కాంగ్రెస్ గుర్తు హస్తం కాదా, సైకిలా?

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారిక చిహ్నం సైకిల్ కదా? యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇడియా కూటమి పొత్తులో భాగంగా అక్కడ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ రెండు స్థానాలలో పోటీకి దిగుతోంది. అయితే ఆశ్చర్యకరంగా యూపీలో రెండు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు హస్తం గుర్తుపై కాకుండా సైకిల్ గుర్తుపై పోటీ చేయనున్నారు.

దీంతో కాంగ్రెస్ గుర్తు మారిపోయిందా? హస్తం అచ్చిరావడం లేదని సైకిల్ గుర్తు వైపు మొగ్గు చూపుతోందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అయితే విషయం ఏమిటంటే.. ఉప ఎన్నికలలో పొత్తు, సీట్ల సర్దుబాటు కంటే విజయమే లక్ష్యంగా కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గుర్తుల తంపులు లేకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కాంగ్రెస్ తరఫున ఉప ఎన్నికల బరిలో దిగే ఇద్దరు అభ్యర్థులూ కూడా సమాజ్ వాది పార్టీ చిహ్నమైన సైకిల్ గుర్తుపైనే పోటీ చేయాలని కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి.

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ల మధ్య జరిగిన చర్చలో ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చాయి. దీంతో యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెలలో జరిగే ఉప ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ తరఫున పోటీ చేసే ఏడుగురు అభ్యర్థులు, అలాగే కాంగ్రెస్ తరఫున పోటీలో ఉండే ఇద్దరు అభ్యర్థులూ కూడా సైకిల్ గుర్తుపైనే పోటీ చేస్తారు. అంటే ఉత్తర ప్రదేశ్ లో 9 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ వారు సమాజ్ వాదీ అభ్యర్థులుగానే పోటీ చేస్తారన్న మాట. అంటే కాంగ్రెస్ పోత్తు ధర్మాన్ని పాటించి పోటీకి దూరంగా ఉండబోతోందని అర్ధం.