సూర్యనమస్కారాలు - 4
ఆసనాలు:
అశ్వసంచాలనాసనం :
                                   పై ఆసనాల నుండి నెమ్మదిగా కటిద్వయాన్ని కిందికి దించి కుడికాలిని కొంచెం ముందుకు తెచ్చి రెండు చేతులను నేలకు అదిమి ఉంచాలి. ఎడమ మోకాలును నెమ్మదిగా వెనక్కి చాచాలి. నెమ్మదిగా లోనికి శ్వాసిస్తూ పైకి చూస్తుంటే అర్థ చంద్రాకారం కలిగి గుఱ్ఱం ఆకారం వలె ఉంటుంది.
' ఓం ఆదిత్యాయ నమః' 'విశ్వ సుతుడైన నీకు ప్రణామం' అనే మంత్రం స్మరణీయం.

ప్రయోజనాలు: ఈ ఆసనం వలన ఉదరం పై ఒత్తిడి పడిన కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది. మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది. కొవ్వుని తొలగించి శరీరం నాజూకుగా మారడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది.


పాద హస్తాసనం
                   అశ్వభంగిమ నుండి శ్వాసను విడుస్తూ ఎడమ పాదాన్ని ముందుకు చాచాలి. అప్పుడు రెండు పాదాలు ఒకే భంగిమలో ఉంటాయి. అదే సమయంలో శరీర భాగాన్ని పైకెత్తి ముందుకు నుంచునే విధంగా వంగాలి. చిత్రంలో చూసి అభ్యసించాలి. పై వివరాలే దీనికీ వర్తిస్తాయి.
' ఓం పవిత్రే నమః ' ' చైతన్యం కలిగించే వానికి ప్రణామం' అన్న భావాన్నిచ్చే మంత్రం అనుకోవాలి.
ప్రయోజనాలు :
                     శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, టైమర్ ఎడ్రినల్, మరియు యూరో  జెనిటల్ గ్రంథులు  వంటివి ఉత్తేజితమవుతాయి . శ్వాస సంబంధమైన ' సైనస్' సమస్యను సంతాన సాఫల్యాన్ని, శ్వాసక్రియ మెరుగుపరచడం , ఈ ప్రక్రియ వల్ల కలిగే ఉపయోగాలు.
హస్త ఉత్థానాసనం
                          పై భంగిమ నుండి రెండు చేతులను తల పైకి ఎత్తి ఉంచాలి. అలా చేసేటప్పుడు గాఢంగా గాలిని పీల్చాలి. నడుం వెనుకభాగం వద్ద కొద్దిగా వంగాలి. ' ఓం ఆర్కాయ నమః ' ' శక్తిప్రదాతకు నమస్సులు ' అనే భావాన్నిచ్చే మంత్రాన్ని జపించాలి.
ప్రయోజనాలు :
                                వెన్నెముకకు శక్తి ఇవ్వడం, దాని రుగ్మతలను నిరోధించేది గాను ఈ ఆసనం పని చేస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేసే ఆలోచనల వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది.
ఛాతీని తెరచి ఉంచుకోవాలి,  శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది . టైమస్, థైరాయిడ్, వంటి గ్రంథుల పై బాగాపని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్  ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం , మెటబాలిజం మెరుగుపరిచి, సారా థైరాయిడ్ చురుకుగా పనిచేస్తుంది.
ప్రణామాసనం
                          శ్వాసను వదులుతూ రెండు అర చేతులను నమస్కార భంగిమలో ఉండేలా దగ్గరకు చేర్చి చాతీ వద్ద ఉంచాలి. దీనితో సూర్య నమస్కారాసనాలు పూర్తి అయినట్లే.
' ఓం భాస్కరాయ నమః ' ' గురువుకు అభివాదం' అనే భావంలో జపం చెయ్యాలి.
                                                                                   ముగింపు
                          మృదువైన కదలికలతో సూర్య నమస్కారాల పేరిట ఆచరించే పన్నెండు ఆసన భంగిమలు  ప్రసిద్ధమైనవి .మనిషి పుట్టిన తేదీ ఆధారంగా ఏర్పడే వయస్సు కాకుండా మనిషి వెన్నెముక వంగే శక్తి ఆధారంగా ' యోగ వయస్సు' అనేది మరొకటి ఉందని పెద్దలంటారు . యోగప్రాయాన్ని బట్టి యవ్వనం, భౌతిక శక్తి, బలమైన మనస్సు ఏర్పడతాయి. శరీరాన్ని ఎలా పడితే అలా స్వాధీనంలో ఉండేలా వెన్నెముక సులువుగా వంగేలా ఉంచుకునేందుకు అవసరమైన సరళతర వ్యాయామం సూర్యనమస్కారాలు.
భౌతిక ఆరోగ్యం
                 పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలో బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు అవడం, కీళ్ళు వదులవడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. అంతే కాక వ్యాధి నిరోధక శక్తి హెచ్చి శరీరం తేలికగాను, తేజోవంతంగాను, శక్తివంతంగాను  తయారవుతుంది. దేహంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి మలినరహితమై శక్తివంతమవుతాయి.
మనో స్పష్టత
                          సూర్యాసనాల ప్రక్రియ వల్ల మనస్సు స్థిమితంగా ఉండి జ్ఞాపక శక్తి పెరగడం, ఆలోచనలో స్పష్టత, భావ వ్యక్తీకరణలు , ప్రజ్ఞ కలుగుతాయి. వీటి వలన శరీరం ఒకే  విధమైన విశ్రాంతిని పొందుతుంది. ఆత్మకు అనిర్వచనీయమైన  అనుభూతి కలుగుతుంది. సమతుల్యం, సహనం, నిర్దిష్ట మార్గానుసరణ, అనుభూతి పొందుతూ సంతోషం, అర్థవంతమైన జీవనం, ఆలోచనాత్మకమైన మనో విశ్లేషణ, హృదయ వివేకాన్ని సాధకుడు పొందుతాడు. ద్వాదశ సంఖ్యాత్మకమైన  సూర్య నమస్కారాలు గోప్యమైనవి. వీటిని సక్రమంగా ఆచరిస్తే, ఇవి ప్రణామ ప్రవాహంగా అవిచ్చిన్నంగా సాగుతాయి. వీటిలో మొండెం, మెడ ముందుకు , వెనుకకు , పైకి, కిందకు ప్రధానంగా కదులుతాయి. ఈ కదలికలు ఏడు ప్రధాన చక్రాలను చైతన్యవంతం చేస్తాయి.
ఈ ప్రక్రియలో గుర్తుంచుకోవలసిన అంశాలు రెండు .
వేసే ప్రతి ఆసనంలోను శరీరంలోని వివిధ భాగాల కదలికలు గమనించడం మొదటిది .
శ్వాస యుక్తలయను కదలికలతో అనుసంధానించడం రెండవది. శరీరాన్ని వెనుకకు వంచేటప్పుడు లోనికి శ్వాసించడం, ముందుకు వంగేటప్పుడు శ్వాసను వదలడం ముఖ్య సూత్రం .
ప్రాణాయామం, సూర్యనమస్కారం, విశ్రాంతి ఆసనమైన శవాసనం అనే మూడు ఆదిత్య ప్రణామాల్లో అంతర్లీనంగా ఉంటాయి.