LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,  జనసేనాని పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన పార్టీని   తెలంగాణలో కూడా విస్తరించేందుకు  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా..   జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రయాణం అనే నినాదంతో నిర్వహించిన కీలక సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ కీలక ప్రకటన చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని  పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన  పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విస్తరణ ప్రణాళిక వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రకటించిన  9 వేల 400 కోట్ల రూపాయల  భారీ ప్యాకేజీని పవన్ కళ్యాణ్  స్వాగతించారు. గుడెబల్లూరు - మహబూబ్‌నగర్ మధ్య ఎన్‌హెచ్-167 రహదారి విస్తరణ, జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్, వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్, హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్,  రూ. 1,535 కోట్ల విలువైన రైల్వే ఆధునీకరణ ప్రాజెక్టులను పవన్ కల్యాణ్ బాహాటంగా  ప్రశంసించారు.  వికసిత్ తెలంగాణ కోసం వికసిత్ భారత్  నినాదంతో కేంద్రం చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలను జనసేన క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని ఆయన పిలుపు కూడా ఇచ్చారు. ఎన్డీఏ కూటమిలో  కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను దక్షిణాదిలో ఒక బలమైన జాతీయవాద ముఖచిత్రంగా నిలబెట్టేందుకు బీజేపీ అధిష్ఠానం కూడా ఆసక్తి చూపిస్తోంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎంట్రీని ఈ కారణంతోనే  కాంగ్రెస్  తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పవన్   తెలంగాణలో జనసేన విస్తరణ అంటూ ప్రకటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ  అస్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తే..  పవన్ కళ్యాణ్  దీటుగా కౌంటర్ ఇస్తూ..  గతంలో ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నాయకులు తమ సొంత రాష్ట్రాలు కాకపోయినా ఇతర ప్రాంతాల నుండి పోటీ చేసినప్పుడు లేని అభ్యంతరం, తనపై ఎందుకంటూ నిలదీశారు.  తెలంగాణ ఎవరి జాగీరు కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సైబరాబాద్ పోలీసులు గచ్చిబౌలిలో జనసేన సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో..  పవన్ కళ్యాణ్ తన జూబ్లీహిల్స్ నివాసంలో దాదాపు 50 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను ఎండగట్టారు.   నియోజకవర్గాల పునర్విభజన  విషయంలో దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలపై స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణవ్యాప్తంగా పర్యటించి, కొండగట్టు అంజన్న దేవాలయాన్ని దర్శించుకుని    వారాహి యాత్ర ను ఇక్కడ కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రంలో మోదీ అండ, క్షేత్రస్థాయిలో యువత క్రేజ్ కలగలిసి తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎలాంటి  ప్రభావాన్ని చూపనుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. వ్యవహార శైలి, ఆయన అమలు చేస్తున్న వ్యూహాల పట్ల వైసీపీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోందా? అంటే ఆ పార్టీ వర్గాల నుంచే ఔననే సమాధానం వస్తున్నది. ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు  ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.  గత సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజికవర్గం అంతా ఏకతాటిపైకి వచ్చి కూటమికి అండగా నిలబడటం, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటే నడవటం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో పార్టీ మనుగడ కోసం, రాష్ట్రంలో మళ్లీ పట్టు సాధించడం కోసం కాపు సామాజికవర్గం విషయంలో  వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఆ విషయంలో జగన్.. వరుసగా తప్పుడు వ్యూహాలు, నిర్ణయాలతో కాపు సమాజికవర్గాన్ని పార్టీకి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది.    జగన్ మోహన్ రెడ్డి   కాపు సామాజికవర్గాన్నిపార్టీకి అనుకూలంగా మర్చుకోవడానికి ప్రయత్నించడం మాని, ఆ వర్గం అదే సమాజికవర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు దూరం అయితే చాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారనీ, కానీ ఇది అంతిమంగా వైసీపీకి తీరని నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది.   జగన్ ఈ తీరునువైసీపీలోని  పలువురు సీనియర్లు ప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజికవర్గంలో అనైక్యతను పెంచడం వల్ల, వారి మధ్య చిచ్చు పెట్టడం వల్ల వైసీపీకి ఇసుమంతైనా ప్రయోజనం, రాజకీయ లబ్ధి ఉండకపోవడం అటుంచి.. అది బూమరాంగ్ అయ్యి మొత్తం కాపు సామాజికవర్గాన్నే పార్టీకి దూరం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   
మహా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. శివసేన పార్టీ 60వ వ్యవస్థాపక వేడుకల వేళ ముంబై వేదికగా శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య   మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.  గోరెగావ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఏక్‌నాథ్ షిండే ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా కొందరు నేతలు తమపై విమర్శలు గుప్పిస్తున్నారనీ,  అయితే టైగర్  బెదరదనీ అన్నారు.  తమదే అసలైన శివసేన అని ఆయనీ సందర్భంగా ప్రకటించారు.   ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు తమ వైపు రాబోతున్నారనే ప్రచారంపై షిండే నేరుగా స్పందించారు. ఇది కేవలం  ఆపరేషన్ టైగర్  ట్రైలర్ మాత్రమేనన్న ఆయన.. రాబోయే రోజుల్లో అసలు సినిమా చూపించబోతున్నామన్నారు.    బాలాసాహెబ్ థాకరే సిద్ధాంతాలను ఉద్ధవ్ థాకరే పూర్తిగా విస్మరించారని షిండే ఆరోపించారు. కేవలం ముఖ్యమంత్రి పదవి,  అధికారం కోసమే బాలాసాహెబ్ ఆశయాలను కాంగ్రెస్, ఎన్‌సీపీల వద్ద ఉద్ధవ్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తాము చేసిన చారిత్రాత్మక తిరుగుబాటు వల్లే శివసేన పార్టీ మళ్లీ సాధారణ ప్రజలకు, కార్యకర్తలకు చేరిందన్నారు. ఒకవేళ బాలాసాహెబ్ బతికి ఉంటే, దేశాన్ని గర్వపడేలా చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన నాయకత్వాన్ని కచ్చితంగా అభినందించేవారని షిండే పేర్కొన్నారు.   ఇక మరోవైపు ఉద్ధవ్ థాకరే   వర్గం నిర్వహించిన సభలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీని వీడి షిండే వర్గంలోకి వెళ్తున్న ప్రజాప్రతినిధులను, ముఖ్యంగా ఆ ఆరుగురు లోక్‌సభ ఎంపీలను  ద్రోహులుగా   అభివర్ణించారు. ఒకవేళ పార్టీ కార్యకర్తలకు తన నాయకత్వం నచ్చకపోతే, గౌరవంగా శివసేన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి  తాను సిద్ధమేనంటూ ఉద్ధవ్ థాకరే సంచలన ప్రకటన చేశారు. ఈ రాజకీయ తిరుగుబాటు,  పార్టీ చీలిక వెనుక కేంద్ర శక్తుల ప్రమేయం   ఉందని ఆయన ఆరోపించారు. పార్టీ ఉనికిని, బాలాసాహెబ్ వారసత్వాన్ని కాపాడుకోవడానికి తాను ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు.  
ALSO ON TELUGUONE N E W S
సినిమా ఇండస్ట్రీలో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో.. అదే స్థాయిలో కొందరు కేటుగాళ్లు దాన్ని దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. తాజాగా కన్నడతో పాటు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న నటి రుక్మిణి వసంత్ ఎదుర్కొన్న డీప్‌ఫేక్ వేధింపుల కేసులో కర్ణాటక పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆమె పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించిన ముగ్గురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. గత మే నెలలో ఎఐ ద్వారా రుక్మిణి వసంత్ ముఖాన్ని మరొకరి శరీరానికి అతికించి కొన్ని అశ్లీల బికినీ చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నటి, వెంటనే బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసి.. బాగల్‌కోట్‌కు చెందిన రవికుమార్ (24)తో పాటు బెంగళూరుకు చెందిన చంద్రకాంత్ (33), రంజిత్ (25)లను అరెస్ట్ చేసి ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల విచారణ ప్రకారం.. రుక్మిణి వసంత్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఈ నకిలీ కంటెంట్‌ను సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేసిన దాదాపు 29 అకౌంట్లపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ప్రచారం చేసిన ముగ్గురిని పోలీసులు పట్టుకోగా, మిగిలిన వారి కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల తోటి నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమాతో తెలుగు, కన్నడ ప్రేక్షకుల గుండెల్లో ‘ప్రియ’గా చెరపరాని ముద్ర వేసుకుంది ఈ కన్నడ బ్యూటీ. తన సహజసిద్ధమైన నటనతో అనతికాలంలోనే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న రుక్మిణి.. ప్రస్తుతం టాలీవుడ్, శాండల్‌వుడ్‌లలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో అభిమానులు నకిలీ చిత్రాలను నమ్మవద్దని, వాటిని మరింత షేర్ చేయకుండా నైతిక బాధ్యతగా వ్యవహరించాలని రుక్మిణి సోషల్ మీడియా ద్వారా కోరారు. ప్రస్తుతం ఈ కన్నడ నటి మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ అయిన ‘కాంతార చాప్టర్ 1’లో రిషబ్ శెట్టి సరసన కథానాయికగా నటిస్తోంది. ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని సినీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న తరుణంలో ఎదురైన ఈ సైబర్ వేధింపుల నుంచి ఆమెకు న్యాయం జరగాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని అటు ఫ్యాన్స్, ఇటు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాలలో గళం విప్పుతున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లీడ్ రోల్‌లో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. రాజ్ నిడిమోరు క్రియేట్ చేసిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్‌ బ్యానర్‌పై సమంత స్వయంగా నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజే ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందుకు సంబంధించిన అధికారిక కలెక్షన్ల పోస్టర్ ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రకారం 'మా ఇంటి బంగారం' చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 13.15 కోట్ల రూపాయల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకి ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ అద్భుతమైన విజయంపై స్పందిస్తూ సమంత తన అఫీషియల్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశారు. మొదటి రోజు ఇంతటి ఘనవిజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా హీరో ఆధారితమా లేదా హీరోయిన్ ఆధారితమా అనే తేడా లేకుండా, కేవలం కంటెంట్‌ను నమ్మి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా థియేట్రికల్ ఓపెనింగ్స్ అనేవి కేవలం మేల్ ఆడియన్స్ వల్లే సాధ్యమవుతాయనే పాత నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ, ఈ చిత్రానికి మొదటి రోజు మహిళా ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలిరావడం సినిమా పరిశ్రమ ఎదుగుదలకు నిదర్శనమని సమంత సంతోషం వ్యక్తం చేశారు. తమ చిన్న ప్రొడక్షన్ హౌస్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' నమ్మిన సిద్ధాంతాన్ని నిలబెట్టుకుంటూ మొదటి రోజే ఒక బ్లాక్‌బస్టర్ హిట్‌ను డెలివరీ చేసిందని ఆమె ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.   https://x.com/Samanthaprabhu2/status/2068213638335533219
న‌టీన‌టులు: ప్రియ‌ద‌ర్శి-జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌-దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం-పావ‌ని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్‌, రోహిణి, గుండు సుదర్శన్ త‌దిత‌రులు క్రియేటర్స్: మ‌హి వి.రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌క‌త్వం:  శ్రీరామ్ ఎర‌గం నిర్మాత‌లు:  శివ మేక‌, సాహితి చింత‌ల‌పూడి రైట‌ర్స్‌:  విజ‌య్ న‌మోజు, డి.ఎస్.గౌత‌మ్‌ కెమెరా:  విశ్వేశ్వ‌ర్ శిల కోటి మ్యూజిక్‌:  అజ‌య్ అర‌సాడ‌ ఎడిట‌ర్‌: శ్రవణ్ క‌టిక‌నేని ఓటీటీ: జియో హాట్‌స్టార్ విడుదల తేదీ: జూన్ 19, 2026 హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మొదటి రెండు సీజన్లతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, సెన్సేషనల్ హిట్ సాధించిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. భార్యల బాధితులైన ముగ్గురు భర్తల కథతో నవ్వుల పూయించిన ఈ సిరీస్, ఇప్పుడు మూడో సీజన్‌తో మన ముందుకు వచ్చేసింది. మొదటి రెండు భాగాలకు మించి ఈసారి మరింత ఫన్, ఎమోషన్స్ ఉంటాయని మేకర్స్ ప్రామిస్ చేయడంతో, ప్రేక్షకుల్లో ఈ సిరీస్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ మూడో సీజన్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం. (Save The Tigers 3 Review) ఈ మూడో సీజన్ కథ విషయానికి వస్తే.. రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ) తమ వైవాహిక జీవితాల్లోని ఫ్రస్ట్రేషన్‌తోనే ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అయితే ఈసారి మేకర్స్ కథలోకి ఒక ఊహించని ఫాంటసీ, పారలల్ యూనివర్స్ ట్విస్ట్‌ను తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయి, ఆస్తులన్నీ పోగొట్టుకున్న గంటా రవి భార్య హైమావతి (జోర్దార్ సుజాత) పోరు భరించలేక బస్తీ నుంచి ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతాడు. మరోవైపు రాహుల్ తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయిన నిజాన్ని భార్య మాధురి (పావని గంగిరెడ్డి)కి చెప్పలేక నానా తిప్పలు పడుతుంటాడు. ఇక విక్రమ్ భార్య రేఖ (దేవయాని శర్మ) పెట్టిన కేసు వల్ల జాబ్‌తో పాటు స్టార్టప్ కంపెనీ కూడా మూతపడి విడాకులకు రెడీ అవుతాడు. ఈ ముగ్గురి బాధలు, దేవుడిపై వారు కురిపించే శాపనార్థాలు నేరుగా స్వర్గలోకంలోని ఇంద్రుడికి (వెన్నెల కిషోర్) చేరుతాయి. దీంతో చిత్రగుప్తుడు (గుండు సుదర్శన్) భూలోకానికి వచ్చి, వీరికి భార్యలు లేని ఒక ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని చూపిస్తాడు. ఆ కొత్త లోకంలో రవి పవర్‌ఫుల్ పొలిటీషియన్, రాహుల్ సక్సెస్‌ఫుల్ స్క్రీన్ రైటర్, విక్రమ్ వెల్తీ సీఈఓగా మారిపోతారు. కానీ, అక్కడ కూడా సుఖం లేదని వీరు ఎలా తెలుసుకున్నారనేదే అసలు ట్విస్ట్. మొత్తంగా ఆరు ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ రన్ టైమ్ దాదాపు 30 నిమిషాల పాటు సాగుతుంది. మొదటి మూడు ఎపిసోడ్‌లు రెండు వేర్వేరు లోకాల కన్ఫ్యూజన్ డ్రామాతో చాలా హిలేరియస్‌గా సాగిపోతాయి. ముఖ్యంగా నాలుగో ఎపిసోడ్ వచ్చేసరికి ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుంటుంది. ట్విస్టులు రివీల్ అయ్యే విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అయితే ఐదో ఎపిసోడ్ నుండి కథ కాస్త రూట్ మార్చి, కామెడీ కంటే ఆలోచింపజేసే సీన్లు, సందేశాత్మక డైలాగులతో ముందుకు సాగుతుంది. ఆఖరిదైన ఆరో ఎపిసోడ్ పూర్తిగా ఎమోషనల్ నోట్‌తో ముగుస్తుంది. మునుపటి సీజన్లతో పోలిస్తే ఈసారి వినోదంతో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా పెరిగాయి. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ కాస్త పెరిగినప్పటికీ, కొన్ని సన్నివేశాలు మళ్లీ మళ్లీ రిపీట్ అయినట్లు అనిపించి కథనంలో వేగాన్ని తగ్గించాయి. అలాగే కొన్ని డైలాగులు కాస్త లైన్ దాటినట్లు అనిపించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. నటీనటుల పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఈ సిరీస్‌కు ప్రధాన బలం ముగ్గురు హీరోల కెమిస్ట్రీనే అని చెప్పాలి. ప్రియదర్శి తన డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో అద్భుతమైన వైవిధ్యం చూపించాడు. ఒక లోకంలో అమాయకుడైన భర్తగా, మరో లోకంలో అవకాశవాది అయిన రాజకీయ నాయకుడిగా ఆయన నటన మెప్పిస్తుంది. అభినవ్ గోమఠం తన మార్క్ వన్ లైనర్స్, టైమింగ్‌తో ప్రతి ఎపిసోడ్‌లోనూ నవ్వుల పూయించాడు. చైతన్య కృష్ణ ఎమోషన్స్ మరియు ఫ్రస్ట్రేషన్‌ను చక్కగా బ్యాలెన్స్ చేశాడు. ఈసారి భార్యలుగా నటించిన పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, దేవయాని శర్మల పాత్రలకు మరింత ప్రాధాన్యత లభించింది. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారీ హిలేరియస్ వినోదాన్ని పంచగా, గంగవ్వ, రోహిణి, హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్ తమ సపోర్టింగ్ రోల్స్‌తో కథను నిలబెట్టారు. సాంకేతిక విభాగంలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఎడిటర్ శ్రావణ్ కటికనేని ప్రతి ఎపిసోడ్‌ను 25 నుండి 30 నిమిషాల క్రిస్ప్ రన్ టైమ్‌తో నడిపించినప్పటికీ, మిడిల్ ఎపిసోడ్స్‌లో కథ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. ఎస్. వి. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ రెండు వేర్వేరు లోకాలను విజువల్ కలర్ ప్యాలెట్‌తో చాలా చక్కగా చూపించింది. అజయ్ అరసాడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కామెడీ మరియు ఎమోషనల్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. కొన్ని చోట్ల డైలాగులు కాస్త లౌడ్‌గా అనిపించినా, భార్యాభర్తల బంధం అనేది ఒకరినొకరు గౌరవించుకునే భాగస్వామ్యం అనే మెసేజ్‌ను మహి వి రాఘవ్ టీమ్ ఎక్కడా బోర్ కొట్టించకుండా, నవ్విస్తూనే గుండెలకు హత్తుకునేలా చెప్పడంలో సక్సెస్ అయింది.  
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. వెండితెరపై పవన్ కళ్యాణ్‌ను ఒక డైహార్డ్ ఫ్యాన్‌లా సుజీత్ ప్రెజెంట్ చేసిన విధానం, హై-వోల్టేజ్ మాస్ ఎలివేషన్లు థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. 'ఓజీ' సాధించిన భారీ విజయంతో ఈ చిత్ర సీక్వెల్ 'ఓజీ 2'(OG 2)పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి ఈ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్‌కు సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, 'ఓజీ 2' నిర్మాణ భాగస్వామ్యంలో ఊహించని మార్పు చోటుచేసుకోబోతోంది. మొదటి భాగాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ అయిన 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' ఈ సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు టాలీవుడ్‌కు చెందిన మరో టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ భారీ సీక్వెల్‌లో జాయింట్ పార్ట్‌నర్‌గా చేతులు కలపనుందని ఇండస్ట్రీ టాక్. ఆ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు, షూటింగ్ షెడ్యూల్స్ కూడా శరవేగంగా ప్లాన్ చేయబడుతున్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న దర్శకుడు సుజీత్ త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్నారు. ఆయన వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమై, 'ఓజీ 2' ఫైనల్ స్క్రిప్ట్‌కు సంబంధించి తుది చర్చలు జరపనున్నారు. పవన్ కళ్యాణ్ వైపు నుండి కూడా ఈ ప్రాజెక్ట్‌పై పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ వచ్చేయడంతో మెగా అభిమానుల్లో జోష్ పెరిగింది. అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే ‘ఓజీ 2’కి సంబంధించిన అధికారిక ప్రకటనను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ వెంటనే నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు సమాచారం. ఒకపక్క ప్రొడక్షన్ హ్యాండ్స్ మారుతున్నాయనే వార్తలు గుసగుసలు రేపుతుంటే, మరోపక్క సుజీత్ ఈసారి అంతకుమించిన యాక్షన్ సీక్వెన్సులు, ఊహకందని మాస్ ఎలివేషన్లతో పవన్ కళ్యాణ్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్‌తో పోలిస్తే పార్ట్ 2 రేంజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి మోస్ట్ అవేటెడ్ సీక్వెల్‌గా రాబోతున్న ‘ఓజీ 2’ ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.  
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద తన విజయవిహారాన్ని కొనసాగిస్తోంది. థియేటర్లలోకి వచ్చి రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు మూడో వారంలోకి అడుగుపెట్టింది. సాధారణంగా మూడో వారంలో కలెక్షన్ల జోరు కాస్త తగ్గడం సహజమే అయినా, 'పెద్ది' మాత్రం బాక్సాఫీస్ బరిలో గట్టి పోటీని తట్టుకుని చాలా స్టడీగా నిలబడటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు భారీగా సందడి చేసినప్పటికీ, పెద్ది జోరు తగ్గలేదు. ఈ మూడో శుక్రవారం అంటే 16వ రోజు బాక్సాఫీస్ రిపోర్ట్ పరిశీలిస్తే, బాక్స్ ఆఫీస్ రేసులో 'పెద్ది' ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. సమంత నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రంతో పాటు వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ మూవీ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు', మంజుమ్మేల్ బాయ్స్ దర్శకుడి 'బాలన్ ది బాయ్', విజయ్ ఆంటోనీ 'వంద దేవుళ్ళు', 'దీవానా' వంటి అరడజను కొత్త సినిమాలు మార్కెట్లోకి వచ్చాయి. ముఖ్యంగా సమంత సినిమాకు పాజిటివ్ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, రామ్ చరణ్ మాస్ పుల్‌ని ఆపలేకపోయాయి. థియేటర్లలో 16వ రోజున ఈ చిత్రం ఇండియా వైడ్ గా ఏకంగా 1.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టి సత్తా చాటింది. అంతకుముందు రోజు అంటే 15వ రోజు వచ్చిన 2.00 కోట్ల రూపాయల వసూళ్లతో పోలిస్తే ఇది కేవలం 12.5 శాతం మాత్రమే తగ్గడం విశేషం. ఇక ఇప్పటివరకు సాధించిన టోటల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే, 'పెద్ది' బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. గడిచిన 16 రోజుల్లో భారతదేశం అంతటా ఈ సినిమా సాధించిన మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 229.75 కోట్లకు చేరుకున్నాయి. దీని గ్రాస్ వసూళ్లు చూసుకుంటే రూ. 272.05 కోట్లుగా నమోదయ్యాయి. అయితే, ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం సినిమా రన్ కొద్దిగా నెమ్మదించింది. 16వ రోజున ఓవర్సీస్ లో కేవలం 5 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. దీంతో ఈ 16 రోజుల్లో కలిపి టోటల్ ఓవర్సీస్ గ్రాస్ వసూళ్లు రూ. 52.60 కోట్లకు చేరాయి. వీటన్నింటినీ కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' చిత్రం 16 రోజుల్లో సాధించిన మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ. 324.65 కోట్లు కావడం గమనార్హం. ఈ సినిమా కలెక్షన్లను భాషల వారీగా విశ్లేషిస్తే, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ చిత్రం డీసెంట్ వసూళ్లను సాధిస్తోంది. 16వ రోజున కేవలం తెలుగు వెర్షన్ నుంచే రూ. 1.60 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఇక హిందీ వెర్షన్ ద్వారా 10 లక్షల రూపాయలు, కన్నడ వెర్షన్ ద్వారా 4 లక్షల రూపాయలు, తమిళ వెర్షన్ ద్వారా 1 లక్ష రూపాయల నెట్ వసూళ్లు లభించాయి. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా కమర్షియల్‌గా క్లీన్ హిట్‌గా నిలవాలంటే ట్రేడ్ లెక్కల ప్రకారం దాదాపు రూ. 500 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం 500 కోట్ల క్లబ్‌లో చేరుతుందో లేదో చూడాలి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు. ఈ కారణంగా మధ్యతరగతి, దిగువ తరగతి వారిగానే ఉండిపోతారు తప్ప, ధనవంతుల లిస్ట్ లోకి వెళ్లలేరు.  అయితే దీనంతటికి కారణం ఆ వ్యక్తులే అంటున్నారు ఆర్థిక నిపుణులు,  లైఫ్ స్టైల్ విశ్లేషకులు.  ఇంతకీ మనిషి చేసే తప్పులు మనిషిని ధనవంతుడు కాకుండా ఎలా  ఆపుతాయి.  ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే.. మనిషి చేసే తప్పు.. శ్రమ మనిషికి నిజమైన సంపద, కానీ మనిషి చాలా సార్లు శ్రమిస్తాడు కానీ అతనికి సొంతంగా ఎదగడం తెలియదు.  గంధం తీయాలంటే గందపు చెక్కను అరగదీయాలి,  అలాగే ఒక మంచి పూల హారం కావాలంటే పూలను దారంలోకి జొప్పించి అల్లాలి.  ఇవన్నీ వ్యక్తిలో ఓపిక,  శ్రమకు చక్కని నిదర్శనాలు. అలాంటి శ్రమ, ఓపిక ఉన్నప్పుడే.. దేవుడి ముందు నిలబడి దేవుడిని తృప్తిగా ప్రార్థిస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా పొందగలుగుతారు. అదే విధంగానే.. మనిషి కష్టపడి పనిచేస్తేనే తనకు తాను ఫలితాన్ని పొందగలుగుతాడు. అంతేకానీ కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడి చివరిలో ఫలితం రావాలని అనుకుంటే అది ఆశాజనకంగా ఉండదు. సద్గుణాలు.. మనిషిలో సద్గుణాలు ఉంటే అతను ధనవంతుడు కావడానికి మార్గాలు పదే పదే కలిసి వస్తూనే ఉంటాయి.  పేదరికంలో ఉన్న వ్యక్తికి ఓర్పు ఉంటే గొప్ప అవకాశాలు చూపిస్తుంది.  మాసిపోయిన బట్టలు మంచి నీటితో ఉతికితేనే అవి తెల్లగా మెరుస్తాయి. అలాగే వ్యక్తి మొదట సద్గుణాలు అలవర్చుకున్నప్పుడు అతను  అతను ఆకర్షిస్తాడు.  అతని వ్యక్తిత్వంలో మంచి, చెడు బయటకు ప్రకాశిస్తాయి.  ధనవంతులు కావడం అంటే చెడు గుణాలు కలిగి ఉండటమా లేదా అనేది కాదని కొందరు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. చెడు దారిలో కలిగే ధనం ఎప్పటికీ మనిషిని ఉన్నతంగా ఉంచదు. నిజమైన ధనవంతుడు.. పేదరికంలో ఉన్న వ్యక్తి అసలు పేదవాడిగా  పరిగణించకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే నిజమైన పేదవాడు డబ్బు లేని వాడు.. జ్ఞానం,  వ్యక్తిత్వం లేనివాడే నిజమైన పేదవాడు అంటాడు ఆచార్య చాణక్యుడు. జ్ఞానం లేని వ్యక్తికి ఎంత సంపద ఉన్నా అతను వ్యర్థ్యం అంటాడు. అవకాశాలు.. మనిషి జీవితంలో అవకాశాలు రావడం లేదని వాపోతుంటాడు. కానీ నిజానికి అవకాశాలను సృష్టించుకునే వాడే ఆర్థికంగా ఎదగగలడని అంటారు. ఎడారిలో అయినా ఇసుకను లోతుగా తవ్వితేనే నీటి చెలమ లభించే అవకాశం ఉంటుంది. అలాగే అవకాశాలే లేవు అనుకున్నప్పుడు వాటిని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. అపాత్ర దానం.. దానం చేయడం చాలా గొప్ప గుణం. కానీ దానం చేస్తే పుణ్యం వస్తుందనే కారణంతో చేతిలో ఉన్నది అనవసరమైన వ్యక్తులకు దానం చేయడం పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టే. దానం చేయడం ఎంత మంచి కార్యమో.. అర్హత లేని వారికి దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభించకపోగా, ఆర్థికంగా దిగజారిపోతారు.   పొదుపు.. చాలామందికి పొదుపు చేయడం అంటే అవసరాలు మాని మరీ దాచిపెట్టడం అనుకుంటారు. కానీ అవసరాలు మానుకుని దాచిపెట్టే డబ్బే పేదరికానికి కారణం అవుతుంది.                                   *రూపశ్రీ.
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి. కానీ అంతవరకు అలాంటి అప్యాయత ఏమీ లేని భర్త  అకస్మాత్తుగా మితిమీరిన ఆప్యాయతను చూపించడం, అధికంగా  శ్రద్ధ చూపడం లేదా అంతకు ముందు ఎన్నడూ లేనంత సన్నిహితంగా ఉండటం వంటివి జరిగితే దాన్ని చాలా సులువుగా కొట్టి పారేయకూడదని అంటున్నారు రిలేషన్ నిపుణులు. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిదని, ఇలాంటి మార్పు జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..  విడాకుల ప్రమాదం.. భార్యాభర్తల బంధం  ప్రారంభంలో మితిమీరిన ప్రేమతో ఉండే జంటలకు జీవితంలో తర్వాత విడాకులు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. పరిశోధకులు 168 జంటలను 13 సంవత్సరాల పాటు అనుసరించి ఈ విషయాన్ని వెలిబుచ్చారు.  సంబంధం ప్రారంభంలో మితిమీరిన శృంగారభరితంగా , చాలా ఆనందంగా ప్రవర్తించే వారికి కాలక్రమేణా విడాకులు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారట. మితిమీరిన ప్రేమ ఎందుకు ప్రమాదకరం?  సంబంధంలో నమ్మకం లేదా కమ్యూనికేషన్  లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే మితిమీరిన ఆప్యాయత అని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన తీవ్రమైన ఆప్యాయత ఎక్కువకాలం నిలవదని అంటున్నారు. బంధం ప్రారంబైమనప్పుడు అతి చాలా చాలా మితిమీరి ఉంటే.. ఆ తరువాత ఆ బంధం శూన్యంగా మారే అవకాశం ఉంటుదని అంటున్నారు. మితిమీరిన ప్రేమ ఎందుకు ప్రమాదం? ప్రతి సంబంధంలోనూ ఒక మధురమైన దశ ఉంటుంది, ఆ సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ  ఒకరితో ఒకరు ఎంతో  సన్నిహితంగా ఉంటారు. కానీ కాలక్రమేణా ఈ అనురాగం తగ్గిపోవడం సహజంగా జరుగుతుంది. భార్యాభర్తల బంధం మొదలైనప్పుడే ఎమోషన్ గా ఒకరిమీద మరొకరు ఆధారపడితే  సమస్య తలెత్తుతుంది. మొదట్లో ఉన్న  ప్రేమ,  సాన్నిహిత్యం క్రమంగా బాధ్యతలు,  ఇంటి విషయాల కారణంగా  తగ్గినప్పుడు వారి బంధంలో ప్రేమ కనుమరుగైపోయిందని భార్యాభర్తలలో ఎవరో ఒకరు తప్పకుండా ఫీలవుతారు.. ఒక బలమైన సంబంధం కేవలం ఆప్యాయతతో మాత్రమే బిల్డ్ కాదు.. బంధంలో నిజాయితీ, నమ్మకం, ఒకరితో మరొకరు మాట్లాడే తీరు,  ఒకరికి ఒకరు  సహకరించే విధానం  అనేవి బంధం ఎక్కువ కాలం పాటు బలంగా ఉండటానికి పునాది అవుతుంది . భార్యాభర్తల బంధంలో  ఆప్యాయతను మితిమీరి ప్రదర్శించడం అనేది, ఆ లోటును భర్తీ చేయడానికి చేసే ప్రయత్నానికి సంకేతం కావచ్చని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. లవ్ బాంబింగ్.. లవ్ బాంబింగ్‌ను ఒక ప్రధాన హెచ్చరిక సంకేతంగా  రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.  ఒక వ్యక్తి త్వరగా భావోద్వేగపరంగా దగ్గరవ్వాలనే ఆశతో, మొదట తమ భాగస్వామిపై మితిమీరిన ప్రేమను, బహుమతులను, పొగడ్తలను కురిపిస్తారు. ఆ తర్వాత, ఈ ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోతుంది. తరచుగా, భాగస్వామి తమను తామే నిందించుకోవడం మొదలుపెట్టి, సంబంధాన్ని తిరిగి బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, దీని అర్థం మితిమీరిన ప్రేమను చూపించే ప్రతి భాగస్వామి తప్పు అని కాదు. కానీ అతిగా ప్రేమ ఉంటే ఆ తర్వాత ప్రేమ లేకపోవడాన్ని భరించలేక గొడవలు, అపార్థాలకు దారితీస్తుంది. ఇది విడాకుల దాకా కూడా వెళ్లవచ్చు.                                          *రూపశ్రీ.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,  జనసేనాని పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన పార్టీని   తెలంగాణలో కూడా విస్తరించేందుకు  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా..   జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రయాణం అనే నినాదంతో నిర్వహించిన కీలక సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ కీలక ప్రకటన చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని  పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన  పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విస్తరణ ప్రణాళిక వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రకటించిన  9 వేల 400 కోట్ల రూపాయల  భారీ ప్యాకేజీని పవన్ కళ్యాణ్  స్వాగతించారు. గుడెబల్లూరు - మహబూబ్‌నగర్ మధ్య ఎన్‌హెచ్-167 రహదారి విస్తరణ, జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్, వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్, హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్,  రూ. 1,535 కోట్ల విలువైన రైల్వే ఆధునీకరణ ప్రాజెక్టులను పవన్ కల్యాణ్ బాహాటంగా  ప్రశంసించారు.  వికసిత్ తెలంగాణ కోసం వికసిత్ భారత్  నినాదంతో కేంద్రం చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలను జనసేన క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని ఆయన పిలుపు కూడా ఇచ్చారు. ఎన్డీఏ కూటమిలో  కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను దక్షిణాదిలో ఒక బలమైన జాతీయవాద ముఖచిత్రంగా నిలబెట్టేందుకు బీజేపీ అధిష్ఠానం కూడా ఆసక్తి చూపిస్తోంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎంట్రీని ఈ కారణంతోనే  కాంగ్రెస్  తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పవన్   తెలంగాణలో జనసేన విస్తరణ అంటూ ప్రకటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ  అస్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తే..  పవన్ కళ్యాణ్  దీటుగా కౌంటర్ ఇస్తూ..  గతంలో ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నాయకులు తమ సొంత రాష్ట్రాలు కాకపోయినా ఇతర ప్రాంతాల నుండి పోటీ చేసినప్పుడు లేని అభ్యంతరం, తనపై ఎందుకంటూ నిలదీశారు.  తెలంగాణ ఎవరి జాగీరు కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సైబరాబాద్ పోలీసులు గచ్చిబౌలిలో జనసేన సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో..  పవన్ కళ్యాణ్ తన జూబ్లీహిల్స్ నివాసంలో దాదాపు 50 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను ఎండగట్టారు.   నియోజకవర్గాల పునర్విభజన  విషయంలో దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలపై స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణవ్యాప్తంగా పర్యటించి, కొండగట్టు అంజన్న దేవాలయాన్ని దర్శించుకుని    వారాహి యాత్ర ను ఇక్కడ కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రంలో మోదీ అండ, క్షేత్రస్థాయిలో యువత క్రేజ్ కలగలిసి తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎలాంటి  ప్రభావాన్ని చూపనుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. వ్యవహార శైలి, ఆయన అమలు చేస్తున్న వ్యూహాల పట్ల వైసీపీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోందా? అంటే ఆ పార్టీ వర్గాల నుంచే ఔననే సమాధానం వస్తున్నది. ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు  ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.  గత సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజికవర్గం అంతా ఏకతాటిపైకి వచ్చి కూటమికి అండగా నిలబడటం, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటే నడవటం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో పార్టీ మనుగడ కోసం, రాష్ట్రంలో మళ్లీ పట్టు సాధించడం కోసం కాపు సామాజికవర్గం విషయంలో  వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఆ విషయంలో జగన్.. వరుసగా తప్పుడు వ్యూహాలు, నిర్ణయాలతో కాపు సమాజికవర్గాన్ని పార్టీకి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది.    జగన్ మోహన్ రెడ్డి   కాపు సామాజికవర్గాన్నిపార్టీకి అనుకూలంగా మర్చుకోవడానికి ప్రయత్నించడం మాని, ఆ వర్గం అదే సమాజికవర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు దూరం అయితే చాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారనీ, కానీ ఇది అంతిమంగా వైసీపీకి తీరని నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది.   జగన్ ఈ తీరునువైసీపీలోని  పలువురు సీనియర్లు ప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజికవర్గంలో అనైక్యతను పెంచడం వల్ల, వారి మధ్య చిచ్చు పెట్టడం వల్ల వైసీపీకి ఇసుమంతైనా ప్రయోజనం, రాజకీయ లబ్ధి ఉండకపోవడం అటుంచి.. అది బూమరాంగ్ అయ్యి మొత్తం కాపు సామాజికవర్గాన్నే పార్టీకి దూరం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   
మహా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. శివసేన పార్టీ 60వ వ్యవస్థాపక వేడుకల వేళ ముంబై వేదికగా శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య   మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.  గోరెగావ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఏక్‌నాథ్ షిండే ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా కొందరు నేతలు తమపై విమర్శలు గుప్పిస్తున్నారనీ,  అయితే టైగర్  బెదరదనీ అన్నారు.  తమదే అసలైన శివసేన అని ఆయనీ సందర్భంగా ప్రకటించారు.   ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు తమ వైపు రాబోతున్నారనే ప్రచారంపై షిండే నేరుగా స్పందించారు. ఇది కేవలం  ఆపరేషన్ టైగర్  ట్రైలర్ మాత్రమేనన్న ఆయన.. రాబోయే రోజుల్లో అసలు సినిమా చూపించబోతున్నామన్నారు.    బాలాసాహెబ్ థాకరే సిద్ధాంతాలను ఉద్ధవ్ థాకరే పూర్తిగా విస్మరించారని షిండే ఆరోపించారు. కేవలం ముఖ్యమంత్రి పదవి,  అధికారం కోసమే బాలాసాహెబ్ ఆశయాలను కాంగ్రెస్, ఎన్‌సీపీల వద్ద ఉద్ధవ్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తాము చేసిన చారిత్రాత్మక తిరుగుబాటు వల్లే శివసేన పార్టీ మళ్లీ సాధారణ ప్రజలకు, కార్యకర్తలకు చేరిందన్నారు. ఒకవేళ బాలాసాహెబ్ బతికి ఉంటే, దేశాన్ని గర్వపడేలా చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన నాయకత్వాన్ని కచ్చితంగా అభినందించేవారని షిండే పేర్కొన్నారు.   ఇక మరోవైపు ఉద్ధవ్ థాకరే   వర్గం నిర్వహించిన సభలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీని వీడి షిండే వర్గంలోకి వెళ్తున్న ప్రజాప్రతినిధులను, ముఖ్యంగా ఆ ఆరుగురు లోక్‌సభ ఎంపీలను  ద్రోహులుగా   అభివర్ణించారు. ఒకవేళ పార్టీ కార్యకర్తలకు తన నాయకత్వం నచ్చకపోతే, గౌరవంగా శివసేన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి  తాను సిద్ధమేనంటూ ఉద్ధవ్ థాకరే సంచలన ప్రకటన చేశారు. ఈ రాజకీయ తిరుగుబాటు,  పార్టీ చీలిక వెనుక కేంద్ర శక్తుల ప్రమేయం   ఉందని ఆయన ఆరోపించారు. పార్టీ ఉనికిని, బాలాసాహెబ్ వారసత్వాన్ని కాపాడుకోవడానికి తాను ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు.  
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు , అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఎంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఆకలిని తీర్చడమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎనర్జీగా ఉండటానికి , అతిగా తినడాన్ని నివారించడానికి సహాయపడతాయి.  ఎలాంటి చింత లేకుండా  ఆహారంలో చేర్చుకోగల కొన్ని ఆరోగ్యకరమైన చిరుతిళ్ల గురించి తెలుసుకుంటే.. వేయించిన శనగలు.. వేయించిన శనగలు ఆరోగ్యకరమైన చిరుతిళ్లలో మొదటి  స్థానంలో ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.  వీటిని  తీసుకోవడం వల్ల కడుపు చాలా సేపటి వరకు నిండుగా ఉంటుంది, దీని కారణంగా పదేపదే ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి వేయించిన శనగలు స్నాక్స్ కోసం మంచి ఆప్షన్.   అంతేకాకుండా, ఇవి శరీరానికి శక్తిని అందించడంలో కూడా సహాయపడతాయి. మఖానా.. మఖానా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన చిరుతిండి, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మఖానాలో  కాల్షియం, మెగ్నీషియం , యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు లభిస్తాయి.  లేతగా వేయించిన మఖానా తినడం వల్ల ఆకలిని నియంత్రించుకోవచ్చు , అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి , బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా చాలా మంచిది. తాజా పండ్లు.. పండ్లు సహజంగానే పోషకాల నిధి. ఆపిల్, అరటిపండు, జామ, బొప్పాయి , నారింజ వంటి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతాయి. పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది , శరీరం చాలా సేపటి వరకు తాజాగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్.. బాదం, వాల్‌నట్స్, పిస్తా , జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ , అనేక విటమిన్లు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం శరీరానికి శక్తిని అందించి, ఆకలిని కూడా నియంత్రిస్తుంది.  వాల్‌నట్‌లు , బాదం పప్పులు ముఖ్యంగా మెదడు , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  వీటిని చిరుతిండిగా తినడం ద్వారా జంక్ ఫుడ్ తినే అలవాటును తగ్గించుకోవచ్చు. మొలకలు.. మొలకెత్తిన పెసలు, శనగలు , ఇతర పప్పుధాన్యాలలో ప్రోటీన్, పీచుపదార్థం , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత వాటిలోని పోషకాల పరిమాణం పెరగడం వల్ల అవి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.  మొలకలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది , కండరాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.  శరీరం ఫిట్ గా ఉండాలని అనుకునే వారికి మొలకలు చాలా మంచివి. వేరుశనగలు.. వేరుశెనగలను పేదల బాదం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వేరుశెనగలను పరిమితంగా తినడం వల్ల ఆకలి తగ్గి, శరీరానికి ఎక్కువసేపు శక్తి లభిస్తుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి , శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.                              *రూపశ్రీ.
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా.. కనీసం అందులో కాసింత అన్నం అయినా లేకపోతే భోజనం తిన్న తృప్తి ఉండదు చాలామందికి. అయితే ఈ మధ్యకాలంలో రాత్రి పూట అన్నానికి బదులుగా చపాతీలు తినమని కొందరు, టిఫిన్ లు తినమని మరికొందరు చెబుతూ ఉంటారు. రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని కూడా చెబుతుంటారు. రాత్రి సమయంలో అన్నం తింటే బరువు పెరుగుతారా?  ఇది నిజమా? దీని గురించి వైద్యులు చెబుతున్న నిజాలు ఏంటి? తెలుసుకుంటే.. బరువు పెరగడానికి అసలు కారణం.. డాక్టర్ల ప్రకారం..  బరువు పెరగడం లేదా తగ్గడం అనేది  తినే ఏదో ఒక ఆహారంపై ఆధారపడి ఉండదు. అది పూర్తిగా  రోజూ తీసుకునే కేలరీలు , శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది.  అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, ఆ కేలరీలు అన్నం నుండి వచ్చినా లేదా ఇతర ఆహారాల నుండి వచ్చినా బరువు పెరుగడం జరుగుతుంది. అందువల్ల, రాత్రిపూట కేవలం అన్నం తింటేనే లావు అవుతామని చెప్పలేమని అంటున్నారు. అన్నం తినవద్దని ఎందుకు అంటారంటే.. అన్నంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి  శరీరానికి శక్తిని అందిస్తాయి.  రాత్రి భోజనం చేసేటప్పుడు,  శారీరక శ్రమ గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల,  ఎక్కువగా అన్నం తిని,  రోజువారీ కేలరీల పరిమితిని మించిపోతే, అదనపు శక్తి శరీరంలో కొవ్వుగా పేరుకుపోవడం మొదలవుతుంది. అందుకే రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు. బియ్యం రకం ముఖ్యం.. అన్ని రకాల బియ్యం ఒకేలా ఉండవని వైద్యులు చెబుతున్నారు.  తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్, అంటే తక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడుతుంది.  అన్నాన్ని పప్పులు, పుష్కలంగా కూరగాయలు , ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల సమతుల్య ఆహారం లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి , అతిగా తినడాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియ, నిద్రపై అన్నం ప్రబావం.. ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి రాత్రిపూట అన్నం తినడం సులభంగా జీర్ణమై, బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మరోవైపు, మరికొందరు ఎక్కువగా అన్నం తిన్న తర్వాత కడుపులో భారంగా ఉన్నట్లు ఫీలవుతారు. దీన్ని బట్టి అన్నం యొక్క ప్రభావాలు ప్రతి వ్యక్తి  జీర్ణవ్యవస్థ, జీవనశైలి , ఆరోగ్యంపై ఆధారపడి మారుతూ ఉంటాయి. సమతుల్యం ఉంటేనే.. రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారన్న భావన పూర్తిగా నిజం కాదు.  క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ,  రోజువారీ కేలరీలను  గమనిస్తూ, సమతుల్య మోతాదులో అన్నం తింటే, రాత్రిపూట అన్నం తినడం వల్ల  బరువు పెరగడం అనేది జరగదు.  బరువును అదుపులో ఉంచుకోవడానికి, రోజులోని సమయం కంటే కూడా  తినే ఆహారం పరిమాణం, ఆహార రకం ,  మొత్తం జీవనశైలికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల, అన్నాన్ని సరైన మోతాదులో , సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది.                            *రూపశ్రీ.
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి. వయసు కారణంగా, లేదా అలసిపోవడం వల్ల జరుగుతోందేమోనని, పరిసరాల కారణంగా సరిగా వినిపించడం లేదేమోనని ఇలా.. రకాలుగా అనుకుంటూ   వినికిడి సమస్యను లైట్ తీసుకుంటారు. చాలామంది ఇతరులతో  మాట్లాడటం కష్టమయ్యే వరకు తమ సమస్యను గుర్తించరు. కానీ వినికిడి సమస్య రావడానికి ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.  ఆ లక్షణాలేంటో తెలుసుకోవడం వల్ల సమస్యను ముందే గుర్తించవచ్చు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. వినికిడి సమస్యను మొదట్లోనే  గుర్తించడం ఎందుకు ముఖ్యం? వయసు పెరగడంతో వచ్చే వినికిడి లోపం క్రమంగా అభివృద్ధి చెంది, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది.  దీని లక్షణాలను ముందుగానే గుర్తిస్తే, దీర్ఘకాలికంగా వినికిడిని , జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. చుట్టూ ఉన్న అందరూ ఎంతో బాగా మాట్లాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఉంటే.. వినికిడి సమస్య ఉన్నవారు మాత్రం తమ సమస్య కారణంగా ఎవరితో ఎక్కువ మాట్లాడలేకపోవడం, తమ రోజు వారీ కార్యకలపాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం వంటివి జరుగుతాయి.  దీని వల్ల వినికిడి సమస్యను ముందుగానే గుర్తించడం ముఖ్యం. లక్షణాలు.. గందరగోళం.. వినికిడి లోపానికి మొదటి లక్షణం వినిపించకపోవడమే కాదు.. . కొన్నిసార్లు ఇతరులు మాట్లాడటం వినగలుగుతారు, కానీ మాటలను స్పష్టంగా అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో, కుటుంబంలో అందరూ కలిసి మాట్లాడుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లలో మాట్లాడే మాటలను  అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది.  ఇది ప్రారంభ దశలో వినికిడి లోపానికి ఒక సాధారణ లక్షణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పించుకోవాల్సి రావడం..  ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు పదేపదే మళ్ళీ చెప్పమని అడుగుతున్నట్లయితే, ఇది కూడా ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు. మొదట్లో ఇది సాధారణంగానే అనిపించవచ్చు, కానీ ఈ అలవాటు రోజువారీ లైఫ్ స్టైల్ లో  భాగంగా మారినప్పుడు, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కువగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులే ఈ మార్పును మొదటగా గమనిస్తారు. వ్యాల్యూమ్.. టీవీ, మొబైల్ ఫోన్ లేదా రేడియో వాల్యూమ్‌ను నిరంతరం పెంచడం మరో సాధారణ లక్షణం. తరచుగా, ఇంట్లోని ఇతర వ్యక్తులు ఆ వాల్యూమ్‌ను చాలా ఎక్కువగా అని చెబుతూ ఉంటారు, అయితే వినికిడి లోపం ఉన్న వ్యక్తి దానిని సాధారణంగానే అనుకుంటారు. ఈ మార్పు క్రమంగా జరుగుతుంది, కాబట్టి చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు. ఫోన్లో  మాట్లాడటంలో ఇబ్బంది.. ఫోన్‌లో మాట్లాడటంలో ఇబ్బంది కూడా వినికిడి లోపానికి ఒక సంకేతం కావచ్చు. నేరుగా, ఎదురుగా ఉండి మాట్లాడేటప్పుడు  ముఖ కవళికలు , పెదవుల కదలికలు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి, కానీ ఫోన్‌లో కేవలం  గొంతుపైనే ఆధారపడవలసి ఉంటుంది. స్వల్ప వినికిడి లోపం కూడా  ఫోన్ లో మాట్లాడటం కుదరకపోతే అది స్పష్టంగా తెలిసిపోతుంది. చెవిలో శబ్దాలు.. చెవుల్లో నిరంతరం రింగింగ్, గింగురుమనే లేదా ఈల శబ్దాలు రావడం ఆందోళన కలిగించే విషయం. టిన్నిటస్ అని పిలువబడే ఈ పరిస్థితి, తరచుగా వినికిడిలో ఒక అంతర్లీన సమస్యను సూచిస్తుంది. వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయడం కేవలం చెవులకే పరిమితం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలక్రమేణా ఇది సామాజిక ఒంటరితనం, నిరాశ, ఒత్తిడి , కుంగుబాటుకు కూడా దారితీయవచ్చు. అందువల్ల, ఈ లక్షణాలు కొనసాగితే ఈ.ఎన్.టి నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.                                            *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.