శారీరక వ్యాయామాల్లో నడక అంత సులువైనది మరొకటి లేదని చెప్పవచ్చు. ఎలాంటి ఖర్చూ ఉండదు. జిమ్‌కి వెళ్లక్కర్లేదు, వ్యాయామ సామగ్రి అక్కర్లేదు, శిక్షణ అవసరం లేదు.
ఉదయం పూట నడవటం వలన ప్రయోజనం అధికంగా ఉంటుంది. అదీ అవకాశం ఉంటే చెట్ల గాలి పీలుస్తూ నడవటం మరింత ఆరోగ్యకరం. ట్రాఫిక్ పెరిగిన తరువాత సాగించే నడక వలన వాహనాల నుంచి వెలువడిన కాలుష్యాన్ని పీల్చాల్సివస్తుంది.
నడక పూర్తిగా అలవాటు లేని వారు ఒక్కసారిగా నడవటం మంచిది కాదు. మొదట పది నిముషాలు, పావుగంటతో మొదలుపెట్టి తరువాత పెంచుతూ పోవాలి. వారానికి ఒకసారి ఈ కాలపరిమితిని పెంచుతూ పోవచ్చు. రోజుకి నాలుగయిదు కిలోమీటర్ల వరకు నడవవచ్చు. వారానికి 30 కిలోమీటర్లు, నెలకి 100 కిలోమీటర్ల వరకు వాకింగ్ చేయవచ్చు.
నడకని మొదలు పెట్టేటపుడు ముందు కొద్ది నిముషాలపాటు నెమ్మదిగా నడవాలి. తరువాత నడకలో వేగం పుంజుకోవాలి. నడిచేటపుడు చాలా నిటారుగా ఉండాలి. శరీరాన్ని ఎక్కడా వంచకూడదు.
భుజాల్లో ఏమాత్రం పట్టులేకుండా చూసుకోండి. అలాగే చేతులు కూడా శరీరానికి వేలాడుతున్నట్టుగా వదిలేయాలి. రెండుకాళ్లు ఒకే తరహాలో అడుగులు వేస్తూ నడక సాగించాలి. శరీరంలో ఏ భాగమూ హెచ్చుతగ్గులతో ఒంగకుండా నిటారుగా ఉండేలా చేతులు ఊపుతూ నడవాలి. మోకాలు, తొడల ప్రాంతంలో కదలిక తేలిగ్గా ఉండేలా చూసుకోవాలి.
ఈ విధంగా ప్రతిరోజూ నడవడం వలన ఏ అనారోగ్యం కూడా మన దరికి చేరాడు. ఈ విధంగా ప్రతి రోజు నడిస్తే స్లిమ్ గా మారుతారు.