ఆరోగ్యానికి మిశ్రమ ఆహారం మంచిది
మనం రోజు వారి అన్నం తినటానికి అలవాటు పడిపోయం. అలాగే ఉత్తరాది వారు నిత్యం గోధుమ ఆహారమే ఎక్కువగా తీసుకుంటు౦టారు. మనం ఇలా రోజు ఏదో ఒక రకమైన ధాన్యానికే పరిమితం కావటం వల్ల నష్టం లేదు కాని, ఆశించినన్ని పోషకాలు మాత్రం లభించవు. ఎందుకంటే వరి అన్నంలో ఉండే మాంసకృత్తులు సంపుర్ణమైనవి కావు. వీటిలో 'లైసిన్' అనే అమినోఆమ్లం కొంత తక్కువ మోతాదులో వుంటుంది. అయితే ఇది పప్పు ధాన్యాల్లో అధికంగా లభిస్తుంది కాబట్టి రొజూ బియ్యం పప్పు ధాన్యాలను కలిపి వండుకు తింటే బియ్యంలో లోపించిన అమినో ఆమ్లాలు పప్పు ధాన్యాల ద్వారా భర్తీ అవుతాయి అలాగే పప్పు ధాన్యాల్లో కూడా కొన్ని అమినో ఆమ్లాలు తక్కువ మోతాదులో వుంటాయి. అవి బియ్యం ద్వారా అందుతాయి. ఇలా బియ్యం, మరో పప్పుధాన్యం మిశ్రమం తినటం వలన ఆహారంలోని మాంసకృత్తులు సంపుర్ణమవుతాయి. మనకు పప్పుధాన్యాలకు కొదువ లేదు. సెనగ, కంది, పెసర, మినుము, అలసందలు, బొబ్బర్లు, ఉలవలు, బతాగిలు, సోయాబీన్స్ వంటి ఎన్నో రకాల పప్పు ధాన్యాలు అందుబాటులో వున్నాయి. కాబట్టి ప్రతి పూట అన్నంతో పాటు ఓ పప్పు ధాన్యాన్ని కలిపి తీసుకోవటం తప్పనిసరి అంటున్నారు పౌష్టికాహార నిపుణలు.
పులగం, పొంగలి, ఇడ్లి, వడలు వంటివి అన్నీ మిశ్రమ ఆహారాలే. వీటి పోషక విలువ విడివిడిగా తీసుకొనే పదార్ధాల కన్నా మేలైనదని చెప్పవచ్చు. అలాగే కేవలం ఒక రకమైన పప్పు ధాన్యాలని వాడుతుండాలి. ఏ పదార్ధాన్ని వండుతున్నా కూడా అందులో రకరకాల గింజ ధాన్యాలను కలిపి వాడుకోవటానికి ప్రయత్నించాలి అంటున్నారు నిపుణలు. ఇలా మనం వాడే పప్పు ధాన్యాల వల్ల మన శరీరానికి మాంసకృత్తులు లభిస్తాయి. వీటి ద్వారా మన శరీరానికి లభించే శక్తి కూడా ఎక్కువే. కొన్ని బి-విటమిన్లు కూడా శరీరానికి వీటి ద్వారానే అందుతాయి. అందుకే మనం రోజు తీసుకునే ఆహారంలో మిశ్రమ ఆహరం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది