పెదవులు పగులుతున్నాయా..ఈ విటమిన్ లోపమే కారణం!
పెదవులు పగలడం చాలా మంది ఎదుర్కునే సాధారణ సమస్య. చలికాలంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. పెదవులు పగిలినప్పుడు తినడంలోనూ, తాగడం లోనూ, కొన్ని సార్లు మాట్లాడటంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే ఇలా పెదవులు, పెదవుల మూలాలు పగలడం అనేది వాతావరణ మార్పుల వల్ల జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇలా జరగడం విటమిన్ లోపం వల్లనే అని అంటున్నారు ఆహార నిపుణులు, చర్మ సంరక్షణ నిపుణులు. ఇలా విటమిన్ లోపం వల్ల పెదవులు పగిలితే ఎన్ని క్రీములు రాసినా, ఎన్ని చిట్కాలు ఫాలో అయినా అది తగిన ఫలితాలు ఇవ్వదట.
విటమిన్ లోపం..
కొన్ని సార్లు పెదవులు పగలడం, పెదవులు చివర్లు చీలడం జరుగుతుంది. దీని వల్ల కొన్ని సందర్భాలలో రక్తం కారడం కూడా జరుగుతుంది. ఇది విటమిన్-బి, విటమిన్-సి లోపం వల్ల జరుగుతుందని అంటున్నారు.
విటమిన్-బి, విటమిన్-సి లోపిస్తే శరీరం చాలా తొందరగా పొడిబారుతుంది. దీని వల్ల చర్మం మీద దురద, పొలుసులు ఏర్పడటం, మొటిమలు రావడం జరుగుతాయి.
మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. ఈ విటమిన్ -బి లోపం వల్లనే జుట్టు రాలే సమస్య, జుట్టు బలహీనంగా మారడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇవన్నీ జుట్టును బాగా దెబ్బతీస్తాయి.
విటమిన్-బి లోపాన్ని భర్తీ చేయాలంటే గుడ్లు, చేపలు, గింజలు, తృణధాన్యాలు, పాలకూర, బచ్చలి కూర, మాంసం.. ముఖ్యంగా చికెన్.. మొదలైనవి తినాలి. ఇవి తింటే విటమిన్-బి భర్తీ అవుతుంది.
ఇక విటమిన్-సి లభించాలి అంటే నిమ్మరసం, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు తీసుకోవాలి. ఇవన్నీ విటమిన్-సి ని భర్తీ చేస్తాయి. ఇవి పుష్కలంగా తీసుకుంటే పెదవుల పగుళ్లు, పెదవుల మూలలు చీలడం వంటివి ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినా మెల్లగా తగ్గిపోతాయి.
*రూపశ్రీ
