లోకేష్ దారిలోనే కేటీఆర్.. రెడ్ బుక్ అంటున్నారా?

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ బాగా పాపులర్ అయ్యింది. తెలగుదేశం విపక్షంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపై నిబంధనలకు తిలోదకాలిచ్చి మరీ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి కేసులు నమోదు చేసి, దౌర్జన్యాలకు పాల్పడిన అధికారుల పేర్లు లోకేష్ రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర చేసిన సందర్భంలో ఆయన పాదయాత్ర సాగుతున్న ప్రాంతాలలో నిబంధనలు, చట్టాలను పాటించకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన అధికారులు, ఇతర అధికారుల పేర్లను స్థానికుల సమాచారం మేరకు రోడ్ బుక్ లో నోట్ చేసే వారు. అధికారంలోకి రాగానే నిబంధనలకు చెల్లు చీటీ పాడి జగన్ పార్టీ తొత్తులుగా వ్యవహరించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని పార్టీ క్యాడర్ కు, ఆయా అధికారుల బాధితులకు లోకేష్ అప్పట్లో భరోసా ఇచ్చారు. 

సరే ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. ఇప్పుడు ఒక్కటొక్కటిగా రెడ్ బుక్ లో ఉన్న అధకారులపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అందులో భాగంగానే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా కూటమి సర్కార్ వారిని జీఏడీకి అటాచ్ చేసింది. అలాగే జగన్ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన వైసీపీ నేతలు ఒక్కొక్కరిపై అప్పుడు వారు చేసిన అరాచకాలకు సంబంధించిన కేసులు తెరమీదకు వస్తున్నాయి. కొందరు అరెస్టై జైళ్లలో ఉన్నారు. మరి కొందరు ముందస్తు బెయిలుపై ఉన్నారు. ఇంకొందరు పరారీలో ఉన్నారు. అలాగే అప్పట్లో అధికార పార్టీతో అంటకాగిన అధికారులు ఏ క్షణంలో తమపై చట్టం ప్రకారం కేసులు, చర్యలు ఉంటాయన్న భయంతో వణికిపోతున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లోకేష్ రెడ్ బుక్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. చేస్తోంది.

ఇక ఇప్పుడు విషయానికి వస్తే గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలై ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలకు దిగుతోంది. ఆ క్రమంలో ఆ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఒక్కొక్కసారి అరెస్టు చేస్తున్నారు. లేదా హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఇది సహజమే. అయినా పోలీసులు అధికార కాంగ్రెస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసులతో పాటు కొందరు అధికారులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజలను, బీఆర్ఎస్ క్యాడర్ ను వేధిస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. అక్కడితో ఆగకుండా వారి పేర్లన్ని నమోదు చేయండి.. మళ్లీ మనం అధికారంలోకి రాగానే వారి పని పడదాం అంటూ క్యాడర్ కు పిలుపు నిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లోకేష్ బాటలో నడుస్తున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. 

సరిగ్గా గతంలో లోకేష్ ఏ విధంగా అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడికి లొంగి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించిన ఎవరినీ వదలం.. వాళ్లందరి పేర్లూ రెడ్ బుక్ లో రాసిపెట్టుకున్నానంటూ చెప్పేవారో ఇప్పుడు కేటీఆర్ కూడా సరిగ్గా అలాగే పై నుంచి వచ్చే ఒత్తిళ్లకు లొంగి బీఆర్ఎస్ నేతలకు, క్యాడర్ పై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్న అధికారుల పేర్లు రాసి పెట్టండంటూ పిలుపునిస్తున్నారు.   పైనుంచి వచ్చే ఒత్తిడితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరిస్తున్నారు. అటువంటి అధికారులకు తాము అధికారంలోకి వచ్చాకా వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు పోరుబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రైతుల కోసం తాము ఎంత దూరమైనా వెళతామన్నారు. అవసరమైతే జైలుకైనా వెళతామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని మండిపడ్డారు. ఏ  హామీనీ నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని జనం తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.