పొరపాటున కూడా పిల్లలను ఈ మాటలు అనకూడదు..
 


పిల్లల పెంపకం చాలా కష్టమైన పని. పిల్లలను బుజ్జగించడం, వారికి క్రమశిక్షణ నేర్పడం వంటి ఎన్నో  సందర్బాలలో చాలా  విషయాలను గుర్తుపెట్టుకోవాలి. తమ చుట్టూ ఉన్న వాతావరణం పిల్లలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండా తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, చాలాసార్లు వారే ఇలాంటి తప్పులకు పాల్పడి పిల్లలు గాడి తప్పడానికి కారణం అవుతారు. వాస్తవానికి తల్లిదండ్రులు పిల్లలను అనే కొన్ని మాటలు వారి మానసిక ఆరోగ్యంపై లోతైన ప్రభావం చూపుతాయి. అందుకే కోపం వచ్చినా, విసుగు చెందినా.. పొరపాటున కూడా పిల్లలను కొన్ని మాటలు అనకూడదు. పొరపాటున అన్నారంటే అవి   పిల్లల హృదయాలలో లోతైన గాయాలను మిగులుస్తాయి. వారు పెరిగే కొద్దీ ఆ విషయాలు కూడా వారిలో బలంగా తయారవుతూ వస్తాయి. అవే పిల్లలు గాడి తప్పేలానూ, పిల్లల దృష్టిలో పెద్దలు విలువ కోల్పోయేలానూ చేస్తాయి. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలను అనకూడని విషయాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని తెలుసుకంటే..

నీకేమీ తెలియదు అని అనకండి..

తల్లిదండ్రులు  పిల్లలకు తాము ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో తెలియదని చెప్పినప్పుడల్లా వారికేమీ తెలియడం లేదనే ఆత్మన్యూనతలో పడిపోతారు. నీకేమీ తెలీదు నువ్వు  సరైన నిర్ణయం తీసుకోలేవు అని పెద్దలు అంటూ ఉంటారు. దీని వల్ల జరిగేది ఏంటంటే పిల్లలు నా అభిప్రాయం ఎవరికీ పట్టదు, అంతా వారికి నచ్చినట్టే జరగాలా అని ఒకానొక వ్యతిరేక భావన   పిల్లల మనసులో నాటుకుపోతుంది.

ఎప్పుడూ ఏడుస్తావెందుకు అనకూడదు..

 తరచుగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ తరహా మాట అంటూ ఉంటారు. ఎప్పుడూ ఏడుస్తావెందుకు  అని విసుక్కోవడం, కోప్పడటం చేస్తారు. పిల్లలు బాధలో ఉన్నప్పుడు, ఏదైనా కష్టం అనిపించినప్పుడు ఏడుస్తూనే తమ బాధను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి సందర్బాలలో పిల్లలను విసుక్కోవడం వల్ల వారు తమ బాధను తల్లిదండ్రులతో పంచుకునే విషయంలో వెనకడుగు వేస్తారు.  పిల్లలు ఏదైనా చెప్పగలిగే వాతావరణం తల్లితండ్రులే కల్పించాలి.

తోబుట్టువులతోనూ, ఇతరులతోనూ పోల్చకండిి..

ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మెదడు, ప్రతి వ్యక్తి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. అలాంటప్పడు పిల్లలను తొబుట్టువులతోనూ, ఇరుగు పొరుగు పిల్లలతోనూ, క్లాస్ మేట్స్ తోనూ పోల్చకూడదు. ఇది పిల్లలను ఎక్కువగా బాధించే విషయం.  ఈ విషయంలో పిల్లలు కుంగుబాటుకు లోనై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు.

పదే పదే పెద్దరికాన్ని ప్రదర్శించవద్దు..

పెద్దలు కొన్నేళ్లు జీవించేశామని, తమకు అనుభవాలు ఉన్నాయని, మంచేదో, చెడు ఏదో తమకు బాగా తెలుసని పెద్దలు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పిల్లల మీద రుద్దడం, పిల్లల విషయంలో నిర్ణయాలు తామే తీసుకోవడం మానేయాలి.  పిల్లలకు ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలి. అవసరమైతేనే పెద్దల  సలహాలు ఇవ్వాలి. పెద్దరికాన్ని పదే పదే పిల్లల మీద చూపిస్తే పెద్దలు ఏం చేసినా కరెక్ట్ అని, పిల్లలు ఏదీ చేయకూడదు అనే ఆలోచన వారిలో నాటుకుపోతుంది. దీని కారణంగా జీవితంలో చాలా లాస్ అవుతారు.

అమ్మాయిల  విషయంలో ఇలా వద్దు..

ప్రపంచం అభివృద్ది చెందుతోంది కానీ నేటికీ  చాలా మంది తల్లిదండ్రులు తమ అబ్బాయిలు,  అమ్మాయిల మధ్య వివక్ష చూపుతున్నారు.  బిడ్డ మగపిల్లాడా లేక ఆడపిల్లా అన్నది ముఖ్యం కాదు. వారి లింగాన్ని బట్టి వారి సామర్థ్యాలను అంచనా వేయకూడదు. అమ్మాయిలు ఇలా చేయకూడదు, మగపిల్లలు ఇలాగే ఉండాలి, అబ్బాయిలతో నీకు కంపేర్ ఏంటి? వాడు నువ్వూ ఒకటేనా లాంటి మాటలు అంటూ ఉంటారు. ఎప్పుడైనా అమ్మాయిలు కాస్త ఎదురు మాట్లాడినా 'అబ్బాయిలంటే గోచి పెట్టుకుని బయటకు వెళ్లగలరు, నువ్వు అలా వెళతావా ఏంటి?' లాంటి జెండర్ డామినేషన్ మాటలు మాట్లడుతుంటారు. ఇలాంటి మాటతీరు మార్చుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలను తల్లులు అర్థం చేసుకోవాలి.

ఆహారం.. అధిక బరువు..

సహజంగానే పిల్లలకు జంక్ ఫుడ్ అంటే బాగా ఇష్టం. తల్లిదండ్రులుగాబిడ్డకు ఆరోగ్యం,   ఫిట్నెస్ గురించి ఆలోచించాల్సిందే. కానీ  ఎలా పిల్లలు జంక్ ఫుడ్ తిన్నప్పుడు జంక్ ఫుడ్ తినవద్దు లావైపోతావ్ అని, బరువు పెరుగుతున్నావు చూడు అని నేరుగా పిల్లల ముందు అనడం పూర్తీగా తప్పు.   జంక్ ఫుడ్ గూర్చి, బరువు గూర్చి మాట్లాడటానికి బదులు,  ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినమని వారికి  చెప్పడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంకరేజ్ చేయాలి.  ఇవన్నీ చాలా సింపుల్ గా అనిపిస్తాయి కానీ పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి.


                                                               *నిశ్శబ్ద