పీరియడ్స్ టైంలో వచ్చే తలనొప్పి తగ్గాలంటే.. ఈ పనులు చేయండి!


ప్రతి మహిళకు పీరియడ్స్ అనేది సాధారణ విషయం.  కొందరికి పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. మరికొందరికి అస్సలు నొప్పి ఉండదని చెబుతుంటారు. కొందరికేమో నడుము, వెన్ను భాగంలో నొప్పి ఉంటుంది. మరికొందరికి పొత్తి కడుపు కండరాలు ఒకటే నొప్పి, తిమ్మిర్లు ఉంటాయి. కానీ చాలామంది బయటకు చెప్పని విషయం తలనొప్పి. మహిళలలో పీరియడ్స్ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల ఇవన్నీ వస్తాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే తలనొప్పికి పీరియడ్స్ కారణం అని చాలామందికి తెలియదు. ఈ సమయంలో వచ్చే తలనొప్పిని అధిగమించాలన్నా, పీరియడ్స్ ఇబ్బందులను అధిగమించాలన్నా ఈ కింది చిట్కాలు పాటించాలి.

వేడి కాపడం..

పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి అయినా తలనొప్పి అయినా తగ్గించుకోవడానికి వేడి కాపడం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తలనొప్పి తగ్గాలంటే వేడి కాపడం మెడ దగ్గర పెట్టాలి. ఇది  తలనొప్పిని, తల భారాన్ని తగ్గిస్తుంది.

అల్లం టీ..

పీరియడ్స్ సమయంలో కలిగే ఇబ్బందులకు చెక్ పెట్టే మరొక చిట్కా అల్లం టీ. తలనొప్పి, వికారం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటే అల్లాన్ని నీటిలో వేసి బాగా మరిగించి కాసింత తేనే, నిమ్మరసం కలిపి గోరువెచ్చగా తాగాలి.

ఆయిల్స్..

నెలసరి సమయంలో వచ్చే తలనొప్పి తగ్గించడానికి ఎసెంటియల్ ఆయిల్స్ కూడా బాగా సహాయపడాయి. లావెండర్, పిప్పరమెంట్, చామంతి వంటి నూనెలను  సాధారణ నూనెలో కలిపి తలకు రాసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం ఉంటుంది. వీటి వాసన వల్ల మానసికి స్థితి కూడా మెరుగ్గా ఉంటుంది.

ఆకుకూరలు..

పాలకూర, తోటకూర, బచ్చలికూర వంటి వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో మెగ్నీషియం తలనొప్పిని కంట్రోల్ చేస్తుంది. ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.

గింజలు, విత్తనాలు..

బాదం, జీడిపప్పు, హాజెల్ నట్స్, బ్రెజిల్ నట్స్ తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. వీటిలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలను రిలాక్స్ గా ఉంచుతుంది. మరీ ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్-ఇ మైగ్రేన్ నొప్పిని కంట్రోల్ చేస్తుంది.

చేపలు..

సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా-3 ప్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తలనొప్పిని తగ్గిస్తాయి.

పండ్లు..

విటమిన్-సి, మెగ్నీషియం, పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లు తింటే నెలసరి సమయంలో వచ్చే తలనొప్పి,కడుపునొప్పి, వికారం, ఉబ్బరం వంటివి తగ్గుతాయి.

చిక్కుళ్లు..

చిక్కుళ్లలో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచుతుంది. వీటిలో ఉండే పోషకాలు తలనొప్పిని తగ్గిస్తాయి.

                                    *నిశ్శబ్ద.