పిల్లలకు వాంతులు అవుతుంటే ఏమి చెయ్యాలి?


చాలా మంది తల్లులు పిల్లలకు వాంతులు అవుతున్నాయని చెప్పడం వింటూ ఉంటాం. అయితే..  ఎక్కువసార్లు, వెంటవెంటనే వాంతులు అయితే బిడ్డ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టుగా గ్రహించాలి. బిడ్డకు వాంతులు అరికట్టే ప్రయత్నంలో సొంతవైద్యం చేయడం మరింత ప్రమాదకరం. బిడ్డ వాంతులు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. బిడ్డ జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఏర్పడి వాంతులు అవుతుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఈ విషయంలో ఆలస్యం చేయడం  ప్రమాదకరం.

కొందరు పిల్లలు అసాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు వాంతి చేసుకుంటారు. మరికొందరు పిల్లలు పాలు తాగిన తరువాత కొద్ది పాలు వాంతి చేసుకుంటారు. ఇది పాలు తాగిన ప్రతిసారీ కావచ్చు. లేదా రోజులోనో, వారంలోనో ఒకసారి కావచ్చు. ఈ తరహా వాంతుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బిడ్డ అన్ని రకాల ఆరోగ్యంగా ఉన్నప్పుడు  ఒక్కసారి ఎక్కువ మోతాదులో వాంతి చేసుకొన్నా దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ ఇదే పరిస్థితి 5,6 సార్లు జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

బిడ్డ వాంతి చేసుకున్న వెంటనే ఏం చేయాలి ? 

బిడ్డ వాంతి చేసుకోగానే తల్లి చాలా కంగారు పడుతుంది. అయితే ఆందొళనపడకుండా గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తుండాలి. సంవత్సరం లోపు బిడ్డ అయితే వడపోసిన గోరువెచ్చటి మంచినీటిని తాగించాలి. 'వెంటనే' పాలు ఇవ్వకూడదు. కడుపులో ఏదైనా అసౌకర్యం ఏర్పడితే కొందరు పిల్లలు వాంతి చేసుకుంటారు. అందువల్ల వారికి వెంటనే పాలు ఇవ్వడం సరికాదు. 2,3 నిమిషాలు వేచి చూడాలి. బిడ్డ కడుపు ఖాళీ అయివుంటే, వెంటనే ఏడ్వడం ప్రారంభం అవుతుంది. ఆ సమయం పాలు ఇవ్వడానికి అనువైనది.

బిడ్డ సాధారణ స్థాయిలో పాలుతాగుతూ ఉన్నప్పుడు, బిడ్డ శరీర ఉష్ణోగ్రత సరిగా ఉన్నప్పుడు వాంతి చేసుకున్నా ఫరవాలేదు. కానీ పాలుతాగడం మానేసి వాంతి చేసుకుని, శరీరం ఉష్ణోగ్రత తగ్గితే మాత్రం తక్షణం డాక్టర్ను సంప్రదించాల్సిందే. బిడ్డ జబ్బు పడ్డాడు అనడానికి ఇవన్నీ లక్షణాలుగా గుర్తించాలి. అయితే కొన్ని సార్లు బిడ్డ కడుపులో ఆమ్లాలు ఏర్పడతాయి. అవి తాగిన పాలతో కలవడం వల్ల కూడా బిడ్డ వాంతి చేసుకునే అవకాశం ఉంది. మరికొన్ని సార్లు తాగిన పాలు, తీసుకున్న ఆహారం సాఫీగా వెళ్ళడంలో కొన్ని అవరోధాలు ఏర్పడతాయి. అలాంటి సందర్భంలో తీసుకున్న మొత్తం ఆహారం, పాలు వాంతి అవుతాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకసారిజరిగితే ఫరవాలేదు. అది కూడా వాంతి వల్ల బిడ్డ ఏ విధమైన నీరసానికి లోను కానంత వరకు తల్లులు కంగారు పడనవసరం లేదు.

గమనిక: వైద్యులు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారమే ఈ సమాచారం రాయడబడింది. పిల్లల విషయంలో వైద్యుల సలహాలు చాలా ముఖ్యం.

                                   ◆నిశ్శబ్ద.