.. జగన్ పిలిచి మరీ పార్టీలో చేర్చుకోవడంతో.. ఆయనకు ఇంతకు మించిన నేతలు దొరకడం లేదా? వారి చేరికల వల్ల జగన్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  'రాజకీయ నాయకుల మధ్య పార్టీల సిద్ధాంతపరమైన వ్యతిరేకతే తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోరు.' ఇది ఒకప్పటి మాట. ఈ తరంలో కొందరు నేతలు హద్దు దాటి వ్యక్తిగతంగా విమర్శలు చేసున్నారు. అందులో ముందువరుసలో ఉంటారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా విజయసాయి.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మీద హద్దు దాటి విమర్శలు చేస్తున్నారు. ఆయన కూడా విమర్శల పాలవుతున్నారు.   కొండవీడులో రైతు కోటయ్య మృతికి టీడీపీ, ఏపీ పోలీసులే కారణమని వైసీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే రైతు కులాన్ని ప్రస్తావిస్తూ జగన్ ట్వీట్ చేసారు. దీనిపై స్పందించిన లోకేష్.. జగన్ కులరాజకీయాలు చేస్తున్నారని, శవాలపై పేలాలు ఏరుకునే జగన్ మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారని విమర్శించారు. అయితే ఈ విమర్శలకు విజయ సాయి ఘాటు రిప్లై ఇచ్చారు. 'లోకేష్.. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని ట్వీట్ పెట్టావ్. ఇంతకీ శవం ఎవరు. నువ్వా? మీ నాన్నా?' అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలు చేయాలి గానీ.. మరీ ఇలా బ్రతికున్నవాళ్లను శవాలంటూ వారి చావుని కోరుకోవడం ఏంటని పలువురు తప్పుపట్టారు. కొందరైతే గతంలో జగన్ నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబుని నడిరోడ్డు మీద ఉరి తీయాలంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అధినేత బాటలోనే మిగతా నేతలంతా నడుస్తున్నారు. మీ పార్టీ నేతలు ఎదుటి వ్యక్తుల చావుని కోరుకుంటున్నారు, మీరేం ప్రజా నాయకులు అసలు? అంటూ విమర్శిస్తున్నారు. అయినా విజయ సాయి వ్యక్తిగత విమర్శలు ఆపలేదు. తాజాగా లోకేష్ బాడీ గురించి హద్దు మీరి కామెంట్స్ చేసారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసిపోయాయని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్నీ లోకేష్ ట్విట్టర్ లో వ్యంగంగా ట్వీట్ చేసారు. 'ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు.' అని ట్వీట్ చేసారు. అయితే దీనికి కౌంటర్ గా విజయ సాయి లోకేష్ బాడీ గురించి కామెంట్స్ చేసారు. 'లోకేష్.. నీకు జగన్ గారిలోనూ కేసీఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని వ్యగంగా ట్వీట్ చేసావు. మోడీ సంగతి తర్వాత ఆలోచిద్డువులే.. ముందు నీ బాడీ, ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో.మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.' అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నేతలు హుందాగా విమర్శలు చేయాలి, తమపై వచ్చిన విమర్శలను హుందాగా తిప్పికొట్టాలి. అంతేకాని ఇలా బాడీ, మైండ్ గ్యారేజ్ లో చూపించుకో, మతిస్థిమితం లేదంటూ హద్దు దాటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి విజయ సాయి ఇప్పటికైనా తన తీరు మార్చుకొని హుందాగా విమర్శలు చేస్తారో లేక ఎన్నికలు వస్తున్నాయిగా అని ఇంకాస్త డోస్ పెంచి విమర్శలు పాలవుతారో చూడాలి.
  వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ ఇస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తే మా పార్టీకి ఇబ్బంది అని టీడీపీ, వైసీపీ పార్టీలు అనుకునే అవకాశముందా?. అబ్బే అసలే ఛాన్సే లేదు అంటారా?. కానీ వైసీపీ ఎందుకో కాంగ్రెస్ ని చూసి ఉలిక్కిపడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో బస్సు యాత్రకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్‌ బస్సులను వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకొని నల్లజెండాలతో నిరసన తెలిపారు. ‘కాంగ్రెస్ గో బ్యాక్’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి భరోసాయాత్ర చేసే హక్కు లేదంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. భరోసా యాత్ర పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కాంగ్రెస్ యాత్రను వైసీపీ నేతలు అడ్డుకోవడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవలేదు. అయితే ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేకహోదాని ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇస్తోంది. ఇప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీ ప్రత్యేకహోదా ఫైల్ మీద పెడతామని పలుసార్లు స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ మీద విభజన కోపం కాస్త తగ్గింది. అదీగాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హోదా విషయంలో మొండిచెయ్యి చూపింది. దీంతో హోదా రావాలంటే కాంగ్రెస్సే మనకున్న ఏకైక మార్గం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. హోదా హామీతో కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజలు కాస్త సానుకూలంగా స్పందిస్తుండటంతో.. ప్రజల్లోకి వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని భావించిన కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర చేపట్టింది. అదేవిధంగా నిన్న ఏపీ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. మోదీ మాట ఇచ్చి తప్పిన తిరుపతి సాక్షిగానే ఏపీకి హోదా ఇచ్చి తీరుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఈరోజు బస్సు యాత్రలో మరింత ఉత్సాహంతో పాల్గొన్నారు. అయితే వైసీపీ నేతలు యాత్రని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఏపీకి హోదా ఇస్తానంటున్న కాంగ్రెస్ బస్సు యాత్రని అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీకి ఏమొచ్చింది? అంటే కాంగ్రెస్ వల్ల.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. అందుకే వైసీపీ ఉలిక్కిపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న వైసీపీ ఓటు బ్యాంకంతా ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంకే.. మరి ఇప్పుడు హోదా హామీతో కాంగ్రెస్ కాస్తోకూస్తో బలపడి ఎంతోకొంత ఓట్లు చీలిస్తే వైసీపీకి నష్టమేగా? అందుకే వైసీపీ కాంగ్రెస్ బస్సుకి బ్రేకులు వేయాలని చూస్తుందట. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసీటైనా గెలుస్తుందో లేదో తెలీదు కానీ.. ఎన్నికలకు ముందే ఓట్లు చీలుస్తుందేమో అని వైసీపీలో భయం కలిగేలా చేసింది. చూద్దాం మరి హోదా హామీతో ఏపీలో కాంగ్రెస్ ఎంతలా బలపడుతుందో.
  ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీ, అధికార పార్టీ టీడీపీని ఇబ్బంది పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పోలీసుశాఖ పదోన్నతులు, చింతమనేని వీడియో, రైతు కోటయ్య మృతి.. కాదేదీ టీడీపీని విమర్శించడానికనర్హం అంటూ కొత్త కొత్త టాపిక్స్ తో టీడీపీ మీద ఆరోపణలు, విమర్శలు చేస్తుంది. తాజాగా వైసీపీ పరోక్షంగా మరో టాపిక్ తో టీడీపీని టార్గెట్ చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య డీల్ కుదిరింది అంటూ  జగన్ కి సంబంధించిన పత్రికలో ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. ముసుగులో స‌ర్దుబాటు అంటూ ఒక క‌థ‌నం ప్ర‌చురించారు. దాని సారాంశం ఏంటంటే.. సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ కళ్యాణ్ ల మ‌ధ్య ర‌హస్య ఒప్పందం కుదిరిపోయింద‌ట‌, సీట్ల స‌ర్దుబాటు కూడా జ‌రిగిపోయిందట‌! అంతేకాదు.. ఈ మ‌ధ్య చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు ఓ ర‌హ‌స్య స్థ‌లంలో భేటీ అయ్యార‌నీ, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ ఈ భేటీకి ఏర్పాట్లు చేశారంటూ రాశారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, ఎన్నికలకు ఎలా వెళ్ళాలి వంటి అంశాలు చర్చించారట. జనసేనకు 25 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చేలా డీల్ కుదిరిందట. అంతేనా ‘ఇన్నాళ్లూ తిట్టుకొని ప్రజల ముందుకు వెళ్లాం. ఇప్పుడు జనం  ముందుకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లగలుగుతాం? ఇప్పటికిప్పుడు కలసి పోటీ చేస్తామంటే ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఏం చెప్పి నమ్మించగలం?’ అని ప్రధానంగా చర్చించారంటూ రాసుకొచ్చారు. మొత్తానికి 2014 లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్.. తరువాత టీడీపీకి దూరమై విమర్శలు చేసారు. ఈమధ్య చంద్రబాబుతో మళ్ళీ డీల్ కుదరడంతో విమర్శలు తగ్గించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారు అని ఆ క‌థ‌నం సారాంశం. మరి పవన్ కళ్యాణ్ ఏమో ఎవరితో పొత్తులుండవు.. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో మాత్రమే కలిసి పనిచేస్తాం అన్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేసి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు ఆయన సోదరుడు నాగబాబు యూట్యూబ్ లో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ పత్రికలో వచ్చిన కథనం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.  
  అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు బాటలోనే.. కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అనారోగ్యం కారణంగా తాను రాబోయే ఎన్నికల్లో పోటీచేయడం లేదంటూ ప్రకటించిన నర్సింహం.. ఆయన భార్య వాణికి టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. కీలకమైన జగ్గంపేట టీడీపీ టికెట్ తన భార్యకు ఇవ్వాలని చంద్రబాబుకి విన్నవించడం ద్వారా నర్సింహం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి ఇప్పటికే టీడీపీ టికెట్ ఖరారైనట్టు సమాచారం ఉంది. ఇది తెలిసి కూడా నర్సింహం టికెట్ అడగడం పార్టీని వీడుతున్నానంటూ చెప్పుకోవడానికి కారణం కోసమేననే వాదన ఉంది. జగ్గంపేట టికెట్ ఇవ్వకపోతే.. వైసీపీలోకి వెళ్లిపోవాలని తోట నర్సింహం భావిస్తున్నట్లు సమాచారం. జగ్గంపేట టికెట్ ను వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి, ఆ తరువాత టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూకే టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తుండగా, ఈ విషయం తెలిసి కూడా నర్సింహం ఇదే స్థానాన్ని ఆశించడం వెనుక ఆయన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన, కారణం చెప్పుకోవడానికే జగ్గంపేట టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రిగానూ పనిచేసిన ఆయన, ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచారు. తాజాగా, చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరనుండటంతో తోట నర్సింహానికి సీటు లభించే పరిస్థితి లేదు. అందుకే ఆయన పోటీకి దూరంగా ఉండి.. టీడీపీలో తన భార్యకైనా టికెట్ లభిస్తే, పార్టీలో ఉండాలని, లేకుంటే మరో పార్టీలోకి మారాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తోట నర్సింహం వైసీపీలో చేరినా.. జగ్గంపేట టికెట్ హామీ లభించడం కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే జ్యోతుల చంటిబాబు ఆ నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. జగన్ టికెట్ కూడా ఆయనకే ఖరారు చేసినట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో తోట నర్సింహం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
  వైసీపీ అధినేత వైఎస్ జగన్.. 'సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వరు, ఎవరి మాట వినరు, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతారు' అని కొందరు నేతలు ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ ఆరోపణల్లో నిజమెంతో తెలీదు కానీ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ కి సంబంధించి ఇలాంటి వార్తే ఒకటి తాజాగా తెరమీదకు వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులతో.. నువ్వేమైనా పోటుగాడివి అనుకుంటున్నావా? అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారట. రామచంద్రాపురం ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్దమయ్యారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తోటా వైసీపీలో చేరాలంటే తనకి కాకినాడ ఎంపీ టికెట్, తమ కుమారుడికి రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. ఇదే విషయంపై వైసీపీ నేత విజయసాయి రెడ్డితో తోటా చర్చించగా.. ఒక్క సీటు మాత్రమే ఇస్తామని, రెండో సీటు కష్టమని విజయసాయి చెప్పారట. దీనికి బదులిస్తూ.. రెండ్లు సీట్లు ఇస్తేనే వైసీపీలో చేరతానని తోటా తెగేసి చెప్పడంతో విజయ సాయికి ఏం చేయాలో తెలియక జగన్ తో ఫోన్ మాట్లాడించారట. జగన్ తోటాతో ఫోన్లో మాట్లాడుతూ.. 'అన్నా ఒక్క సీటిస్తాం. అది నీకా? మీ అబ్బాయికా? అన్నది మీరే తేల్చుకోండి. రెండో సీటు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని' చెప్పారట. దానికి తోటా స్పందిస్తూ.. రెండు సీట్లిస్తేనే వైసీపీలో చేరతా అన్నారట. ఇంకేముంది జగన్ కి కోపం కట్టలు తెంచుకొని తోటా మీద ఫైర్ అయ్యారట. 'నువ్వు ఏమన్నా పోటుగాడివి అనుకుంటున్నావా? చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికే నీకు సీటు ఇస్తానంటున్నా. నువ్వు ఎంత పోటుగాడివో నాకు తెలుసులే. ఇష్టమైతే ఒక సీటు తీసుకొని పార్టీలోకి రా. లేదంటే మానేయ్' అంటూ ఆవేశంగా ఫోన్ పెట్టేశారట. దీంతో తోటాకి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయిందట. ఇప్పుడే ఇలా ఉంటే వైసీపీలో చేరాక నా పరిస్థితి ఎలా ఉంటుందో అనుకొని.. ప్రస్తుతానికి వైసీపీలో చేరే ప్రోగ్రాంకి ఫుల్ స్టాప్ పెట్టి.. చంద్రబాబుతో భేటీ అయ్యి టీడీపీలోనే ఉంటానని తోటా స్పష్టం చేశారట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. తోటా త్రిమూర్తుల మీద జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ రాజకీయ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.
  ఎదుటివారు వాడే పెర్‌ఫ్యూమ్‌ని బట్టి వారి మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చట. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. కానీ ఇది నిజం. కొంతమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు అనేకమంది మీద పరిశోధనలు జరిపి నిర్ధారించిన నిజం. జాజి, మల్లె, విరజాజి, సంపంగి, చంపక, పున్నాగ, గులాబీ, చేమంతి... ఇలా పువ్వుల పరిమళాలను కోరుకునేవారి లక్ష్యాలు సమున్నతంగా వుంటాయట. ఎప్పుడూ చక్కగా తయారవడాన్ని కూడా ఇష్టపడతారట కూడా. నిండైన ఆత్మవిశ్వాసం వీరి స్వంతంట. వీరికి ఎదురుపడ్డ ఏ అవకాశాన్నీ అంత తేలికగా చేయిదాటి పోనివ్వరు కూడా. పళ్ళ పరిమళాన్ని ఇష్టపడేవారు... ఇక నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు తినడానికి చాలా బాగుంటాయి కదా! ఇవి తినడానికి ఎంత బాగుంటాయో వాటి పరిమళాలు కూడా అంతే అద్భుతంగా వుంటాయి. మరి ఈ పరిమళాలని ఇష్టపడేవారు సాధారణంగా ఏ పనినైనా శ్రద్ధగా, ఇష్టంగా చేస్తారుట. ఎప్పుడూ ఆడుతూ, పాడుతూ ఉంటారు. అయితే కాస్త దురుసుగా మాట్లాడటం, తనకి నచ్చకపోతే నిక్కచ్చిగా చెప్పటం కూడా చేస్తారుట.   ఆకుల పరిమళాన్ని ప్రేమించేవారు.. యూకలిప్టస్, తేజ్ పత్తా, సబ్జా ఆకుల వంటివాటి సువాసనలంటే మక్కువ చూపేవారు చాలా చురుగ్గా వుంటారని అంటున్నారు నిపుణులు. వీరు సదా అప్రమత్తంగా కూడా వుంటారట. అలాగే చాలా విషయాలు తెలుసుకోవాలని కూడా వీరు ఆరాటపడుతూ వుంటారట. సృజనాత్మకత పాళ్ళూ వీరిలో ఎక్కువే. కానీ ఒక్కోసారి చప్పున మూడీగా మారిపోతుంటారుట.   వీరి వ్యక్తిత్వమే వేరు... వట్టివేరు, అల్లం, పసుపు వంటి వేర్ల సువాసనలను అధికంగా ఇష్టపడేవారు సౌమ్యంగా, నిరాడంబరంగా వుంటారుట. వీరి మనసులో మాట కనిపెట్టడం కష్టమే. వీరు చెప్పేదాకా వీరి ఇష్టాలేంటో కూడా అంచనా వేయలేంట. సో... ఈ సువాసనలని ఇష్టపడేవారు మీ ఫ్రెండ్స్‌లోనో, కావలసిన వారిలోనో వుంటే కొంచెం సునిశితంగా వారిని గమనించి వారి ఇష్టాలని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.   వీరి వ్యక్తిత్వమూ సుగంధమే... మంచి గంధం, రోజ్ వుడ్, రైన్ చెట్ల బెరళ్ళ వాసనలు చాలా విలక్షణంగా వుంటాయి కదా. వీటిని ఇష్టపడే వారు కూడా విలక్షణ వ్యక్తులే. ఎందరిలో వున్నా ఇట్టే పసిగట్టవచ్చు వారిని. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ వుంటారు. ఇలా ఆయా పరిమళాల ఎంపికను బట్టి సదరు వ్యక్తుల మనస్తత్వాన్ని అంచనా వేయచ్చు అంటున్నారు ఈ అంశంపై అధ్యయనం చేసిన వ్యక్తులు. మీ సన్నిహితులను కలసినప్పుడు సరదాగా ప్రయత్నించి చూడండి.
  మన భారతదేశం లో యోగసూత్రాల ద్వారా యోగశాస్త్రాన్ని మానవాళికి అందించిన గొప్పయోగి పతంజలిగారు. ఈయన శ్రీ క్రిష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటుయిటుగా జీవించినవాడు అంటారు.. అంటే దాదాపు 5000 సంవత్సరాలకు పైమాటే. పతంజలి గారు రచించిన యోగసూత్రములు 195. అందులో అష్టాంగయోగము ప్రధానమైనది. యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి అని చెప్పారు. అలాగే ఈ ఆసనం వేసుకుంటే ఈ యోగం మనకి కలుగుతుందన్నది ఏ రోగం తగ్గుతుందన్నది కూడా పతంజలి గారు వివరించి మరీ చెప్పారు. అనేక యోగరహస్యాలను పతంజలి గారు యోగ సూత్రాలలో పొందుపరిచారు. ఆయన చెప్పిన ఆసనాలు అన్నీ ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి.. ప్రశాంతతని ఇస్తాయి... ఆయన సూచించిన ఆసనాలెన్నో వాటిలోకొన్నిటి పేర్లు తెలుసుకుందాం.... 1. నాడీశుద్ది ప్రాణాయామం 2. బద్దపద్మాసనం 3. పద్మాసనం 4. భుజంగాసనం 5. శలభాసనం 6. పశ్చిమోత్తాసనం 7. హలాసనం 8. విపరీతకరణిముద్రాసనం 9. సర్వాంగాసనం 10. వజ్రాసనం 11. సింహాసనం 12. గోముఖాసనం 13. లోలాసనం 14. హస్తపాదాసనం 15. త్రికోణాసనం 16. చక్రాసనం 17. యోగముద్ర 18. మత్య్యాసనం 19. ధనురాసనం 20. మయూరాసనం 21. అర్ధమత్స్యేంద్రాసనం 22. ఉద్యాణబంధము 23. నౌళిక్రియ 24. శీర్షాసనం 25. శవాసనం ఇలా ఏ ఆసనం వేసుకుంటే ఏ ప్రయోజనం ఉంటుంది అన్నది కూడా తెలియజేసిన మహాను భావుడు పతంజలి గారు.... ఆయన మన అందరి యోగం బాగుండాలనే యోగశాస్త్రమన్నదాన్ని స్రుష్టించారన్నది అక్షరసత్యం.
తెల్లవారికి చెప్పమంది బాయ్ బాయ్.... ఆమెవరో కాదండీ ఝాన్సీ లక్ష్మీబాయి.... అంటూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రతీ భారతీయుడు ఆమెను తలుచుకున్నారు. అంతటి వీర నారి ఆమె. బ్రిటీష్ వారిపై భారతీయుల పోరాట స్ఫూర్తికి...అక్షరాల ఆమె మూర్తి... వారణాశిలో మోరాపంత్ ధాంబే గారికి జన్మించారు. మణికర్ణిక అనేది ఆమె చిన్ననాటి పేరట. అప్పట్లో చిన్న మరాఠా సంస్ధానమైన ఝాన్సీ పరిపాలకుడు రాజా గంగాధరరావుకు ఆమెనిచ్చి వివాహం చేశారు. పెళ్ళయిన తర్వాత ఆమె లక్ష్మీబాయిగా పేరుపొందారు. వారసులెవ్వరూ లేకుండానే గంగాధరరావు మరణించారట. చనిపోవటానికి ముందు దామోదర్ ను ఆయన దత్తత తీసుకున్నారు.  అప్పట్లో లార్డ్ డల్ హౌసీ బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా ఉండేవారు. దామోదర్ ను చట్టబద్ధమైన వారసుడిగా, లక్ష్మీబాయిని రాజప్రతినిధిగా అంగీకరించడానికి డల్ హౌస్ నిరాకరించారు. దాంతో గొడవ మొదలైంది. ప్రతిఘటనలు, నిరసనలు ఎదురైనప్పటికీ ఝాన్సీ లక్ష్మీభాయ్ కి అయిదువేల రూపాలయ చిన్నమొత్తాన్ని భరణంగా ఇవ్వసాగారు. అయితే ఈ అగౌరవాన్ని, పరాయివారికి లోబడి ఉండడాన్ని రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్ జీర్ణించుకోలేకపోయారు. సంస్ధానాన్ని వదిలిపెట్టకూడదనుకున్నారు.  అంతే ఆమె వారి మీద 1857 మే నెలలో తిరుగుబాటు చేశారు. ఝాన్సీ సంస్ధానమంతా రాణీ లక్ష్మీబాయిదే అధికారమని ప్రకటించారు. బ్రిటిష్ సేన దండయాత్రకుదిగితే  వారిని ఎదుర్కొని... గ్వాలియర్ కోటను లక్ష్మీబాయి తన అధీనంలోకి తీసుకుంది. అది చూసి గ్వాలియర్ మహారాజు కోట వదిలి పరిగెత్తాడు. ఆయన బలగాల్లో అత్యధికశాతం లక్ష్మీబాయి పక్షం వచ్చేసాయి. దెబ్బతిన్న బ్రిటిష్ వారు గ్వాలియర్ కోట మీద ఒక్కసారి దాడి చేశారు. లక్ష్మీ బాయ్ తీవ్రపోరాటం చేసినప్పటికీ ఆపోరులో మరణించింది. ఆ విధంగా తన ఇంటికి సుదూరప్రాంతంలో రాని అశువులు బాసింది. కానీ బ్రిటిష్ వారి మీద ఝాన్సీ లక్ష్మీ భాయి చూపిన ధైర్యసాహసాలు బలపరాక్రమాలు, సామర్ధ్యం భారతీయులెవ్వరూ ఎప్పటికీ మరిచిపోరు. ఆమె చిరస్మరణీయురాలు.  
  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు సిట్ దర్యాప్తు జరుగుతుంటే.. మరోవైపు ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో హత్యకు కారణం మీరంటే మీరంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. మీడియాలో కూడా ఈ హత్య గురించి రకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె సునీత పులివెందులలో మీడియా సమావేశం నిర్వహించారు. సిట్‌ నివేదిక వచ్చే వరకూ మీడియా, రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని కోరారు. 'మా నాన్నకు ముందు ప్రజాసేవ, తర్వాతే కుటుంబం. పులివెందులలోని ప్రజలంటే ఆయనకు ఎంతో ఇష్టం. కొంత కాలంగా మా అమ్మకు అనారోగ్యంగా ఉండడంతో నా దగ్గరే ఉంటోంది. నాన్న ఒక్కరే పులివెందులలో ఉంటున్నారు. నాన్న చనిపోవడంతో చాలా బాధ కలిగింది. కానీ మీడియాలో వచ్చినవి చూస్తుంటే ఇంకా ఎక్కువ బాధ కలుగుతోంది. మానాన్న ఎంతో హుందాగా బతికారు. చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదని అంటుంటాం. ఈ విషయంలో ఇలా వ్యవహరించడం సరికాదు. మీడియాలో వస్తున్న వార్తలు దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని అనిపించడం లేదా? ఈ కిరాతకమైన పని చేసిన వారిని గుర్తించాలి కదా! వారికి శిక్ష పడాలి. సిట్‌ నిరంతరం ఈ ఘటనపై పని చేస్తోంది. సిట్ బృందం నుంచి ఇంకా ఏ సమాధానం రాకుండా ఏది పడితే అది రాసుకుంటూ పోతే సరైన విచారణ ఎలా జరుగుతుంది. ఇది ఎంత మాత్రం సబబు కాదు. ఆయన బతికున్నప్పుడు ఎలా గౌరవించారో.. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. సిట్‌ను స్వతంత్రంగా పని చెయ్యనివ్వండి’ అని విజ్ఞప్తి చేశారు. 'ప్రతి కుటుంబంలోనూ పొరపొచ్చాలు ఉంటాయి. మా కుటుంబంలో 700 మంది సభ్యులు ఉన్నారు. అభిప్రాయభేదాలు ఉండడం సహజమే. దీనర్థం ఒకరినొకరం చంపుకుంటామని కాదు. అది మా సంస్కృతి కాదు. మేం ఒకరినొకరం గౌరవించుకుంటాం. ఏటా మా కుటుంబ సభ్యులు ఒకచోట కలుసుకుంటాం. మా లాంటి కుటుంబం ఎక్కడా ఉండదు.' అని సునీత అన్నారు.
  ఇల్లు అద్దెకిస్తే.. సమయానికి అద్దె కట్టండి, లేదా ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పడం సహజం. కానీ ఓ మహానుభావుడు మాత్రం.. నేను చెప్పిన పార్టీకి ఓటు వేయండి లేదా ఇల్లు ఖాళీ చేయండి అంటూ.. ఇల్లు ఖాళీ చేయించాడు. ఈ ఘటన గుంటూరుజిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన భీమినేని అంకమరావు(70), మహాలక్ష్మమ్మ (65) దంపతులు చెరుకుమల్లి బుజ్జి అనే స్థానిక వైసీపీ నేత ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ‘మా పార్టీకే ఓటు వేయండి’ అని ఆ దంపతులను బుజ్జి పలుమార్లు అడిగారు. అయితే వాళ్ళు.. తమకి నచ్చిన వ్యక్తికి, నచ్చిన పార్టీకి ఓటు వేస్తామని చెబుతూ వచ్చారు. ఇదే విషయమై సోమవారం రాత్రి బుజ్జి వారితో వాదనకు దిగారు. ‘వైసీపీకి ఓటు వేస్తామని మాట ఇవ్వండి’ అని పట్టుబట్టారు. వృద్ధ దంపతులు అంగీకరించలేదు. ‘ఐతే బయటికి నడవండి’ అంటూ వారిచేత బుజ్జి ఇంటిని ఖాళీ చేయించారు. ఇక చేసేదేమీలేక అంకమరావు దంపతులు అర్ధరాత్రి చిన్న బడ్డీ కొట్టులోకి సామాన్లు మార్చుకున్నారు. రాత్రికి అక్కడే తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు.. వారికి చిన్న గదిలో ఆవాసం ఏర్పాటు చేశారు.  
  లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సీనియర్ నేతలను బరిలోకి దింపి సత్తా చాటాలనుకుంటున్న కాంగ్రెస్ కు.. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అనే తేడా లేకుండా ఎన్నికలకు ముందు షాకుల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ని వీడుతున్నట్లు ప్రకటించారు. వారిలో సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు వారి బాటలోనే మరో సీనియర్ నేత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు రాంమాధవ్‌ మంగళవారం అరుణ నివాసానికి వెళ్లి ఆమెతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన తరువాత ఢిల్లీ వెళ్లి రాత్రి 1 వరకు చర్చలు జరిపారు. చర్చల అనంతరం అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆమె బీజేపీ తరపున మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.