అమరావతి సాకారం సత్వరం!
posted on Oct 21, 2024 10:11AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక చకచకా సాగుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టత ఇచ్చారు. నిర్దిష్ట కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్న కృత నిశ్చయంతో ఉన్న చంద్రబాబు.. మూడేళ్లలో అమరావతి పూర్తి చేయాలన్న విస్పష్ట ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇక అమరావతి పనులు పరుగులు పెడతాయనడంలో సందేహం లేదు.
జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో ఆయన అమరావతిపై కక్ష కట్టినట్లుగా వ్యవహరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి నిర్మాణ పనులను ఆపేశారు. వైసీపీ నేతలు, మంత్రులు అయితే అమరావతిని శ్మశానంతో పోల్చారు. భ్రమరావతి అని ఎగతాళి చేశారు. గ్రాఫిక్స్ అంటూ ఎద్దేవా చేశారు. అదే రాజధాని అమరావతిలో చంద్రబాబు హయాంలో నిర్మాణమైన సచివాలయం, అసెంబ్లీలో కార్యకలాపాలను కొనసాగిస్తూనే అమరావతిపై దుష్ప్రచారం చేశారు. 2019లో ప్రభుత్వం మారడంతో పనులకు బ్రేక్ పడ్డాయి.ఆ ప్రదేశాలు పిచ్చిమొక్కలకు ఆలవాలమైంది.అమరావతి రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులు ఇక్కడే నిర్మించాలని ఉద్యమం చేసారు.వైసీపీ ప్రభుత్వం అమరావతి కి వ్యతిరేకంగా మూడురాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు.విశాఖను చేస్తామన్నారు.చివరికి ఐదేళ్లు రాజధాని లేకుండా,రాకుండా గడిపేశారు. 2024లో కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతి పేరు బయటకువచ్చింది. కేంద్రం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే గత ఐదేళ్ల జగన్ నిర్వాకం కారణంగా అమరావతి మొత్తం పిచ్చిచెట్లు, తుప్పలతో జంగిల్ గా మారింది. దీంతో చంద్రబాబు సర్కార్ తొలుత యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లయరెన్స్ పనులను చేపట్టింది. జంగిల్ క్లియరెన్స్ పూర్తి కావడంతో శనివారం అమరావతి పనులను పున: ప్రారంభించారు.
సచివాలయం,అసెంబ్లీ,కొన్ని కార్యాలయాలు బాబు హాయాంలో గతంలో పూర్తిఅయ్యాయి. అధికారుల,ఉద్యోగుల క్వార్టర్స్ సగంలో ఆగిపోయాయి. మరికొన్ని నిర్మాణాలు చివరిదశలో ఆగిపోయాయి. రాజధాని కోసం 54వేల ఎకరాలను సేకరించామని సీఎం చంద్రబాబు చెప్పారు.దీనిలో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములు 30వేల ఎకరాలుపైగా ఉన్నాయి. గత ఐదేళ్లుగా రాజధాని రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా చంద్రబాబు క్లియర్ చేసారు. పోలవరం కొంచం ఆలస్యమవచ్చుగానీ అమరావతి విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని చంద్రబాబు ఉద్ఘాటించారు. రహదారులు, ఇతర సంస్థల ఏర్పాటుతో పాటు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీఆర్డీఏ రాజధాని నిర్మాణ బాధ్యతలను చేపట్టనుంది. హైదరాబాద్ ను తలదన్నేలా, ప్రపంచ స్థాయి నగరంలో అమరావతిని నిర్మించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. హైటెక్ సిటీ,సైబరాబాద్ నిర్మాణాలు చంద్రబాబు హయాంలోనే జరిగాయి.వాటికి దీటుగా అమరావతిని తీర్చిదిద్దే ఆలోచనలో ఆయన ఉన్నారు.
మామూలుగా బాబు ఐదేళ్లలో అమరావతి, పోలవరం పూర్తిచేయాలని సీఎంకాగానే తలచారు. విశాఖ ఆర్ధిక రాజధానిగా, సినీపరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలని భావించారు. అలాగే కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేసి వారినీ అభివృద్ధిలో భాగస్వాములు చేసే ఆలోచనలో ఉన్నారు.అమరావతి రాష్ట్రానికి సెంటర్ పాయింట్. రాజధానికి ఇక్కడే నిర్మిస్తే ప్రజలకు సౌకర్యాలతో పాటు అందుబాటులో ఉంటుందని చంద్రబాబు భావన.
అయితే బీజేపీ జమిలి ఎన్నికల బాటలో పయనిస్తుండటంతో ముందస్తు ఎన్నికలు తప్పవన్న నిర్దారణకు వచ్చిన చంద్రబాబు అందుకు అనుగుణంగా అమరావతి నిర్మాణ వ్యవధిని కుదించారు. మూడేళ్లలో రాజధాని పూర్తికావాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ముందుకు పోతున్నారు.అలాగే సూపర్ సిక్స్ హామీలను కూడా జనవరి నుంచే అమలు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి అత్యాధునిక రాజధాని మూడేళ్లలో సాకారం కావడం తథ్యమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.