పవన్ ఉద్యమిస్తాడట.. అబ్బ ఛా...



సినీ హీరో, జనసేన పార్టీ ఏకైన నాయకుడు పవన్ కళ్యాణ్‌ది ఉరుములేని పిడుగు టైపు. అప్పటి వరకు ఎక్కడున్నాడో తెలియదు.. అంతలోనే సడన్‌గా ఓ పిడుగులాంటి స్టేట్‌మెంట్ ఇచ్చేస్తాడు. అప్పుడిక  మీడియా పని మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన రెండు లైన్ల స్టేట్‌మెంట్‌కి రకరకాల ఊహాగానాలు, కల్పనలు, కాకరకాయలు జోడించి కథనాలు ప్రసారం చేస్తుంది. పాపం స్టేట్‌మెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఊహించని విషయాలను కూడా మీడియా ఊహించేస్తుంది. ఒక్కోసారి ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఏం చేయాలో కూడా మీడియా చెప్పేస్తుంది. అదేంటోగానీ, పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు మీడియా చెప్పినట్టే అడుగులు వేస్తూ వుంటాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఏపీ రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం భూ సేకరణ చేయాలని అనుకుంటోందట, దానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఉద్యమించేస్తాడట. అదీ విషయం...

పవన్ కళ్యాణ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు కాబట్టి ఇక ఉద్యమించేస్తాడని, ఆయన ఉద్యమం వల్ల భూమి బద్దలైపోతుందని, ఆకాశం కంపించిపోతుందని ఆయన అభిమానులు అనుకుంటే అనుకుంటారేమో. అయితే, ఆయన వరసని మొదటినుంచీ గమనిస్తున్న పరిశీలకులు మాత్రం పవన్ కళ్యాణ్‌ చేస్తున్నవి  కేవలం తాటాకు చప్పుళ్ళేనని, ఆయన ఆవేశం కేవలం తాటాకు మంటేనని అంటున్నారు. ఉద్యమం చేసేంత సీను ఆయనకు లేదని స్పష్టంగా చెబుతున్నారు. ఎప్పుడో ఒక్కసారి బయట కనపడితే మళ్ళీ నాలుగైదు నెలల వరకూ అడ్రస్ లేకుండా పోయే ఆయనేంటి... ఉద్యమం చేసేందేంటి అని అంటున్నారు. ఆయన పార్టీ పెట్టి ఏడాది ఎప్పుడో పూర్తయింది. పేరయితే ప్రకటించారుగానీ, తన పార్టీ నిర్మాణానికి ఆయన ఎంతమాత్రం పూనుకోలేదు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయన పార్టీ ఏక్‌నిరంజన్‌గానే వుంది. ఉట్టెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానని అందట. పార్టీని అభివృద్ధి చేసుకోవడమే చేతగాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉద్యమాలు చేసేస్తానని ప్రకటించడం ఉట్టెక్కలేనమ్మ తరహాలోనే వుంది. ఉద్యమం చేస్తానని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ప్రకటించాడు. కనీసం ఆయన మీడియా ముందుకు రాలేదు. ఆయన ప్రతినిధి అంటూ ఎవరూ రాలేదు.. ఉద్యమం చేస్తానని ప్రకటించడానికే మనుషులు లేని ఆయన ఇంకేం ఉద్యమం చేస్తాడని పరిశీకులు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఉద్యమం చేస్తానంటున్నాడు. అసలు ఉద్యమమంటే ఏం చేస్తాడు? రాజధాని గ్రామాలకు వెళ్ళి మరోసారి ఆవేశంగా మాట్లాడతాడా? ఒకవేళ అక్కడ ఆవేశంగా మాట్లాడి అక్కడి రైతుల్ని రెచ్చగొట్టినా, మర్నాడు హైదరాబాద్‌లో నాలుక్కరుచుకుని ప్రభుత్వాన్ని పొగిడేరకం ఆయన. మొన్నామధ్య కూడా జరిగింది అదే కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను మాట్లాడిన మాటకే కట్టుబడి వుండే ధైర్యం ఆయనకు లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను మాట్లాడిన మాటలకు రియాక్షన్ ఎలా వుంటుందో రెండు మూడు రోజులు వేచి చూసే ఓర్పు కూడా ఆయనకు లేదు. తనను చూడటానికి వచ్చిన జనం ముందు ఆవేశంగా మాట్లాడ్డం, వాళ్ళను రెచ్చగొట్టడం, ఆ తర్వాత మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం... ఇదే ఉద్యమమని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారేమో. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ‘ఉద్యమం’ చేసి పరిస్థితిని సర్వనాశనం చేయడం తప్ప ఆయన సాధించేదేమీ వుండని పరిశీలకులు అంటున్నారు.