వాషింగ్ మెషీన్ లో దుస్తులు వేసే అలవాటు ఉంటే ఈ పనులు మాత్రం చెయ్యకండి!

స్నానం చెయ్యడం, ఉతికిన  దుస్తులు ధరించడం పిల్లల నుండి పెద్దల వరకు పాటించే అలవాటు. అయితే వాషింగ్ మెషిన్ వాడే అందరికీ అందులో దుస్తులు వేయడం గురించి సరైన అవగాహన ఉండదు. కొందరు తెలిసీ తెలియక కొన్ని రకాల దుస్తులు వేయడం వల్ల దుస్తులు చాలా దారుణంగా దెబ్బతింటాయి.  అసలు వాషింగ్ మెషీన్లో వేయకూడని దుస్తులేంటో తెలుసుకుంటే..

ఉన్ని దుస్తులు..

ఉన్నిదుస్తులను వాషింగ్ మెషీన్లో అస్సలు వేయకూడదు. దీనివల్ల దుస్తులు చాలా దారుణంగా దెబ్బతింటాయి. ముఖ్యంగా ఉన్ని దారాల మధ్య గ్యాప్ పెరిగిపోయి దుస్తులు చాలా వదులుగా తయారవుతాయి. దీనివల్ల ఈ దుస్తులను చలికాలంలో వేసుకున్నా చలిని నియంత్రించలేవు. పైపెచ్చు ఉన్నిదుస్తులు వాషింగ్ మెషీన్లో వేస్తే రంగు కోల్పోయనట్టు డల్ గా తయారవుతాయి.

లెదర్ దుస్తులు..

అబ్బాయిలు లేదా అమ్మాయిలు లెదర్ దుస్తులను వాడుతుంటారు. ముఖ్యంగా లెదర్ జాకెట్లు చాలామందికి ఉంటాయి. అదే విధంగా తోలుతో తయారైన ఇతర దుస్తులు కూడా ఉంటాయి.  కానీ వీటిని వాషింగ్ మెషీన్లో వేయకూడదు. ఇవి తొందరగా మన్నిక తగ్గడమే కాదు, రంగు నుండి చాలా విధాలుగా నష్టం జరుగుతుంది.

పట్టుబట్టలు..

పట్టు దుస్తులు  అమ్మాయిల దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. ఆడవాళ్ళు వీటిని చాలా అపురూపంగా చూసుకుంటారు. పైగా ఇవి ఖరీదు కూడా ఎక్కువ. తెలిసీ తెలియనితనంతో పొరపాటుగా  పట్టు దుస్తులను వాషంగ్ మెషీన్లో వేస్తే అంతే సంగతులు. దుస్తుల పోగులు పైకి లేవడమే కాకుండా పట్టుదుస్తులు వాషింగ్ మెషీన్లో వేస్తే బట్ట కుచించుకుపోతుంది. దుస్తుల రూపమే మారిపోతుంది.

స్టక్చర్డ్ దుస్తులు..

ఫ్యాషన్లో భాగంగా ముడతలతో కూడిన దుస్తులు వస్తుంటాయి. వీటిని ప్లీటెడ్ దుస్తులు అని కూడా అంటారు. ఈ దుస్తులను వాషింగ్ మెషీన్లో అస్సలు వేయకూడదు. ఇలాంటి దుస్తులు వాషింగ్ మెషీన్లో వేస్తే బట్టల నాణ్యత దెబ్బతింటుంది. దుస్తుల రూపం చెడిపోతుంది.

                                     *నిశ్శబ్ద.