మహిళలలో పిసిఒయస్ సమస్యకు కారణాలు.. పరిష్కార మార్గాలు..


ఒక వయసు వచ్చాక అమ్మాయిలలో ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి.  అవి మెల్లగా పెరుగుతూ మహిళలను చాలా రకాలుగా ఇబ్బందికి గురిచేస్తాయి. మహిళలలో సాధారణంగా కనిపించే సమస్యలలో పిసిఒఎస్ ఒకటి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ గా పిలువబడే ఈ సమస్య  మహిళలలో చాలా తీవ్రమైన పరిస్థితులకు కారణం అవుతుంది. ఇది ప్రధానంగా హార్మోన్ సమస్యగా పరిగణింపబడుతుంది.  పునరుత్పత్తి వయస్సు మహిళలలో వస్తుంది. ఈ సమస్య ఉన్న మహిళలలో నెలసరి రావడం నుండి, ఆ సమయంలో జరిగే ఋతుస్రావం వరకు చాలా విషయాలు ప్రభావితం అవుతాయి. ఇది పూర్తిగా మహిళల మానసిక  స్థితిని దెబ్బతీసే సమస్య.  పిసిఒఎస్ సమస్య గురించి మహిళలలో సరైన అవగాహన కలిగించడానికి,  ఈ సమస్యను అధిగమించే విషయంలో మహిళలను ప్రోత్సహించడానికి సెప్టెంబర్ నెలను పిసిఒయస్ అవగాహనా నెలగా కేటాయించారు.  మహిళలలో ఎక్కువగా కనిపించే ఈ సమస్య గురించి వివరంగా తెలుసుకుని, దీనికి పరిష్కార మార్గాలేమిటో విశ్లేషించడం ఎంతో ముఖ్యం.

పిసిఒఎస్..

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యకు ఖచ్చితమైన కారణం అంటూ ఏదీ  ఇప్పటి వరకు తెలియదు. ఆరోగ్య నిపుణులు మహిళలలో కనిపించే  కొన్ని మార్పుల కారణంగా  సమస్యకు మూలాన్ని అంచనా వేసి దానికి తగిన పరిష్కాలు సూచిస్తుంటారు. మహిళలలో  నెలసరి సమస్యలు రావడం, దీర్ఘకాలం రక్తస్రావం జరగడం, లేదా నెలసరిలో తగినంత రక్తస్రావం జరగకపోవడం వంటి సమస్యలు పిసిఒఎస్ సమస్యలున్న మహిళలలో కనిపిస్తుంటాయి.  ఇది చాలా కాలం  కొనసాగడం వల్ల మహిళలలో పిల్లలు పుట్టడంలో అవాంతరాలు ఏర్పడతాయి.  ఈ సమస్యకు అధికబరువు, హార్మోన్ అసమతుల్యత  ముఖ్యకారణాలు కావచ్చునని వైద్యులు చెబుతున్నారు.  

నివారణ ఎలాగంటే..

ఆరోగ్యకరమైన జీవనశైలి..

అధిక బరువు ఉన్న మహిళలలో పిసిఒఎస్ సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు బరువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నం చేస్తే ఈ సమస్య కూడా అంత తగ్గే అవకాశం ఉంటుంది.  బరువు నియంత్రణలోకి వచ్చే కొద్ది శరీరంలో హార్మోన్లు కూడా మెల్లిగా చక్కబడతాయి.  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, పోషకాల సహాయంతో బరువు తగ్గడం వల్ల పిసిఒఎస్ సమస్యను తగ్గించుకోవచ్చు.

ఆహారం..

పిసిఒయస్ సమస్యను నియంత్రించడానికి సరైన పోషకాహారం ముఖ్యం.  కార్భోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం తగ్గించాలి. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.  పిసిఒయస్ సమస్యను అరికట్టడానికి సింపుల్ గా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తగ్గించి వాటి స్థానంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవడం వల్ల చాలావరకు సమస్యను అదుపులో ఉంచవచ్చు.

చురుగ్గా ఉండాలి..

 ఒకేచోట కూర్చుని పనిచేయడం అధికబరువుకు ప్రధాన కారణం అవుతుంది. నేటికాలంలో బిజీ పేరుతో శారీరక వ్యాయామం చేయకపోడం కూడా అధికబరువుకు కారణమే. ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ జీవితం గడుపుతున్నా రోజులో కొద్దసేపు వ్యాయామం, యోగ, ధ్యానం మొదలైనవాటికి కేటాయించడం చాలా ముఖ్యం. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.  బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అధికబరువు ఉన్నా పిసిఒయస్ సమస్య ఉండకూడదు అంటే క్రమం  తప్పకుండా వాకింగ్, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. వీటిని పాటిస్తే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఫలితంగా పిసిఒయస్ సమస్య తగ్గిపోతుంది.

                                                                *నిశ్శబ్ద.