ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్-బి12 లోపం ఉన్నట్టే..!
posted on Nov 21, 2025 3:03PM

శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లలో విటమిన్-బి12 ముఖ్యమైనది. నేటి కాలంలో విటమిన్ బి12 లోపం ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం తినే ఆహారం, తీసుకునే పానీయాల విషయంలో తగిన శ్రద్ద లేకపోవడం. ఈ లోపం మెల్లిగా పెరుగుతుంది. ఇది శరీరం వివిధ సంకేతాలను కూడా ఇస్తుంది. కానీ చాలామంది విటమిన్-బి12 లోపాన్ని ఈ లక్షణాల ద్వారా గుర్తించలేరు. విటమిన్ బి12 లోపం మొదలైనప్పుడు కనిపించే లక్షణాలేంటి? విటమిన్-బి12 లోపిస్తే శరీరంలో కలిగే మార్పులేంటి? తెలుసుకుంటే..
నాలుక రంగు, ఆకృతి..
విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు కనిపించే మొదటి ల7ణం నాలుక ఆకృతి, రంగులో మార్పు. నాలుక పాపిల్లే అని పిలువబడే చిన్న గడ్డలతో కప్పబడి ఉంటుంది. కానీ విటమిన్-బి12 లోపంలో పాపిల్లే క్రమంగా తగ్గిపోతుంది. నాలుక నునుపుగా, మెరుస్తూ కనిపిస్తుంది.
నాలుక రంగు..
చాలా మందిలో నాలుక సాధారణ గులాబీ రంగు నుండి ముదురు ఎరుపు లేదా గొడ్డు మాంసం ఉన్నట్టు ఎరుపు రంగులోకి మారుతుంది. పాపిల్లే కోల్పోవడం వల్ల నాలుక ఉపరితలం సన్నగా అవుతుంది, దీని వలన లోపలి వాపు బయటపడుతుంది. ఇది కారంగా లేదా వేడిగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు మంట, చురుకు తగలడం లేదా నొప్పి వంటి ఇబ్బందులు కలిగిస్తుంది.
నోటి పూతలు, పుండ్లు..
తరచుగా నోటి పూతల లేదా త్వరగా నయం కాని చిన్న పుండ్లు వస్తుంటే అది విటమిన్ బి12 లోపానికి ప్రధాన సంకేతం. శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి విటమిన్ బి12 చాలా ముఖ్యమైనది. ఈ లోపం వల్ల నోటిలోని సున్నితమైన కణాలు సరిగ్గా ఏర్పడకపోగా, తరచుగా పూతల, పుండ్లు వస్తాయి.
నాలుకలో జలదరింపు, వింత ఫీలింగ్..
నరాల ఆరోగ్యానికి విటమిన్ బి12 చాలా ముఖ్యమైనది. ఈ విటమిన్ లోపం ఏర్పడినప్పుడు అది నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకే కొంతమందికి నాలుకపై వింతైన జలదరింపు, ముళ్ళు గుచ్చుకోవడం లేదా తేలికపాటి మంట వంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇంత జరిగినా పుండ్లు లేదా వాపు వంటివి మాత్రం నాలుకపై కనిపించవు.
సూదులు గుచ్చుకున్న ఫీలింగ్..
చాలా మందికి నాలుకలో పిన్స్, సూదులు గుచ్చుకున్నట్టు అనిపించడం, లేదా కొన్నిసార్లు తిమ్మిరి అనిపించడం జరుగుతుంది. దీన్ని వైద్యపరంగా లింగ్యువల్ పరేస్తేసియా అని పిలుస్తారు. దీని అర్థం B12 లోపం నరాలను ప్రభావితం చేస్తుందని, ఇది తరువాత తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని సూచిస్తుంది.
విటమిన్-బి-12 లోపాన్ని ఎలా అధిగమించాలి?
గుడ్లు, పాలు, పెరుగు, పనీర్, జున్ను వంటి పాల ఉత్పత్తులు విటమిన్ బి12 లోపాన్ని నయం చేయడంలో సహాయపడతాయి. చేపలు, చికెన్ మాంసాహారాలలో విటమిన్-బి12 చాలా మెరుగ్గా ఉంటుంది. శాఖాహారులు బలవర్థకమైన పాలు, బలవర్థకమైన తృణధాన్యాలు, సోయా పాలు, ప్లాంట్ బేస్డ్ మిల్క్ వంటివి తీసుకోవాలి. కొన్ని పుట్టగొడుగులలో కూడా తక్కువ మొత్తంలో విటమిన్-బి12 ఉంటుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...