వాళ్ళని ఆడనివ్వండి.. అలసిపోనివ్వండి...

పిల్లలు దూకుడుగా ఉంటే తల్లులకు  కాస్త కంగారుగా వుంటుంది. ఎక్కడ క్రింద పడతాడో దెబ్బలు తగిలించుకుంటాడోనని జాగ్రత్త... జాగ్రత్త అంటూ వెంట వెంటే తిరుగుతూనే వుంటుంది అమ్మ, కానీ అల్లరి బుడతలు ఓ చోట కూర్చుంటారా? కుర్చీలు ఎక్కి, సోఫాలెక్కి దూకటం, పరుగులు పెట్టడం మామూలే. కొంతమంది అమ్మమ్మలు, నాయనమ్మలు పసివాడు ఉదయం నుంచి చక్రంలా తిరుగుతూనే వున్నాడు కాళ్ళు నొప్పి వస్తాయో ఎమో అంటూ బాధపడతారు. కానీ అమెరికాలోని ఇండియానా వర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం అది ఎంతో మంచిది, పిల్లలని వారించద్దు, వీలయితే చిన్న వయస్సులో ఉండగా వారితో వ్యాయామాల వంటివి కూడా చేయించండి అంటున్నారు.


చిన్నతనంలో చేసే వ్యాయామం వల్ల జీవితకాలం ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చిన్నతనంలో బాగా శారీరక అలసట వచ్చేలా ఆటలు అడిన పిల్లలు, ఎముకల చలనం ఎక్కువగా ఉండేలా పరుగులు పెట్టి ఆడిన పిల్లలు, అలాగే చిన్నప్పటి నుంచి వ్యాయామాలు చేసిన పిల్లల్లో పెద్దయ్యాక వారి ఎముకలు పటిష్టంగా ఉండటం వీరు నిర్వహించిన ఓ పరిశోధనలో గుర్తించారుట. చిన్నతనంలో వ్యాయామాల  వల్ల ఎముకల్లో అదనంగా బాహ్య పొరలు ఏర్పడటం గమనించారు వీరు. దీనివల్ల భవిష్యత్తులో ఎముకలు విరిగే ప్రమాదం వుండదని, కీళ్ళ నొప్పుల వంటివి త్వరగా రావని చెబుతున్నారు వీరు .

పిల్లల ఆటలు వారి ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయనే  విషయాన్ని నిర్ధారించు కోవటానికి శాస్త్రవేత్తలు కొంత మంది పిల్లలపై కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపారు, కొంతమంది పిల్లలతో కొన్ని నెలల పాటు చిన్నపాటి వ్యాయామాలు చేయించారట. ఆ సమయంలో వారి ఎముకల ఎదుగుదలని నమోదు చేసినపుడు వ్యాయామం చేయకమునుపు కంటే, వ్యాయామం చేసిన తరువాత ఎముక పెరగటం గమనించారుట. ఎముక బలంగా ఉన్నప్పుడే అది ఎక్కువకాలం పాటు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రత్యేకంగా పిల్లలతో వ్యాయామాల వంటివి చేయించలేం అనుకుంటే కనీసం పిల్లల్ని అడుకోనివ్వమని చెబుతున్నారు. వారి మానాన వారిని వదిలేస్తే వాళ్ళు అటు,ఇటు తిరుగుతూ ఆడుకుంటూ వుంటారు .

ఏమాత్రం కదలికకి అవకాశం ఇవ్వకుండా పిల్లలు పడిపోతారనే భయంతో చంకన వేసుకు తిరగటం వంటివి చేయటం మంచిది కాదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎదిగే వయసులో ఎముక బలిష్టంగా ఉంటేనే ఆ తర్వాత కాలంలో ప్రయోజనం పొందవచ్చని, అదే అ సమయంలో కావల్సినంత కదలిక లేకుండా పిల్లల్ని ఒకేచోట కూర్చోబెట్టటం వంటివి చేస్తే ఫలితాలు భిన్నంగా ఉంటాయని హెచ్చరిస్తునారు. అంతే కాదు పౌష్టికాహారం కూడా పిల్లల్లో ఎముకలు ఆరోగ్యంగా ఎదగటానికి సహాయపడుతుందని, పిల్లలు తినరంటూ ఎదో ఒకటిలే అని పెట్టడం వంటివి చేసే తల్లులు ఒకసారి ఆలోచించటం అవసరమని కూడా చెబుతున్నారు ఆహారం, వ్యాయామం వంటివి పెద్దలకే కాదు పిల్లలకూ ముఖ్యమేనని గట్టిగా హెచ్చరిస్తున్నారు వీరు.

 ఒకప్పుడు పిల్లలు స్కూలు నుంచి వస్తే ఓ రెండు, మూడు గంటల పాటు ఆరుబయట ఆడుకొనేవారు. ఊర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంచక్కా నడచి వెళ్ళేవారు. కానీ ఇప్పుడో... పిల్లలు ఇంటి నుంచి అడుగు బయట పెడితే స్కూల్ బస్సు, తిరిగి స్కూల్ బస్సు దిగి ఇల్లు. టి.వి., వీడియో గేమ్స్ వంటివి పిల్లలని కదలకుండా ఓ చోట కట్టిపడేస్తున్నాయి. దాంతో నడక నేర్చిన పిల్లల నుంచి స్కూల్ పిల్లల దాకా అందరూ ఉరుకులు, పరుగులు తగ్గించారు. ఆ ప్రభావం వారి ఎముకల ఎదుగుదలపై, వాటి ఆరోగ్యంఫై తప్పక ఉంటుందని నిపుణులు చెబుతున్న మాట తేలికగా తీసుకోటానికి లేదు. అందువల్ల పిల్లలని ఓ కంట కనిపెడుతూనే వారిని స్వేచ్చగా ఆడుకోనివ్వటం అవసరం. వీలయినంతలో పిల్లలు, పెద్దలు వ్యాయామాలు వంటివి చేయటం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు. మరి ఈ విషయాన్ని ఆలోచిస్తారు కదూ.. ఆలోచించడమే కాదు.. తప్పకుండా అచరణలో కూడా పెట్టాలి. ఎందుకంటే ఈ ఆలోచన, ఆచరణ మీరు ఎంతగానో ప్రేమించే మీ పిల్లల భవిష్యతుకు ఆరోగ్యకరమైన బాట పరుస్తాయి.

-రమ