పీరియడ్స్ నొప్పి తగ్గాలంటే ఈ ఆసనాలు వేయండి!


ఆడవారికి నెలసరి అనేది సాధారణం. ఒక వయసులో ఋతుచక్రం మొదలయ్యాక  ప్రతి నెలా ఈ సమస్యను ఎదుర్కోవాల్సింది. ఇది ఒక నెలతోనో, ఒక ఏడాదితోనో ముగిసేది కాదు. కొందరికి నెలసరి సమయంలో ఎలాంటి నొప్పి ఉండదు. మరికొందరిలో మాత్రం తీవ్రమైన రక్తస్రావం, కడుపు నొప్పి, కండరాల తిమ్మిర్లు ఉంటాయి. ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి యోగాలో కొన్ని ఆసనాలు సహాయపడతాయి. ఆ ఆసనాలేంటో తెలుసుకుంటే..

బలాసనం..

బలాసనం వేయడం చాలా సులువు.  మోకాళ్లమీద  పాదాలకు పిరుదులు తగిలేలా కూర్చోవాలి. దీన్ని వజ్రాసనం అని అంటారు. ఇప్పుడు ముందుకు వంగి తలను నేలకు ఆనించాలి. చేతులు రెండూ పొడవుగా చాపాలి. ఈ స్థితిలో 10నిమిషాల సేపు ఉండవచ్చు. ఇది పీరియడ్స్ నొప్పిని తగ్గించడమే కాకుండా జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. మానసిక సమస్యలు, జీర్ణసమస్యలుంటే తగ్గుతాయి. నాడీవ్యవస్థ చురుగ్గా మారుతుంది.

పశ్చిమోత్తానాసనం..

వెన్నెముకను వంచి చేసే ఆసనం కాబట్టి దీన్ని పశ్చిమోత్తనాసనం అని అంటారు. పద్మాసనంలో కూర్చుని పాదాలను ముందుకు చాపాలి. ఇప్పుడు తలను కిందకు వంచి మోకాళ్లకు తల తగిలేలా వంగాలి. ఈ ప్రయత్నంలో రెండు చేతులను ముందుకు చాపి పాదాలను అందుకోవాలి. మొదట్లో ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటైపోతుంది. ఈ ఆసనం వెన్నెముకను బలపరుస్తుంది.  నెలసరి సమయంలో కలిగే కడుపునొప్పి, కండరాల తిమ్మిర్లు  తగ్గిస్తుంది. మనసుకు ప్రశాంతత ఇస్తుంది. అలసటను తగ్గిస్తుంది.

సీతాకోక చిలుక భంగిమ..

సీతాకోక చిలుక ఎగురుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండటం వల్ల దీన్ని సీతాకోక చిలుక భంగిమ అని అంటారు.  పద్మాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్లను ఎడంగా చేసి రెండు పాదాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచాలి. ఇప్పుడు చేత్తో రెండు పాదాలను పట్టుకుని మోకాళ్లను సీతాకోక రెక్కల్లా ఆడించాలి. దీని వల్ల యోని కండరాలు బలపడతాయి. యోని సమస్యలు పరిష్కారం అవుతాయి. నెలసరి సమయంలో కడుపునొప్పి నుండి ఉపశనం లభిస్తుంది.

శవాసనం..

శవాసనం సాధారణంగా యోగా లేదా వ్యాయామాలు చేసిన తరువాత శరీరం విశ్రాంతి తీసుకోవడానికి   వేస్తారు. అయితే మహిళలు తమ నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడుతుంటే శరీరాన్ని రాలాక్స్ గా వదులుగా ఉంచి శవాసనం భంగిమలో ఉండాలి. కాళ్లు, చేతులు, శరీరంలో కండరాలు వదులుగా ఉండటం వల్ల శరీరం తేలికగా అనిపిస్తుంది. ఇది కడుపునొప్పిని తగ్గిస్తుంది.

                                                 *నిశ్ళబ్గ.