హీరోయిన్స్ లా స్టైల్ గా మెడకు పెర్ఫ్యూమ్ కొట్టేవారికి షాకింగ్ న్యూస్..!

 

ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్దది.  ముఖ్యంగా అమ్మాయిలు ఫ్యాషన్ లో మునిగి తేలుతుంటారు. దుస్తులు, మేకప్ నుండి అంతా తయారయ్యాక చివరగా పెర్ఫ్యూమ్ స్ప్రే చేయడం వరకు ఎక్కడా రాజీ పడరు. చాలామంది సెలబ్రిటీలను, హీరోయిన్స్ ను అనుసరిస్తారు. వారిలా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిలో పెర్ఫ్యూమ్ అప్లై చేయడం ఒకటి. టీవీ లో పెర్ఫ్యూమ్  యాడ్స్ గమనిస్తే గనుక హీరోయిన్స్ లేదా మోడల్స్  పెర్ఫ్యూమ్ ను చాలా స్టైల్ గా మెడ దగ్గర స్ప్రే చేస్తుంటారు. ఆ తరువాత చేతి మణికట్టు దగ్గర కూడా స్ప్రే చేస్తుంటారు. అయితే ఇలా స్ప్రే చేయడం ఎంత వరకు ఆరోగ్యకరం అనే విషయం మాత్రం ఆలోచించరు.  మెడ దగ్గర, మణికట్టు దగ్గర పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే జరిగేదేంటో.. దీని గురించి చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెప్పారో తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది.

పెర్ఫ్యూమ్ ను మెడ, మణికట్టు దగ్గర స్ప్రే చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య  బాధితులుగా మారే అవకాశం ఉంటుందట. పెర్ఫ్యూమ్ సువాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఇందులో చాలా రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. వీటిని ఫోటోసెన్సిటైజింగ్ ఏజెంట్లు అని అంటారు. పెర్ఫ్యూమ్ స్ప్రే చేసిన చర్మం భాగంలో పదునైన సూర్య కిరణాలు తాకినప్పుడు చర్మం చికాకు పెట్టడం, వాపుకు గురి కావడం, హైపర్పిగ్మెంటేషన్ కు దారితీయడం జరుగుతుంది.


చాలా పెర్ఫ్యూమ్ ల తయారీలో ఆల్కహాల్ వాడతారు. ఈ ఆల్కహాల్, సింథటిక్ వాసనలు చర్మాన్ని చికాకు పెడతాయి. అలెర్జీని కలిగిస్తాయి. పిగ్మెంటేషన్ కు కారణమయ్యే మెలనోసైట్ లను ప్రేరేపించి చర్మాన్ని  నల్లగా మార్చే మెలనిన్ ను ఉత్పత్తి చేసేలా చేస్తుంది. మచ్చలు ఏర్పడటానికి కూడా కారణం అవుతుంది.


కొన్ని రకాల పెర్ఫ్యూమ్ లలో ఉండే రసాయనాల కారణంగా చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. ఇది కూడా పిగ్మెంటేషన్ ను కలిగిస్తుంది.


                                             *రూపశ్రీ.