ఉదయం లేదా సాయంత్రం.. ఏ సమయంలో విటమిన్-డి వేగంగా లభిస్తుంది?
posted on Nov 20, 2025 2:57PM
.webp)
విటమిన్ డి ఉత్పత్తికి సూర్యరశ్మి చాలా ముఖ్యం. అందుకే దీనిని సన్ లైట్ విటమిన్ అని కూడా పిలుస్తారు. శీతాకాలంలో చాలా మంది విటమిన్ డి లోపాన్ని ఎదుర్కొంటారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ప్రధాన కారణం మాత్రం శీతాకాలంలో సూర్యరశ్మి సూర్యుడి ప్రకాశం తక్కువగా ఉండటం. వాతావరణంలో పొగమంచు, కాలుష్యం కారణంగా సూర్యకిరణాలు నేలను సరిగ్గా చేరుకోలేవు. ఇది మాత్రమే కాకుండా శీతాకాలంలో చలి కారణంగా వెచ్చని దుస్తులు ధరిస్తుంటాము. చర్మం సూర్యరశ్మికి గురి కాకుండా ఉండటానికి ఇది కారణం అవుతుంది. విటమిన్ డి మన శరీరానికి, ముఖ్యంగా ఎముకల బలం, రోగనిరోధక శక్తికి చాలా అవసరం. ఉదయం లేదా సాయంత్రం.. ఏ సమయంలో సూర్యరశ్మికి గురి కావడం వల్ల విటమిన్-డి బాగా లభిస్తుందో తెలుసుకుంటే..
విటమిన్-డి.. ఏ సమయంలో లభిస్తుంది..
అతినీలలోహిత B సూర్యకాంతి బలంగా ఉన్నప్పుడు మన శరీరాలు విటమిన్ D ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయట. ఇది సాధారణంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు వాతావరణం ద్వారా అతి తక్కువ దూరం ప్రయాణిస్తాయి.
మద్యాహ్న సూర్యకాంతి మంచిదా?
శీతాకాలంలో సన్‌స్క్రీన్ లేకుండా శరీరంలోని కొన్ని ప్రాంతాలను.. అంటే.. చేతులు, ముఖం వంటి ప్రాంతాలను 20-30 నిమిషాలు ప్రత్యక్ష సూర్యకాంతికి గురిచేస్తే సరిపోతుందట. ఈ వ్యవధిలో శరీరం తగినంత మొత్తంలో విటమిన్ డిని వేగంగా సంశ్లేషణ చేస్తుందట.
కాలం, భౌగోళిక స్థానం..
విటమిన్ డి సంశ్లేషణ వ్యవధి భౌగోళిక స్థానం అంటే భూమధ్య రేఖ నుండి నివసించే దూరం, సీజన్, చర్మం రంగుపై ఆధారపడి ఉంటుందట. ముదురు రంగు చర్మం ఉన్నవారికి లేత చర్మం ఉన్నవారి కంటే విటమిన్ డి సంశ్లేషణ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందట. అందువల్ల అవసరాలకు అనుగుణంగా, జాగ్రత్తగా సూర్యరశ్మిని తీసుకోవడం మంచిది.
జాగ్రత్తలు..
మధ్యాహ్న సూర్యరశ్మి విటమిన్ డి కి ఉత్తమమైనది అయినప్పటికీ, ఇది చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందట. అందువల్ల చర్మవ్యాధి నిపుణులు చర్మ రకం, భౌగోళిక స్థానం ఆధారంగా ఎండలో ఎంతసేపు ఉండాలనే విషయాన్ని అవగాహన చేసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్న సమయంలో సూర్యరశ్మిలో ఉండేవారు 30 నిమిషాల కంటే ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికాకుండా ఉండాలట. చర్మం కొద్దిగా గులాబీ రంగులోకి మారుతున్నట్టు అనిపించగానే వెంటనే నీడలోకి వెళ్లడం సన్ స్క్రీన్ రాసుకోవడం వంటివి చేయాలి. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి విటమిన్-డి ఆహారాలు, మంచి పోషకమైన ఆహారాలు తీసుకోవాలి.
*రూపశ్రీ.