బుడుగులే మనకి గురువులు
మన ఇంట్లో ఉండే పసివాడికి తినటం, తాగటం, నడవటం, చదవటం, రాయటం ఇలా ఎన్నెన్నో నేర్పిస్తుంటాం మనం. వాడు ఎంత వాడైనా ఏదో ఒకటి వాడికి నేర్పించేది మిగిలే వుంటుందని గాఢంగా నమ్ముతాం, నేర్పిస్తుంటాం. వాడికి నేర్పింది, నేర్పించేది, నేర్పించబోయే దాని గురించి మనం బోల్డంత నేర్చుకోవటానికి ప్రయత్నిస్తుంటాం. అది సరే.... మరి మనం ఆ పసివాడి నుంచి నేర్చుకునేది ఏదీ లేదంటారా? ఆ నవ్వులు, ఆనందం, ఆశ్చర్యపడటం, లేవటం, ప్రేమ... ఇవన్నీ మనం వాడి దగ్గర నేర్చుకోవల్సినవి కావా? పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటూ పెద్ద పెద్ద వర్క్ షాపులలో నేర్పించేది గమనిస్తే అచ్చం మనం పసివాడు అలాగే చేస్తున్నాడని మురిసిపోక తప్పదు. రూపాయి ఫీజు తీసుకోకుండా ఫ్రీగా వాడు రోజూ మనకి నేర్పించే పాఠాలు. ఈ రోజు ఆ పాఠాల్లోని విశేషాలని తెలుసుకుందాం.
పిల్లలు నేర్పే పాఠాలెన్నో...
చంటివాడు పాకటం, నుంచోవటం, నడవటం నేర్చుకునేటప్పుడు వాడిని గమనించండి.. ప్రయత్నిస్తాడు... సాధ్యం కాదు, మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఒకోసారి పడతాడు, తిరిగి లేస్తాడు, ఏమైనా చివరికి అనుకున్నది సాధిస్తాడు. అంతేకానీ మధ్యలోనే నావల్ల కాదని చతికిలపడడు. నాకిక రాదేమోనని నిరుత్సాహపడడు. వస్తుందనే నమ్మకం వాడిని ప్రయత్నించేలా చేస్తుంది. నేర్చుకోవటాన్ని వాడు శిక్షగా భావించడు. ఆనందంగా నేర్చుకోవటం మొదలుపెడతాడు. అలా అని పాకటం నేర్చుకున్న తర్వాత ఇక ఊరికే వుంటాడా! ఇక అప్పుడు నడవటానికి ప్రయత్నిస్తాడు. నడక వచ్చిందని ఆగిపోక పరుగులు పెట్టడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ నేర్చుకోవటానికి ఫుల్ స్టాపులు, కామాలు ఉండవు. ఇది జీవిత పాఠం కాదంటారా?
ఆత్మవిశ్వాసం చిరునామాలు...
పిల్లలు ఏదైనా నేర్చుకోవటానికి ప్రయత్నించినప్పుడు వారిని గమనించండి. ఇష్టంగా ప్రేమతో నేర్చుకోవటానికి ప్రయత్నిస్తారు. అందుకే పిల్లలకి ఏదైనా త్వరగా వస్తుంది. తమకి ఏమీ తెలియదన్న అమాయకత్వం వారికి అన్ని నేర్పిస్తే, మనకి చాలా తెలుసు అనీ అహంభావం మనల్ని నేర్చుకున్నవి కూడా మర్చిపోయేలా చేస్తుంది. అందుకే ఏ కొత్త విషయం నేర్చుకోవాలన్నా ముందు పసిపిల్లలంతస్వచ్ఛంగా జిజ్ఞాస కలిగి వుండాలి మనం. ఇక మరో ముఖ్య విషయం మనం పిల్లల నుంచి నేర్చుకోవలసినది ఆత్మవిశ్వాసం. పిల్లల్ని ఏమడిగినా ‘‘వచ్చు’’ అనే సమాధానం చెబుతారు. వాడు గీసే పిచ్చిగితల్నే గొప్ప బొమ్మ అని నమ్ముతాడు. పదిమందికి చూపిస్తాడు. కానీ మనమో...ఆత్మన్యూనత, సొంత సామర్థ్యంపై అపనమ్మకం, ఓటమి అంటే భయంవంటి వాటిని వదలకుండా పట్టుకుంటాం. ఏం సాధించాలన్నా ముందు కావలసినది ఆత్మవిశ్వాసం. ఇది మనం పిల్లల నుంచి నేర్చుకు తీరాల్సిన పాఠం.
పిల్లలంటే ఆనందపు గనులు...
మీకు బాగా సంతోషం కలిగిన సందర్భం ఏది అని ఎవరైనా అడిగితే మన సమాధానం ఏంటి. ఎప్పటివో ఒకటి రెండు సంఘటనలు గుర్తు చేసుకుని చెబుతాం. అదే పిల్లల్ని అడిగితే ప్రతీరోజూ వారికి ఆనందం కలిగించే విషయాలు ఎన్నో వుంటాయి.అవి కాకుండా చిన్నచిన్నవే ఫ్రెండ్‌కి పెన్సిల్ ఇవ్వటం నుంచి రోడ్డుపై కనిపించిన కుక్కపిల్లతో ఆడుకోవటం దాకా ఎన్నిటికో అందులో చోటుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రతి విషయం అబ్బురమే. ఉదయించే సూర్యుడు, అస్తమించే చంద్రుడు, వీచే చల్లటి గాలి... అన్నీ తమకోసమే ప్రత్యేకం అన్నంత ఆనందం వారి స్వంతం. మనకి ఆనందం కలిగించే విషయాలు అంటూ కొన్నిటిని నిర్ణయించుకుని, వాటితోనే ఆనందాన్ని ముడిపెట్టి, గిరిగిసుకుని కూర్చుంటాం కాబట్టే ఆనందాల వెలితి మనల్ని వెంటాడుతుంది.
ఈ పాఠం మనం నేర్చుకోవాలి...
పసివారి బోసినవ్వులంత స్వచ్చంగా మన నవ్వులు విరియలంటే వారంత స్వచ్ఛంగా మన మనసులూ వుండాలి. విరిసే కొమ్మని, పూసే పువ్వుని కూడా చూసి ఆనందించగలగాలి. నిస్వార్థంగా మెలగాలి, ప్రేమని పంచాలి. ముఖ్యంగా పిల్లల్లా నిన్నటిని నిన్నే వదిలేసి ఈ రోజుని కొత్తగా ప్రారంభించాలి. గెలుపు ఓటమి ఆటలో భాగమని నమ్మాలి. వాళ్ళకి ఆడుకోవటానికి ఈ ఆటే అని లేదు. ఈ బొమ్మే కావాలనిలేదు. పూచిక పుల్లతో కూడా అడుకోగల నేర్పు పిల్లల స్వంతం. జీవితమూ అంతే జీవించాలి అదీ ఆనందంగా. అనుకోవాలే కానీ సాధ్యం కాదంటారా!
-రమ ఇరగవరపు