కేటీఆర్ రాజకీయ అపరిపక్వత.. హరీష్ కే పగ్గాలంటూ బీఆర్ఎస్ కేడర్ డిమాండ్?!

రాజ‌కీయాల్లో  విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు కామ‌న్‌.. ఒక్కోసారి దాడులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పార్టీ కోసం ప్రాణ‌మిచ్చే కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకోవ‌టానికి నాయ‌కులు ఎంత‌దూర‌మైనా వెళ్లాల్సి వ‌స్తుంది. ఇది అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ్య‌మే.  కానీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కు మాత్రం ఈ విషయం ఇంకా తెలిసిన‌ట్లు కనిపించదు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర  ఆవిర్భావం తరువాత  బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అధికారంలోకి వ‌చ్చింది. ఏకంగా ప‌దేళ్లు ప్ర‌జ‌లు ఆ పార్టీకి ప‌ట్టం క‌ట్టారు. దీంతో అధికారంలో ఉంటే వ‌చ్చే గౌర‌వాన్ని మాత్ర‌మే కేటీఆర్‌ ఇన్నాళ్లూ అను భ‌వించారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో బీఆర్ఎస్ ప్ర‌తిప‌క్ష స్థానానికి ప‌రిమి త‌మైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దీంతో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద‌ దిక్కులా మారాడు. అధికార పార్టీపై నిత్యం విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అధికార పార్టీ నేత‌లు కూ డా సహజంగానే కేటీఆర్ టార్గెట్‌గా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వ్య‌క్తిగ‌త విష‌యాలుకూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయి.  కానీ కేటీఆర్ వాటిని జీర్ణించుకోలేక పోతున్నాడు. అధికారంలో ఉన్న‌ప్పుడు, ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా కేటీఆర్‌, బీఆర్ఎస్ నేత‌లు రేవంత్ రెడ్డిస‌హా అనేక మంది కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు. దీంతో బీఆర్ఎస్ నేత‌ల విమ‌ర్శ‌ల‌కు వారు స‌మాధానం ఇచ్చుకున్నారు. కానీ, కేటీఆర్‌పై ఒక‌టి రెండు వ్య‌క్తిగత విమ‌ర్శ‌లు చేయ‌గానే  భ‌య‌ప‌డిపోయి లీగ‌ల్ నోటీసులు ఇవ్వ‌డం బీఆర్ఎస్ శ్రేణుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

త‌న‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారంటూ ఇటీవ‌ల మంత్రి కొండా సురేఖ‌కు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు ఇచ్చారు. త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే ప‌రువు న‌ష్టం దావా వేస్తా, దావాతో పాటు క్రిమిన‌ల్ కేసులు వేస్తా అంటూ కేటీఆర్ బెదిరించారు. వాస్త‌వాన్ని ప‌రిశీలిస్తే.. కొండా సురేఖ‌, బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అయితే, హ‌రీశ్ రావు, కేటీఆర్ డీపీలు క‌లిగిన ఇద్ద‌రు వ్య‌క్తులు వారిపై అస‌భ్య‌క‌ర  వ్యాఖ్య‌లు చేశారు. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. మంత్రి కొండా సురేఖ ఆ పోస్టుల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హ‌రీశ్ రావుసైతం స్పందిస్తూ అస‌భ్య‌క‌రంగా పెట్టిన పోస్టుల‌పై త‌న ఆగ్ర‌హాన్ని వెలుబుచ్చారు. కానీ, కేటీఆర్ స్పందించ‌లేదు. ఇదే విష‌యాన్ని మంత్రి ప్ర‌స్తావిస్తూ.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా పోస్టులు పెట్టాల‌ని కేటీఆర్ ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పిన‌ట్లు ఉంద‌న్నారు. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోవ‌టానికి కార‌ణం కేటీఆర్‌,  ఆయ‌న కొంద‌రు హీరోయిన్ల ఫోన్ల‌ను ట్యాపింగ్‌ చేశారు.. కేటీఆర్ కార‌ణంగా కొంద‌రు హీరోయిన్లు త్వ‌ర‌గా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి త‌ప్పుకున్నారంటూ ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌కు కేటీఆర్‌ స‌మాధానం ఇవ్వ‌కుండా లీగ‌ల్ నోటీసులు పంపించారు. మంత్రి సురేఖ నా ప‌రువుకు, గౌర‌వానికి భంగం క‌లిగించేలా వ్యాఖ్య‌లు చేశారంటూ లీగ‌ల్ నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు పంపించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

కేటీఆర్ లీగ‌ల్ నోటీసుల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు బండి సంజ‌య్‌. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీసు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోంది. కేటీఆర్ సుద్దపూస కాదు. ఆయన బాగోతం అంతా ప్రజలకు తెలుస‌ని సంజ‌య్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారం లో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో అందరికీ తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చాను.. నేనుకూడా లీగల్ నోటీసులకు నోటీసులతోనే జవాబిస్తాను.. కాచుకో కేటీఆర్ అంటూ సవాల్ చేశారు. దీంతో లీగల్ నోటీసుల వ్య‌వ‌హారం మరో లెవెల్ కు వెళ్లింది.

కేటీఆర్ తీరు ప‌ట్ల బీఆర్ఎస్ నేత‌లు సైతం కాస్త ఇబ్బందిప‌డుతున్నార‌ట‌. విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్పుడు వాటికి స‌రియైన స‌మాధానం చెప్పి ప్ర‌జ‌ల‌ను మెప్పించేలా రాజ‌కీయాలు చేయాలి. కానీ, విమ‌ర్శ‌లు చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ లీగ‌ల్ నోటీసులు ఇస్తామంటే ఎలా అంటూ కేటీఆర్ తీరు ప‌ట్ల కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అదంతా అలా ఉంచితే కేటీఆర్ రాజకీయ అపరిపక్వతకు ఇదే నిదర్శనం అన్న చర్చ రాజకీయ వర్గాలలో ఆరంభమైంది.  పాలిటిక్స్ లోకి వచ్చి ఇన్నేళ్లయినా.. కేటీఆర్ కురాజకీయాలు వంటబట్టలేదా అన్న వ్యాఖ్యలూ గట్టిగా వినిపిస్తున్నాయి. పొలిటికల్ విమర్శలన్నిటికీ లీగల్ నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్తే ఇక అదే పనిలో కేటీఆర్ ఉండాల్సిందే అన్న చర్చా జరుగుతోంది.  ఎందుకంటే నువ్వొకటంటే.. నేను రెండంటా అన్నట్లుంది ఇప్పటి రాజకీయం. కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆ స్థాయికి రాజ‌కీయాల‌ను దిగజార్చేశారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై కేసీఆర్ ఇష్ట‌మొచ్చిన‌ట్లు  వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న్ను ఎదుర్కోవాలంటే ఆయ‌న భాష‌నే ప్ర‌యోగించాల‌ని కాంగ్రెస్‌, బీజేపీల్లోని  కొంద‌రు నేత‌లు భావించి అలాగే మాట్లాడారు.   దీంతో రాజకీయాల్లో భాష కూడా రోజురోజుకూ దిగజారిపోతూ వ‌చ్చింది. అన్ పార్లమెంటరీ పదాలు పెద్దఎత్తున వాడుతున్నారు. ఇలాంటి సమయంలో లీగల్ నోటీసులు పని చేస్తాయా అనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది.

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆ పార్టీ అధినేత జ‌గ‌న్, వైసీపీ నేత‌లు చంద్ర‌బాబు నాయుడుపై వ్య‌క్తిగ‌తంగా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న భార్య‌ను సైతం అవ‌మాన‌క‌రంగా మాట్లాడారు. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు సైతం లీగ‌ల్ నోటీసులు ఇచ్చి ఉండొచ్చు. అలా ఇస్తే వారు చేసిన వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు నిజ‌మ‌ని ప్ర‌జ‌లు అర్ధంచేసుకొనే ప‌రిస్థితి ఉంటుంది. త‌న‌పై, త‌న కుటుంబంపై వ‌చ్చిన వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌ను చంద్ర‌బాబు, టీడీపీ నేత‌లు రాజ‌కీయంగానే ఎదుర్కొన్నారు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే వెళ్లి త‌మ నిజాయితీని నిరూపించుకొని జ‌గ‌న్ పార్టీకి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. తెలంగాణ‌లో వైసీపీ లాంటి అరాచ‌క పార్టీ లేదు. ఎప్పుడో ఒక స‌మ‌యంలో కొంద‌రు నేత‌లు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వాటికే కేటీఆర్ బ‌య‌ప‌డి లీగ‌ల్ నోటీసులు అనేస‌రికి.. ప్ర‌జ‌ల్లో సైతం కేటీఆర్ నిజంగా త‌ప్పుచేశారా  అనే భావ‌న వచ్చే ప్రమాదం ఉంది. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు కేటీఆర్ తీరు ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. కేటీఆర్ రాజ‌కీయాల్లో రాటు దేల‌కుంటే రాబోయే కాలంలో బీఆర్ఎస్  మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థంగా మారుతుంద‌ని ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కేటీఆర్ వ‌రుస లీగ‌ల్ నోటీసుల‌తో.. బీఆర్ఎస్ పార్టీ ప‌గ్గాలు హ‌రీశ్ రావుకు ఇస్తేనే మేల‌న్నభావన బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ఇలా తనను విమర్శించిన వారిపై పరువునష్టం దావాలు వేస్తూ  పోతే కేసీఆర్ కు ఇక పార్టీని పట్టించుకునే తీరిక ఉండే అవకాశం లేదనీ, అందుకే ఆయన పరువునష్టం దావాల వ్యవహారం చూసుకుంటూ పార్టీ పగ్గాలను హరీష్ కు అప్పగిస్తే మేలన్న వాదనకు బీఆర్ఎస్ లో మద్దతు పెరుగుతోంది. తొందరలోనే పార్టీలో మెజారిటీ నేతలు ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. పార్టీ అధ్యక్ష పగ్గాలు హరీష్ కు అప్పగించాలని డిమాండ్ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబు తున్నాయి.