అసలు సినిమా ముందుంది.. ఏక్ నాథ్ షిండే.. శివసేన చీలిక వెనుక కేంద్రం.. ఉద్ధవ్

posted on: Jun 20, 2026 9:45AM

మహా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. శివసేన పార్టీ 60వ వ్యవస్థాపక వేడుకల వేళ ముంబై వేదికగా శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య   మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి. 

గోరెగావ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఏక్‌నాథ్ షిండే ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా కొందరు నేతలు తమపై విమర్శలు గుప్పిస్తున్నారనీ,  అయితే టైగర్  బెదరదనీ అన్నారు.  తమదే అసలైన శివసేన అని ఆయనీ సందర్భంగా ప్రకటించారు.   ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు తమ వైపు రాబోతున్నారనే ప్రచారంపై షిండే నేరుగా స్పందించారు. ఇది కేవలం  ఆపరేషన్ టైగర్  ట్రైలర్ మాత్రమేనన్న ఆయన.. రాబోయే రోజుల్లో అసలు సినిమా చూపించబోతున్నామన్నారు.  

 బాలాసాహెబ్ థాకరే సిద్ధాంతాలను ఉద్ధవ్ థాకరే పూర్తిగా విస్మరించారని షిండే ఆరోపించారు. కేవలం ముఖ్యమంత్రి పదవి,  అధికారం కోసమే బాలాసాహెబ్ ఆశయాలను కాంగ్రెస్, ఎన్‌సీపీల వద్ద ఉద్ధవ్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తాము చేసిన చారిత్రాత్మక తిరుగుబాటు వల్లే శివసేన పార్టీ మళ్లీ సాధారణ ప్రజలకు, కార్యకర్తలకు చేరిందన్నారు. ఒకవేళ బాలాసాహెబ్ బతికి ఉంటే, దేశాన్ని గర్వపడేలా చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన నాయకత్వాన్ని కచ్చితంగా అభినందించేవారని షిండే పేర్కొన్నారు.  

ఇక మరోవైపు ఉద్ధవ్ థాకరే   వర్గం నిర్వహించిన సభలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీని వీడి షిండే వర్గంలోకి వెళ్తున్న ప్రజాప్రతినిధులను, ముఖ్యంగా ఆ ఆరుగురు లోక్‌సభ ఎంపీలను  ద్రోహులుగా   అభివర్ణించారు. ఒకవేళ పార్టీ కార్యకర్తలకు తన నాయకత్వం నచ్చకపోతే, గౌరవంగా శివసేన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి  తాను సిద్ధమేనంటూ ఉద్ధవ్ థాకరే సంచలన ప్రకటన చేశారు. ఈ రాజకీయ తిరుగుబాటు,  పార్టీ చీలిక వెనుక కేంద్ర శక్తుల ప్రమేయం   ఉందని ఆయన ఆరోపించారు. పార్టీ ఉనికిని, బాలాసాహెబ్ వారసత్వాన్ని కాపాడుకోవడానికి తాను ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...