వయసుతో ఎటువంటి సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్లందరూ ఇష్టపడేవి కాలి పట్టీలు. గొలుసులు, గాజులతోపాటు ఆడవాళ్ళు రోజూ ధరించే ఆభరణంగా స్థిరపడిపోయాయి కాలి పట్టీలు. కాస్త అడుగులేసే వయసు రాగానే కూతురుకు ముందుగా మువ్వల పట్టీలు చేయించి పెడతారు అమ్మా నాన్నలు. వారి బుజ్జి బుజ్జి అడుగులకు ఆ మువ్వల గలగలలు తోడై ఇల్లంతా తిరుగుతుంటే మురిసిపోతారు.

 

 

ఈనాటి అమ్మాయిలకు సంప్రదాయ దుస్తులు ధరించడమే బద్ధకంగా భావిస్తున్నారు. కానీ, కాలి పట్టీలు కూడా కాలానుగుణంగా తమ రూపురేఖలు మార్చుకుని ఆధునికతను సంతరించుకున్నాయని వారు తెలుసుకోవడం లేదు. పట్టు లంగా, వోణీ వేసుకున్నా, జీన్స్, టీషర్ట్ వేసుకున్నా వారి వస్త్రాధరణకు తగినట్టుగా ఎన్నో పట్టీలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అంతేకాదు, తమ అభిరుచికి తగ్గట్టుగా వాటిని మార్చుకుని, మాచింగ్‌గా కూడా చేసుకోవచ్చు.

 

 

సాధారణంగా కాలి పట్టీలు వెండి లేదా బంగారంతో తయారుచేస్తారు. కాని ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల కాలి పట్టీలు అందుబాటులో ఉన్నాయి. చెక్క పూసలు, బ్లాక్‌మెటల్, రంగు రంగుల పూసలు, రాళ్లు, ముత్యాలు, మువ్వలు, గొలుసులు.. చివరకు ప్లాస్టిక్ గొట్టాలు, లెదర్‌తో చేసిన పట్టీలు కూడా దొరుకుతున్నాయంటే నమ్ముతారా? ఇవి జీన్స్, స్కర్ట్స్, మినీస్, కాప్రీలు మొదలైన డ్రెస్సులకు అనువుగా మాచింగ్‌గా ఉంటాయి. అందుకే కాలేజీ అమ్మాయిలు ఇటువంటి అధునాతనమైన పట్టీలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 

 

అలాగని ఎప్పటికీ అవే వేసుకోవాలంటే కూడా ఇష్టపడరు. పెళ్లిళ్ళు, పార్టీల కోసం వారు ధరించే పట్టు, హెవీవర్క్ చీరలు, డ్రెస్సులకు ధీటుగా బంగారు నగలకు ఏ మాత్రం తీసిపోని పనితనంతో రంగు రంగుల రాళ్లు, ముత్యాలు, పూసలు, క్రిస్టల్స్ పెట్టి తయారుచేసిన కాలి పట్టీలు కూడా దొరుకుతున్నాయి. వెండి, బంగారంతో చేసినవి ఒకటో, రెండో కాలి పట్టీలు కొనుక్కునే బదులు ఇలాంటివి డ్రెస్సులకు మాచింగ్ ఉండేట్టు ఎన్నైనా కొనుక్కోవచ్చు.

 

 

అంతేకాదు అమ్మాయిలు తమ కొత్త డ్రెస్సులకు, అందులోని రంగులకు మాచింగ్‌గా కూడా పట్టీలు చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కువ ఖరీదు కూడా ఉండవు. అందువలన ఈ పట్టీలు విరివిగా అమ్ముడవుతున్నాయి. పండగ, పెళ్లి, పార్టీ, పుట్టిన రోజు వచ్చినా, డ్రెస్సుతోపాటు కొనుక్కునే మాచింగ్ గాజులు, నగలలో కాలిపట్టీలు కూడా చేరిపోయాయి. ఎంతైన ఆ మువ్వల సవ్వడి వింటే అబ్బాయిలు కూడా ఫ్లాట్ అయిపోవాల్సిందే మరి.