శ్రుతిహాసన్ ఇష్యూలో శ్రుతి మించిన మీడియా
posted on Apr 11, 2015 4:16PM
![](/teluguoneUserFiles/shkamine.jpg)
సినీ కథానాయిక శ్రుతిహాసన్‌ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ విమానంలో ఏడిపించారనే అనారోగ్యకరమైన వార్త గత కొద్ది రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వార్తకి మీడియా రకరకాల మసాలాలు దట్టించి, చిలువలు పలువలు కల్పించి, తనదైన స్టైల్లో స్క్రీన్‌ప్లే అల్లేసి ప్రసారం చేసి మంత్రి కామినేని శ్రీనివాస్‌ని బద్నామ్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నించింది. దీనికితోడు ఇదిగో పులి అంటే అదిగో తోక అనే సోషల్ మీడియా వుండనే వుంది...
ఇలా ఈ నిరాధార వార్త మీడియాని ఆధారం చేసుకుని వ్యాపించింది. ఒక అబద్ధాన్ని ఖండించకపోతే అది నిజమేమోనని జనం నమ్మే ప్రమాదం వుంది కాబట్టి మంత్రి కామినేని శ్రీనివాస్ దీనిమీద వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ శ్రుతి హాసన్ ప్రయాణించిన విమానంలో ప్రయాణించనే లేదని, తాను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కారులోనే వెళ్తానని, మీడియాలో జరుగుతున్న ఈ దుష్ప్రచారమంతా శుద్ధ అబద్ధమని తేల్చేశారు. తాను శ్రుతిహాసన్‌ని సినిమాల్లో తప్ప బయట ఎక్కడ చూడను కూడా చూడలేదని స్పష్టం చేశారు. ఒక వార్తను ప్రకటించే ముందు తన వివరణ తీసుకోవాలని మీడియా ఆలోచించకపోవడం అన్యాయమని ఆయన బాధపడ్డారు. తాను శ్రుతిహాసన్‌ని విమానంలో ఏడిపించానని నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా వున్నానని ప్రకటించారు. తన పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారంటే మంత్రిగారిని మీడియా ఎంతగా విసిగించిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ శ్రుతిహాసన్ ఇష్యూలో మీడియా శ్రుతిమించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే, అసలు ఆరోజు జరిగింది వేరు... మీడియా కల్పించింది వేరు.
అసలు ఆరోజు జరిగింది ఇదే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఇటీవల ఒక సీనియర్ మహిళా అధికారితో కలసి విమానంలో తిరుపతికి వెళ్తున్నారు. వీరి పక్క సీట్లో ఒకమ్మాయి కూర్చుని వుంది. సినిమాలు చూడని మంత్రిగారికి ఆ అమ్మాయి శ్రుతిహాసన్ అని కూడా తెలియదు. ఇంతలో సూర్యాపేటలో జరిగిన కాల్పుల్లో దొరబాబు అనే ఎంపీటీసీ గాయపడ్డారని మంత్రిగారికి ఫోన్ వచ్చింది. గాయపడిన ఎంపీటీసిని ఆపరేషన్ థియేటర్‌కి తరలిస్తుండగా మంత్రికి ఫోన్ చేశారు. మంత్రి మాణిక్యాలరావు ఆ ఎంపీటీసీకి చికిత్స చేస్తున్న డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎంపీటీసీ దొరబాబుకు మంచి వైద్యాన్ని అందించాల్సిందిగా డాక్టర్ని మంత్రి కోరారు. ఇలా మంత్రి మాణిక్యాలరావు ఫోన్‌లో మాట్లాడుతూ వుండగా పక్కసీట్లోనే వున్న శ్రుతిహాసన్ గయ్యిమంటూ లేచింది. మీరు ఫోన్ మాట్లాడుతూ వుంటే నేను డిస్ట్రబ్ అయిపోతున్నానంటూ గోలగోల చేసింది. మంత్రి మాణిక్యాలరావు ‘‘ఇది చాలా ఇంపార్టెంట్ ఫోనమ్మా.. అందుకే మాట్లాడుతున్నాను’’ అని చెప్తున్నా శ్రుతిహాసన్ ఎంతమాత్రం పట్టించుకోకుండా ఎయిర్‌హోస్టెస్‌ని పిలిచి కంప్లయింట్ చేసింది. దాంతో మంత్రి మాణిక్యాలరావు ఎందుకొచ్చిన గొడవ అని ఫోన్ కట్ చేసి కూర్చున్నారు.
ఇంతలో మంత్రిగారి ఫోన్ మరోసారి మోగింది. అవతల ఫోన్ చేసిన వ్యక్తి... ‘‘సార్... ఇక్కడ బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. అతను స్పృహ కోల్పోయాడు. అతని ఫోన్‌లో చివరగా డయల్ చేసిన నంబర్ మీదే వుంది. అందుకే ఫోన్ చేశాం’’ అని చెప్పారు. ఇంతకీ ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి మరెవరో కాదు... మంత్రి మాణిక్యాలరావు పీఏ. దాంతో ఆందోళన చెందిన మంత్రి తన పీఏ ప్రాణాలు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అతనని ఎలా ఆస్పత్రికి తరలించాలి.. ఏం చేయాలి అనే విషయాలను ఫోన్‌లో మాట్లాడారు. అంతే... శ్రుతి హాసన్ మరోసారి శివాలెత్తింది. తాను డిస్ట్రబ్ అయిపోతున్నానంటూ మరోసారి గొడవ చేయడం మొదలుపెట్టింది. చాలా పెద్ద ప్రాబ్లం కావడం వల్లే ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పినా ఆమె ఎంతమాత్రం వినిపించుకోలేదు. ఇక ఈమెతో వాదించి తన పరువు తీసుకోవడం ఎందుకనుకున్న మంత్రిగారు ఫోన్ కట్ చేసి కూర్చుండిపోయారు. మంత్రిగారి పక్కన సీనియర్ మహిళా అధికారి ఉన్నారుకాబట్టి సరిపోయింది.. లేకపోతే విమానంలోని జనం మంత్రిగారిని అనుమానంగా చూసేవారే. మొత్తమ్మీద తిరుపతిలో ఫ్లైట్ లాండ్ అయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదీ అసలు జరిగిన విషయం.
ఈ విషయాన్ని మీడియా ఎలా డైవర్ట్ చేసిందో చూడండి. అసలు ఈ విషయంలో సంబంధమే లేని మంత్రి కామినేని శ్రీనివాస్‌ని ముగ్గులోకి లాగింది. అసలు జరిగిన ఘటనకి రకరకాల మసాలాలు దట్టించి జనాల్లోకి వదిలింది. ఇలాంటి అనారోగ్యకరమైన ధోరణులు ఇటీవలి కాలంలో మీడియాలో బాగా పెరిగిపోయాయి. తమ రేటింగ్ కోసం బాధ్యతాయుతమైన వ్యక్తుల మీద లేనిపోని అభాండాలు వేయడం దారుణమైన విషయం. మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయంలో నానాయాగీ చేసిన శ్రుతిహాసన్ ఎంత తప్పు చేసిందో, ఈ విషయంలో అభూత కల్పనలు ప్రసారం చేసిన మీడియా కూడా అంతే తప్పు చేసినట్టు. ఈ విషయంలో మీడియా తన పొరపాటును తెలుసుకుని, భవిష్యత్తులో అయినా బాధ్యతాయుతంగా ఆలోచిస్తుందని ఆశించడం అత్యాశే అయినా... మనం ఆశావాదులం... అలా జరుగుతుందనే ఆశిద్దాం.