వర్కింగ్ ఉమెన్స్ పిల్లలకు పాలు ఇవ్వడంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఇవీ..!
ఇప్పటి కాలంలో ఆడవారు మల్టి టాస్కర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు ఇంటి పనులు చేస్తూనే మరొక వైపు ఉద్యోగం, పిల్లల సంరక్షణ అన్నీ హ్యాండిల్ చేస్తుంటారు. ముఖ్యంగా పిల్లలను కనడం, వారిని చూసుకుంటూ ఉద్యోగం చేయడం చాలా ఓపికతో కూడుకున్నది. మహిళలు ప్రయాణాలలోనూ, ఆఫీసులకు కూడా తమ చంటి పిల్లలను తీసుకెళ్ళి తమ విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే నలుగురిలో పిల్లలకు పాలివ్వడం ఇబ్బంది కలిగిస్తుంది. మరికొందరికి పిల్లలను తమతో తీసుకెళ్లే వీలు ఉండదు. ఇలాంటి వర్కింగ్ ఉమెన్స్ పిల్లలకు పాలు ఇవ్వడంలో కొన్ని విషయాలు తెలుసుకుంటే.. అవి వారికి చాలా ఉపయోగపడతాయి..
బ్రెస్ట్ ఫీడింగ్ షెడ్యూల్..
పిల్లలకు పాలు ఇవ్వడానికి సమయాన్ని ప్లాన్ చేయాలి. ఆఫీసుకు లేదా ఇతర పనుల మీద బయటకు వెళ్ళే ముందు, ఆ తరువాత పిల్లలకు పాలు ఇవ్వడానికి ట్రై చేయాలి. ఒక నిర్ణీత సమయానికి పిల్లలకు పాలు ఇవ్వడం అలవాటు చేస్తే ఆ తరువాత పిల్లలు కూడా అదే సమయంలో పాలు తాగడానికి అలవాటు పడతారు. దీని వల్ల తల్లులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
బ్రెస్ట్ పంప్..
పిల్లల కోసం తల్లులకు ఈ మధ్య కాలంలో అందుబాటులోకి వచ్చిన వస్తువు బ్రెస్ట్ పంప్. నాణ్యంగా, సౌకర్యవంతంగా, ఉపయోగించడానికి సులభంగా ఉండే బ్రెస్ట్ పంప్ ను కొనుగోలు చేయడం వల్ల తల్లులకు పాలు ఇవ్వడంలో కంగారు తగ్గుతుంది. కొన్ని ఎలక్ట్రిక్ పంప్ లు సెషన్ ల కోసం రూపొందించబడతాయి. సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇవి మంచివి. అలాగే తరచుగా ప్రయాణాలలో ఉంటే పోర్టబుల్ పంప్ ను ఎంచుకోవచ్చు.
వాతావరణం..
చాలా వరకు కొన్ని ఆఫీసులు, సంస్థలు స్త్రీల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తుంటాయి. బ్రెస్ట్ మిల్క్ ను సేకరించడానికి పాలను పంప్ చేయడానికి ఇలాంటి సౌకర్యవంతమైన ప్రదేశాలు లేకపోతే పనిచేసే ఆఫీసు యజమాని లేదా అధికారులతో మాట్లాడాలి. సౌకర్యవంతమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
నిల్వ..
తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష. నేరుగా తల్లులు పిల్లలకు స్తన్యం నుండి పాలు అందివ్వకపోయినా, నేటి ప్రపంచం అభివృద్ది చెందిన కారణంగా పాలను నిల్వ చేసే సదుపాయం, వాటిని తరువాత పిల్లలకు ఇచ్చే సౌలభ్యం ఏర్పడింది. అయితే తల్లులు తమ పాలను సేకరించి వాటిని జాగ్రత్తగా నిల్వ చేయాలి. శుభ్రమైన సీసాలు లేదా ప్యాకెట్లు ఉపయోగించాలి. పాలను సేకరిచిన తేదీని వాటి మీద వేయాలి. తల్లిపాలను గది ఉష్ణోగ్రత వద్ద నాలుగు గంటల వరకు, రిఫ్రిజిరేటర్ లో నాలుగు రోజుల వరకు, ఫ్రీజర్ లో ఆరు నెలల వరకు నిల్వ చేయవచ్చు.
*రూపశ్రీ.