సల్మాన్ ను ఖతం చేస్తామంటున్న బిష్ణోయ్.. అసలు కథేంటి?

పరిచయం అక్కర్లేని పేరు సల్మాన్ ఖాన్.. కండల వీరుడిగా అశేషమైన ప్రేక్షకాభిమానం కలగిన స్టార్ హీరో. దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలో ఆయనకు అభిమానులు ఉన్నారు. హీరోగా ఆయన స్థాయే వేరు. తెరపై విలన్లను భయభ్రాంతులకు గురి చేసి, వారిని చీల్చి చెండాని గెలిచే పాత్రలలో సల్మాన్ స్టైలే వేరు. ఎదురులేని హీరోగా ప్రేక్షకుల నీరాజనాలందుకునే సల్మాన్ ఖాన్ ఇప్పుడు భయంతో వణికి పోతున్నాడు. అడుగుతీసి అడుగు వేయాలంటే.. కట్టుదిట్టమైన భద్రత, సొంత బౌన్సర్లే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా పదుల సంఖ్యలో సెక్యూరిటీ గార్డ్స్ , బయటకు వెడితే బుల్లెట్ ప్రూఫ్ కార్. వీటిలో ఏది లేకపోయానా సల్మాన్ బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఇంత భారీ సెక్యూరిటీ ఉన్నా కూడా సల్మాన్ లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు సల్మాన్ ఖాన్ ఇంతగా భయపడటానికి కారణమేంటి? పదే పదే సల్మాన్ ను ఖతం చేస్తామంటూ బెదరింపులు ఎందుకు వస్తున్నాయి? ఎవరు చేస్తున్నారు? అంటే మనం ముందుగా  గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గురించి చెప్పుకోవాలి. అంత కంటే ముందు సల్మాన్ ఖాన్ నిర్దోషిగా బయటపడిన కృష్ణ జింకల వధ కేసు గురించి తెలుసుకోవాలి.  అలాగే తిరుగులేని స్టార్ గా ఎదిగిన సల్మాన్ ఖాన్ ప్రస్తానాన్నీ సింహావలోకనం చేసుకోవాలి. 

బాలీవుడ్‌లో  ఒకప్పటి స్టార్‌ రైటర్స్‌ సలీమ్‌ జావేద్‌లలో ఒకడైన సలీమ్‌ఖాన్‌ కుమారుడే సల్మాన్‌ఖాన్‌.  1988లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్ అదే ఏడాది  ‘బీవీ హోతో ఐసీ’ చిత్రంలో ఒక క్యారెక్టర్‌ పోషించడం ద్వారా నటుడిగా మారాడు. ఆ మరుసటి సంవత్సరమే ‘మైనే ప్యార్‌ కియా’ సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమాతో సల్మాన్ ఖాన్ స్టార్ హీరో అయిపోయారు. ఆ తరువాత  ‘హమ్‌ ఆప్‌కె హై కౌన్‌’ చిత్రంతో ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.   వరుస చిత్రాలతో స్టార్ డమ్ పొందాడు. కండల వీరుడిగా గుర్తింపు పొంది. అశేష ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్నాడు.  ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సినిమా షూటింగ్ లో భాగంగా రాజస్థాన్ లో ఉన్న సమయంలో ఆయన అక్కడి అటవీ ప్రాంతంలో సరదాగా షూటింగ్ కు వెళ్లి  కృష్ణజింకను వేటాడారన్న అభియోగాలతో సల్మాన్ ఖాన్ పై 1998 అక్టోబర్‌ 2న  కేసు నమోదైంది.   అరెస్టై  20 రోజులు జైల్లో ఉన్నాడు. సల్మాన్‌ ఖాన్‌ కృష్ణజింకను వేటాడినట్టు ఆధారాలు లేని కారణంగా రాజస్థాన్‌ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. అక్కడితో ఆగని రాజస్థాన్‌ ప్రభుత్వం కేసును సుప్రీమ్‌ కోర్టుకు తీసుకెళ్లింది. 26 ఏళ్ళుగా సుప్రీమ్‌ కోర్టులో ఈ కేసు నడుస్తోంది. అయితే ఇక్కడే బిష్ణోయ్ రంగ ప్రవేశం చేశాడు. తమకు అత్యంత పవిత్రమైన కృష్ణ జింకను వేటాడి వధించిన కేసులో ఇన్నాళ్లైనా ఫలితం వెలువడకపోవడంతో  లారెన్స్‌ బిష్ణోయ్‌ రగిలిపోయాడు. సల్మాన్ ను ఖతం చేస్తామని ప్రతినపూనాడు. నిజానికి సల్మాన్‌ఖాన్‌పై కృష్ణ జింక వధ కేసు నమోదయ్యే సమయానికి లారెన్స్ బిష్ణోయ్ ఐదేళ్ల బాలుడు. అయితే ఇప్పుడు అతడో పెద్ద గ్యాంగ్ స్టర్  700 మంది సభ్యులతో తన నేర సామ్రాజ్యాన్ని దేశ వ్యాప్తంగా విస్తరించాడు. ప్రధానంగా ఐదారు రాష్ట్రాలలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలా చాలా పవర్ ఫుల్.  సల్మాన్‌ఖాన్‌ని చంపడమే తన ధ్యేయమని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సల్మాన్‌కి అత్యంత సన్నిహితుడైన మంత్రి బాబా సిద్ధిఖీని చంపడం ద్వారా తను ఏమిటో నిరూపించుకోవాలనుకున్నాడు లారెన్స్ బిష్ణోయ్‌. నిరూపించుకున్నాడు కూడా.   ప్రస్తుతం సబర్మతి జైలులో ఉన్న బిష్ణోయ్‌.. అక్కడి నుంచే తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామంటూ హెచ్చరికలు పంపుతున్నాడు. అందుకోసం రెక్కీలు కూడా జరుగుతున్నాయి. గత ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ నివాసం సమీపంలో ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. సల్మాన్ ఖాన్ హత్యకు ఈ కాల్పుల ఘటన ఒక రెక్కీ అని పోలీసులు భావిస్తున్నారు. సల్మాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అరెస్టు చేశారు కూడా.  సల్మాన్ కు సన్నిహితుడైన  మంత్రి సిద్దిఖీ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్, అతడి సోదరుడు అన్ మోల్ సహా మరో  ముగ్గురు కీలక నిందితులు. సల్మాన్ ను తాము క్షమించి వదిలేయాలంటే బిష్ణోయ్ ఆలయానికి వచ్చి సల్మాన్ క్షమాపణ చెప్పాలన్నది వారి డిమాండ్. లేదా.. సల్మాన్ ఐదు కోట్లు చెల్లస్తే చంపకుండా వదిలేస్తామన్నది బిష్ణోయ్ చేసిన ప్రపోజల్. మరి సల్మాన్ ఏం చేస్తాడన్నది చూడాల్సి ఉంది.