నెలసరి సరిగా రావడం లేదా...ఈ విషయాలు తెలుసుకోండి..!
నెలసరి ఆడవారి జీవితంలో తప్పనిసరి భాగం. నెలసరి సరిగా రాకపోతే ఎంత ఆందోళన పడతారో అది కేవలం మహిళలకే తెలుసు. ఈ నెలసరి జాప్యం వల్ల మానసికంగానే కాక శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోంటారు. ముఖ్యంగా శరీరంలో హార్మోన్ల సమస్యలు వస్తాయి. అది ఒత్తిడికి దారి తీస్తుంది. నిజానికి మహిళలలో వివిధ కార్యకలాపాల వల్ల ఒత్తిడి పెరగడం వల్లనే నెలసరి కూడా సరిగా రావడం లేదని, దీనికి తోడు ఆహారం విషయంలో చేసే నిర్లక్ష్యం మహిళల ఋతుచక్రానికి ఇబ్బంది కలిగిస్తాయని ఆహార నిపుణులు, మహిళా వైద్యులు అంటున్నారు. నెలసరి సరిగా రానివారు కొన్ని విషయాలు తెలుసుకుని వాటిని ఫాలో అవ్వడం వల్ల తిరిగి నెలసరిని ఒక గాడిలో పెట్టవచ్చు.
నెలసరి మీద ఒత్తిడి ప్రభావం ఎంతగా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఉంది. ఇప్పుడెలాగో పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలకు హాజరయ్యే అమ్మాయిలకు తరచుగా ఒత్తిడి స్థాయిలు పెరగడం వల్ల పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి. ఎవరైనా ఒత్తిడికి గురైనప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అండోత్సర్గముకు అంతరాయం కలిగిస్తుంది. ఇది ఋతు చక్రంపై ఈ విధంగా ప్రభావం చూపుతుంది.
ఒత్తిడిని కంట్రోల్ చేస్తే..
ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం ఋతు చక్రాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. "ధ్యానం, యోగా, కౌన్సెలింగ్, కుటుంబం, స్నేహితులతో ఓపెన్ గా మాట్లాడటం వంటివి ప్రయోజనకరంగా ఉంటాయి. అంతే కాదు.. బయటకు వెళ్లడం, అభిరుచులు, ఇష్టమైన కార్యకలాపాలలో పాల్గొనడం లేదా ఒత్తిడి నిర్వహణ కార్యక్రమాలలో చేరడం కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
మహిళలలో నెలసరి అనేది 28 రోజులకు కాస్త ముందు లేదా తరువాత రావడం పరిపాటి. అయితే దీనికి మించి చాలా జాప్యం ఉంటే జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ప్రతి నెలా నెలసరి రావడంలో ఎక్కువ రోజులు జాప్యం జరుగుతూ ఉంటే అది చాలా ప్రమాదం. వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
ముఖ్యంగా గర్భధారణ ప్లాన్ చేసుకోవాలి అనుకునే మహిళలు క్రమం తప్పకుండా నెలసరి వచ్చేలా చూసుకోవడం ముఖ్యం. గర్భం దాల్చడానికి ప్రయత్నించని వారు నెలసరి మరీ ఆలస్యంగా ఎక్కువ నెలలు కొనసాగితే గర్భాశయ సమస్యలు ఏవైనా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే నెలసరి విషయంలో ఏ మహిళ కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
*రూపశ్రీ.
