మహిళలలో మెనోపాజ్.. ముఖ్యవిషయాలు ఇవే..

ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పనిసరిగా కొన్ని దశలు అదిగమించాలి. వీటిలో  12 నుండి 16ఏళ్లలోపు రజస్వల అయితే అది దాదాపు 30నుండి 40 ఏళ్ళపాటు  కొనసాగుతుంది. ఆ తరువాత ఈ నెలసరి ఆగిపోతుంది. ఇలా నెలసరి ఆగిపోవడాన్ని వైద్యపరిభాషలో మెనోపాజ్ అని అంటారు.  మెనోపాజ్ చెప్పడానికి సులువైన విషయమే అయినా దాన్ని ఎదుర్కొనే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. హార్మోన్లలో మార్పులు, శారీరక మార్పులు, శరీరంలో వేడి ఆవిర్లు, బరువు మొదలైన సమస్యలు ఎన్నో మహిళలను ఇబ్బంది పెడతాయి.  చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల మెనోపాజ్ చాలా నరకంగా అనిపిస్తుంది. దీని గురించి మహిళలకే కాకుండా వారి భాగస్వాములకు కూడా మెనోపాజ్ విషయంలో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది అక్టోబర్ 18వ తేదీన వరల్డ్ మెనోపాజ్ డే ని నిర్వహిస్తున్నారు. దీని లక్ష్యాలు, దీని చరిత్ర, దీని థీమ్ మొదలైన విషయాలు తెలుసుకుంటే..

ఈ ఏడాది ప్రపంచ మెనోపాజ్ డే థీమ్  కార్డియోవాస్కులర్ డిసీజ్. మహిళల పునరుత్పత్తి ఆరోగ్యం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మెనోపాజ్  కు చేరువ అవుతున్న మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం.

చరిత్ర..

ప్రపంచ మెనోపాజ్ డే ను 1984లో ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఇంటర్నేషనల్ మెనోపాజ్ సొసైటీ కలిసి స్థాపించాయి. నలభై ఏళ్ళ తరువాత మహిళలు ఈ సమస్యలో ఎదుర్కొనే పరిస్థితుల గురించి అవగాహన కల్పించడం ఈ రోజు ప్రధాన ఉద్దేశ్యం.

ఒకప్పుడు  45 నుండి  55 సంవత్సరాల మధ్య మహిళలలో  పునరుత్పత్తి హార్మోన్లు సహజంగా  క్షీణించేవి. ఇది ఇప్పుడు కొందరిలో 40ఏళ్ల తరువాతే మొదలవుతోంది.   మెనోపాజ్ ఎదుర్కొంటున్న మహిళలలో  సాధారణ లక్షణాలైన వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు, మానసిక మార్పులు  నిద్ర భంగం వంటివి ఉంటాయి. ప్రతి మహిళ వీటి గురించి  తెలుసుకోవాలి. ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థ బలహీన పడటం వల్ల  గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరగడం,  ఆందోళన, నిరాశకు మొదలైన సమస్యలకు కూడా  కారణమవుతుంది.

ప్రపంచ మెనోపాజ్ డే  చాలా  ముఖ్యమైనది, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది  స్త్రీలు ఇప్పటికీ మెనోపాజ్ సమస్య గురించి అవహాహన కలిగి లేరు, అలాగే దీని గురించి అవగాహన ఉన్న కొద్ది మంది కూడా దీని గురించి చర్చించలేకపోతున్నారు, అయినప్పటికీ ఇది మహిళల ఆరోగ్యంలో చాలా ముఖ్యమైన దశ. మెనోపాజ్ చాలా కాలం పాటు కొనసాగుతుంది.  పెరిమెనోపాజ్ పరిస్థితి మెనోపాజ్‌కు ఒక సంవత్సరం ముందు ప్రారంభమవుతుంది,   ఇది మహిళలకు అసౌకర్యాన్నికలిగిస్తుంది. సుమారు ఒక దశాబ్దం పాటు ఉంటుంది.