నారింజ పండు ఎంతో ఉత్తమమైన ఫలం. నిమ్మ, బత్తాయి, నారింజ ఒకే జాతికి చెందిన ఫలాలు. వీని గుణాలు దాదాపు సమానంగానే ఉంటాయి. కానీ నిమ్మ కన్నా నారింజ కాస్త ఉత్తమం అని చెబుతారు. నిమ్మలోని గుణాలతో పాటుగా, తీపి అనే అదనపు గుణం కూడా నారింజ కుంటుంది.

నారింజలో రెండు రకాలున్నాయి - పుల్ల నారింజ, తీపి నారింజ. పుల్ల నారింజ కాయలలో నీరు అధికంగా ఉంటుంది. లవణాలు తక్కువగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో కాస్తుంటాయి. తీపి నారింజలు వేసవిలో కాస్తాయి. వీటిలో నీటి భాగం తక్కువ. లవణాలు ఎక్కువ. ఇది దేహానికి మేలు మేస్తాయి. కాబట్టి వేసవి కాలంలో కాచే నారింజ పండ్లను తినటం ఎక్కువ శ్రేయస్కరం.

నారింజలో విటమిన్ A, B స్వల్పంగా, విటమిన్‌ C ఎక్కువగా ఉంటాయి. రెండు, మూడు గ్లాసుల నారింజ రసం త్రాగితే చాలు.. ఆ రోజుకు కావలసిన విటమిన్‌ C లభిస్తుంది. ఈ పండులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాలలో, జీర్ణశక్తి తగ్గినప్పుడు, నారింజను వాడితే శరీరానికి కావలసిన శక్తితో పాటు కాస్త ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు నారింజ పండ్లను, ఉదయం స్నానానంతరం రెండు పండ్లను తింటే మలబద్దకం పోతుంది. నారింజ పండు దగ్గు, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్రాన్ని సరళంగా జారీ చేస్తుంది.