పెళ్ళైన మహిళల్లో నెలసరి స్కిప్ అయినా ప్రెగ్నెన్సీ రాకపోతే ఏమి జరుగుతుంది..

 


గర్భం దాల్చడం ప్రతి మహిళ జీవితంలో ఎంతో గొప్ప అనుభూతి. ఇషించల ప్రత్యేకమైన దశ కూడా. చాలామంది పెళ్ళైన మహిళలు నెలసరి స్కిప్ అవ్వగానే ఇక ప్రెగ్నెన్సీ వచ్చిందని అనుకుంటారు. కానీ ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రం ఫలితం నెగిటివ్ గా వస్తుంది. అసలిలా ఎందుకు జరుగుతుంది?? పెళ్ళైన మహిళలలో నెలసరి మిస్సైనా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఏమిటి?? ఇలా నెలసరి మిస్సయ్యే మహిళలు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం ఎలా?  ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?? మొదలైన విషయాలు వివరంగా తెలుసుకుంటే..


పెళ్ళైన తరువాత మహిళలు గర్భం ధరించారనడానికి  మొదటి సిగ్నల్ పీరియడ్స్ మిస్ అవ్వడమే. అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ లో కొందరికి నెగిటివ్ వస్తుంది. అప్పటిదాకా ప్రతినెలా సరైన ఋతుచక్రం కొనసాగిన మహిళల్లో అటు నెలసరి రాక, ఇటు గర్భం దాల్చక అయోమయానికి లోనవుతుంటారు. కనీసం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలా వద్దా?? అని సందిగ్ధ పడుతుంటారు.  మహిళలు ఏమాత్రం ఒత్తిడికి లోనైన వారి శరీరంలో హార్మోన్ల స్థాయిలు అసమతుల్యం అవుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల ఋతుచక్ర సమస్యలు వస్తాయి. 


మహిళలు చాలా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, దీర్ఘకాలిక ఆందోళన కలిగి ఉంటే లేదా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నట్లయితే, చికిత్స తీసుకోవాలి. ఒత్తిడిని నియంత్రించడానికి,  సమతుల్య ఆహారం, శారీరక శ్రమ  కూడా అవసరం అవుతుంది. దీంతో శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.


సాధారణంగా ప్రతినెలా అండాశయం నుంచి అండాలు విడుదల అవుతాయి. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి, ఇది అనోయులేషన్‌కు దారితీస్తుంది. అనోయులేషన్ అంటే అండాలు  విడుదల కాకపోవడం. దీని కారణంగా, పీరియడ్స్ మిస్ కావచ్చు లేదా ఆలస్యం కావచ్చు.  అంతేకాదు ఇది పిల్లలు పుట్టడంలో  సమస్యలకు కారణం కావచ్చు. PCOD, థైరాయిడ్,  బరువు తగ్గడం, పెరగడం అనోయులేషన్‌కు కారణం అవుతాయి. 


గర్భనిరోధక మాత్రలు,  రక్తపోటు,  అలెర్జీ మందులు వంటి కొన్ని మందులు కూడా హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి, ఇది నెలసరి తప్పిపోవడానికి లేదా ఆలస్యం కావడానికి దారితీస్తుంది. ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా ఋతు చక్రంలో ఆటంకం ఏర్పడవచ్చు. ఇలాంటి సందర్భాలలో, గర్భధారణ కోసం మహిళలు  ఆరోగ్యాన్ని  జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక వ్యాధులు, పోషకాహార లోపాలు,  హార్మోన్ల అసమతుల్యత కారణంగా బరువులో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవి ఋతు చక్రం పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. 


ధ్యానం, యోగ, ప్రాణాయామం వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని నియంత్రలోకి తీసుకురావచ్చు. రోజూ చురుగ్గా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం, వీలైనంత వరకు అందరితో నవ్వుతూ మాట్లాడటం. ఇవన్నీ మహిళల నెలసరి తిరిగి సాధారణ స్థితిలోకి రావడానికి కారణం అవుతాయి.

   

                                *నిశ్శబ్ద.