యోగాలో జాగ్రత్తలు

                 యోగాను మించిన దివ్య సాధన లేదు. యోగాసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అధ్యయనాలు పదేపదే తెలియజేస్తున్నాయి. కనుక యోగా గురించి కొన్ని ప్రాధమిక సూత్రాలు తెలుసుకుందాం. మీరు ఇప్పటికే యోగా చేస్తున్నట్లయితే సరే, ఒకవేళ చేసే అలవాటు లేకుంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే అలవాటు చేసుకోవచ్చు. మనకు ఇంకా యోగా చేసే వయసు రాలేదు, పెద్దవాళ్ళు మాత్రమే ఇలాంటివి చేస్తారు అనుకున్నా, వయసు మించిపోయింది, ఇప్పుడేం చేస్తాములెద్దూ అనుకున్నా పొరపాటే. ఏ వయసులో నయినా యోగా మొదలుపెట్టవచ్చు.

                యోగాలో ప్రవేశం లేనివారు తమంతట తాము చేయడం శ్రేయస్కరం కాదు. యోగాసనాలు బాగా తెలిసి నిష్ణాతులైనవారిని గురువుగా భావించి ప్రాక్టీస్ చేయడం మంచిది. వారి గైడ్ లైన్స్ లో  రెండు మూడు తేలికైన ఆసనాలతో రోజుకు అరగంట చొప్పున చేయడం మొదలుపెట్టాలి.

         యోగాసనాలు వందలాది ఉన్నాయి. అందరికీ అన్నీ అవసరం ఉండదు. తమ తమ శారీరక తత్వాన్ని, ఆరోగ్యాన్ని అనుసరించి ప్రాణాయామం, సర్వాంగాసనం లాంటి కొన్ని ఆసనాలు సెలెక్ట్ చేసుకోవాలి. పొద్దున్నే పరగడపున యోగా చేయడం ఉత్తమం. అలా వీలు కుదరకపోతే ఇతర సమయంలోనూ చేయవచ్చు. అయితే అంతకు మూడు గంటలు ముందు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉండాలి. యోగా పూర్తయిన తర్వాత నానబెట్టిన పెసలు, శనగలు లాంటివి సేవించాలి.