ప్రతి అమ్మాయి తన జీవితంలో బోలెడు సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది, వాడుతుంది కూడా. అయితే అమ్మాయిల జీవితంలో సాధారణ దశలు వేరు.. గర్బవతులుగా ఉండే దశ వేరు. ఈ కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భానికి హాని కలిగించే ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గర్భవతులకు హాని కలిగించే వాటిలో బ్యూటీ ఉత్పత్తులు కూడా ఉంటాయి. కొన్ని రకాల బ్యూటీ ఉత్పత్తులు గర్బంలో పెరుగుతున్న శిశువుకు హాని కలిగిస్తాయి. పుట్టుక లోపాలు రావడానికి కారణం అవుతాయి. ఏ బ్యూటీ ఉత్పత్తులు గర్భవతులకు హాని చేస్తాయంటే..
రెటినోల్ కలిగిన ఉత్పత్తులు..
రెటినోల్ ఉత్పత్తులలో విటమిన్-ఎ ఉంటుంది. ఇది ముడతలు, మొటిమలు రాకుండా చేస్తుంది. అయితే ఈ రకమైన ఉత్పత్తులు గర్బధారణ సమయంలో వాడితే కడుపులో బిడ్డకు హాని చేస్తుంది.
సాలిసిలిక్ యాసిడ్..
సాలిసిలిక్ యాసిడ్ అనే రసాయనం మొటిమలు తొలగించడం కోసం ఉపయోగించే క్రీములలో ఉంటుంది. డాక్టర్ల సలహా లేకుండా సాలిసిలిక్ యాసిడ్ ఉన్న క్రీములు వాడటం మంచిది కాదు.
హైడ్రోక్వినోన్..
చర్మాన్ని కాంతివంతం చేయడానికి హైడ్రోక్వినోన్ ఆధారిత క్రీములు వాడతారు. గర్భాధారణ సమయంలో దీన్ని వాడితే పిల్లలలో ఎదుగుదల మందగిస్తుంది.
థాలేట్స్..
థాలేట్స్ అనే రసాయం ఎక్కువగా నెయిల్ పాలిష్, సబ్బులు, హెయిర్ స్ప్రే వంటి అనేక ఉత్పత్తులలో ఉంటుంది. ఇది పిండంలో హార్మోన్ల మార్పులు రావడానికి కారణం అవుతుంది. గర్భవతులు వీటికి దూరంగా ఉండాలి.
ఆక్సిబెంజోన్, ఆక్సినోక్సేట్..
ఆక్సిబెంజోన్, ఆక్సినోక్సేట్ అనే రసాయనాలు సన్ స్క్రీన్ లో ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతాయి. ఈ రసాయనాలు లేని సన్ స్క్రీన్ ను గర్భవతులు ఉపయోగించాలి.
అసిటోన్..
అసిటోన్ అనే రసాయనం నెయిల్ పాలిష్ లో ఉంటుంది. గర్భిణీ స్త్రీలు నెయిల్ పాలిష్ వేసుకోవడానికి, దాని వాసనకు దూరంగా ఉండాలి. ఇది చాలా హానికరం.
విటమిన్-ఇ..
వైద్యుల ప్రకారం గర్భధారణ సమయంలో విటమిన్-ఇ టాబ్లెట్లు తీసుకోకూడదు. ఇది మెదడుపై ప్రబావం చూపిస్తుంది.
*రూపశ్రీ.