డిజైనర్ శారీలకు పెరుగుతున్న క్రేజ్ 

 

 

చీర కట్టుకుంటే మహిళల అందం పెరుగుతుందని చెప్పలేం కానీ... మన తెలుగింటి ఆడపడచులు మాత్రం చీర కట్టుకుంటే ఆ చీరకే అందం వస్తుందన్నది మాత్రం అతిశయోక్తి కాదు. ఎలాంటి చీరనైనా అందంగా మలచగల సృజన, కళాత్మకత మనవారి సొంతం. ఒక చిన్న అల్లిక, మరో చిన్న అతుకు, ఒక పూస లాంటివి చేర్చినా ఆ చీర డిజైనర్ చీరలకు ఏమాత్రం తీసిపోదు. అనేక రకాలుగా డిజైన్ చేసిన వీటిని ధరించే స్త్రీలు ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతారనడంలో సందేహం లేదు.

 

లేటెస్ట్ ఎంబ్రాయిడరీ, దానికి మరింతగా అందాన్నిచ్చే కుందన్స్, స్టోన్స్, వీటన్నింటినీ డామినేట్ చేసే పల్లూ, స్వచ్ఛమైన జరీతో మెరిసిపోయే చీరలు ప్రస్తుతం అమితంగా మహిళలను ఆకట్టుకుంటున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో, అపురూపమైన డిజైన్లతో ఉన్న ఈ చీరలు మహిళలను అల్లుకుపోయి మరింత అందంగా కనిపిస్తున్నాయి.

 

 

డిజైనర్ చీరలంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఈనాటి అమ్మాయిలు వీటిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడైనా ఫంక్షన్లకు, వివాహ కార్యక్రమాలకు పట్టుచీరలకంటే ఇప్పుడు వీటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే డిజైనర్ చీరలంటే ధరలు మాత్రం మాములుగా ఉండవు. వెయ్యి రూపాయల నుండి మొదలుకొని దాదాపు లక్ష రూపాయల పై వరకు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.

 

అయితే చిన్నపాటి జాగ్రత్తలు, కాస్తంత సృజన జోడిస్తే... మీ దగ్గరుండే సాదా చీరలనే అందంగా తయారు చేసుకుని డిజైనర్ శారీలను తలదన్నేలా తీర్చిదిద్దవచ్చు. మరి మీకు అలాంటి శ్రమ ఎందుకులే అనుకుంటే.. మార్కెట్లో అదిరిపోయే డిజైన్ లలో డిజైనర్ శారీలు లభిస్తున్నాయి. వెళ్లి ఓసారి షాపింగ్ చేసేయండి మరి.