ఏపీలో బీజేపీకి దూకుడు అవసరమా?



భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పుణ్యమా అని రాకరాక కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పుణ్యమా అని ఆంధ్రపదేశ్‌లో మంత్రివర్గంలో స్థానం సంపాదించుకుంది. అయితే అన్నప్రాశన రోజునే ఆవకాయ తినేయాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేయాలని కలలు కంటున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికారం కోసం ఇప్పటి నుంచే విత్తనాలు వేస్తున్నారు. ఏపీకి చెందిన కొంతమంది బీజేపీ నాయకులు అప్పుడప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్లు, ఏపీలో రాజకీయ నిరుద్యోగంలో వున్న అనేకమందిని పార్టీలో చేర్చుకోవడం దీనినే సూచిస్తున్నాయి. అవసరమైతే వైసీపీతో దోస్తీ చేయాలని కూడా కొంతమంది బీజేపీ నాయకుల బుర్రలో ఆలోచనలు పుడుతున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయాలను ప్రదర్శించడం మొదలుపెడితే 2019 ఎన్నికల నాటికి ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకోవచ్చన్నది అలాంటి నాయకుల ఆలోచన. అయితే ఏపీలో ఇంత దూకుడుగా వ్యవహరించడం బీజేపీకి అవసరమా అని ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాల్సి వుంది.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పాపం బీజేపీ ఖాతాలో కూడా వుంది. అయితే, తెలుగుదేశం పార్టీతో స్నేహం చేసిన పుణ్యమా అని ఏపీ ప్రజలు బీజేపీని క్షమించారు. కొన్ని స్థానాల్లో గెలిపించారు. ఏపీ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేలా చేశారు. అయితే ఇదంగా తన బలం కాదయా... టీడీపీతో స్నేహం వల్ల వచ్చిన బలమేనయా అనే విషయాన్ని మాత్రం కొంతమంది బీజేపీ నాయకులు మరచిపోయి వ్యవహరిస్తున్నారు. బీజేపీ మీద మొన్నటి వరకూ ఏపీలో కొంత సానుకూల అభిప్రాయమే వుండేది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మాట తప్పడం, ప్రత్యేక హోదా అడిగిన వాళ్ళని శత్రువులను చూసినట్టుగా చూడటం, ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన పాపానికి బీజేపీలోనే వున్న నటుడు శివాజీ గురించి చులకనగా మాట్లాడ్డం... ఇవన్నీ ప్రజలు గమనిస్తు్న్నారు. ఇవే కాకుండా ఏరకంగా చూసినా ఏపీలో బీజేపీ ప్రధాన పార్టీగా నిలబడే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. అంచేత బీజేపీ నాయకులు 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చే పగటి కలలను కనడం, దానికోసం రాజకీయాలు ప్రదర్శించడం మానుకుని తెలుగుదేశం ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా వుంటూ అభివృద్ధిలో భాగస్వామిగా కొనసాగితే అందరికీ మంచిది.