రాజకీయాల్లో కవిత మళ్లీ యాక్టివ్.. హరీశ్‌కు చెక్ పెట్టేందుకేనా?
posted on Nov 25, 2024 5:43AM
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని కాంగ్రెస్ నేతలు పదేపదే ప్రస్తావిస్తున్నారు. స్వయాన సీఎం రేవంత్ రెడ్డిసైతం కేటీఆర్ ను జైలుకు పంపిస్తానంటూ బహిరంగ సభల్లో పేర్కొన్నారు. కేటీఆర్ కూడా జైలుకెళ్లేందుకు, సిద్ధమని చెప్పడమే కాకుండా, జైల్లో యోగా చేసుకొని, మంచి ఫిట్ నెస్ తో బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానంటూ ప్రకటన కూడా చేశారు. త్వరలో కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఓ క్లారిటీతో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలన్నీ కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అధికార పార్టీకి కౌంటర్ ఇస్తూ పార్టీలో అన్నీతానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి సమయంలో కేటీఆర్ జైలుకెళ్తే పార్టీని ముందుకు నడిపించే వారు ఎవరన్న చర్చ బీఆర్ ఎస్ వర్గాల్లో మొదలైంది. పార్టీలోని ఓ వర్గం నేతలు రాబోయే రోజుల్లో హరీశ్‌రావు పార్టీలో కీలకంగా మారబోతున్నాడని, ఆయనే పార్టీని ముందుకు నడిపించే వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలోనే కవిత రాజకీయాల్లో యాక్టీవ్ కావడం చర్చనీయాశంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఇటు ప్రజా క్షేత్రంలోనూ అడుగుపెట్టారు. ఇటీవల అదానీ కేసు విషయంలో కవిత కేంద్రంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత గురుకులలో ఫుడ్ పాయిజన్ కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించి కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేశారు. దీనికితోడు చాలారోజుల తరువాత తన నివాసంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఏ), బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. దీంతో కవిత ఈజ్ బ్యాక్ అని ఆ పార్టీ నేతలు, జాగృతి కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లకముందు కవిత అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేశారు. బీసీ హక్కుల సాధన ఎజెండాతో యూనైటెడ్ పూలే ఫ్రంట్ (యూపీఏ), భారత జాగృతి సంస్థల తరపున జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. మనమెంతో మనకంత నినాదంతో ముందుకెళ్లాలంటూ పిలుపునిస్తూ బీసీ ఉద్యమాన్ని తలకెత్తుకున్నారు. కులగణన చట్టబద్ధంగా చేయాలంటూ కవిత డిమాండ్ చేశారు. అయితే అరెస్టయి జైలుకెళ్లి, బెయిల్ పై విడుదలైన అనంతరం సైలెంట్ అయిపోయారు. పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. అటువంటి కవిత మళ్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
కవిత ఉన్నట్లుండి ఇప్పుడు రాజకీయాల్లో యాక్టీవ్ కావడం కేసీఆర్ వ్యూహంలో భాగమేనని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందరూ ఊహించినట్లు కేటీఆర్ నిజంగా జైలుకెళితే పార్టీని నడిపించే బాధ్యతను కవిత తీసుకోబోతున్నారని, అందుకే ఆమె ఉన్నట్లుంటి రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. కవిత పొలిటికల్ గా మైలేజ్ సంపాదించుకున్నా కేటీఆర్ కు వచ్చే ఇబ్బంది ఏమీలేదు. ఎందుకంటే.. కవిత జైల్లో ఉన్న సమయంలో తన చెల్లికి బెయిల్ కోసం కేటీఆర్ ఢిల్లీలోనే మకాం వేసి తీవ్రంగా శ్రమించారు. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత కవిత సైతం అన్నను హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలో అన్నాచెల్లెలు మధ్య ఒకరిపైఒకరికి ఉన్న ప్రేమ బహిర్గతం చేశారు. దీంతో రాజకీయాల్లో తాను ఎంత ప్రజాదరణ పొందినప్పటికీ.. తన అన్న తరువాతనే ఉంటానని కవిత చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలో ఒకవేళ కేటీఆర్ ఏదైనా కేసులో జైలుకెళ్లినప్పటికీ పార్టీ బాధ్యతలను కవిత తన భుజస్కంధాలపై వేసుకుంటారని, కేటీఆర్ జైలు నుంచి తిరిగిరాగానే ఆయన సారథ్యంలో రాజకీయాల్లో కొనసాగుతారని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇలా అన్నాచెల్లెలు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం కృషి చేస్తూనే.. మరో వ్యక్తి చేతికి పార్టీ పగ్గాలు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని, తద్వారా కేసీఆర్ వారసుడు కేటీఆర్ అనే విషయాన్ని క్యాడర్ లోకి కవిత బలంగా తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి తరువాత కేసీఆర్ పెద్దగా బయటకు రావటం లేదు. అడపాదడపా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ.. కేటీఆరే పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నాడు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ముందు కేటీఆర్ తేలిపోతున్నాడని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. హరీశ్ రావు లాంటి సీనియర్ నేతకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీలోని ఓ వర్గం డిమాండ్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ జైలుకెళితే పార్టీ పగ్గాలు హరీశ్ రావు చేతికి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావించిన కేసీఆర్.. తన కుమార్తె కవితను రంగంలోకి దింపినట్లు బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత తన తండ్రి సూచనతోనే ఉన్నట్లుండి ఒక్కసారిగా పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఎలాంటి పరిస్థితి ఎదురైనా హరీశ్ రావుకు చేతికి మాత్రం పార్టీ పగ్గాలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగానే కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారని తాజా రాజకీయ పరిణామాలను బట్టిచూస్తే స్పష్టమవుతోంది.