క్లాసు తీసుకునే వరకూ మారరా?



తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సరిగా పనిచేయని వారికి క్లాసు తీసుకున్నారని, నవ్వుతూనే హెచ్చరించారని వచ్చిన వార్తలు చూసి నవ్వుకోని వారు వుండరు. ఎందుకంటే, చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తూ, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆయనతోపాటు ఉత్సాహంగా పనిచేయాలి. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ ఇంకా నేర్చుకునే స్థితిలోనే, ముఖ్యమంత్రి చేత వార్నింగులు ఇప్పించుకునే స్థితిలోనే ఏపీ మంత్రులు వున్నారంటే వారిని ఏమనాలి? చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ ఎన్నోసార్లు పలువురు మంత్రుల్ని పని సరిగా చేయడం లేదంటూ హెచ్చరించారు. తాజాగా నవ్వుతూనే క్లాస్ తీసుకున్నారు. మంత్రులందరూ బాగానే చదువుతున్నారు. కానీ ఎంత బాగా చదివినా చివరకు పరీక్షల్లో పాసవ్వాలి. పాసవ్వకుండా ఎంత చదివినా ఏం లాభం అని ముఖ్యమంత్రి మంత్రులతో అన్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ముఖ్యమంత్రి ఇంత మాట అనేంత వరకూ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి.

ఇప్పటికీ చంద్రబాబు నాయుడితో సమానంగా పనిచేసే మంత్రులు ఏపీ మంత్రివర్గంలో  లేరు అని చెప్పుకోవడానికి ఎంతమాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు. నష్టాల్లో వున్న రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం చంద్రబాబు చేస్తున్న కృషిలో యాభై శాతం కృషి చేయగలిగినా ముఖ్యమంత్రిగా చేదోడుగా వున్నట్టు వుంటుంది. శ్రమించడానికి ఎవర్నో ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరికంటే పెద్ద ఉదాహరణగా ముఖ్యమంత్రి చంద్రబాబే కనిపిస్తున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పనిచేస్తూ కూడా ఆయన్ని ఫాలో అవకుండా వున్న మంత్రులను ఏమనాలి? మంత్రివర్గం ఏర్పాటులో వివిధ సమీకరణాల కారణంగా కొంతమంది ప్యాసింజర్ రైళ్ళకు కూడా మంత్రి పదవులు దక్కాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాంటి ముఖ్యమంత్రి పనితీరును వీళ్ళు అందుకోలేకపోతున్నారు. వారికి ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా వేగాన్ని పెంచుకోలేకపోతున్నారు. అలాంటి మంత్రుల తీరు ఇలాగే కొనసాగితే ఆ ప్యాసింజర్ రైళ్ళను చంద్రబాబు పట్టాలు తప్పించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సరైన పనితీరు ప్రదర్శించని మంత్రులు తమ వర్కింగ్ స్టైల్‌ని మెరుగు పరుచుకుని ముఖ్యమంత్రికి తగ్గ మంత్రులుగా ప్రశంసలు పొందితే అందరికీ ఆనందమే.