Yoga Asanas to reduce Acidity

అసిడిటీని తగ్గించే యోగాసనాలు

     మనం తిన్న ఆహారం క్రమ పద్ధతిలో జీర్ణమవ్వడానికి, సకాలంలో ఆకలి వేయడానికి, కడుపులో కొన్ని రకాల ఎంజైములు, హైడ్రో క్లోరిక్ ఆసిడ్ ల లాంటివి ఉంటాయి. ఇవి జీర్ణక్రియ సక్రమంగా అవ్వడానికి తోడ్పడతాయి. ఈ ప్రక్రియలో ఏవైనా లోపాలు జరిగినా, ఆహారం ఎక్కువ సేపు కడుపులో నిల్వ ఉండటం, లేదా సమయానికి ఆహారం తినకపోవడం, ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం లాంటి వాటి వల్ల కడుపులో మంట, చాతీలో నొప్పి మొదలవుతుంది దాన్నే అసిడిటీ అంటారు. కొందరిలో ఈ అసిడిటీ ప్రెగ్నెన్సీ, లేదా అధికంగా మసాలా దట్టించిన ఆహారం తిన్నా కూడా వస్తుంది. మరి కొందరిలో అదే పనిగా అస్తమానం అసిడిటీ వేధిస్తూనే ఉంటుంది. ఎన్ని మందులు వాడినా తాత్కాలిక పరిష్కారమే తప్ప సొల్యూషన్ ఉండదు. కానీ కొన్ని ప్రత్యేక యోగాసనాల ద్వారా ఈ అసిడిటీ నుండి కూడా విముక్తి పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

.

 

  • పశ్చిమోత్తానాసనం : రెండు కాళ్ళు పొడవుగా చాపుకుని రిలాక్స్ డ్ గా కూర్చోవాలి. ఆ తర్వాత కాళ్ళు ఏ మాత్రం కదలకుండా వంగి రెండు చేతులతో కాలి బొటన వేలిని పట్టుకోవాలి. ఆ తరవాత మెల్లిగా తల కాళ్ళకు అంటేలా వంగాలి. ఈ భంగిమలో రెండు నిమిషాల పాటు ఉండి మళ్ళీ యధాస్థితికి రావాలి, ఇలా రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఆ తరవాత ఈ సారి చేతితో కాలి బొటనవేలికి బదులు రెండు చేతులతో అరి కాలును పట్టుకోవాలి.

  • సర్వాంగాసన : వెల్లకిలా పడుకుని రెండు కాళ్ళను లేపి ఏ మాత్రం వంచకుండా తలమీదుగా కాలి వేళ్ళు భూమికి అంటేలా ఉంచాలి. మీకు ఇబ్బంది కలగనంత వరకు ఈ ఆసనం వేయవచ్చు.

  • సుప్త్ పవనముక్తాసన : కాళ్ళను బార్లా చాపి పడుకోవాలి. ఎడమ కాలును అలాగే ఉంచి, కుడి మోకాలును వంచి , తొడను పొట్టకు ఆన్చి, చేతులతో మోకాలును ముందుకు తెచ్చి, శిరస్సును ఎత్తి శ్వాస వదులుతూ , చుబుకాన్ని స్పృశించడానికి ప్రయత్నించాలి. తరువాత శ్వాస పీలుస్తూ కాలు చాచాలి. కాసేపు రిలాక్స్ అయి, ఎడమ కాలుతో కూడా ఇదేవిధంగా చేయాలి.

  • వజ్రాసనం : ముందుగా రెండు కాళ్ళు ముందుకు చాచి కూర్చోవాలి. మోకాళ్ళు కిందికి మడచి రెండు పాదాల మధ్య పిరుదులు ఆనించి మోకాళ్ళ మీద చేతులు ఆనించాలి. శిరస్సును, వెన్నెముకను నిటారుగా ఉంచాలి.

                      ఈ ఆసనాలను క్రమంతప్పక చేస్తుంటే అసిడిటీనే కాదు రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది, తద్వారా చర్మ వ్యాధులు, గుండెకు సంబంధించిన ఇబ్బందులనుండి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

గమనిక : గర్భిణీ స్త్రీలు, వెన్నెముక సమస్యలతో బాధపడేవారు ఈ ఆసనాలను వేయరాదు