కంప్యూటర్లు వచ్చాక ప్రతీదీ మారిపోయింది. టెలిగ్రాఫ్ ఆఫీసు కూడా మూతపడిపోయింది, ఒక ఈ-మెయిల్ కొడితే ఎంతో మందికి ఒకటేసారి విషయం తెలిసిపోయేపుడు ఒకొక్కరికి విడిగా టెలిగ్రాంలు పంపించాల్సిన అవసరం లేదనుకుంటున్నారు లేదా ఒక సెల్ ఫోన్ తో చాలా మందికి ఎమర్జెన్సీ విషయాలేమైనా తెలపవచ్చు అనుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు ఎంతగా ప్రపంచాన్ని మార్చేసిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చిన్న చిన్న పిల్లలు కూదా హోం వర్కులు ఇంటర్నెట్ ద్వారా చాలా త్వరగా చేసుకుంటున్నారు. వారికి సాయం చేయడానికి ఎన్నో వెబ్ సైట్లను మొదలు పెట్టారు అన్ని రకాల భాషల్లో. పిల్లలకు కార్టున్లు, వాళ్ళకిష్టమయిన పాటలను చూడడం, వినడం, నేర్చుకోవడం కూడా చేస్తుంటారు. ఒకప్పుడు అమ్మలు పాటలను నేర్పించాల్సి వచ్చేది . ఇప్పుడైతే చిన్న పిల్లలకు కూడా లాప్ టాప్ లో రైమ్స్ కార్టున్లు వాళ్ళంతట వాళ్ళే పెట్టుకుని చూసేసుకుంటున్నారు. అంతే కాదండోయ్ ఏడాది వయసు లోపు పిల్లలే సెల్ ఫోన్లు పట్టుకుని వాళ్ళకావల్సిన రైమ్స్ ఒకటే కాదు, పవన్ కళ్యాణ్ పాటలు, మహేష్ బాబు పాటలు పెట్టుకుని వింటుంటే అది చూసి మురిసిపోతున్నారు తల్లి తండ్రులు, తాత, బామ్మలు. సెల్ ఫోన్లు పిల్లల చేతులకిచ్చేసి వాళ్ళు వాటిని పీకి పడేస్తే కూడా అది తప్పురా అని చెప్పకుండా చూసి మురిసిపోతూ, 'మా పిల్ల/పిల్లడు ఎంత అల్లరో బాబు, పట్టుకోలేక పోతున్నాము,' అని ముద్దుగా కంప్లయింట్లు. అందరూ అలా వుంటారని కాదు లెండి. పిల్లలు పడుకున్నపుడే లాప్ టాప్లపైన కానీ కంప్యూటర్ లో పని చేసుకుంటారట ఎందుకంటే లేచినప్పట్నుండి వాళ్ళకిష్టమయిన పాటలు పెట్టమని గోల చేస్తారట. చూసారా ఒక ఎలక్ట్రానిక్ పరికరం ఇంట్లో చిన్న పిల్లల పైనే ఇంత ప్రభావం చూపిస్తుంటే మరి చదువుకుంటున్న పిల్లలు ఇంకా ఎన్నేన్ని చేయగలరో ఆలోచించండి.
ఫేస్ బుక్ లో పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలు కూడా అకౌంట్లు ఓపెన్ చేసి ఎంతో మందిని ఫ్రెండ్స్ ని చేసుకోవడమే కాదు, ఫోటోలు షేర్ చేసుకోవడం కూడా చేస్తుంటారు. 'ఫేస్ బుక" లో ఎక్కువగా పెద్దవాళ్ళుంటారు కాబట్టి 'ఇన్ స్టాగ్రామ" లో ఫ్రెండ్స్ చేసుకుని ఫోటోలు షేర్ చేసుకుంటుంటారు. ఇందులో ఎక్కువగా చిన్నపిల్లలు, టీనేజర్లు వుంటారు. ఏ కొత్త పరికరం అయినా అందరికీ అందుబాటులోకి వచ్చినపుడు దాని ద్వారా ఎన్నో మంచి జరిగే అవకాశాలుంటాయి అలాగే చెడు కూడా జరిగే అవకాశం కూడా వుంటుంది. అందుకని మన జాగ్రత్తలో మనం వుండడం చాలా అవసరం ముఖ్యంగా ఈ సోషల్ నెట్ వర్క్ ల్లో ఎలాంటివారైనా దూరే అవకాశం వుంది. అన్ని తెలిసిన పెద్ద వాళ్ళే ఎన్నో మోసాలకు గురి అవుతుంటే ఏ అభం శుభం తెలియని చిన్నారులు మోసకారుల చేతుల్లో మోసపోరని నమ్మకం ఏమిటి చెప్పండి?
అదీ కాక ఈ సోషల్ నెట్ వర్క్ మొదలైనప్పటినుండి చిన్న పిల్లలని లైంగికంగా హింసించేవారికి మంచి నెట్ వర్క్ దొరికింది చాలా సులభంగా చిన్న వయసు అమ్మాయిలను, అబ్బాయిలను పట్టుకోవడానికి వాడుకోసాగారు. అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే మనకి మతి పోతుంది, ఎలా మన ఇంట్లోనే మన పిల్లలతో స్నేహంగా వుంటూ వారి నమ్మకాన్ని పూర్తిగా పొందాక, వారి వీక్ నెస్లను వాడుకుని వారి అసలు రూపం చూపిస్తారు. ఇలాంటి నెట్ వర్కుల్లో అకౌంట్లు లేని వారిని చులకనగా చూస్తారు. కొంతమంది అమ్మాయిలు స్కూల్లో తమతో ఎవరూ ఫ్రెండ్స్ కాకపోవడంతో ఒంటరితనంతో బాధపడేవారు ఇదిగో ఇలాంటి సోషల్ నెట్ వర్క్ ద్వారానయినా ఫ్రెండ్స్ చేసుకుందామనుకుంటారు, వారి అదృష్టం బావుంటే మంచి ఫ్రెండ్స్ దొరికి వారు మంచి స్నేహాన్ని పొందుతారు. అంతా ఇలాగే జరిగితే ఇంక అసలు గొడవే లేదు. కానీ అంతా మంచివాళ్ళే వుంటారని చెప్పలేం కదా! ఒకమ్మాయి ఎంతో తెలివైనది, సంగీతం, చిత్రకళ అంటే చాలా ఇష్టం తనకి. తండ్రి వుద్యోగరిత్యా ప్రతి కొన్ని నెలలకి వూళ్ళు మారుతుండడంతో ఎక్కడా తనకంటూ క్లోజ్ ఫ్రెండ్స్ కాలేదు. దాంతో ఒంటరితనం పొగొట్టుకోవడానికి ఒక సోషల్ నెట్ వర్క్ లో ఫ్రెండ్ షిప్ చేసింది. కొన్నాళ్ళు స్నేహం చాలా బాగా సాగింది. స్కూల్ నుండి రాగానే హోం వర్క్ కాగానే తన రూమ్ లో ఫ్రెండ్స్ తో చాట్ చేసేది. కొన్నాళ్ళయ్యాక ఫ్రెండ్స్ అనుకున్న వారే ఆ అమ్మాయి అందాన్ని పొగడడం, సెక్సీ బట్టలే్సుకోమని గొడవ మొదలు పెట్టారు, వేసుకోనంటే తనతో ఫ్రెండ్స్ గా వుండమని లేదా తన గురించి అంతా చెడుగా రాసి స్కూల్లో పెడతామని అలాగే ఇంట్లో వారికి కూడా పంపిస్తామని బెదిరించడం మొదలు పెట్టారు. అప్పుడు తెలిసింది ఆ అమ్మాయికి స్నేహం పేరుతో ఎలాంటి వారి చేతిలో చిక్కుక్కుపోయిందో. ఆ ఒక్కసారి వారు అడిగింది చేస్తే తనని తన మానాన వదిలేస్తామని ఆమె నమ్మేలా చెప్పారు. ఒక్కసారి ఆ అమ్మాయి అశ్లీలంగా వుండగా తీసిన ఫోటోలు వారి చేతికి దొరకగానే తనని బ్లాక్ మేయిల్ చేస్తూ వారు ఏది చెబితే అది చేస్తే అవి ఇంటర్నెట్ సైట్స్ లో పోస్ట్ చేసేవారు. వారు ఈ అమ్మాయి ఒక్కదానితోనే కాదు ఎంతో మందితో ఇలాగే చేసే గ్యాంగ్ అది. వారు అంతా పెద్దవారే ఏ వయసు వారితో ఆ వయసు వారిగా వుండి వారిని హింసించి వారితో అశ్లీల శృంగార ఫోటోలు తీసి ఎన్నో సైట్స్ ల్లో పోస్ట్ చేస్తారు. ఆ అమ్మాయి ఫోటోలు ఆన్ లైన్ లో చూసి స్కూల్లో పిల్లలు తనతో అసహ్యంగా ప్రవర్తించడం, అబ్బాయిలొచ్చి తమతో రాత్రుళ్ళు గడపడానికి రమ్మని హింసించడం, స్కూల్ ప్రిన్స్ పాల్ ఆ అమ్మాయితో మాట్లాడి అసలు విషయం తెలుసుకోకుండా సస్పెండ్ చేసారు. ఇంటికొచ్చి తన రూమ్ లోకెళ్ళి తలుపేసేసుకుంది తల్లి తండ్రులతో ఏమి చెప్పకుండానే. వారు భయపడిపోయి ఇద్దరూ బ్రతిమిలాడ్తూ, బయటికి రమ్మని తాము ఏమి అనమని ఎంతో చెప్పగా వచ్చి కూర్చొని తల్లి వొళ్ళో తల పెట్టుకుని ఆన్ లైన్ ఫ్రెండ్ షిప్ ఎలా మొదలయ్యింది ఎలా ఈ స్థితికి వచ్చింది అన్నీ వివరంగా చెప్పింది. తల్లి తండ్రి ఇందులో తన తప్పేమీ లేదనీ వారి గురించి పోలీసులకు కంప్లయింట్ ఇద్దామని, వేరే వూరికెళ్ళి కొత్తగా జీవితం మొదలు పెడదామని ధైర్యం చెప్పారు. ఆ రాత్రి తల్లి తండ్రితో కూర్చొని ఎంతో ఉత్సాహంగా ఎన్నో కబుర్లు చెప్పింది. మధ్య రాత్రి తర్వాత తన రూమ్ లోకి పడుకోవడానికి వెళ్ళి తలుపేసుకుంది. చాలాసేపు ఆలోచించి కూర్చొని వెబ్ కామ్ పెట్టుకుని తన గురించి, తన కుటుంబం గురించి, తన ఇంట్రెస్ట్స్ గురించి, భవిష్యత్తులో తను ఏం కావాలనుకుంది, ఆ తర్వాత తన ఆన్ లైన్ ఫ్రెండ్ షిప్ గురించి చెప్పి తను ఎలా మోసపోయిందో, మరెవ్వరూ ఎప్పుడూ ఇలా మోసపోకూడదని వారు ఎలా జాగ్రత్తగా వుండాలో చెప్పింది. అది యూ ట్యూబ్ లో పోస్ట్ చేసింది. పొద్దునే తల్లి కూతురిని నిద్ర లేపడానికి వచ్చి చూస్తే తమ చిట్టి తల్లి ఈ లోకంలో లేదని తెలుసుకుని గుండెలు బాదుకున్నారు తల్లి తండ్రులిద్దరూ. కూతురు రాసిన నోట్ చూసి యూ ట్యూబ్ లో కూతురు పోస్ట్ చేసిన తమ చిన్నారి కథని చూసి గుండెలవిసేలా ఏడిచారు. కొన్నాళ్ళ తర్వాత తమ కూతురిలా ఎవ్వరూ మోసపోవద్దని తల్లి తండ్రుల్లో, పిల్లల్లో ఇంటర్నెట్ వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అందరూ ఇలాగే చేస్తారనుకుంటే పొరపాటు. ఒకసారి వర్జీనియా స్ట్రీట్ గ్యాంగ్ వాళ్ళు ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ ఆధారంగా కొంతమంది హైస్కూల్ టీనేజ్ అమ్మాయిలను మాయ మాటలు చెప్పి బయట కాసేపు సరదాగా తిరుగుదామని రమ్మని చెప్పి వారు వచ్చాక కోక్ డ్రింక్స్ లో మత్తు మందు కలిపి ఇచ్చి వారు స్పృహ కోల్పోగానే వారిని రేప్ చేసి దాన్ని టేప్ చేసుకున్నారు. ఎఫ్.బి.ఐ (FBI) ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏమిటంటే ఈ టీనేజ్ అమ్మాయిలు ఎంత సులభంగా ఫేస్ బుక్ లాంటి సైట్స్ లో స్నేహాన్ని ఎంత అమాయకంగా నమ్ముతారోనని, వారు రమ్మనగానే ఏమి ఆలోచించకుండానే ఎలా వెళ్ళిపోయారు అనేది కూడా తెలిసింది.
ఈ సోషల్ నెట్ వర్కులు మొదలయ్యే ముందే సామాజిక శాస్త్రవేత్తలు ఇవన్నీ ఎలా 'సెక్స్ ఇండస్ట్రీ,' కి దారి తీస్తుందో కొన్ని పేపర్స్ రాసి తెలియజేసారు. ముందుగా బాల బాలికలతో అశ్లీల శృంగారం, పోర్నోగ్రఫీ మొదలవుతుందనీ, పిల్లలని బెదిరించి వారితో ఫోటోలు తీయించుకుని అవి ఈ సైట్లల్లో ఫోస్ట్ చేస్తారని, ఆ తర్వాత ఇలాంటి సైట్ల ద్వారానే వ్యభిచారం కూడా చేయిస్తారని చెప్పారు. వారు అనుకున్నట్టే ఇవన్నీ జరుగుతూనే వున్నాయి.
గ్రోప్ప్(Groppe) అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారం తల్లి తండ్రులు చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళ సైట్స్ ల్లోకి వెళ్ళకుండా లాక్ సిస్టమ్ లాంటివి వాడతారు కానీ వారు గుర్తించని విషయం ఏమిటంటే ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్కుల్లో కూడా ఎక్కువగా ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయి అలాగే వ్యభిచారం లాంటివి కూడా ఇలాంటి సైట్స్ ద్వారా చాలా సులభంగా ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ కొనసాగిస్తున్నారని అంటున్నారాయన. లీరి(Leary) గారి ప్రకారం ఆన్ లైన్ పొర్నొగ్రఫీలో దాదాపు 26% చిన్న పిల్లలే వున్నారు. మరో ఇద్దరు శాస్త్రవేత్తలు చిన్న పిల్లలు ఈ సెక్స్ ఇండస్ట్రీలో ఎంత శాతం చిన్నవయసు వారు వున్నారు అనే విషయం పై స్టడీ చేసారు. అందులో తేలిందేమంటే 12 నుండి 17 ఏళ్ళ వయసు వారు 59%, 6 నుండి 11 ఏళ్ళ వయసు వారు 28%, మరో 13% చాలా చిన్న వయసు వారు అంటే నర్సరీ స్కూల్ వయసు వారున్నారు. అందుకే లీరి(Leary) ఏమన్నారంటే చిన్న పిల్లల పొర్నోగ్రఫితో బిజినెస్ చేసే వేటగాళ్ళు ఇంటర్నెట్ మరియు ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ని ప్రవేశ ద్వారంలా ఉపయోగించుకుంటూ ఈ సైట్స్ ని మరింత శక్తివంతంగా వాడుకుంటూ వారికి కావాల్సిన లక్ష్యం (చిన్నపిల్లల) కోసం వెతకడం మరింత ఉధృతంగా చేస్తున్నారు.
పిల్లలు తమ కంటే బాగా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను చాలా బాగా ఉపయోగిస్తున్నారని, తమకు వాటిని ఎలా వాడాలో సరిగా తెలియదని చాలా మంది తల్లితండ్రులు గొప్పగా చెప్పుకోవడం వింటుంటాము మనం. వారికి తెలియని విషయం ఏమిటంటే మనం జాగ్రత్తగా వుండకపోతే ఎన్నో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయని. కాబట్టి ఇపుడు మనం పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తెలియజేయాలి, తల్లి తండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇందులోని సలహాలన్నీ 'చిన్న పిల్లలు, ఇంటర్నెట్ ప్రభావం,' అనే స్టడీ చేసిన వారు ఇచ్చినవి వున్నాయి.
ముందు తల్లి తండ్రులు ఇంట్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తెచ్చినా వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇంటర్నెట్ లో పిల్లలు ఏది పడితే అది చూడకుండా పేరంటల్ కంట్రోల్స్ అని సిస్టమ్ లో పిల్లలు పెద్దవాళ్ళ సైట్స్ లోకి వెళ్ళకుండా లాక్ చేయవచ్చు. అవి చేసినా మామూలు సోషల్ నెట్ వర్కులు చూసినా, అందులో చేరినా పర్వాలేదు అనుకోవచ్చు కానీ వారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి విషయాలు అందరితో పంచుకుంటున్నారు లాంటి విషయాలు గమనిస్తూ వుండాలి.
పిల్లలు వయోపరిమితిని గుర్తు పెట్టుకోవాలి. తప్పు వయసు చెప్పి చేరేవారుంటారు. అలా చేస్తే ప్రమాదాల్లో చిక్కుకుంటారని వారికి అర్ధం అయ్యేలా చెప్పాలి. ఇప్పుడొచ్చే ఫొన్స్ లోనే ఇంటర్నెట్ మొత్తం చూసుకోవచ్చు, పిల్లలకు ఒక వయసు వచ్చేదాక ఫోన్ లు ఇవ్వకపోతేనే మంచిది. ఒకప్పుడు సెల్ ఫోన్లు లేకుండా పిల్లలు వుండలేదా అంటే రోజులు మారాయి కదా, పిల్లలకి సెల్ ఫోన్లు లేకపోతే కష్టమవుతుంది అంటారు. ఏది వాడుతున్నా తల్లి తండ్రులు వాటి వల్ల వచ్చే ప్రమాదాల గురించి పిల్లలకు బాగా వివరించి అపుడపుడు వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ వుండాలి.
పిల్లలతో అన్ని విషయాలు స్పష్టంగా,ప్రేమగా మాట్లాడుతూ వారితో కమ్యునికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. మీరు ఇంట్లో మీ స్వంతంగా పిల్లలు పాటించాల్సిన ఇంటర్నెట్ రూల్స్ పెట్టి వాటిని వారు తప్పకుండా పాటించేలా చూసుకోవాలి, ఉదాహరణకు రోజూ ఇంత సమయం కంటే ఎక్కువగా కంప్యూటర్ కానీ, లాప్ టాప్ కానీ, సెల్ ఫోన్లో ఇంటర్నెట్ వాడకూడదని మీరే నిర్ణయించాలి.
ఆన్ లైన్ లో వారి ఫోన్ నెంబర్లు కానీ, ఇంటి అడ్రస్ లు కానీ మనకు తెలియని కొత్తవారికెవ్వరికీ ఇవ్వకూడదని ఖచ్చితంగా చెప్పాలి. ఎవరైనా సోషల్ నెట్ వర్క్ లో ఫ్రెండ్ అయ్యి బయట ఎక్కడో కలుసుకోవడానికి రమ్మంటే వెళ్ళకూడదని, అలా ఎందుకు వెళ్ళకూడదో వారికి ప్రేమగా తెలియచేయాలి. సోషల్ నెట్ వర్క్ లో స్నేహం చేస్తే మరీ ఎక్కువ సమాచారం పిల్లలు తమ గురించి ఇచ్చేస్తే వారి వీక్ నెస్ లను తెలుసుకుని వారిని సైబర్ బుల్లియింగ్ కి, ఇంటర్నెట్ ద్వారా పిల్లలను ఫోర్నోగ్రఫీకి వాడుకునే వారు, పిల్లల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారిని మోసం చేసే అవకాశాలున్నాయని తెలియచేయాలి. ఫోటోలు షేర్ చేసుకునేపుడు దాంట్లో వివరాలు సరిగ్గా చూసి పెట్టాలి, కొంతమంది ఆ ఫోటోల్లోనే అందంగా వున్న లేక వారి శరీర అందాలను అంచనా కట్టుకుంటారు, అందుకని చాలా జాగ్రత్తగా వుండాలి ఈ విషయాల్లో పిల్లలు. తల్లి తండ్రులు అప్పుడప్పుడు పిల్లలు ఎలాంటి ఫోటోలు షేర్ చేసుకుంటున్నారో గమనిస్తూ వుండాలి. పిల్లలు ఒకోసారి ఎదుటివారు చిన్నవాళ్ళో, పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లా స్నేహం చేస్తున్నారో తెలుసుకోవడం కష్టం. అందుకని వారు తమ మనసులోని విషయాలన్నీ వారితో పంచుకుంటుంటారు. అటు వైపు వారు వారి వయసు పిల్లలైతే పర్వాలేదు కానీ అలా కానప్పుడే వీరు వారితో పంచుకున్న విషయాలను పట్టుకుని వీరిని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారని వాళ్ళకి అర్ధం అయ్యేలా చెప్పాలి.
పిల్లలు వారికి వ్యక్తిగతంగా తెలిసిన వారితోనే ఈ సోషల్ నెట్ వర్కుల్లో స్నేహం చేస్తే ఏ ఇబ్బంది వుండదు. కొత్త వాళ్ళతో చేసేపుడు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా వుండాలి ముఖ్యంగా, వారు అవవసరంగా వారి అందాన్ని పొగడడం, వారిని ఎలాంటి బట్టలు వేసుకోవాలో, మేకప్ చేసుకోమని బలవంతం చేయడం లాంటి విషయాలు చేస్తే వెంటనే తల్లి తండ్రులకు చెప్పడమో, వారిని ఫ్రెండ్స్ లిస్ట్ నుండి తీసివేయడమో చేయాలి, ఆ నెట్ వర్క్ వారికి పిర్యాదు చేయాలి వారి ప్రవర్తన అనుమానస్పదంగా వుంటే. పిల్లలకు లాప్ టాప్ లు వాడడానికి అనుమతినివ్వకూడదు. ఇంట్లో కంప్యూటర్ వుంటే ఆ సిస్టమ్ ని అందరూ తిరిగే చోట పెట్టాలి, లివింగ్ రూమ్ లో అయితే అందరూ అక్కడే కూర్చుంటారు చాలా మటుకు అందుకని పిల్లలు కంప్యూటర్ పై ఏం చేస్తున్నారు, చూస్తున్నారు తెలిసిపోతుంది పెద్దవాళ్ళకి. అదీ కాకుండా అందరూ వుండే ప్రదేశంలో పిల్లలు కూడా జాగ్రత్తగా వుంటారు వారు, అదే వారి రూమ్ లో పెట్టేస్తే ఇంట్లో వారికి వారు ఏం చేస్తున్నారో తెలియదు. ఈ ఆర్టికల్ ఉద్దేశ్యం అందరినీ భయపెట్టడం కాదు. మన జాగ్రత్తలో మనం వుండి, ముఖ్యంగా పిల్లలకు జాగ్రత్తలు నేర్పితే ఇంటర్నెట్, సోషల్ నెట్ వర్క్ ల మంచి విషయాలను తప్పకుండా ఆనందించొచ్చు.
- కనకదుర్గ