పిల్లల్లో కమ్యూ నికేషన్ స్కిల్స్

Communication skills in Kids

 

              మనషిలో వ్యక్తిత్వ వికాసానికైనా, సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు సాధించాలనుకున్నా ముఖ్యంగా కావాల్సింది కమూనికేషన్ స్కిల్స్ , ఏం మాట్లాడాం అనే దానికన్నా , ఎలా మాట్లాడాం అన్న దానికే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది కమ్యూనికేషన్ స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ఈ ప్రయత్నం పిల్లల్లో మాటలు నేర్చుకునే స్టేజ్ నుండే ఉంటే ఇంకా బావుంటుంది.

మామూలుగా పిల్లల్లో ఎదుటి వారిని గమనించే లక్షణాలు చాలా ఉంటాయి. కాబట్టి పుట్టిన నాటి నుండి ఆరేళ్ళ వయసు వరకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది.

పిల్లలకు ప్రత్యేకంగా ఎవరూ భాష నేర్పించరు. ప్రతి రోజు ఏదో సందర్భంలో , ఎవరో ఒకరు మాట్లాడుతుండటాన్ని గమనిస్తూ నేర్చుకుంటూ ఉంటారు. ఈ టైం లో తల్లి దండ్రులు కొంచెం ప్లాన్డ్ గా ఉండి కమ్యూనికేషన్ పై దృష్టి పెట్టినట్టైతే స్కూల్ అడ్మిషన్స్ దగ్గరి నుండి, భవిష్యత్తులో వేసే ప్రతి అడుగులోనూ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అలవడుతుంది. పిల్లల్లో ఈ కమ్యూనికేషన్ డెవలప్ అవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరమేమీ లేదు .

మొదటి సంవత్సరం :

మొదటి సంవత్సరం పిల్లలు మాట్లాడగలిగే స్థాయి కాదు , బిడ్డ పుట్టిన నాటి నుండి సంవత్సరం లోపు మనం వివిధ దశల్లో పిల్లలను అనేక రకాలుగా ఎంకరేజ్ చేయవచ్చు.

 1. మీరు పిల్లలతో ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు మీ మొహాన్ని చూస్తుండేలా జాగ్రత్తపడాలి. మీరు మీ మొహం లో చూపించే హావభావాల ద్వారానే మీరేం చెప్తున్నారో వారికి అర్థమవుతుంది.

 2. పిల్లలు ఇష్టపడి ఆడుకునే బొమ్మలు అస్తమానం వారికి అందుబాటులో ఉండేలా కాక వారికి కనిపించేలా ఉండి, వాళ్ళు ఎప్పుడు ఆ బొమ్మతో ఆడుకోవాలనుకున్నా మిమ్మల్ని అడిగేలా చేయాలి. దీని ద్వారా మాటలు రాకపోయినా తనక్కావాల్సింది ఎక్స్ ప్రెస్ చేసి తీసుకునే గుణం పిల్లల్లో అలవడుతుంది.

 1. వారికి తినిపించే ఆహారపదార్థాలను గాని, ఆడుకునే వస్తువులను కాని, ఒకటికి రెండు సార్లు వారి ఎదురుగా నిదానంగా పలకండి, తద్వారా తనకు సంబంధించిన విషయాలపై అవగాహన కలుగుతుంది.

 2. సాయంత్రం పూట వారిని ఆడించడంలో భాగంగా రైమ్స్ పాడటం, పాటలు పాడటం లాంటివి చేయండి,

  12 వ నుండి 24 వ నెల వరకు

  పిల్లల్లో ఈ దశ చాలా కీలకమైనది. మన ఇంటి పరిసరాలు, ఆచార వ్యవహారాలూ , ఇంట్లోని మనుషుల మధ్య మధ్య ఉండే బాంధవ్యాలు అన్నింటికీ అలవాటు పడుతుంటారు. సంవత్సరం లోపు పిల్లలది కేవలం పరిసరాలను అర్థం చేసుకునే దశైతే , ఈ దశ తమకేం కావాలో మారాం చేసి మరీ తీసుకునే దశ. ఈ దశలోని పిల్లల్లో అబ్జర్వ్ చేసే గుణం చాలా ఎక్కువ. వారికంటూ పరిక్యులర్ మ్యూజిక్ వినదం దగ్గర్నించి, కార్టూన్లు, వారికి ఇష్టమైన ఫుడ్ లాంటి వాటికి అలవాటు పడుతుంటారు. ఈ దశలో వారిలో కమ్యూనికేషన్ పెరగడానికి తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు :

  1. పిల్లలతో ఎంత వీలయితే అంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి.

  2 వారితో పాటు మీరు కూడా ఆడండి, తద్వారా పిల్లలు మీకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది.

  3. వారిని మీతో పాటు కూర్చోబెట్టుకుని నీతి కథలను చదివి వినిపించండి.

             4. రోజుకు ఒకసారైనా వారిని బయటికి తీసుకు వెళ్ళి చుట్టూ పరిసరాల గురించి వారికి    

                            అర్థమయ్యేలా  చెప్పడానికి ప్రయత్నించండి.

  5. వారు సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు మాట్లాడుతున్న చిన్న చిన్న మాటలకే నవ్వుతూ, వారిని ఎంకరేజ్ చేయండి.

  6. వారికేం కావాలో వాళ్ళే డిసైడ్ చేసేలా ప్లాన్ చేయండి. ఉదాహరణకి ' నువ్వు పాలు తాగుతావా? లేకపోతె జ్యూస్ తాగుతావా? ' లాంటివి . అలాంటి చిన్న చిన్న పదాలను పలకడం కూడా వారికి కష్టమేం కాదు.

  దానితో పాటు వారిలో స్వంతంత్రంగా ఆలోచించే ధోరణి అలవడుతుంది.

  7. పిల్లల్లో మాట్లాడే స్థాయి పెరిగే కొద్ది ఒక్కో ప్లేస్ గురించి కాని , వస్తువు గురించి ఎక్స్ ప్లేన్ చేయడం

  మొదలుపెట్టండి. వాటి గురించి తెలిసినవి చెప్పమని ప్రోత్సహించండి.

  8. మీరు ఏ పని చేస్తున్నా, దాని గురించి పిల్లకు తెలియజేయండి. ఉదాహరణకు ' నేను చేతులు కడుగుతున్నాను, ' అన్నం తింటున్నాం' లాంటి వాక్యాలు పలుకుతూ, పిల్లల చేత కూడా పలికించడానికి ప్రయత్నించాలి. వాళ్ళు పలికినప్పుడల్లా మీరు హ్యాప్పీ గా ఫీల్ అవుతున్నారని వారికి అర్థమవ్వాలి.

  9. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఏం నచ్చిందో అడిగి తెలుసుకోండి .

  24 నెలల నుండి 36 నెలల వరకు    

  ఈ స్టేజి లో పిల్లలకు రకరకాల ఆటల్ని నేర్పించవచ్చు.

  1. లోటో గేమ్స్, లేదా ఇతర మ్యాచింగ్ గేమ్స్. ఆడించడం.

  2. మీరు ఇంట్లో చేసే చిన్న చిన్న పనుల్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం.

  3. పిల్లలతో పాటు కూర్చుని కార్టూన్స్ బుక్స్ ని చదవడం. మీకు ఏది నచ్చిందో ఎందుకు నచ్చిందో వారికి

  అర్థమయ్యేలా చెప్పడం.

  4. వీటన్నింటితో పాటు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే .. , మీరు పిల్లలతో ఏది

  చేయించాలనుకున్నా , వాళ్ళు ఇష్టపడి చేసేలా జాగ్రత్త పడాలి. బలవంతంగా చేయించడానికి ప్రయత్నించకూడదు. వాళ్ళు మీకు చెప్పుకునే ఏ చిన్న విషయాన్ని కొట్టి పారేయకూడదు , వాళ్ళు చెప్పదలుచుకున్నది ముందుగానే మీకు అర్థమైనా , దానిని మధ్యలోనే ఆపకుండా ఓపికగా విని వారికి అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్పాలి.

          మనిషి జీవితంలో బాల్యం మధురాతి మధురమైనదే అయినా , పరిపూర్ణ వ్యక్తిత్వానికి

          కూడా పునాది బాల్యమే. కాబట్టి బాల్యం నుండే కొద్దిగా ప్లాన్డ్ గా ఉంటే వారికి మంచి భవిష్యత్తును

          ఇవ్వగలుగుతాం .