రాంబాబుకి రాజకీయాలెందుకు కెమెరా ఉండగా..
posted on Apr 10, 2015 9:54PM
జనసేన పార్టీకి ఏకఛత్రాధిపతి అయిన పవన్ కళ్యాణ్ మనసులో ఏమీ ఆలోచనలున్నాయో తెలియదు కానీ ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే తను ఏమి చేయాలనుకొంటున్నాడో తనకే తెలియనట్లు కనబడుతున్నారు. ఆ కారణంగానే ప్రజలు, ముఖ్యంగా అభిమానులు కూడా ఆయన ధోరణిణి అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఆయన రాజకీయాలలో స్థిరంగా ఉంటారా అంటే ఉండరు. పోనీ మిగిలిన సినీ నటుల్లా రాజకీయాలకు దూరంగా ఉంటారా అంటే అలాగా ఉండలేరు. పోనీ స్థిరంగా ఏదయినా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటారా...అంటే అలాగా ఉండలేరని రుజువు చేసుకొన్నారు. ప్రజా సమస్యలపట్ల నిజంగా శ్రద్ద ఉందా లేదా అంటే చెప్పలేని పరిస్థితి. ఉంటే నిలకడగా వాటి పరిష్కారం కోసం కృషి చేసేవారు. కానీ లేదని చెప్పడానికి లేదు. ఉంది గాబట్టే అప్పుడప్పుడు ఇలాగ ఆవేశపడుతుంటారు. కానీ అది తాటాకు మంటలాగ ఎంత వేగంగా ఎగిసిపడుతుందో అంతకంటే వేగంగా చల్లారిపోతుంది.
ప్రజాసమస్యల పట్ల పవన్ కళ్యాణ్ కి చాలా సానుభూతి ఉండవచ్చు. కానీ ఈవిధంగా అయోమయంగా, అస్థిరంగా వ్యవహరించడం వలన ఆయనకున్న మంచిపేరును, ప్రతిష్టను ఆయనే స్వయంగా కాలరాసుకొంటున్నారు. నలుగురిలో నవ్వుల పాలవుతున్నారనే సంగతి గ్రహిస్తే మంచిది. అంతేకాదు ఆయన ఒక సమస్య పరిష్కరించడానికి బయలుదేరితే మరొకరికి సమస్యలు సృష్టిస్తున్నారు కూడా.
ఇంతకు ముందు ఆయన తుళ్ళూరు మండలంలో గ్రామాలను సుడిగాలిలా పర్యటించినప్పుడు చెప్పిన మాటాలు, హైదరాబాద్ చేరుకొన్న తరువాత చెప్పిన మాటలకి ఎక్కడా అసలు పొంతన లేకపోవడంతో ఆయన చాలా విమర్శలకు ఎదుర్కోవలసి వచ్చింది. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తుళ్ళూరు పర్యటించాలనుకొన్న సమయంలో ఆయన కూడా తుళ్ళూరులో పర్యటించబోతున్నట్లు మెసేజ్ పెట్టడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి మాట్లాడటం ఆ తరువాత తుళ్ళూరు పర్యటించడం అనే మూడు సంఘటనలను కలిపి చూసిన వైకాపా నేతలు, ఆయన చంద్రబాబు ప్రోద్బలంతోనే తుళ్ళూరు బయలుదేరారంటూ చంద్రబాబుని ఆడిపోసుకొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ తుళ్ళూరు వెళ్లిన తరువాత ఆయనకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతానని శపధాలు చేసారు. కానీ మళ్ళీ హైదరాబాద్ చేరుకోగానే చంద్రబాబు నాయుడుణి పొగడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడటం వలన ఇదంతా చంద్రబాబు పన్నాగమేనని మళ్ళీ అందరూ అనుమానించారు. పవన్ కళ్యాణ్ అయోమయ వ్యవహార శైలి వలన చంద్రబాబు నాయుడు తను చేయని తప్పుకి కూడా నిందలు పడాల్సి వచ్చిందని అర్ధమవుతోంది.
అన్ని మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ మళ్ళీ హటాత్తుగా ఎందుకు అదృశ్యమయిపోయారో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆవేశపడుతున్నారో ఆయనే చెప్పాలి. మళ్ళీ ఒకవేళ ఈసారి ప్రజల మధ్యకి రాదలిస్తే ముందుగా తను ఏమి చేయాలనుకొంటున్నారో, అందుకు తను ఎన్ని గంటలు లేదా రోజులు వారికి తన కాల్షీట్లు కేటాయించగలరో ముందుగానే అవగాహన చేసుకొని, అందులో సాధ్యాసాధ్యాలను తన సన్నిహితులతో లేదా అభిమానులతో చర్చించిన తరువాతనే తగిన నిర్ణయం తీసుకొంటే మంచిది. అలాకాక మళ్ళీ ఓ నాలుగయిదు గంటలు హడావుడి చేసి మాయమయిపోతే పోయేదీ ఆయన పరువే. ఆయన రాజకీయాలలో రాకపోయినా ఎవరూ ఆయనను నిలదీయరు. కానీ ఇలా అప్పుడప్పుడు వచ్చి హడావుడి చేయడాన్ని ఎవరూ సమర్ధించరు.
ఒకవేళ ఇప్పుడు రాజధాని కోసం భూములు ఇవ్వదలచుకొని రైతుల తరపున పోరాడేందుకు సిద్దపడితే దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయో ఆయన ఆలోచించిన తరువాతనే రంగంలో దిగితే మంచిది. ఇప్పటికే కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయిస్తే వారి భూముల జోలికి వెళ్ళవద్దని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగించి రైతుల భూములు తీసుకోదలిస్తే, అందుకు చట్టంలో ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే కోర్టు కూడా అడ్డుకోలేదు. కానీ అది చట్ట వ్యతిరేకమయితే కోర్టులు ప్రభుత్వాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయకుండా అడ్డుపడటం తధ్యం. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి కొత్తగా చేసేదేముంటుంది? హడావుడి తప్ప.