ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర సరిగా రాదు ఎందుకని...నిద్ర బాగా పట్టాలంటే ఏం చెయ్యాలి?
మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ తగినంత నిద్ర అవసరం. కానీ గర్భధారణ సమయంలో తగినంత నిద్రపోవడం మహిళలకు పెద్ద సవాలుగా మారుతుంది. అయితే గర్భం దాల్చిన తొమ్మిది నెలల కాలం చాలా విలువైనది. నిద్రలేమి సమస్య ఈ 9నెలల కాలాన్ని చాలా క్లిష్టతరంగా మారుస్తుంది. సాధారణంగా అలసటగా ఉన్నప్పుడు చాలామంది హాయిగా నిద్రపోతారు. కానీ అలసటగా అనిపించినా సరైన నిద్ర పట్టడం లేదని చాలామంది మహిళలు వాపోతుంటారు.
మహిళలకు నిద్రలేమి వెనుక హార్మోన్లలో మార్పులు, వెన్నునొప్పి, కడుపులో బిడ్డ చురుకుగా మారడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడానికి లేవడం వల్ల చాలాసార్లు నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీని కారణంగా మరుసటి రోజు అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. గర్భిణీ స్త్రీ రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోవాలని, పగటిపూట కనీసం రెండు గంటలు నిద్రపోవాలని, ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మహిళా వైద్యులు చెబుతున్నారు. గర్భవతులు హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుంటే..
ప్రెగ్నెన్సీ సమయంలో రోజంతా యాక్టివ్ గా ఉండటం వల్ల రాత్రి బాగా నిద్ర పడుతుంది. చురుగ్గా ఉండటం అంటే భారీ పని కాదు. పగటిపూట లైట్ యోగా, వ్యాయామం చేయడం వల్ల రాత్రి బాగా నిద్ర పడుతుంది.
డిజిటల్ గాడ్జెట్లు మనస్సును చురుకుగా ఉంచుతాయి. పదే పదే మొబైల్ చూడటం, ఏదో ఒకటి ఆపరేట్ చేయడం చేస్తుంటారు. ఇవి నిద్రపై అత్యధిక ప్రభావం చూపుతాయి. పడుకునే రెండు గంటల ముందు ఫోన్, టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రపై దృష్టి పెట్టడం మంచిది.
పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇలా చేయడం వల్ల రోజంతా అలసట, టెన్షన్ తొలగిపోయి స్నానం చేసి పడుకోగానే గాఢ నిద్రలోకి జారుకుంటారు.
రాత్రి పడుకునే ముందు వేడి లేదా చల్లని కాఫీ వంటి కెఫిన్ ఉన్న పానీయాలను తాగడం మానుకోవాలి. నిద్రవేళకు రెండు మూడు గంటల ముందు వీటిని తీసుకోవడం మానేస్తే, ఆహ్లాదకరమైన నిద్రను సొంతం అవుతుంది.
పడుకునే ముందు చాలా తక్కువ మొత్తంలో నీరు త్రాగాలి. దీనితో తరచుగా మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఉండదు . నిద్రకు కూడా ఆటంకం కలగదు. నిద్రవేళకు ముందు ఒకసారి మూత్ర విసర్జనకు వెళ్లి రావాలి. ఇలా చేయడం వల్ల గాఢ నిద్ర నుండి మళ్లీ మళ్లీ మేల్కొనే అవసరం ఉండదు.
ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడూ వీపుపై నేరుగా పడుకోకూడదు. కుడి లేదా ఎడమ వైపున నిద్రించడానికి ప్రయత్నించాలి. మనకు వెన్నుపాము పైన రక్త నాళాలు ఉంటాయి. దానిపై కడుపులో శిశువు నెమ్మదిగా పెరుగుతుంటాడు. వెల్లికిలా పడుకోవడం వల్ల నాళాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీని కారణంగా శిశువుకు రక్త సరఫరా ఆగిపోతుంది. అంతేకాదు గర్భవతుల కాళ్లు గుండెకు రక్త సరఫరా కూడా ఆగిపోతుంది. అదే ఒకవైపుకు తిరిగి పడుకోవడం ద్వారా పిల్లల మొత్తం బరువు రక్తనాళాలపై పడదు. దాని కారణంగా కడుపులో బిడ్డ పెరుగుదల బాగుంటుంది.
*రూపశ్రీ.