ఏ సీజన్ లో అయినా పొట్ట సమస్యలకు చెక్ పెట్టే అమృతం ఇది..!

పొట్ట కాస్త తేడా కొడితే చాలు.. ఎంత బలంగా, దృఢంగా ఉన్న మనిషి అయినా  అసౌకర్యానికి లోనవుతారు.  పొట్ట ఆరోగ్యం బాగుంటే మిగతా శరీరం ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. కానీ పొట్ట ఆరోగ్యం తేడా వస్తే తిండి, నీరు తీసుకోవడం కూడా  బ్రేక్ పడుతుంది.  ఇలా పొట్ట, ప్రేగు ఆరోగ్యాన్నే గట్ అని పిలుస్తారు. శరీరం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడే ఆరోగ్యకరమైన బాక్టీరియా తయారయ్యేది పొట్టలోనే.. అలాంటప్పుడు పొట్ట ఆరోగ్యం బలంగా ఉండటం ఎంతో  అవసరం.  పొట్ట ఆరోగ్యం బాగుండాలన్నా,  పొట్ట సమస్యలు ఏ సీజన్ లో వచ్చినా వాటికి చెక్ పెట్టాలన్నా కేవలం ఒక్క పానీయం అమృతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  అదేంటో  తెలుసుకుంటే..

మజ్జిగ..

శీతాకాలంలో తరచుగా మజ్జిగ, పెరుగుకు దూరంగా ఉంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ప్రతి సీజన్‌లో కడుపు సమస్యలకు చెక్ పెట్టడంలో మజ్జిగ చాలా  ప్రయోజనకరంగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనంతో పాటు ప్రతిరోజూ మజ్జిగ  తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు తగ్గుతాయి.  జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఇదే అసలైన మజ్జిగ..

మజ్జిగ ఈనాటి పానీయం కాదు.. దీనికి ఎంతో చరిత్ర ఉంది. పెరుగు చిలికిన తర్వాత తయారుచేసిన మజ్జిగ ఎప్పుడూ ఆరోగ్యకరమైనది. చాలామంది వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగుతారు.  కానీ శీతాకాలం వచ్చేసరికి పెరుగు, మజ్జిగ వాడకం తగ్గిస్తారు.  అయితే ఆయుర్వేదం ప్రకారం ఇది ప్రతి సీజన్ లో శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. జీర్ణక్రియను బలంగా ఉంచుతుంది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి.


మజ్జిగ ఇలా తాగాలి..

చాలామంది పెరుగులో నీళ్లు కలిపి పలుచగా చేసుకుని దాన్నే మజ్జిగ అనుకుంటారు. కానీ నిజానికి మజ్జిగ అనేది పెరుగులో వెన్న తొలగించిన తరువాత లభించే ద్రవం. ఈ మజ్జిగలో అస్సలు ఫ్యాట్ ఉండదు.  ఈ మజ్జిగను నేరుగా అలాగే తాగవచ్చు.  లేదా అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర పొడి వంటివి కలిపి కూడా తాగవచ్చు.  అలా కాకున్నా ప్లెయిన్ మజ్జిగలో కాసింత నిమ్మరసం, జీలకర్ర పొడి కలుపుకుని తీసుకున్నా జీర్ణశక్తి బలంగా ఉంటుంది.  

మజ్జిగ బెస్ట్ ఎందుకంటే..

మజ్జిగలో కాల్షియం, ప్రోబయోటిక్స్,  ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపు ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.  జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది. భోజనం తర్వాత బరువుగా, గ్యాస్ లేదా ఉబ్బరం ఉన్నవారికి మజ్జిగ ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి జోడించిన రాతి ఉప్పు శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది.  వేయించిన జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  నల్ల మిరియాలు కడుపు వాయువును తగ్గించి కడుపును తేలికపరుస్తుంది.

                                     *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu